Menu

ఒకరాత్రిలో జరిగే ఉల్టాపల్టా : ఉట్ పటాంగ్

హిందీ చిత్రరంగంలో అల్ట్రా స్మాల్ బడ్జట్ చిత్రాల రారాజు బహుశా వినయ్ పాఠక్ అనుకోవచ్చు. ‘భేజా ఫ్రై’ (2007)నుంచీ ఇప్పటి వరకూ సంవత్సరానికి రెండుమూడు సినిమాల్లో ప్రధాన పాత్రధారుడిగా (హీరో అని ఖచ్చితంగా చెప్పలేని పాత్రలు ఇవి) కనిపించి, సినిమాని తన నటనతో భుజానవేసుకుని బాక్సాఫీసులో సక్సెస్ చేయించడమే కాకుండా ప్రేక్షకుల మనసుల్లోకూడా స్థానం కల్పించుకుంటున్నాడు. రజత్ కపూర్ – వినయ్ పాఠక్, రణ్వీర్ శౌరి – వినయ్ పాఠక్, సౌరభ్ శుక్లా – వినయ్ పాఠక్ లాంటి కాంబినేషన్లతో సింపుల్ ప్లాట్ – సేలబుల్ సినిమా తరహాల్లో వస్తున్న మల్టిప్లెక్స్ సినిమాల పరంపరలో వచ్చిన తాజా చిత్రం “ఉట్ పటాంగ్”.

రామ్ (వినయ్ పాఠక్) అనే ఒక సాధారణ యువకుడి జీవితంలో జరిగే ఆసాధారణ రాత్రి ఈ సినిమా కథాంశ. ప్రేమికుడు మోసం చెయ్యడంతో ఇల్లొదిలొచ్చేసిన కోయల్ (మోనా సింగ్), కొత్త బాయ్ ఫ్రెడ్ ఫ్రెంచి భాష పిచ్చున్న మాఫియా డాన్ లక్కీ(మళ్ళీ…వినయ్ పాఠక్ 🙂 )  దగ్గర్నుంచీ డబ్బులు కొట్టేసి పాత బాయ్ ఫ్రెడ్ రామ్ దగ్గరున్న పాస్ పర్ట్ కోసం నాటకాలాడే ప్రియురాలు సంజన (మాహి గిల్), స్నేహితుడి కోసం ఎదో చెయ్యబోయి ఏదేదో ఇరకాటాల్లో పడే ప్రైవేట్ డిటెక్టివ్ నందు (సౌరభ్ శుక్లా) ఈ పాత్రల మధ్య  డబ్బు, ప్రేమ, స్నేహాల కోసం జరిగే కామెడీ సస్పెన్సుల ఉల్టాపల్టా ప్రహసనమే ఈ సినిమా.

రామ్ గా లక్కీగా వినయ్ పాఠక్ నటన  బాగుంది. మఫియా డాన్ లక్కీగా కొంత ఓవర్ అనిపించినా, పాత్రపరంగా సరిపోయింది. మోనా సింగ్ నటన పెద్దగా చెప్పుకోవడానికి ఏమీలేదు. “దేవ్ డి” ఫేం మాహి గిల్ పాత్రోచితంగా ఉంది. సౌరబ్ శుక్లా వినయ్ పాఠక్ కు ధీటుగా నటించాడు. అతిధినటులుగా వచ్చే గోవింద్ నామ్ దేవ్, మురళి శర్మ, దల్నాజ్ ల నటన బాగుంది. ప్రత్యేకపాత్రలో సంజయ్ మిశ్రానటన హాస్యాన్ని కురిపిస్తుంది.

షమీర్ టండన్ సంగీతం కన్నా, సినిమాలో నచ్చేది సంజొయ్ చౌదరి నేపధ్య సంగీతం. అరుణ్ వర్మ కెమెరా పనితనం బొంబాయి రాత్రిని ప్రతిభావంతంగా క్యాప్చర్ చెయ్యడంతో పాటూ ఇంటీరియర్ లైటింగ్ లోకూడా తనశైలిని నిరూపించాడు.  సంకల్ప్ ఎడిటింగ్ సినిమా గతిని అక్కడక్కడా నిదానంచేసినా, ట్యాలెంట్ మాత్రం కనిపిస్తుంది.

రెండు మూడు కాస్ట్యూమ్స్, రెండు మూడు లొకేషన్స్ లో జరిగే ఈ కథ మొత్తంలో చెప్పుకోవలసింది నటీనటుల కన్విన్సింగ్ నటన, ఆసక్తి కరమైన కథ, పకడ్బందీ స్క్రిప్ట్, మతాబుల్లా అక్కడక్కడా వెదజల్లే  డైలాగ్స్, బిగిసడలని దర్శకత్వం. కథ దర్శకుడు ‘వెలగలేటి శ్రీకాంత్’ అందిస్తే, స్క్రీన్ ప్లే- డైలాగ్స్ అందించింది స్క్రీన్ పైన కూడా ఒక ప్రధాన మాత్ర పోషించిన సౌరభ్ శుక్లా కావడం ఆసక్తికరం. దర్శకుడు శ్రీకాంత్ తెలుగువాడు కావడం మరో కొసమెరుపు. నిజానికి ఈ సినిమా కథ ఒక తెలుగు సినిమాగా తీసినా ఇప్పటికీ రిలీజుకు నోచుకోలేదని వినికిడి.

సింపుల్గా తియ్యగలిగే ఇలాంటి సినిమాలు మహా అయితే ఒకటి రెండు కోట్ల ఖర్చు మధ్యలోనే ఉంటాయి. కావలసిందల్లా సాంకేతికపరంగా నైపుణ్యం కలిగి ఔత్సాహిక టీం, సత్తాఉన్న నటులు. వారిని నమ్మే నిర్మాత (అపర్ణ్ జోషి). ఇవన్నీ సమకూరాయి గనకనే దేశవ్యాప్తంగా ఈ సినిమా వితరణ (distribution) వార్నర్ బ్రదర్స్ చేశారు. ఈ సినిమా తీసిన ఖర్చు నిర్మాతకు ఎప్పుడో వచ్చేస్తే, లాభాలు ఇప్పుడు రావడం మొదలయ్యుంటాయి. ఈ పరిస్థితి మన తెలుగు సినిమాకు ఇప్పట్లో రాదు, బహుశా ఎప్పటికీ రాదేమో అందుకే ట్యాలెంట్ అంతా వలసపోతున్నారు. ఇలాంటిదే స్క్రిప్టుతో చేసిన ఒక తెలుగు సినిమా గత నాలుగేళ్ళుగా రిలీజుకు నోచుకోలేకపోవడం కన్నా పెద్ద ఉదాహరణ మనకు మరొకటి అవసరం లేదు. నిజానికి సాంకేతికపరంగా తెలుగు సినిమానే ఉట్ పటాంగ్ కన్నా బాగుందని చూసినవాళ్ళు చెప్పడం సిగ్గుపడాల్సిన విషయం.

ఏది ఏమైనా వారాంతరంలో సరదాగా చూడాలనిపిస్తే చూసే చిత్రం ఉట్ పటాంగ్. గొప్పచిత్రం కాకపోయినా, ఖచ్చితంగా వినోదాన్ని అందించే చిత్రం. వీలైతే చూడండి.

2 Comments
  1. srikanth February 7, 2011 /
  2. Desi March 17, 2011 /