Menu

దీనమ్మ జీవితం: ఏ సాలీ జిందగీ

నిషి బలహీనతల్లోంచీ బలవత్తరమైన కోరికలు పుడతాయి. ఆ కోరికలు జీవన విధానాన్ని నిర్మిస్తాయి, జీవితాన్ని శాసిస్తాయి, జీవితాన్ని సమూలంగా మార్చేస్తాయి. అలాంటి కోరికల పర్యవసానంగా ఏర్పడే ఘటనలూ, ఆశల్లోంచీ వచ్చిన పరిస్థితులూ ఒక్కోసారి గమనించేవాళ్ళకు/ చూసేవాళ్ళకు హాస్యాస్పదంగా ఉంటాయి. అలాంటి బలహీతల, బలవత్తర కోరికల, తికమక జీవితాల ఘటనల్లోంచీ పుట్టిన హాస్యాన్ని సినిమా భాషలో “బ్లాక్ కామెడీ” అంటారు. అలాంటి బ్లాక్ కామెడీకి దాదాపు పర్ ఫెక్టు ఉదాహరణ “ఏ సాలీ జిందగీ”. ఒక మితృడు ఈ సినిమాకు తెలుగులో పెట్టుకున్న శీర్షిక ‘దీనమ్మ జీవితం’.

దర్శకుడిగా తీసింది మూడు (ఇస్ రాత్ కి సుబహ్ నహి, హజారో ఖ్వాహిషే ఐసి, ఖోయా ఖోయా చాంద్) సినిమాలే  అయినా, హిందీ చిత్రరంగంలో ఉత్తమ దర్శకుల కోవలో ఎన్నబడే దర్శకుడు సుధీర్ మిశ్రా నాలుగో ప్రయత్నం “ఏ సాలీ జిందగీ”. టైటిల్ సాంగ్ లో “మనమొకటి అనుకుంటే జీవితం మరొకటి చేస్తుంది. దీనమ్మ జీవితం!”  అన్నట్టుసాగే కొన్ని జీవతాల సమాహారపు హింసాత్మక హాస్యం ఈ చిత్రం.

సినిమా కథ గురించి చెప్పాలంటే కొంత తికమక తప్పదు ఎందుకంటే ఎన్నో పాత్రల జీవితాలు కలిపితే ఈ కథ అవుతుంది. ప్రతొక్క పాత్రకూ ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ఆ ప్రతి కథకు ఒక గ్రాఫ్ ఉంది. మధ్యలో ఇతర పాత్రలతో వాళ్ళ కథలతో క్రిస్ క్రాస్సింగూ ఉంది. అదే మొత్తం కథ. కాబట్టి ఆ వున్న కథల కమామిషు చెబుతాను లెక్కెట్టుకోండి 🙂

కథ 1: ‘అరుణ’ (ఇర్ఫాన్ ఖాన్) ఫైనాన్స్ మాఫియా నడిపే మెహతా& మెహతా (సౌరభ్ శుక్లా) కంపెనీలో ఒక ఛార్టెడ్ అకౌంటెంట్. ఒక ఫైనాన్స్ డీల్ లో పరిచయమైన సింగర్‘ప్రీతి’ (చిత్రాంగదా సింగ్) తో ప్రేమలో పడతాడు. ప్రీతి మాత్రం ఒక ఇండస్ట్రియలిస్టు కొడుకు ‘శ్యామ్’ (విపుల్ శర్మ) తో ప్రేమలో ఉంటుంది. ఆ ఇండస్ట్రియలిస్టు కొడుకుకు ఒక మినిస్టర్ కూతురితో ఎంగేజ్మెంట్ అయ్యుంటుంది.

కథ 2: ‘కుల్ దీప్’ (అరుణోదయ్ సింగ్) తీహార్ జైల్లో ఒక ఖైదీ. ‘బడే’ (యశ్ పాల్ శర్మ) అనే గ్యాంగ్ స్టర్ తో పనిచేస్తుంటాడు. ఇప్పుడు నేరజీవితం వదిలేసి భార్య(అదితి రావ్) పిల్లాడితో సుఖంగా ఉండాలనుకుంటుంటాడు.

కథ 3: ఒక రాజకీయనాయకుడి అండతో గ్యాంగ్ స్టర్ గా ఎదిగిన బడే, అదే రాజకీయనాయకుడు మినిస్టర్ ఆయ్యి బడేని కాదనుకున్న కారణంగా జైల్లో పడి బాధలు అనుభవిస్తుంటాడు. ఆ బాధల్ని భరించలేక అదే మినిస్టర్ కూతుర్ని, కాబోయే అల్లుడ్ని కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి తను విడుదలవ్వాలని, విడుదలై అప్పటివరకూ స్విస్ బ్యాంక్ లో దాచుకున్న డబ్బుతో శేషజీవితం గడపాలని బడే ప్లాన్. ఈ ప్లాన్ అమలు జరపాల్సింది రష్యాలో ఉన్న బడే తమ్ముడు చోటే ( ప్రశాంత్ నారాయణన్).

కథల వెనుకున్న/ముందున్న కమామిషు ఏంటంటే…1) శ్యామ్ పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి వాళ్ళ నాన్న బడే ప్రతీకారం తీర్చుకోవాలనుకునే మినిస్టర్. 2) జీవితంలో సెటిలవ్వొచ్చని ఆ కిడ్నాప్ చెయ్యడానికి కుల్ దీప్ ఒప్పుకుంటాడు. 3) బడే జైలు నించీ రాగానే తన స్విస్ బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకుని చంపెయ్యాలని ఛోటే ప్లాన్. 4) మినిస్టర్ కూతురు అనుకుని శ్యామ్ తో ప్రీతి ఉండగా ప్రీతి-శ్యామ్ లను కుల్ దీప్ కిడ్నాప్ చేస్తాడు. 5) ప్రీతి మీద పిచ్చి ప్రేమతో ఫాలో అవుతున్న అరుణ్ ఆ కిడ్నాప్ నుంచీ ప్రీతిని రక్షించాలనుకుంటాడు.

ఈ కథాకమామిషుల కన్ఫూజింక్ కథలో జరిగే మలుపులూ, పాత్రల తిక్కలూ, పరిస్థితుల మకతికలూ సాగే తీరే ఈ సినిమాకు ప్రాణం. ఇన్ని పాత్రల్ని వాటి తీరుల్ని సృష్టించిన రచయిత/దర్శకుడి మేధకు అప్పుడప్పుడూ అబ్బురపాటుకు గురిచేస్తుంది. మనురుషి-మిశ్రాల మాటలు హాస్యాన్ని పుష్కలంగా అందిస్తాయి. సినిమాలో హిందీ బూతులు యదేచ్చగా వాడటం కొందరిని ఇబ్బంది కలిగించొచ్చు… అడల్ట్స్ ఓన్లీ సినిమానే కాబట్టి ఫరవాలేదు.

చాలా వరకూ నటీనటులందరూ ఆరితేరినవాళ్ళు. వాళ్ళతోపాటూ కొత్తనటులూ అదేస్థాయిలో నటించడం ఈ సినిమాకు అందొచ్చిన విషయం. ఇర్ఫాన్ ఖాన్ నటన, డైలాగ్ డెలివరీ చాలా దృశ్యల లోతును పెంచుతుంది. చిత్రాంగదా సింగ్ కన్నుతిప్పలేని అందం మీదకన్నా పాత్ర మీద పాత్ర చిత్రీకరణ కెమెరామెన్(సచిన్ కుమార్ కృష్ణ), దర్శకుడు ఎక్కువ శ్రద్దపెట్టడం అభినందనీయం 😉 చిత్రాంగదా సింగ్ నటన బాగుంది. నూతన నటుడు అరుణోదయ్ సింగ్ చాలా పరిణితితో నటించాడు. కొత్త అనే ఆలోచనే కలిగించలేదు. మంచి భవిష్యత్తు ఉంది. అదితి తన నటన, అందంతో ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొడుతుంది. నటిలోని ఈ పార్శ్వం ఇదివరకూ చూడనిది. మంచి గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది. ఇక యశ్ పాల్ శర్మ, ప్రశాంత్ నారాయణన్ పాత్రల్లో ఒదిగిపోయారు. సౌరభ్ శుక్లా ప్రత్యేక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నిషాత్ ఖాన్ సంగీతం, స్వానంద్ కిర్ కిరే సాహిత్యం సినిమాకు చాలా బలాన్ని చేకూర్చాయి. ప్రకాష్ ఝా నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఝా అభిరుచికి దర్పణం. దర్శకుడు సుధీర్ మిశ్రా ఈ జనరేషన్ దర్శకులైన మధుర్ భండార్కర్, అనురాగ్ కశ్యప్, విశాల్ భరద్వజ్ వంటి వారికి స్ఫూర్తిని అందించడంతో పాటూ తనవంతుగా ఇలాంటి విన్నూత్న ప్రయత్నాలు చెయ్యడం ముదవహం.

కొంత మెదడున్న బ్లాక్ కామెడీలని ఎంజాయ్ చేసే వాళ్ళకు విపరీతంగా నచ్చే సినిమా ఇది. ద్వితీయార్థంలో కొంత బోర్ గా అనిపించినా సినిమా మొత్తంగా చూస్తే ఒక మంచి సినిమా.  చూడండి. తప్పక చూడండి.

10 Comments
  1. holyman February 5, 2011 /
    • sreenadh February 11, 2011 /
  2. gopi kiran February 5, 2011 /
  3. అరిపిరాల February 5, 2011 /
  4. chakri February 5, 2011 /
  5. Raghu February 11, 2011 /
  6. chakri February 11, 2011 /
  7. chakri February 11, 2011 /