Menu

ఆరు జీవితాలు-రెండు ముక్కోణ ప్రేమలు–ఒక మంచి సినిమా(LBW–Life Before Wedding)

ప్పుడూ ఒకే రకం మూస చిత్రాల వరదలో కొట్టుకుపోయే తెలుగు సినిమాకి అప్పుడప్పుడు ఒక శేఖర్ కమ్ముల, ఒక క్రిష్, ఒక దేవకట్టా దొరుకుతుంటారు. వాళ్ళు తీసే సినిమాలు అన్నీ ట్రెండ్ సెట్టర్లు కాకపోయినా ఒకే రకమైన (ఫ్లాప్) సినిమాలతో బోరెత్తిన జనానికి ఒక ప్రెష్ ఫీల్ ఇస్తుంటాయి. రోజు అన్నం తినే వారికి అప్పుడప్పుడు పిజ్జా తిన్నట్టు..!! సరిగ్గా అలాంటి సినిమానే LBW – Life Before Wedding. ఈ మధ్య కాలంలో విదేశాలనుంచి దిగుమతి అవుతున్న చాలా మంది (టాలెంటెడ్) దర్శకుల వరసలో వచ్చిన మరో దర్శకుడు ప్రవీణ్ సత్తరు (Praveen Sattaru) చేసిన తొలి ప్రయత్నమిది. మొదటి సినిమా అయినా సినిమా కథ, దర్శకత్వం తదితర సాంకేతిక అంశాలు అన్నింటిలో మంచి మార్కులు కొట్టాశాడు ప్రవీణ్. ఇంకొంచెం కమర్షియల్ సినిమా వైపు మొగ్గితే మన ఇండస్ట్రీకి మరో మంచి దర్శకుడు దొరికినట్టే.

ఇక సినిమా గురించి..

నలుగురు స్నేహితులు తమ నిర్ణయాలు, ఆ నిర్ణయాలపై పెద్దవాళ్ళ ప్రభావాలు అంటూ చర్చలు మొదలుపెట్టి వారిలో ఇద్దరు తమ స్నేహితుల కథలు చెప్పడంతో సినిమా ప్రారంభమౌతుంది. ఆ రెండు కథలే సినిమాకి మూల స్థంభాలు. అందులో ఒకటి హైదరాబాద్లో వున్న ఇద్దరు స్నేహితులు – జై (అభిజిత్), రిషి (సిద్ధు) గురించి. వీరిలో రిషి ఆల్లరి చిల్లరిగా తిరిగే (తెలుగు సినిమా హీరో లాంటి) అబ్బాయి అయితే, జై పద్దతిగా చదువు, పుస్తకాలు, గీతాంజలి పాటలు అంటూ గడిపేసే సాదా సీదా అబ్బాయి. అను (నిషాంతి) అనే అమ్మాయిని రిషి ప్రేమించడం, రిషి అసలు స్వరూపం తెలిసి అను అతనికి గుడ్ బై చెప్పేసి గుడ్ బాయ్ జై ప్రేమలో పడటం మొదటి కథ.

ఇక రెండొవది డల్లాస్ ‍లో వుండే రాజేష్ (రోహన్), రాధిక (చిన్మయి) లది. రాధిక ఎంతో ప్రేమించే రాజేష్, తనకి ఆ వుద్దేశ్యంలేదని, మనం స్నేహితులం మాత్రమే అని చెప్పడంతో ఆ అమ్మాయి బాధపడుతుంది. సరిగ్గా అప్పుడు ఓదార్చడానికి వచ్చిన రాజేష్ స్నేహితుడు వరుణ్ (ఆసిఫ్ అలి) ప్రేమలో పడుతుంది రాధిక.

ఈ రెండు ముక్కోణపు ప్రేమలు ఆ ఆరుగ్గురి జీవితాలతో ఎలా ఆడుకున్నాయి, ఈ రెండు కథలకి వున్న సంబంధం ఏమిటి.. చివరికి ఎవరెవరు ఒకటయ్యారు అనేది (యధావిధిగా) వెండి తెరపైన చూడవలసిందే…!!

ఒక్క మాటలో చెప్పేయాలంటే నటీనటులంతా చాలా బాగా చేశారు.. ప్రత్యేకించి చిన్మయి, రోహన్, సిద్ధు. తెలుగు సినిమా హీరో హీరోయిన్లుగా చెప్పలేం కాని.. మంచి నటులుగా నిలబడే అవకాశం అందరికీ పుష్కలంగా వుంది. మొత్తానికి సినిమా బాగుంది కాబట్టి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అన్నీ ప్రవీణ్ వే కాబట్టి అన్నీ సమర్ధవంతంగా నిర్వహించాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. కథ ఎత్తుగడ కొంచెం తికమకగా వున్నా తర్వాత తర్వాత ఆకట్టుకుంది. దాదాపు అన్ని పాత్రలు (నిజ జీవితానికి దగ్గరైన) సమస్యలలో చిక్కుకోవడంతో ప్రేక్షకులు ప్రతి పాత్రతో కనెక్ట్ అవుతారు. సెకండాఫ్ లో కొంచం సాగినట్టు అనిపించినా అదంతా నిజంగానే జరిగే సంఘటనల్లాగే వున్నాయి కాబట్టి బోరు కొట్టదు. క్లైమాక్స్ కూడా ప్రేక్షకుల వూహకి భిన్నంగా వుండటంతో లేచి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు “ఇలా కాకుండా వుంటే బాగుండు..” అనుకుంటూ వెళ్తారు.. అదే ఈ సినిమా ప్రత్యేకత… It is just a slice of life.. and in life it happens..!!

ఎడిటింగ్, ఫొటోగ్రఫి చాలా బాగున్నాయి. వున్న కొద్ది వనరులతో (రెడ్ వన్ కెమెరా) ఇంత చక్కగా తీయగలగడం, తీసిన చిత్రాన్ని ఇంత చక్కగా కూర్చడం రెండూ అభినందనీయం. అమెరికా భాగానికి ఆండ్రూ రెడ్, హైదరాబాద్ భాగానికి సురేష్ బాబు సినిమాటోగ్రాఫర్లు – ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల.

వున్న పాటలన్నీ సందర్భోచితంగా వచ్చే నేపధ్యగీతాలే. అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా తీరాలే వద్దంటే, ఏ మేఘం ఎప్పుడు.. రెండు పాటల్లో సంగీతం సాహిత్యం రెండూ బాగున్నాయి..!!

ఇక బాగాలేనివి..

ఈ సినిమాకి LBW అనే పేరు పెట్టడమే బాగాలేదు… అసలే క్రికెట్ సీజన్.. ఆ పైనా ఈ మధ్య వచ్చిన క్రికెట్ ఆధారిత సినిమా.. ఈ సినిమాని కూడా అలాంటి చిత్రమే అని అనుకునే ప్రమాదం వుంది.. ఇలాంటి పెళ్ళికి ముందు ప్రేమ కథలకి మంచి రొమాంటిక్/భావుకమైన టైటిల్ వుంటే ఇంకా ఎక్కువమంది ప్రేక్షకుల్ని ఆకట్టుకునేదేమో..!!

సినిమాలో చాలా వరకు సంభాషణలు ఇంగ్లీషులో వుండటం, కథా వస్తువు, (సగం) కథ జరిగే ప్రదేశాలు ఇక్కడివి కాకపోవటం వల్ల ఈ సినిమా మల్టీప్లెక్సులు, టౌన్లు దాటి నిలబడటం కష్టమే.

ఏది ఏమైనా… ఎప్పుడో వచ్చిన “ఐతే”.. తర్వాత వచ్చిన “హ్యాపిడేస్”, “గమ్యం” ఈ మధ్య వచ్చిన “ప్రస్థానం”, “స్నేహగీతం”, “గగనం” లాగా.. మూస సినిమాలనించి తెలుగు సినిమాలని బయటపడేసే చిత్రం ఇది. ఇలాంటి సినిమాని చూడటం, చూడమని పది మందికి చెప్పడం అవసరం. తెలుగు సినిమా ప్రేక్షకుడికి, తెలుగు సినిమాకి కూడా అవసరం.

కొసమెరుపు..

చిన్న సినిమాని ప్రోత్సహించండి, మంచి సినిమాని ఆదరించండి అని మొత్తుకునే “పెద్దలు” వున్న తెలుగు సినిమా పరిశ్రమలో ఇలాంటి మంచి సినిమాకి దక్కింది – హైదరాబాద్ మొత్తానికి ఒకే ఒక్క సినిమా హాలు.. అదీ కొంపల్లెలో వున్న సినీప్లానెట్ లో..!! సినిమా ప్రేక్షకుడికి ఇంతకన్నా జరిగే అన్యాయం ఇంకొకటి వుండదు..!! రేపెప్పుడో టీ.వీ లో ఈ సినిమా చూసి.. “సినిమా బాగానే వుందే ఎందుకు ఆడలేదో”… అని ఆశ్చర్యపోవడంకన్నా… ఇప్పుడే ఈ సినిమా చూసి మంచి సినిమా తీసిన నిర్మాతని నిలబెట్టడం మంచిదేమో.. ఆలోచించండి..!!

సినిమా: LBW (Life Before Wedding) – (తెలుగు)

నటీనటులు: ఆసిఫ్ అలి, రోహన్, చిన్మయి, నిషాంతి, సిద్ధు

సంగీతం: అనిల్ ఆర్.

ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల

కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు

నిర్మాత: నవీన్ సత్తారు

నిర్మాణం: Working Dream Production

7 Comments
  1. MADHU March 7, 2011 /
    • అరిపిరాల March 7, 2011 /
  2. holyman March 7, 2011 /
  3. T Krishna Chaitanya March 8, 2011 /