Menu

తెలుగు సినిమాకి ఫిలిం ఛాంబర్ కొత్త రూల్స్

కందిరీగ చిత్రం షూటింగ్‌లో మొదలైన ఫైటర్ల వివాదం చివరకు నిర్మాతలు రూల్స్ పెట్టుకునే స్దితి దాకా సాగి ముగింపుకు వచ్చిందన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్  ఫిలిం ఛాంబర్‌ ఆధ్వర్యంలో పలుశాఖలతో సంప్రదింపులు జరిగిన పిమ్మట తెలుగు సినిమా బాగు కోసం  కొన్ని మార్గదర్శక సూత్రాలు ముందుంచారు.. అందులో నిర్మాత, దర్శకుడు, సాంకేతిక సిబ్బంది గురించిన అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ వివరాలివి:

నిర్మాత:

షూటింగ్‌ ప్రారంభానికి ముందుగానే ప్రతి నిర్మాత తన చిత్రానికి పనిచేసే నటీనటులు, దర్శకుడు, ఇతర సాంకేతిక సిబ్బందితో చేసుకున్న అగ్రిమెంట్లతోపాటు పారితోషికాలు పొందుపర్చాలి.

– పూర్తి స్క్రిప్టు, నిర్మాణపు అంచనా వ్యయం, పనిచేస్తున్న వారి అన్ని వివరాలు ‘అడ్వయిజరీ కమిటీ’ (కొత్తగా వేసిన కమిటీ)కి నిర్మాతలు అందజేయాలి.

– షూటింగ్‌ స్థలంలో సిద్ధం చేయబడ్డ రిజిస్టర్‌లో అక్కడ పాల్గొనే ఆర్టిస్టులంతా హాజరైన సమయాన్ని పొందుపర్చి సంతకం చేయాలి. లేదా హాజరయ్యే సమయాన్ని ముందుగా తెలియజేయాలి. డైలీ ఖర్చుల వివరాల షీట్‌ తయారుచేయాలి. దానిని సంతకాలతో నిర్మాతల మండలికి అందజేయాలి.

– షూటింగ్‌ లొకేషన్లలో టిఫిన్‌, భోజన ఏర్పాట్లు ‘బఫే’ పద్ధతినే జరుగుతాయి. (మలయాళంలో హీరో, జూనియర్‌ ఆర్టిస్టు కలిసి ఒకేచోట తింటారు)

– ఆర్టిస్టు, సాంకేతిక సిబ్బందికి చెందిన వ్యక్తిగతదారునికి కంపెనీ కింద పెట్టడం జరగదు.

– ఫిలింనగర్‌లోని నిర్మాతల మండలి కార్యాలయానికి 15 కిలోమీటర్ల లోపు షూటింగ్‌ జరిగే స్థలాలకు నిర్మాత ద్వారా ప్రత్యేకంగా ఎవరికీ కార్లు పంపబడవు. 15 కిలోమీటర్లను మించినప్పుడు, కార్ల పెట్రోలు/డీజిల్‌ బిల్లులు మాత్రం, వాస్తవిక ఖర్చుకు సంబంధించిన బిల్లులు చెల్లించబడును. 5లక్షలు మించి పారితోషికం తీసుకునే ఆర్టిస్టులందరికీ ఇది వర్తిస్తుంది. 5 లక్షలకు తక్కువైనవారికి ప్రయాణ ఖర్చులు చెల్లించబడతాయి.

– స్వదేశ, విదేశ ప్రయాణాలలో అందరికీ ఎకానమీ క్లాస్‌టిక్కెట్లు మాత్రమే సమకూర్చబడతాయి. ఈ పద్దతి ‘ప్రీ ప్రొడక్షన్‌, షూటింగ్‌, ప్రమోషన్‌’ సమయాలకు వర్తిస్తుంది.

– ప్రతి షెడ్యూల్‌ అనంతరం జరిగిన షూటింగ్‌లోని బాగోగులు గురించి అడ్వయిజరీ కమిటీ ముందు దర్శక నిర్మాతలు రివ్యూ చేసుకోవాలి.

– కెమెరా, క్రేన్‌, స్పెషల్‌ ఎక్విప్‌మెంట్‌ తీసుకెళ్లడం, తీసుకురావడం కోసం ప్రత్యేకంగా వాహనాలను నిర్మాత పంపాలి. రోడ్లు, పబ్లిక్‌ స్థలాల్లో షూటింగ్‌ జరిగినప్పుడు వాహనాలను ప్రత్యేకంగా కేటాయించాలి.

– జనరేటర్‌, డీజిల్‌కు ఎంత ఖర్చయితే అంత ఇవ్వాలి.

– నిర్మాతే స్వయంగా అవుట్‌డోర్‌ యూనిట్‌తో రేట్స్‌ గురించి సంప్రదించాలి.

– నెగెటివ్‌ కోటింగ్‌ చేయాలా వద్దా? అనే విషయం నిర్మాతపై ఆధారపడి ఉంటుంది.

– సౌండ్‌, రికార్డింగ్‌, ఎడిటింగ్‌ ఛార్జీలు అన్నీ ఖర్చులు స్టూడియో బిల్‌లోనే కలిపి ఉండాలి. (ఇంజనీర్‌ బత్తాలుకూడా)

– స్టూడియోలో పనిచేసేవారికి ప్రయాణపు ఖర్చులు ఇవ్వబడవు. కానీ వారికి టిఫిన్‌, లంచ్‌, డిన్నర్‌లు నిర్మాతే సమకూర్చాలి.

– అవుట్‌డోర్‌ యూనిట్‌వాళ్ళు కానీ,ల్యాబ్‌ వారు కానీ ప్రొడ్యూసర్‌ సెక్టార్‌ పర్మిషన్‌ లేనిదే ఏ నిర్మాతకీ మెటీరియల్‌ (యూనిట్‌ వ్యాన్‌, నెగిటివ్‌) ఇవ్వకూడదు.

– పైన పేర్కొన్న షరతులన్నీ అతిక్రమించేలా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు 5 నుంచి 10 లక్షల వరకు పెనాల్టీ విధించడం జరుగుతుంది. ఒక ఏడాది సినిమా నిర్మాణానికి వారు దూరంగా ఉండాల్సి వస్తుంది.

నటీనటులు:

– సంప్రదింపులు, నిర్ణయాలు వగైరా అన్నింటినీ నిర్మాత, ఆర్టిస్టులు ప్రత్యక్షంగానే పూర్తి చేసుకోవాలి. మధ్యవర్తులు, మేనేజర్ల ద్వారా పనికిరావు.

– ఇకమీదట ఏ ఆర్టిస్టులకైనా ‘సినిమా అకౌంట్‌’లోనే పారితోషికాలు నిర్ణయించబడతాయి. రోజువారీ పద్ధతిలో ఎవరికీ చెల్లింపులు ఉండవు.

– చెల్లింపులన్నీ రికార్డుపరంగా వుంటాయి కాబట్టి అన్యాయానికి ఆస్కారం ఉండదు. టీడీఎస్‌ సర్టిఫికెట్లు నటీనటులకు, సాంకేతిక సిబ్బందికి పూర్తిగా చెల్లించిన తర్వాతనే పబ్లిసిటీ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ను నిర్మాతలమండలి సదరు నిర్మాతకు ఇవ్వడం జరుగుతుంది.

– పారితోషికాల చెల్లింపులు వాయిదాల పద్ధతిలో ఉంటాయి. ఆఖరున 30 శాతం ఆపివేయబడి ఉంచి, ఆ మొత్తం సినిమా రిలీజు సమయంలో ల్యాబ్‌ క్లియరెన్స్‌మార్గంలో చెల్లింపులు జరుగుతాయి.

– ఈ విధానం.. అగ్రిమెంటు సంతకాల సమయంలో- 50లక్షలుపైన తీసుకునేవారికి 20శాతం, 5 లక్షలనుంచి 50 లక్షల లోపు తీసుకునేవారికి 10శాతం, 5లక్షల లోపు తీసుకునేవారికి 10శాతం.. చెల్లింపులన్నీచెక్కుల రూపంలో ఉండాలి.

– హీరో తన వ్యక్తిగత సిబ్బందిగా నలుగురిని (మేకప్‌మేన్‌, టచప్‌, కాస్ట్యూమ్‌ అసిస్టెంటు, బారు) పెట్టుకోవచ్చు. అదే హీరోయిన్‌ విషయంలో అదనంగా ఇంకొకరు (హెయిర్‌ డ్రెస్సర్‌) వుండొచ్చు. ఐదేళ్ళ అనుభవం మించిన సహాయ నటీనటులు మాత్రం ఇద్దర్ని (మేకప్‌, టచప్‌బారు) పనిలో పెట్టుకోవచ్చు.

– బయటనుంచి ఎటువంటి ప్రత్యేక ఆహారాన్ని నిర్మాత సమకూర్చనవసరంలేదని అందరూ ఆర్టిస్టులూ అంగీకరించారు.

– విదేశాల్లో జరిగేషూటింగ్‌ సమయంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒకే బస్సులో లొకేషన్‌కు వెళ్ళాలి.

– ఔట్‌డోర్‌ ప్రదేశాల్లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు కామన్‌గా మాత్రమే ‘కార్‌వాన్‌’ (పురుషులకు, మహిళకు రెండు విభాగాలుగా) సదుపాయం ఉంటుంది.

– కథానాయిక మినహా, గరిష్టంగా ఇద్దరు ఇతర ప్రాంత ఆర్టిస్టులు ప్రతి చిత్రానికి అనుమతించబడతారు. అంతకుమించి మరొక ఆర్టిస్టు అవసరమైతే ప్రత్యేక అనుమతిని పొందాలి.

– ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి షూటింగ్‌లో పాల్గొంటే ఆర్టిస్టులకు, సర్వీసెడ్‌ అపార్ట్‌మెంట్స్‌ గానీ, త్రీస్టార్‌ హౌటళ్ళలోగానీ బసని ఏర్పాటు చేయబడును. సదరు వసతికి రోజువారీ ఖర్చు 3,500రూపాయలకు మించరాదు.

– నటీనటులు ‘మా’లో సభ్యులయి, లోకల్‌ అడ్రస్‌ కలిగి ఉంటే వారికి ప్రయాణపు ఖర్చులు ఇవ్వబడవు.

దర్శకత్వ శాఖ

– దర్శకుడు, ఆర్టిస్టులను నియమించే విషయంలో ఒక్కొక్క ముఖ్యపాత్రకు ముగ్గురు చొప్పున ప్రత్యామ్నాయాలను తెలియజేయడానికి అంగీకరించమైనది. వారందరితో నిర్మాత సంప్రదించి, దర్శకుని సహకారంతో ఆర్టిస్టుల నియామకం జరుగుతుంది.

– షూటింగ్‌కు సంబంధించిన ముఖ్యశాఖలు: ఛాయాగ్రహణం, కళా దర్శకత్వం, సంగీత దర్శకత్వం, పాటల రచన వగైరా గురించి ఒక్కొక్క శాఖకు ముగ్గురు చొప్పున ప్రత్యామ్నాయాలుగా నిర్మాతకు తెలియజేసేందుకు దర్శకులు అంగీకరించమైనది. నిర్మాత వారందరితో సంప్రదించి ఖాయపర్చుకుంటారు. అలాగే అన్ని శాఖలకూ వర్తిస్తుంది.

– దర్శకత్వ శాఖలో పెద్ద బట్జెట్‌ చిత్రాలకు (6+1), చిన్న బడ్జెట్‌ చిత్రాలకు (4+1) సభ్యులను మాత్రమే పెట్టుకోవాలి.

– ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డైరెక్టరు, అతనితో మరో ఇద్దరు అసిస్టెంట్‌ డైరెక్టర్లను మాత్రమే తెచ్చుకోవాలి.

సాంకేతిక నిపుణులు

– ఛాయాగ్రహ శాఖలో పెద్ద బడ్జెట్‌ చిత్రాలకు గరిష్టంగా నలుగురు, చిన్న బడ్జెట్‌చిత్రాలకు ముగ్గురు సభ్యులను నియమించుకోవచ్చు.

– సెట్‌లో అసోసియేట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఉండాలి. అవసరమైతే ఆర్ట్‌ దర్శకుడు రావాలి.

– షూటింగ్‌లో ఖర్చు చేయాల్సిన సందర్భాలన్నింటిలోనూ నిర్మాత అనుమతితోనే జరగాలి.

కాల్షీట్లు..

– జనరల్‌ కాల్‌షీటు టైమ్‌ ఉదయం

6 గంటలనుంచి సాయంత్రం 6గంటలు

– నటీనటుల కాల్‌షీట్‌టైమ్‌ ఉదయం 7 గంటలనుంచి.. సాయంత్రం 6 గంటలు. సందర్బానుసారం బట్టి డైరెక్టర్‌ కాల్‌షీట్‌ టైమ్‌ను మార్చుకోవచ్చును.

ఇవండీ కొత్త రూల్స్…కొన్ని కొందరికీ బాగుండొచ్చు…మరికొన్ని మరికొందరికి మంట ఎక్కించవచ్చు. రీసెంట్ గా ఈ రూల్స్ దెబ్బకు దిల్ రాజు కొత్త చిత్రంలో బుక్కయిన అమృతారావు నో చెప్పి వెళ్ళిపోయిందని వినపడింది. అలా కొన్ని సంఘటనలు చోటుచేసుకోవచ్చు. ఇక ఈ రూల్స్ ఎంతవరకూ అమలవుతాయి. మన హీరోలు, బ్రహ్మానందం వంటి కమిడెయన్స్ ఎంతవరకూ వీటిని ఒప్పుకుంటారు అనేది పెద్ద ప్రశ్నే. ఖర్చు తగ్గించాలనుకునే నిర్మాత ముందున్న సవాలే. అయితే చాలామంది పెద్ద నిర్మాతలుకు ఈ రూల్స్ పట్టకపోవచ్చు కూడా …పేపర్ మీద కరెక్టుగా ఉన్నా..ఫైనల్ గా పాత పద్దతిలో ఫాలో కావచ్చు.ఈ రూల్స్ తో ఏమైనా మార్పు వస్తుందా..లేదా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోయే విషయం.

4 Comments
  1. శంకర్ February 3, 2011 /
  2. shankar Gongati February 3, 2011 /
  3. srikanth February 3, 2011 /