Menu

మన ‘జేమ్స్ బ్రాండ్స్’

హీరో మహేష్‌బాబు స్టైల్‌గా ఓ కూల్‌డ్రింక్‌ని సిప్ చేస్తూ ఉంటాడు… హఠాత్తుగా ఎక్కడినుండో ఓ అల్ట్రామోడ్రన్ అందాల భామ జీన్స్ నిక్కర్‌లో ఆయన పక్కన దర్శనమిస్తుంది… మహేష్‌బాబు తాగుతున్న కూల్‌డ్రింక్‌ను తీసుకుని పరిగెత్తడం మొదలెడ్తుంది… ఇక హీరో పోనీలే అది కూల్‌డ్రింకేకదా అని ఊరుకుంటాడా? లేదు… ఓ స్పోర్ట్స్ బైక్ వేసుకుని అందాల భామ వెంటపడ్డాడు. ఆమెను కన్‌ప్యూజ్ చేసి కూల్‌డ్రింక్ బాటిల్‌ని అతి లాఘవంగా అందుకుంటాడు… ఒకలాంటి కవ్వింపు చూపుల్తో వెళ్తున్న అందాల భామ వెనక్కు వెళ్ళి గుసగుసగా ఓ ప్రశ్న అడుగుతాడు…

‘‘నా కూల్‌డ్రింక్ వెంట ఎందుకు పడ్తున్నావ్?’’

వెంటనే బుల్లెట్‌లా దూసుకువస్తుంది సమాధానం ఆ అందాల భామ నోటి నుండి… ‘‘నువ్వు నా వెంట పడ్తావని!’’ అని కొంటెగా చూస్తూ…!

ఇది ఈమధ్యకాలంలో బాగా పాప్యులర్ అయిన ఓ కూల్‌డ్రింక్ యాడ్! ఇలా మన తెలుగు సినీ హీరో హీరోయిన్లు వేర్వేరు ప్రొడక్ట్‌లకు ‘‘అడ్వర్టయిజ్’’ చేయడం ఇప్పుడే కొత్తకాదు… కానీ తాజాగా మన హీరోహీరోయిన్లు ఈ ప్రొడక్ట్‌లకు కేవలం మోడల్స్‌గానే పనిచేయడం లేదు… వీటికి ఇప్పుడు వీరంతా ‘‘బ్రాండ్ అంబాసిడర్’’లుగా ఉంటున్నారు… టాలీవుడ్ సినీ ప్రపంచంలో ఇపుడిది సరికొత్త ట్రెండ్‌గా… నూతన వ్యాపార వ్యూహంగా మారింది.

బ్రాండ్ అంబాసిడర్ ఏంటి?

మన తెలుగు సినిమాలలో మాస్ హీరో కథానుసారం ఎనె్నన్నో పాత్రలు వేస్తుంటాడు… హీరోయిజం నిరూపించుకోడానికి ఎనె్నన్నో వేషాలు వేస్తుంటాడు… ఇవన్నీ తెరమీదే! ఇపుడు టాలీవుడ్‌లో మన హీరోలు ఓ సరికొత్త వేషం వేస్తున్నారు! అదే ‘‘బ్రాండ్ అంబాసిడర్’’!
‘అంబాసిడర్’ అంటే తెల్సుకానీ బ్రాండ్ అంబాసిడర్ ఏంటీ అనుకుంటున్నారా? నూతన ఆర్థిక మార్కెటింగ్ శాస్త్రం వ్యక్తికుండే ‘‘సేలబిలిటీ’’కి, ‘‘ఇన్‌ఫ్యూయెన్షియల్ కెపాసిటీ’’కి పెట్టిన అందమైన పేరని! ఒక దేశానికి ప్రతినిధిగా విదేశాలలో ఉండే అధికార ప్రతినిధిని ‘అంబాసిడర్’ – రాయబారి అనడం మనకు తెల్సిందే! ఇక ఈ ‘బ్రాండ్ అంబాసిడర్స్’ తాము కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కంపెనీ ప్రొడక్ట్‌లను జనంలోకి, వినియోగదారులలోకి తీసుకెళ్ళే రాయబారులుగా ఉంటారన్నమాట! ఇంకా చెప్పాలంటే బ్రాండ్ అంబాసిడర్స్ తమకున్న పాప్యులారిటీ, క్రేజ్ దృష్ట్యా ‘‘లార్జర్ సైజ్ సేల్స్ మ్యాన్’’ అన్నమాట!
కానీ ఇప్పుడు మన తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్, నవతరం హీరోహీరోయిన్లకు ‘బ్రాండ్ అంబాసిడర్’గా సంతకం చేయడం, ఆ ప్రొడక్ట్‌ల ‘‘యాడ్ క్యాంపెయినింగ్’’ల్లో పాల్గొనడం అనేది ఆయా హీరోల స్టేటస్‌ను, వాల్యూను, క్రేజ్‌ను పెంచే ఇండికేటర్‌గా మారడం విశేషం!

సినిమా స్టార్స్- అడ్వర్టయిజ్‌మెంట్స్:

తెలుగు తెరపై సరికొత్తగా పొడసూపుతున్న ఈ ‘బ్రాండ్ అంబాసిడర్’ అనే ట్రెండ్‌ను అర్ధంచేసుకోవాలంటే, దీనికి మూలమైన అడ్వర్టయిజ్‌మెంట్‌ల పరిణామాన్ని ముందు అవలోకించడం అవసరం. మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ పాప్యులారిటీ, క్రేజ్, సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉండగలిగే వాళ్ళు ప్రధానంగా ముగ్గురు! ఒకరు రాజకీయ నాయకులు, రెండోవారు క్రికెటర్స్, మూడోవారు సినిమా స్టార్స్!

మన వార్తాపత్రికలు, మీడియా అన్నింట్లోనూ ఈ ముగ్గురి గురించిన విషయాలే వార్తలు, విశే్లషణలూ అన్నీనూ! ఇక ఈ ముగ్గురిలోనూ సామాన్య ప్రేక్షకులు, ప్రజలు, వినియోగదారులను గ్లామరస్ పాప్యులారిటీతో ఆకట్టుకోగలిగినవారు- సినిమా స్టార్సే! అందుకే ప్రజల కలలతో, బలహీనతలతో, స్వప్నాలతో వ్యాపారాలు చేసే కంపెనీలు అన్నీ మొదట సినిమా స్టార్స్‌నే తమ వ్యాపారాలను, తమ ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేయగలిగే ‘‘సేల్స్ పర్సన్స్’’గా భావించాయి.. అయితే మొదట్లో ‘‘సినిమా తారల సౌందర్య సాధనం’’ అనే క్యాప్షన్‌తో వచ్చే సబ్బుల వంటి ఉత్పత్తులు మాత్రమే సినీ తారల క్రేజ్‌ను యాడ్‌లుగా మలచి తమ ప్రొడక్ట్‌లను వినియోగదారులకు చేరువ చేసాయి. అయితే అప్పట్లో కేవలం పత్రికలు, రేడియో మాత్రమే ఉండటం ఫోటోస్, పోస్టర్స్, హోర్డింగ్స్ ద్వారా మాత్రమే సినిమా స్టార్స్ యాడ్స్‌లో కనిపించడం జరిగేది.

అయినప్పటికీ అప్పట్లో హీరోలు ‘యాడ్స్’లో కనిపించడానికి సుముఖంగా ఉండేవారు కాదు. సినిమాల్లో కాకుండా ఇతర వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తే తమ క్రేజ్ తగ్గుతుందనో, లేక వ్యాపార ప్రకటనల్లో కనిపించడంవల్ల తమ క్రెడిబిలిటీ దెబ్బతింటుందనో… మరే కారణంవల్లనో సినిమా స్టార్స్ ‘యాడ్స్’లో సైతం కనిపించేవారు కాదు..

కానీ రాన్రానూ, ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది.. సినిమా స్టార్స్ అందరిలో ‘‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే’’ ప్రాక్టికల్ ధోరణి పెరిగింది. దాంతో ‘యాడ్స్’ని తమకు ఆదనపు ఆదాయ వనరుగా భావించడం మొదలెట్టారు… మూనె్నళ్ళపాటు ఓ సినిమా చేయడంవల్ల వచ్చే ఆదాయం, ఓ మూడు రోజుల ‘యాడ్’లో నటించడంవల్ల వచ్చే ఆదాయం దాదాపు ఒకేలా ఉండటంతో తెలుగు సినిమా స్టార్స్ యాడ్స్‌వైపు మొగ్గు చూపడం మొదలెట్టారు.. కానీ తెలుగు సినీ ప్రపంచంలో తొలితరం ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్, కృష్ణ, శోభన్‌బాబులు కానీ, మలి తరంలోని చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కానీ ఈ ‘యాడ్స్’ల వైపు అంతగా ఆసక్తి చూపించలేదు. ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్ వంటి వారు ఏవైనా సామాజిక ప్రయోజనాత్మకమైన ప్రభుత్వ పథకాల ప్రచారంలో మాత్రమే పాల్గొనేవారు. ఈ విషయంలో తెలుగు సినిమా హీరోయిన్లు మాత్రం చాలా ముందంజలో ఉన్నారని చెప్పాలి. కాంచనమాల కాలంనుంచే యాడ్స్‌లో నటించడం హీరోయిన్లకు సాధారణం అయిపోయింది. ఇక ‘లక్స్’ సబ్బు ఆగమనంతో తెలుగు హీరోయిన్లు అందరూ యాడ్స్‌లో కనిపించడం ఓ సంప్రదాయంగా మారింది.

ఐతే గత ఐదేళ్ళకాలంనుంచి ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. సినిమా స్క్రీన్‌మీద తప్ప మరేచోట కనిపించినా తమ పాప్యులారిటీ తగ్గుతుందనే గత కాలపు ఆలోచన నుండి మన సినిమా స్టార్స్ ఇపుడు బయటపడ్డారు. మరోవైపున, ఏ సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో ప్రేక్షకులకు స్క్రీన్‌మీద కనిపించడంకన్నా, అపుడపుడూ వారి కళ్ళెదుట కనిపించాలంటే ఈ ‘‘యాడ్స్’’ సరైన ‘‘గ్యాప్ ఫిల్లర్స్’’గా కనిపించాయి. దాంతో చిరంజీవి వంటి పెద్ద హీరోలు సైతం యాడ్స్‌లో నటించడం మొదలెట్టారు.

‘యాడ్స్’ నుండి ‘బ్రాండ్ అంబాసిడర్’ దాకా:

తెలుగు సినిమా స్టార్లకు మార్కెట్‌లోని కంపెనీ ప్రొడక్ట్‌లకు మధ్య క్రమక్రమంగా బలపడుతూ వస్తున్న ఈ బంధంలో తొలి దశ ‘యాడ్స్’లో నటించడం అయితే, రెండో దశగా ఈ స్టార్స్ ‘బ్రాండ్ అంబాసిడర్‌గా’ ఒప్పందాలు కుదుర్చుకోవడం అని చెప్పాలి. అయితే, యాడ్స్‌లో నటించడంవల్ల సినిమా స్టార్స్‌కు కేవలం ‘యాడ్స్’కొరకు మాత్రమే రెమ్యూనరేషన్ లభించేది. కానీ ‘బ్రాండ్ అంబాసిడర్’గా కాంట్రాక్ట్ కుదుర్చుకోవడంవల్ల హీరోలకు ఓ నిర్ణీత కాలానికిగాను భారీ మొత్తాలే ముట్టడం మొదలయింది. అలా చిరంజీవి నవరత్న హెయిర్ ఆయిల్, ‘్థమ్సప్’లకు బ్రాండ్ అంబాసిడర్‌గా అవతారం ఎత్తారు. పవన్‌కళ్యాణ్ అప్పట్లో ‘పెప్సీ’కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు.

ఇక ఇపుడు నవతరం యంగ్ హీరోలు ఈ ట్రెండి ప్రొడక్ట్‌లకు బ్రాండ్ అంబాసిడర్స్‌గా బాగా పాప్యులర్ అయిపోయారు. మహేష్‌బాబు ఇపుడు నవరత్న హెయిర్ ఆయిల్‌కు, థమ్సప్‌కు, యూనివర్‌సెల్‌లకు బ్రాండ్ అంబాసిడర్! కాగా, అల్లు అర్జున్ ‘సెవెన్ అప్’కు… రామ్‌చరణ్‌తేజ్ పెప్సీకి, ఎయిర్‌టెల్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉన్నారు.

నవతరం హీరోలు ఈ కొత్త అవకాశాన్ని అందిపుచ్చుకుని అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్న తీరు చూసి, ఇపుడు సీనియర్ నటులు కూడా రంగప్రవేశం చేసారు… ఈమధ్యే నాగార్జున ‘ప్యారాషూట్’ ఆయిల్‌కు, విక్టరీ వెంకటేష్ మణప్పురం జనరల్ ఫైనాన్స్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా మారారు. ఆ లెక్కన చిరంజీవి తరంలో ఒక్క బాలకృష్ణ తప్ప అందరూ వ్యాపార ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్స్‌గా మారారని చెప్పాలి.

ఈ పరిణామాలకి మన హీరోయిన్లు మాత్రం దూరంగా ఉన్నారా? లేదు..! వారు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఆమాటకొస్తే ‘వ్యాపార ప్రకటనలు’అనే ఓ అదనపు ఆదాయ మార్గాన్ని తొలిసారి ఉపయోగించుకున్నది హీరోయినే్ల. ఆ బాటలో ఇప్పుడు ‘బిగ్‌సి’ కంపెనీకి ఇలియానా, సన్ డైరెక్ట్ డిటీహెచ్‌కు తమన్నా, ఆర్‌ఎస్ బ్రదర్స్‌కు కాజల్ వంటి హీరోయిన్లు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉన్నారు.. హీరోయిన్ల పాప్యులారిటీని బ్రాండ్ అంబాసిడర్‌గా మలచిన ఖ్యాతి తొలుత బిగ్‌సిదే! ఆ కంపెనీ మొదట ఛార్మిని, ఆ తర్వాత కాజల్‌ని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా కాంట్రాక్టు కుదుర్చుకుంది.

సినిమా స్టార్సే ఎందుకు?

బ్రాండ్ అంబాసిడర్‌గా మారడంవల్ల హీరోహీరోయిన్లకు ఆర్థికంగా చాలా లాభాలున్నాయనే విషయం ఇపుడు సుస్పష్టం! టైమ్‌పరంగా, డబ్బుపరంగా మరెన్నో విధాలుగా సినిమా స్టార్స్‌కు ఇవి ప్లస్ అవుతున్నాయనేది వాస్తవం. అన్నింటినీమించి ఈ హీరోహీరోయిన్లు నిరంతరం ప్రేక్షకుల మదిలో తాజాగా ఉండే అవకాశం కూడా వీటివల్ల లభిస్తోంది. ఇదివరలో సినిమా విడుదలైనపుడో, వంద రోజుల వేడుక అపుడో లేదా మరే ఇతర సామాజిక కార్యక్రమంలోనో మాత్రమే నటీనటుల గురించిన విశేషాలు ఉండేవి. ఇపుడు ఈ ‘బ్రాండ్ అంబాసిడర్’ కాంట్రాక్టుల పుణ్యమా అని సినిమా స్టార్స్ సినిమాల రిలీజ్‌లతో సంబంధం లేకుండా నిరంతరం ప్రేక్షకులు ప్రజల ముంగిట్లో కదలాడుతున్నారు.. అదే సమయంలో ఆ హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ అయినపుడు ఆ సినిమాలను ప్రమోట్ చేసే అదనపు బాధ్యత కూడా ఈ బ్రాండ్ కంపెనీలదే అవుతోంది. ఇది హీరోలకు, నిర్మాతలకు ఒకింత వెసులుబాటే!
ఇలా ‘బ్రాండ్ అంబాసిడర్’ సిస్టమ్ మన తెలుగు సినిమా స్టార్స్‌కి లాభదాయకంగానే ఉంది. కానీ ఏ ప్రయోజనమూ, ఏ లాభమూ లేనిదే రూపాయైనా ఖర్చుచేయని వ్యాపార సామ్రాజ్యాలు ఏ ప్రయోజనాన్ని ఆశించి సినిమా స్టార్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి అనేది ఆలోచించాల్సిన అంశం.
కంపెనీలకు, అవి ఉత్పత్తిచేసే వస్తువులకు సినిమా స్టార్స్ బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉండటంవల్ల జనాల దృష్టిలో ఆ వస్తువులపై విశ్వసనీయత విపరీతంగా పెరుగుతోంది. అంతేకాక, ఆ వస్తువులు, ఉత్పత్తులపై, కంపెనీలపై వినియోగదారులలో ఒకలాంటి తెలీని ‘బంధం’ ఏర్పడుతోంది. హీరోతో తమకు ఉండే ‘మానసిక బంధం’, ‘ఆరాధన’, ‘అభిమానం’ వంటివన్నీ తెలీకుండానే ఆయా ఉత్పత్తులపైకి ‘ట్రాన్స్‌ఫర్’ అవుతున్నాయి. అంటే వినియోగదారులు తాము అభిమానించే సినిమా స్టార్స్ ద్వారా వస్తూత్పత్తులతో ‘కనెక్ట్’అవుతున్నారన్నమాట! దీనినే మేనేజ్‌మెంట్ పరిభాషలో ‘‘బ్రాండ్ కనెక్ట్’’ అంటారు.
మరోవైపున రోజురోజుకి మార్కెట్‌లో తామరతంపరగా పుట్టుకు వస్తున్న కొత్త కొత్త వస్తువులు, వాటి పోటీమధ్య హీరోలు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న వస్తువులు ‘‘డిస్టింక్ట్’’గా ‘‘స్పెషల్’’గా సైతం గుర్తింపు పొందడానికి అవకాశం ఏర్పడుతోంది.

‘బ్రాండ్’ మార్కెట్ విలువ ఎంత?

మన దేశంలో ప్రస్తుతం సెలెబ్రిటీలు చేసే బ్రాండ్ ఎండార్స్‌మెంట్ మార్కెట్ విలువ ప్రతి సంవత్సరం దాదాపు 850 కోట్లకు పైగానే ఉందని ఆర్థిక నిపుణుల అంచనా. వీటిలో 70 శాతం వరకూ సినీ రంగానికి చెందిన స్టార్స్‌వే కాగా, మిగతా 30 శాతం మాత్రం స్పోర్ట్ స్టార్స్‌కు సంబంధించినవి. ఇక దీన్లోనూ నేషనల్ లెవల్‌లో బాలీవుడ్ స్టార్స్‌కు సంబంధించిన వాటానే ఎక్కువ అని చెప్పాలి.

అమితాబ్, షారుఖ్, అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్ నుండి మొదలుకొని కత్రీనా, ఐశ్వర్య, అభిషేక్, బిపాషా, హేమమాలిని వరకూ బాలీవుడ్‌లో అందరు హీరోహీరోయిన్లు ఏదో ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నవారే! అయితే మన దక్షిణాదిలోనూ, అందులోనూ మన తెలుగు సినీ ప్రపంచంలో మన సినిమా స్టార్స్ మొన్నటివరకూ కొంత ‘రిజిడ్’గానే ఉన్నారని చెప్పాలి. కానీ ఈమధ్యే మారిన ట్రెండ్‌లో ఇపుడు మన తెలుగు హీరోలు కూడా విజృంభించారు. అయితే ఇంత చేసినా, మన తెలుగు స్టార్స్ మార్కెట్ దాదాపు 50కోట్లకన్నా మించకపోవడం ఇక్కడ గమనార్హం!

బ్రాండ్ అంబాసిడర్స్‌గా లోకల్ హీరోలు:

ఇటీవలి పరిణామాలను గమనిస్తుంటే కంపెనీలన్నీ తమ ప్రొడక్ట్‌లను ‘లోకలైజ్’ చేయాలని వ్యూహరచన చేస్తున్నాయేమోనని అనిపిస్తోంది. ఈ కారణంవల్లే ఇపుడు ఈ కంపెనీలు స్థానిక హీరోలతో ‘టై-అప్’లు, ‘కాంట్రాక్ట్‌లు’ కుదుర్చుకుంటున్నాయని ఓ సీనియర్ పరిశీలకుడి విశే్లషణ.

గత ఐదారేళ్ళ క్రితం ‘‘డబ్బింగ్ సినిమాల’’లాగా, ‘‘డబ్బింగ్ యాడ్‌లు’’ మన ఛానెల్స్‌లో, పోస్టర్స్‌లో, పత్రికలలో దర్శనమిచ్చేవి. షారుఖ్‌ఖాన్ తెలుగు డబ్బింగ్ వాయిస్‌తో, సింక్ కాని లిప్ మూమెంట్‌తో ప్రొడక్ట్‌ని కొనమని చెప్పడం ఉండేది. ఈ తరహా విధానంవల్ల ఆశించిన రిటర్న్‌లు రావడం లేదని కంపెనీలకు అర్ధమవడానికి చాలాకాలం పట్టింది. 1991 తర్వాత మన దేశంలో మొదలైన ఆర్థిక సరళీకరణ ప్రక్రియలవల్ల ఆర్థిక వ్యవస్థ గ్లోబలైజ్ కావడం, అమెరికా వంటి విదేశాలకు చెందిన బహుళజాతి సంస్థలెన్నో భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించడం జరిగింది. అయితే అప్పట్లో ఈ బహుళజాతి సంస్థల దృష్టిలో భారతదేశమంటే ఓ ‘‘్భరీ ఏకీకృత సమూహం’’, అత్యంత ‘‘్భరీ వినియోగదారుల సంత’’మాత్రమే! ఒక దేశం అంటే ఒకే రకమైన సమాజం ఉంటుందనీ, ఒకే రకమైన, అభిరుచులు, అలవాట్లు ఉంటాయనేది అప్పట్లో వారి ఆలోచన. దానికి తగినట్లే ఏకీకృతమైన మార్కెటింగ్, యాడ్ క్యాంపెయిన్‌ల ద్వారా విస్తృతమైన భారతీయ మార్కెట్‌ను కొల్లగొట్టవచ్చనేది వారి వ్యూహం.

కానీ నెమ్మదిగా నెమ్మదిగా పెప్సీ, కోకాకోలా వంటి మరెన్నో బహుళజాతి సంస్థలకు భారతదేశం ఎంత సంక్లిష్టమో అర్ధమయింది. ఆత్మపరంగా, రాజకీయంగా మాత్రమే భారతీయులంతా ఒక్కటి కానీ, సాంస్కృతికంగా, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు- అలవాట్ల పరంగా భారతదేశం ఓ బహుళజాతుల భిన్నమైన సమాజం అని తెలిసొచ్చింది. కాశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకూ, గుజరాత్ నుంచి మిజోరం వరకూ అన్ని రాష్ట్రాలూ, అందరు ప్రజలకూ సరిపోయే ఒకే మోడల్ ‘యాడ్ క్యాంపెయినింగ్’ కానీ, ‘‘వ్యాపార ప్రకటనా వ్యూహం’’కానీ పనికిరాదని క్రమక్రమంగా తెలిసివచ్చింది.
ఈ అనివార్య చారిత్రక, సామాజిక, వాస్తవిక భిన్నత్వమే ఇపుడు కంపెనీల దృష్టి ‘నేషనల్ స్టార్స్’ నుండి ‘లోకల్ స్టార్స్’ వైపు దృష్టి మళ్ళించేలా చేసింది.. ప్రొడక్ట్‌లను ప్రజలకు చేరువ చేయడానికి ‘యాడ్స్’ని ‘లోకలైజ్’ చేయాలనే ఆలోచన వచ్చింది.. మరి లోకలైజ్ చేయాలంటే మొదట చేయాల్సిన పని ఏంటి? ప్రొడక్ట్‌లను వినియోగదారులు- ప్రజలు తమకు ‘ఓన్’చేసుకోవాలి. ‘ఓన్’ చేసుకోవాలంటే బలమైన ప్రభావం కలిగిన వ్యక్తుల ద్వారా ఆ ప్రొడక్ట్‌లు ప్రచారం పొందాలి.

ఇంతటి సైకలాజికల్ వ్యూహాలు- అంచనాల తర్వాత కంపెనీలు మన తెలుగు స్టార్స్‌తో కాంట్రాక్టులు కుదుర్చుకోవడం మొదలెట్టాయి… అలా మన హీరోలు బ్రాండ్ అంబాసిడర్స్‌గా కొత్త అవతారం ఎత్తారు. దీనికితోడు, ఎన్ని చెప్పినా షారుఖ్ ఖాన్, అమీర్‌ఖాన్ లాంటి బాలీవుడ్ హీరోలకు దేశవ్యాప్త ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉంది కానీ దక్షిణాది రాష్ట్రాల విషయానికొస్తే వీరి ప్రభావం కొంచెం తక్కువే అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే, హిందీ సినిమాలన్నా, హిందీ భాష అన్నా అర్ధంకాని జనమే మన దక్షిణాదిలో ఎక్కువగా ఉన్నారు. దానివల్ల ‘రణ్‌బీర్‌కపూర్’ చెప్పే ‘యంగిస్తాన్’ యాడ్ కేరళలోనో, తమిళనాడులోనో ఉండే వినియోగదారులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అంటే దక్షిణాది రాష్ట్రాల వినియోగదారులను ఆకర్షించాలంటే బాలీవుడ్ స్టార్స్ మాత్రమే సరిపోరు అనేది స్పష్టమైపోయింది.

ఇంకా గమ్మత్తేమిటంటే, ఉత్తరాది ప్రజలు, మేధావుల దృష్టిలో దక్షిణాది అంటే ‘‘మద్రాసీయే’’! సేమ్ ఇదే పరిశీలనాదృష్టి వివిధ కంపెనీల అధినేతల్లో కూడా మొన్నమొన్నటి వరకూ ఉండేవి. ఎన్టీఆర్ లాంటి మహనీయులు దక్షిణాదిలో తెలుగుజాతి ఒకటుందని, అది మద్రాసీలకు భిన్నమయిందని ఎలుగెత్తి చాటడం రాజకీయాలకు మాత్రమే పరిమితమయింది కానీ వ్యాపార, వాణిజ్య, వ్యవహారాలకు అందలేదు. ఈ మధ్యకాలంలోనే ఈ ధోరణిలో మార్పులు వచ్చి ‘ప్రాంతీరుూకరణ’ గురించిన అవగాహన, దక్షిణాదిలోని వివిధ ప్రాంతాల విశిష్ట సంస్కృతులను గురించిన అవగాహన ఏర్పడ్డాయి.
వీటన్నింటి ఫలితంగానే ఇపుడు ప్రతీ మల్టీ నేషనల్ ప్రొడక్ట్‌కీ ఓ ‘లోకల్ బ్రాండ్ అంబాసిడర్’ ఆవశ్యకత ఏర్పడింది. అలా ‘్థమ్సప్’లో నేషనల్ లెవల్‌లో అక్షయ్‌కుమార్ కనిపిస్తే, మన తెలుగు విషయానికొచ్చేసరికి మన లోకల్ హీరో ‘మహేష్‌బాబు’ వచ్చాడు. ‘పెప్సీ’కి రణ్‌బీర్‌కపూర్ అయితే, మనకు రామ్‌చరణ్ వచ్చారు.

ఏదిఏమైనా, ఇప్పుడు తెలుగు సినిమా స్టార్స్ అంతా ఏదో ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా దర్శనమిస్తున్నారు. ‘‘చాలా ఇంకా కావాలా?’’ అని ప్రశ్నిస్తున్నారు.

ఇక్కడ, మనం మొదట చెప్పుకున్న మహేష్‌బాబు యాడ్‌ని కొంచెం ఇపుడు మార్చి చెప్పుకోవాలి. ‘‘నా కూల్‌డ్రింక్ వెంట ఎందుకు పడ్తున్నావ్?’’…అన్న డైలాగ్‌ని తిరగరాసుకోవాలి.

అయితే, అందాల భామ కంపెనీ అయితే కూల్‌డ్రింక్ హీరోగా… హీరో పాత్రధారిని వినియోగదారుగా ఊహించాలి.

–మామిడి హరికృష్ణ

2 Comments
  1. samrat March 16, 2011 /