Menu

సినిమా ‘సిత్రాలు’

సినిమా: మాయాబజార్
సంవత్సరం: 1957
డైరెక్టర్: కదిరి వెంకటరెడ్డి (కె.వి.రెడ్డి) సినిమాటోగ్రాఫర్: మార్కస్ బార్‌ట్లే.
సీన్: ‘లాహిరి లాహిరి లాహిరిలో’ పాట చిత్రీకరణ.

కథా రచయిత పింగళి నాగేంద్రరావు. ఈ పాటకు లీడ్‌గా వచ్చే సన్నివేశాలను చెప్పారు… తన మనోఫలకంపై ఓ దృశ్యాన్ని ఊహించారు.. అర్థరాత్రి… పండువెనె్నల శశిరేఖ- అభిమన్యులు నదిలో విహారానికి వస్తారు! ఎవరికీ తెలీకుండా వచ్చిన ఈ ప్రేమజంట విహారం సంగతి శశిరేఖ తల్లిదండ్రులైన బలరామ దంపతులకు తెలుస్తుంది! సంగతేంటి చూద్దామని బయలుదేరతారు…! వాళ్ళు చూస్తే అభిమన్యుడు- శశిరేఖ ప్రేమాయణం కాస్తా భగ్నమవుతుంది…! శ్రీకృష్ణుడు రుక్మిణితో అక్కడికి చేరుకుని బలరామ దంపతులు వచ్చేసరికి నదీ విహారంలో పడవపై తను కనిపిస్తాడు…! పిండారబోసినట్లున్న వెండి వెన్నెల వెలుగుల్లో నీటి కెరటాల తళుకులకు మురిసిపోయిన బలరామ దంపతులు కూడా నదీ విహారం చేస్తారు…

ఈ సీన్ పింగళిగారు చెప్పగానే డైరెక్టర్ గారికి బాగా నచ్చింది… ‘‘ఓకే ప్రొసీడ్… అలానే చేద్దాం!’’ అన్నారు…! కానీ ‘ఎంకి పెళ్ళిసుబ్బి చావుకొచ్చింది’ అన్నట్లు ‘‘రచయిత ఇమేజినేషన్ సినిమాటోగ్రాఫర్‌కు తల వాచిపోయేలా చేసింది…! సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్‌ట్లే డైరెక్టర్ చెప్పింది విన్నారు…! వెనె్నలకోసం ఆగే పరిస్థితి లేదు… ఒకవేళ వెనె్నల… పున్నమి… ఉన్నా లైటింగ్ ఎంత ఉంటుందనేది డౌటే! షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడకూడదు… నటీనటుల డేట్స్‌కి ప్రాబ్లమ్ రాకూడదు…! సినిమా బడ్జెట్ పెరగకూడదు…! ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య పున్నమి వెనె్నల ఎఫెక్ట్స్‌లో ఈ పాటని తెరపై చూపించాలి…! అత్యంత క్లిష్టమైన, కష్టమైన టాస్క్!

మార్కస్ బార్‌ట్లేకి ‘ఎడ్వర్డ్ డి బోనో’ ఎవరో తెలీదు…!

ఎందుకంటే మార్కస్ 50 ఏళ్ళ వయసొచ్చేనాటికి కూడా ఎడ్వర్డ్ ఇంకా జన్మించలేదు…! కానీ ఎడ్వర్డ్ డి బోనో చేసిన సూత్రీకరణని మార్కస్ బార్‌ట్లే నిజంగా అమలుచేసి చూపించారు… అదే లేటరల్ థింకింగ్! ‘‘దారులన్నీ మూసుకుపోయిన సందర్భంలో మానవ మేథాశక్తి ఇంకా చురుకుగా పనిచేస్తుంది… ‘ఇంపాజిబిలిటీస్’ అన్నింటినీ అధిగమించి అనూహ్యమైన ‘సొల్యూషన్’ని వెదుకుతుంది’’ అనేదే లేటరల్ థింకింగ్ సూత్రం!
మార్కస్ బార్‌ట్లే తీవ్రంగా ఆలోచించారు… లోచించారు… చించారు… చారు…రు! ఒక్కసారిగా ఐడియా వెలిగింది! ఆ పాట సీన్‌కి మిట్టమధ్యాహ్నం… పట్టపగలు షూటింగ్ ఫిక్స్ చేసారు…!

డైరెక్టర్‌గారికి ఆశ్చర్యం!

కథా రచయితకైతే ఏం జరుగుతుందో అర్థంకాలేదు!

నటీనటులందరికీ అది మధ్యాహ్నపు బోటు షీకారు సన్నివేశమేమో అనుకున్నారు…

మార్కస్ బార్‌ట్లే తన అసిస్టెంట్‌లను అలర్ట్ చేసారు… సీన్ కవరయ్యే ఫ్రేమ్ ప్రదేశం అంతటా గుడ్డలను కట్టారు. అవన్నీ నెమ్మదిగా కదిలేలా… అటువైపున కనిపించకుండా ఫ్యాన్లు పెట్టారు.

షూటింగ్ కంప్లీట్ చేసారు…!

ల్యాబ్‌లో రష్ చూస్తున్నారు… డైరెక్టర్, రైటర్!

తెరమీద ‘లాహిరి లాహిరి లాహిరి’లో పాట వచ్చింది…

పాట అయిపోయేంతవరకూ ఊపిరి బిగపట్టి చూసారు…

పౌర్ణమి పండువెనె్నల్లో హాయిగా పాడుకుంటున్న మూడు జంటల వినోదానికి దాన్ని తెరకెక్కించిన తామే ఆశ్చర్యపోయారు. మార్కస్ బార్‌ట్లేని కౌగిలించుకుని అభినందించారు.

ఇదంతా 50 ఏళ్ళ క్రితంనాటి తెలుగు సినిమా చిత్రీకరణ పరిస్థితి… ఇప్పటికీ ఈ పాటని మిట్టమధ్యాహ్నం షూటింగ్ చేసారంటే నమ్మశక్యంగా ఉండదు…!

*********

‘మాయాబజార్’కు 52 ఏళ్ళ తర్వాత…
2009…
సినిమా: మగధీర
డైరెక్టర్: ఎస్.ఎస్.రాజవౌళి
సినిమాటోగ్రాఫర్: కె.కె.సింథిల్‌కుమార్
సీన్: భైరవకోనలో హీరో వందమంది యోధులతో తలపడే దృశ్యం.

దర్శకుడు రాజవౌళికి ఈ యుద్ధ సన్నివేశాన్ని హీరోయిక్‌గా చూపించాలని… కొండ చరియలు… లోతైన లోయల దృశ్య నేపథ్యంతో ఈ యాక్షన్ సీన్‌ను అద్భుతంగా చూపించాలనేది… ఈ సీన్‌కు ఓ భయోద్విగ్న ఉత్కంఠ భరితమైన ‘మూడ్’ని తీసుకురావాలనేది ఇమాజినేషన్…! ఆర్ట్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, సినిమాటోగ్రాఫర్… సింథిల్… ఈ సీన్ గురించి గంటల తరబడి చర్చించారు. ర్చించారు… చారు…రు…

స్పెషల్ ఎఫెక్ట్స్ ఎక్స్‌పర్ట్ కమల్ కణ్నన్‌ని కూడా ఈ డిస్కషన్‌లో భాగస్వామిని చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. కమల్ వచ్చారు…!
రాజవౌళి సీన్ వివరించారు… తనకు కావలసిన ఎఫెక్ట్‌ని వర్ణించి చెప్పారు…

కమల్ కణ్నన్ ‘‘ఒకే… అలాగే!’’ అన్నారు…! ఆర్ట్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డిని స్కెచెస్ వేయమన్నారు… ఈ సీన్‌నంతా ఇండోర్ సెట్‌లో గ్రీన్ మ్యాట్‌లో షూటింగ్ చేయండని సినిమాటోగ్రాఫర్‌కి చెప్పారు…

చుట్టూ గ్రీన్ మ్యాట్…

నటీనటులకి మొదట్లో అర్థంకాలేదు…

భైరవకోన సెట్… భారీ ఢమరుకం… ఓవైపు… భైరవుని భారీ విగ్రహం మరోవైపు… అంతే…!

ఐతేనేం… డైరెక్టర్ చెప్పినట్లుగా యాక్షన్ చేసారు… షూటింగ్ కంప్లీట్ అయింది…!

ల్యాబ్‌లో ప్రీవ్యూ చూసుకుంటున్నారు… డైరెక్టర్… ఇతర సాంకేతిక నిపుణులు…! భైరవకోన సీన్ వచ్చింది… అందరూ ఉద్విగ్నంగా చూస్తున్నారు. అలా చూస్తూనే ఉండిపోయారు. గ్రీన్‌మ్యాట్‌తో చిత్రీకరించిన సీన్లలో కంప్యూటర్ గ్రాఫిక్స్… డిజిటల్ విజువల్ ఎఫెక్ట్స్ మిక్స్‌చేసి స్క్రీన్‌మీద ప్రొజెక్ట్ చేసింతర్వాత… ఆ సీన్ అత్యద్భుతంగా వచ్చింది… అందరూ లేచి కమల్ కణ్నన్‌ని అభినందించారు…!

కానీ భారత ప్రభుత్వం ఏకంగా జాతీయస్థాయి అవార్డునిచ్చి సత్కరించింది!

క్రియేటివిటీకి- టెక్నాలజీకి పుట్టిన ఈ మిలీనియం అద్భుతం- సినిమా! అలాగే క్రియేటివిటీ- కమర్షియాలిజీ రెండూ జోడెద్దులుగా ప్రయాణిస్తున్న అద్భుత వినోదం కూడా సినిమానే! ఐతే, సినిమా మేకింగ్ అనేది ఓ ‘టీమ్‌వర్క్’ అనీ. 24 క్రాఫ్ట్‌లు కలిసి ఏకోన్ముఖంగా… ఒకే ఉమ్మడి లక్ష్యంతో చేసే సృజనాత్మక సృష్టి అనేది ఎప్పట్నించో వినిపిస్తున్నదే! కానీ ‘సినిమా మేకింగ్’లో ఇటీవలి పరిణామాలను గమనిస్తే, సినిమాలో ప్రస్తుతం కొత్త కొత్త టెక్నాలజీలు రాజ్యమేలుతున్నాయని అర్ధమవుతోంది…! సినిమా రంగం ఇపుడు కంప్యూటర్స్‌తో జతకట్టి మేకింగ్‌నుంచి మొదలుకొని, ఎగ్జిబిషన్ వరకూ ఓ నయా రివల్యూషన్‌కు శ్రీకారం చుడుతోందని అవగతమవుతుంది…! అలా ప్రస్తుతం ప్రపంచ సినిమా రంగంలోనుండి, భారతీయ సినిమా రంగంలోనే కాకుండా, తెలుగు సినిమా రంగంలోను ఈ నవ్య సాంకేతిక పరిణామాలు ఇపుడు ఓ ‘‘సంభ్రమాశ్చర్యాల సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్’’ని ఆడియెన్స్‌కు కలిగిస్తున్నాయి… ఇలా కొత్త టెక్నాలజీస్ విశ్వరూపం చూపిస్తున్న రంగాలలో సినిమాటోగ్రఫీ… ఆర్ట్ డైరెక్షన్… సౌండ్… మ్యూజిక్… ఎడిటింగ్ యాక్షన్… డిజిటల్ ఇంటర్ మీడియెరీ (డిఐ) క్రాఫ్ట్స్ ప్రముఖమైనవిగా చెప్పవచ్చు…

సినిమాటోగ్రఫీ ఇన్నోవేషన్స్:
సినిమా అనేది విజువల్ మీడియా! దర్శకుడు ‘‘ఊహలు దృశ్యాలుగా తెరమీద కనిపిస్తూ ఆడియెన్స్‌తో చేసే దృశ్య సంభాషణ- సినిమా! ఇక కథకుడు- దర్శకుడి ఇమాజినేషన్‌ని, క్రియేటివిటీని తెరమీద చూపించే సాధనం, క్రాఫ్ట్ మాత్రం- సినిమాటోగ్రఫీనే! అందుకే హిచ్‌కాక్ అంతటి దర్శకులు కూడా ‘‘డైరెక్షన్ అంటే ఏంలేదు సినిమాటోగ్రఫీ టెక్నిక్స్, యాంగిల్స్ తెల్సి ఉండటమే’’ అని ఓ సందర్భంలో అన్నారు. సన్నివేశానికి తగిన మూడ్‌ని, సిచువేషన్‌ని లైట్స్-షేడ్స్-యాంగిల్స్- ఫ్రేమ్స్ ద్వారా తెరపై అనువదించే సాంకేతిక నిపుణుడు సినిమాటోగ్రాఫర్! అందుకే తెలుగు సినిమా ప్రస్థానంలో ‘మేకింగ్’పరంగా వచ్చిన మార్పులన్నీ అడ్వాన్స్‌మెంట్స్ అన్నీ మొదటగా కెమెరా పనితనం పరంగా వచ్చినవే అని చెప్పాలి… ఆనాటి స్టాండర్డ్ కెమెరానుంచి మొదలుకొని, ఈనాటి ‘రెడ్ కెమెరా’ వరకూ సాంకేతిక పరికరాలన్నీ సినిమాటోగ్రాఫీ పరంగా వచ్చిన మార్పులే! ఈ మార్పులే వైవిధ్యమైన దృశ్యాలకు ఆలంబనగా నిలిచి ప్రేక్షకుడికి వెరైటీ అనుభూతినిస్తున్నాయి…
1963లో వచ్చిన ‘లవకుశ’ తొలి కలర్ సినిమాగా రికార్డు సృష్టించింది… కానీ అప్పటికి ఇది సాహసోపేతమైన కొత్త ప్రయోగం… ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేసి చూపించిన క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ పి.ఎల్.రాయ్‌దే! ఈ ‘విజువల్ వెరైటీ’వల్లే ‘లవకుశ’ సినిమా ఓ చరిత్రగా నిలిచిందనడంలో సందేహం లేదు.

తెలుగు సినిమా ప్రస్థానంలో మేకింగ్‌పరంగా వచ్చిన పరిణామాలలో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన సినిమా- ‘అడవి రాముడు’! 1977లో వచ్చిన ఈ సినిమా తెలుగులో ‘‘హాఫ్ యాన్ అవర్ యాక్షన్ క్లైమాక్స్’’అనే ట్రెండ్‌కు నాంది పలికింది! ఫైట్స్‌తో కూడిన ఈ క్లైమాక్స్ చిత్రీకరణకు సినిమాటోగ్రాఫర్ కొత్త పంథాలో వెళ్ళడం, తర్వాతి తరాల కెమెరామెన్‌కు ఓ పాఠంలా మారింది.
శివ-గీతాంజలి ముద్ర:

ఇక, తెలుగు సినిమా మేకింగ్‌లో టెక్నిక్- టెక్నాలజీ పరంగా ఓ మైల్‌స్టోన్ సంవత్సరం- 1989 అని చెప్పాలి…! ఈ సంవత్సరం విడుదలైన ‘శివ’ సినిమా సినిమాటోగ్రఫీ పరంగా, టెక్నిక్ పరంగా ఎనె్నన్నో కొత్త ప్రయోగాలకు దారితీసింది… ఎస్.గోపాల్‌రెడ్డి సినిమాటోగ్రఫీ పరిజ్ఞానం- రామ్‌గోపాల్‌వర్మ క్రియేటివ్ టెక్నిక్ రెండూ కలిసి ఇప్పటికి తెలుగు సినిమా విజువల్ పిక్చరైజేషన్‌లో ‘లెస్సన్’లా నిలిచాయి.

ఇక మణిరత్నం- పి.సి.శ్రీరామ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా గీతాంజలి! ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ పరంగా శ్రీరామ్ చేసిన ప్రయోగాలు, తర్వాత సినిమా మేకింగ్ పరంగా చాలామందికి అడుగుజాడలయ్యాయి. అయితే ఇప్పటివరకూ, దృశ్యాల పరంగా, చిత్రీకరణ పరంగా వచ్చిన ‘అడ్వాన్స్‌మెంట్’ అంతా కెమెరాలు- లెన్స్‌లు- లైటింగ్ యాంబియెన్స్- ట్రాలీ షాట్స్- ఏరియల్ షాట్స్‌పరంగా వచ్చిందే!

‘అమ్మోరు’…‘అంజి’… సినిమాల తర్వాత సినిమాటోగ్రఫీకి కంప్యూటర్ గ్రాఫిక్స్ తోడైనాయి. కంప్యూటర్ జెనరేటెడ్ ఇమేజెరీ (సిజిఐ), స్పెషల్ ఎఫెక్ట్స్ మామూలుగా తీసిన ఫిల్మ్‌కి మరింత రిచ్‌నెస్‌ని తెచ్చాయి… అనూహ్య దృశ్యాలను సాదశ్యం చేసాయి. ఇక 2009లో వచ్చిన ‘అరుంధతి’, ‘మగధీర’ సినిమాలు సినిమాటోగ్రఫీ- కంప్యూటర్ విజువల్ గ్రాఫిక్స్- ఎఫెక్ట్స్ ఎంతగా కలిసిపోయాయో నిరూపించాయి.

మరోవైపున ‘ఈనాడు’ సినిమా ఓ సరికొత్త సినిమాటోగ్రాఫిక్ మేకింగ్ స్టైల్‌ని మనకు పరిచయం చేసింది…! ఫిల్మ్ రోల్ అనేది లేకుండా డిజిటల్ స్ట్రక్చర్‌లో వచ్చిన ఈ అడ్వాన్స్‌డ్ టెక్నలాజికల్ కెమెరా… కెమెరాలోనే ఎడిటింగ్ సౌకర్యాన్ని అందించింది. తద్వారా ‘ముడి రీలు’కోసం పెట్టే లక్షలాది రూపాయల వ్యయాన్ని తగ్గించింది.

డిజిటల్ ఇంటర్‌మీడియరీ విప్లవం:

హాలీవుడ్ నుంచి మొదలుకొని టాలీవుడ్ వరకూ ఇపుడు సినిమా ఆర్ట్‌పరంగా, సినిమా మేకింగ్ పరంగా అత్యవశ్యకంగా మారిన సరికొత్త టెక్నాలాజికల్ క్రాఫ్ట్స్‌మన్‌షిప్- ‘‘డిజిటల్ ఇంటర్ మీడియరీ విధానం!’’ దీంతో ఆల్రెడీ చిత్రించిన సీన్లకి కావలసినన్ని మార్పులను చేసుకునే అవకాశం ఏర్పడింది… కలర్ కలెక్షన్ నుంచి మొదలుకుని, మొత్తం సినిమా లుక్‌నే మార్చగలిగే అవకాశం వచ్చింది… ఈమధ్య కాలంలో విజువల్ రిచ్‌నెస్‌తో ఎంతగానో ఆకట్టుకున్న సినిమా- ‘ఏ మాయ చేసావే’! మనోజ్ పరమహంస ఫొటోగ్రఫీ నైపుణ్యానికి ఈ డి.ఐ. టెక్నిక్ జతకలవడంతో ఈ సినిమా ప్రతీ ఫ్రేమ్ ఓ అందమైన దృశ్య సంకలనంలా మారింది. అలాగే ‘ఆర్య-2’లో కూడా! ఇక ‘వరుడు’ సినిమాలో పెళ్ళి వేదిక సెట్ చుట్టూ పచ్చని పంట పొలాలు…క్లైమాక్స్‌లోని యాక్షన్ ఫైట్స్ అన్నీ గ్రాఫిక్స్… డి.ఐ. టెక్నాలజీలు సృష్టించిన అద్భుతాలే! ఇక ‘ఖలేజా’లోని స్పెషల్ లుక్ కూడా దీని పుణ్యమే!

ఆర్ట్ టెక్నాలజీ ఉంది:

ఒకనాటి మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే కళా దర్శకత్వంనుంచి మొదలుకుని తోటయాదు, తరణి, భాస్కరరాజులతో కొనసాగి నేడు చిన్న (పూరి జగన్నాథ్ సినిమాలకు ఎక్కువగా చేస్తుంటారు), భూపేష్, అశోక్ (ఒక్కడు, అరుంధతి ఫేమ్), రవీందర్‌రెడ్డి (రాఖీ, ఛత్రపతి, మగధీర, మర్యాద రామన్న) వరకూ కళాదర్శకత్వం ఇప్పుడు ఎనె్నన్నో కొత్త టెక్నాలజీలను సొంతం చేసుకుంది… సీన్‌ని అనుసరించి ‘మినియేచర్’ల నిర్మాణంనుంచి మొదలుకొని, భారీ సెట్టింగ్‌ల వరకూ ఇపుడు సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్‌కుండే ప్రాధాన్యత పెరిగింది. దానికి తగినట్లే, సినిమా మేకింగ్‌లో లేటెస్ట్‌గా వస్తున్న కంప్యూటర్ టెక్నాలజీని, గ్రాఫికల్ స్కిల్స్‌ని సైతం ‘ఆర్ట్ డైరెక్షన్’ డిపార్ట్‌మెంట్ ఇపుడు సంతరించుకుంది. గతంలో కళాదర్శకుడు కేవలం సినిమాటోగ్రాఫర్‌తో సమన్వయం చేసుకుంటే సరిపోయే స్థితినుంచి ‘‘వర్చువల్ సెట్’’లు, ‘‘గ్రీన్‌మ్యాట్’’ పిక్చరైజేషన్‌లు, గ్రాఫిక్ ఇమేజెరీలతో దృశ్యాన్ని ‘రిచ్’గా చేయాల్సి వస్తోంది.

ఎడిటింగ్‌లో కూడా…

రీల్ టురీల్ కళ్ళు కాయలుకాచేలా చూస్తూ స్క్రీన్‌ప్లే, సీనిక్ ఆర్డర్స్ ఫాలో అవుతూ ‘ఓకే’ అయిన షాట్‌లను రష్‌లోంచి వేరుచేస్తూ మాన్యువల్‌గా అష్టకష్టాలు పడే సాంకేతిక దశ- ఎడిటింగ్. ఇపుడు ఎడిటింగ్‌లో ‘ఏలిడ్’ సిస్టమ్స్… కంప్యూటర్ సాఫ్ట్‌వెర్స్‌ని ఎన్నో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో రావడం ఎడిటింగ్ క్రాఫ్ట్‌లో కొత్త రివల్యూషన్‌కు దారితీసిందని చెప్పాలి. గతంలో ఎడిటింగ్ అంటే సరైన షాట్‌లను ఆర్డర్‌లీ పొందుపరచడం వరకే ఉండేది. కానీ ఇపుడు అవసరమైతే విజువల్ ఎఫెక్ట్స్‌ని… ఇంటర్‌కట్స్‌ని… సూపర్ ఇంపోజిషన్ షాట్స్‌ని… క్రాప్స్‌ని… ఫ్రేమ్‌లో ఇన్‌సర్ట్‌చేసే అవకాశం వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఒరిజినల్ రీల్ క్యాప్చర్ చేసిన కలర్‌ను అవసరాన్ని, సన్నివేశాన్నిబట్టి ‘‘కలర్ కరెక్షన్’’ చేసుకోవడానికి… ఆడియో-వీడియో ఎఫెక్ట్‌లు జత చేయడానికి అవకాశం వచ్చింది.

యాక్షన్- సౌండ్‌లూ తక్కువ కాదు..

సినిమాను మరింత అబ్బురపరిచే దృశ్య విన్యాసాలుగా మలచడంలో ఇపుడు ఎనె్నన్నో కొత్త క్రాఫ్ట్‌లు, కొత్త టెక్నాలజీలు పుట్టుకు వచ్చాయి… వస్తున్నాయి…! దీనికి యాక్షన్- ఫైట్స్ విభాగం కూడా మినహాయింపు కాదు… పీటర్ హెయన్, రామ్‌లక్ష్మణ్ వంటి యాక్షన్ డైరెక్టర్స్ పుణ్యమా అని ఇపుడు తెలుగు సినిమాల్లో యాక్షన్ పార్ట్‌ల చిత్రీకరణ ఆడియెన్స్‌కు ఓ వింత అనుభూతిని ఇస్తోంది. ఒకప్పుడు టైటిల్స్‌లో ఫైట్స్ అనీ… ఆ తర్వాత స్టంట్స్ అనీ…ఇపుడు యాక్షన్ అనీ క్రెడిట్స్‌గా పడ్తున్న ఈ క్రాఫ్ట్, ఈ దృశ్యాల చిత్రీకరణలో ఎనె్నన్నో టెక్నాలజీస్‌పై ఆధారపడుతోంది… స్టంట్స్ రాజు కాలంలో, హార్స్‌మన్ బాబు కాలంలోని మార్పులుకన్నా పీటర్ హెయన్ వచ్చిన తర్వాత వచ్చిన పరిణామాలు అనూహ్యంగా ఉన్నాయని చెప్పాలి. హీరో దెబ్బకు విలన్‌ల గ్యాంగ్ గాలిలో లుంగలు చుట్టుకుని తిరిగే దృశ్యాలు… హీరో అత్యంత నేచురల్‌గా గాలిలో ఎగిరే దృశ్యాలు ఇపుడు ఎంతో ‘నమ్మబుల్’గా అనిపిస్తున్నాయి. దీనికోసం చేస్తున్న ‘వైర్‌వర్క్’… ఆపరేట్ చేసే నిపుణుల మధ్య సమన్వయం యాక్షన్ సీన్లలో ఉద్వేగాన్ని, ఉత్తేజాన్ని పండిస్తున్నాయి.

ఇక, సినిమా అంటే ప్రధానంగా దృశ్యమే అయినా, దానికి తగిన నేపధ్య సంగీతం, సౌండ్ కుదిరితే ఆ సీన్ ఆడియెన్స్‌లో చెరగని ‘ఇంప్రెషన్’ని క్రియేట్ చేస్తుందనేది సాధారణ సైకలాజికల్ ప్రిన్సిపుల్! అయితే ధ్వని రికార్డింగ్ అనేది తెలుగు సినిమాల్లో చాలాకాలంవరకూ ‘‘్ఢషుం…్ఢషుం’’ గానే ఉండిపోయిందనేది నిజం! కానీ తెలుగు సినిమా రంగంలోని ఎనె్నన్నో విప్లవాలకి రామ్‌గోపాల్‌వర్మ కారణం అయినట్లుగానే ‘సౌండ్ క్రాఫ్ట్’లో కూడా ఆయన తీసిన ‘శివ’సినిమానే కొత్తదారులను తెరిచింది… మొదటిసారిగా- హీరో విలన్‌ను కొడితే ‘్ఢషుం’స్థానంలో నేచురల్ సౌండ్ తెరపై వినిపించింది. ఇలా సౌండ్ పరంగా చిన్నగా మొదలైన విప్లవం, ఇపుడు రీ-రికార్డింగ్ అనేది ఓ ఇంపార్టెంట్ అంశంగా మారింది. అలాగే ‘బ్యాక్‌గ్రౌండ్ స్కోర్’ అనేది నయా టెక్నలాజికల్ క్రాఫ్ట్స్‌మెన్‌షిప్‌గా ఇపుడు సినీ ఇండస్ట్రీలో పాప్యులర్ అయింది… ఒకపుడు సంగీతం అంటే ఆరు పాటలకి మ్యూజిక్ కంపోజిషన్ మాత్రమే అయి ఉండేది. కానీ ఇపుడు ‘ట్యూన్ తిరిగిన మ్యూజిక్ డైరెక్టర్స్’ సైతం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి తహతహలాడుతున్నారు. దీనికితోడు, రసూల్‌పూకుట్టి ‘సౌండ్’ విభాగానికే ఆస్కార్ అవార్డును సాధించడం ప్రస్తుతం మన సినిమాల్లో సైతం ‘సౌండ్ టెక్నాలజీపై’ తప్పనిసరిగా శ్రద్ధ చూపించే అగత్యాన్ని కల్పించింది.

పాత-కొత్తల మేలుకలయిక:

సినిమా రంగం అనేది ఓ నిత్య ప్రయోగశాల! ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా చూపించి ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడమే సినిమా లక్ష్యం! ఆ దిశగా మన తెలుగు సినీ పరిశ్రమ సైతం ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న పాత టెక్నాలజీలను, క్రాఫ్ట్‌లనే కాకుండా, కొత్త- నవ్య టెక్నాలజీలను- స్కిల్స్‌ను కూడా అందిపుచ్చుకుంటోంది… నవ్యతకు ఎప్పుడూ ఆహ్వానం పలికే తెలుగు సినీ పరిశ్రమ సినిమా మేకింగ్‌లో… సినిమా ఆర్ట్‌లో మరెన్నో విప్లవాలకు ‘రెడ్ కార్పెట్’వేసి ఉంది. ప్రేక్షకులారా… తెలుగు సినిమాలో మరిన్ని అద్భుతాలను చూడటానికి సన్నద్ధంకండి!

కర్టేసీ: ఆంధ్రభూమి

–మామిడి హరికృష్ణ

16 Comments
 1. mohanramprasad March 13, 2011 /
 2. ravi samala March 13, 2011 /
 3. rajkumar March 13, 2011 /
 4. V. Chowdary Jampala March 13, 2011 /
  • harikrishna March 16, 2011 /
 5. jayakiran March 13, 2011 /
 6. sukruthi March 13, 2011 /
 7. swatiprasad March 13, 2011 /
  • harikrishna March 16, 2011 /
 8. Raj Potluri March 15, 2011 /
 9. kailas varma March 16, 2011 /
 10. srilaxmi March 16, 2011 /
 11. mallikarjun March 17, 2011 /
 12. sai navyatha March 20, 2011 /