Menu

వందేమాతరం (1939)

హుశా ఇదేనేమో నేను చూసిన ఓల్డెస్ట్ సినిమా, తెలుగులో!

వందేమాతరమ్ లేక మంగళసూత్రమ్ – అని టైటిల్ పడ్డంతో మొదలైంది నాకు కుతూహలం. ఏమిటీ, అప్పట్లో రెండు పేర్లతో సినిమాలు రిలీజ్ చేసేవారా? లేదంటే ఈ సినిమాకి వందేమాతరం అన్న పేరు వివాదాస్పదం కావొచ్చని అలా పెట్టారా? అని. ఇక, టైటిల్స్ మొత్తం ఆంగ్లం లో పడ్డాయి! పేరు బట్టి ఇదేదో దేశభక్తి, స్వాతంత్ర్య సంగ్రామం కథాంశం అనుకున్నాను కానీ, ప్రధానంగా – వరకట్నం, నిరుద్యోగం వీటిపై దృష్టి పెట్టారు.

కథ: కథ మొత్తం రాయడం మొదలుపెట్టాను కానీ, ఈ కథ గురించి ఇదివరలోనే నవతరంగంలో వివరంగా రాసారు (లంకె ఇక్కడ). అంతకుమించి నేను చెప్పేదేం లేదు.

అయితే, కథ పేరు “వందేమాతరం” అని ఎందుకు పెట్టారు? అన్నది ఒక పట్టాన అర్థం కాలేదు. “మంగళసూత్రం” అని ఎందుకనాలో అంతకంటే అర్థం కాలేదు. ఆలోచించగా, వందేమాతరం అన్న పేరే నప్పింది అనిపించింది. మొదట – సినిమాలో రఘురామయ్య దశ మార్చిన లాటరీటికెట్ కు అతను ఇచ్చిన పేరు – ’వందేమాతరం’. రెండోది – ఈ సినిమా -ఆ కాలంనాటి సాంఘిక చిత్రణ కనుక, ఆ పేరు పెట్టారు అనుకోవచ్చు.

చదువుకుని సాధించేదేమిటి? అన్న ప్రశ్న ఈ సినిమాలో వివిధ సందర్భాల్లో వివిధ పాత్రలూ, చూస్తున్న ప్రేక్షకులూ కూడా వేసుకుంటారు. సినిమా రిలీజైన డెబ్భై ఏళ్ళ తరువాత కూడా నిరుద్యోగాలూ, వరకట్నాలూ కొనసాగుతున్నాయి కనుక, ఈ సినిమా ఇప్పటికీ ఆలోచనలు రేకెత్తించేదే! నాగయ్య బండి మీద వెళుతూ ఉంటే, ఆయనకీ, బండి వాడికీ – ఉద్యోగం గురించీ, చదువుల గురించీ జరిగే సంభాషణ, నాగయ్య భార్యకి ఇంగ్లీషు నేర్పుతూ ఉంటే, దానికి అతని తల్లిదండ్రుల స్పందన – ఇవన్నీ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. మరోచోట, నాగయ్య ఉద్యోగం వెదుకుతున్నప్పుడు – నువ్వేం చదువుకున్నావ్? అంటే – షేక్స్పియర్ అదీ ఇదీ… అని సాహిత్యం అంతా చెబుతాడు ఆయన. అవతలి మనిషి, అవన్నీ చదివిన వాడు చేసే పనులేవీ మా దగ్గర్లేవు పొమ్మంటాడు. ఈ సంభాషణ కూడా రెండ్రోజులుగా వెంటాడుతోంది.

అయితే, ఈకాలానికి, ఈ సినిమా చాలా నెమ్మదిగా సాగుతున్నట్లు లెక్క. అలాగే, నాటక ఫక్కీలో ప్రతి పదినిముషాలకూ ఒక పాటొస్తుంది. పాటలు బాగున్నాయి కానీ, సీరియస్ సినిమా చూస్తూ, మధ్యలో ఇలా పాటలు వినాల్సి రావడం మాత్రం మహా అసహనంగా అనిపించింది. నాగయ్య గారు-హీరోయిన్ కాంచనమాలగారూ తెరపై అద్భుతమైన జంట. అయితే, హీరోయిన్ గొంతు మాత్రం కొన్ని సీన్లలో వెరైటీగా అనిపించింది, పాడుతున్నప్పుడు మామూలుగానే అనిపించినా కూడా! బహూశా, ఎవ్వరి పాటలు వారు పాడుకున్నారు అని నేను ఊహిస్తున్నాను. ఆకాలనికి ప్లేబ్యాక్ పద్ధతి ఉండేదా??

మొత్తానికి, కథాంశం కాలాతీతం అనిపించింది, మన కుటుంబాల పరిస్థితుల్లో అప్పటికీ, ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చినప్పటికీనూ! డెబ్భై ఏళ్ళ క్రితం సినిమాల్లో కథాంశాలు ఎలా ఉండేవో నాకు తెలీదు కానీ, సినిమా చూసేముందు మాత్రం – నేను ఇంత ఆలోచింపజేసేలా ఉంటుందనుకోలా! పైగా, నటులందరూ కూడా బాగా సరిపోయారు వాళ్ళ పాత్రలకి. అందుకేనేమో – నెమ్మదిగా సాగినా, హాస్యం లేకపోయినా, ఒక ఇరవై పాటలొచ్చినా – సినిమాని ఎక్కడా ఒక నిముషమైనా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూశాను (కాకుంటే, రెండు ఇంటర్వెళ్ళు తీసుకున్నా!)

దొరికితే, ఓపిక తెచ్చుకుని ఈ సినిమా తప్పకుండా చూడ్డానికి ప్రయత్నించండి. నాకైతే, బి.ఎన్.రెడ్డి గారి తక్కిన సినిమాలు చూడాలన్న కుతూహలం కలిగింది. అలాగే, ఈ సినిమా చూసిన సమయంలోనే “నాగయ్య స్మారక సంచిక” తిరగేయడంతో, ఆయన హీరోగా వేసిన చిత్రాలు కూడా చూడాలన్న కోరిక కలిగింది. ఆ సినిమాలు కూడా ఎక్కడన్నా దొరుకుతాయేమో చూడాలి!

వీసీడీ ఇంటి దగ్గరి ఒక ప్లానెట్ ఎం లో కొన్నాను. కనుక, ప్రముఖ స్టోర్లు అన్నింటిలోనూ లభ్యం అని ఊహిస్తున్నాను. వెల నలభై రూపాయలు. దివ్య ఎక్స్పోర్ట్స్, గుంటూరు వారి వీసీడీ.

2 Comments
  1. సుజాత February 4, 2011 /
  2. Sowmya May 15, 2011 /