Menu

ఆహ్లాదకరమైన వైవిధ్యం – LBW

జీవితాలు ఎక్కడ విడిపోయి ఎక్కడ కలుసుకుంటాయో. బంధాలు ఏవిధంగా అనుబంధాల్ని కలుపుకుంటాయో. స్నేహాలూ, ఆకర్షణలూ ప్రేమలూ జీవితాల్ని నిర్దేశించేవే కాకుండా అప్పుడప్పుడూ అనుభవాలుగా, అనుభూతులుగా ఎలా మిగిలిపోతాయో… కొందరు యువతజీవిత అనుభవశకలాల్ని ఏర్చికూర్చిన సినిమాటిక్ అనుభవం LBW – లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ : పెళ్ళికి ముందు జీవితం.

కథ: ఈ సినిమాకథలో రెండు కథలున్నాయి. నిజానికి మూడున్నాయి. మూడోకథ గురించి అప్రస్తుతంగానీ, ముందుగా రెండుకథల గురించి చూద్దాం.

కథ1: హైదరాబాద్ లో జై (అభిజిత్) – రిషి (సిద్దు)చిన్ననాటి స్నేహితులు. రిషి అను(నిషాంతి) ని ప్రేమిస్తాడు. పరిస్థితుల ప్రభావంతో జై- అను ప్రేమికులుగా మారతారు.

కథ2: డల్లాస్ లో ఉద్యోగం చేసుకునే రాజేష్ (రోహన్) – రాధిక (చిన్మయి) స్నేహితులు. రాధిక రాజేష్ ని ప్రేమిస్తుంది. రాజేష్ రాధికని ఒక స్నేహితురాలిగా మాత్రమే చూస్తాడు. రాజేష్ స్నేహితుడు వరుణ్(అసిఫ్), రాజేష్  వద్దనుకున్న రాధికలు ప్రేమలో పడతారు.

ఈ రెండు కథలూ ఒక సినిమాలో ఎందుకున్నాయి అనేది  సినిమాలో చూడాల్సిందే.

ఇక మూడోకథేమిటా అని ఆలోచిస్తున్నారా…! ఈ రెండుకథల్నీ లంకె కలపడానికి ఒక ఉపకథ ఉందిలెండి. అది నాకైతే అనవసరం అనిపించింది. కానీ బహుశా దర్శకరచయిత తనకు తెలిసిన (మరి)కొంత జ్ఞానాన్ని పంచుకోవడానికి tempt ఆయ్యి, దాన్ని నెరేటివ్ గా ఎంచుకున్నాడేమో . ఎంతైనా మొదటి సినిమాకదా. అది లేకపోయినా సినిమాకొచ్చే నష్టమైతే ఏమీలేదు.

నటీనటులు: ఈ మధ్యకాలంలో…బహుశా గత దశాబ్ధంలోనే తెలుగులో మొట్టమొదటిసారిగా నటించడం వచ్చిన కొత్తనటులున్న సినిమా ఇదేకాబోలు. Introverted romantic జై గా అభిజిత్ బాగా చేశాడు. చాక్లెట్ బాయ్ లుక్కున్నా ఎమోషనల్ సీన్లనూ పండించాడు. ఈ సినిమాకైతే సరిపోయిందిగానీ, బాడీ లాంగ్వేజ్ మీద శ్రద్ధపెట్టి కొంత ఈజ్ తీసురాగలిగితే నిలబడతాడు. రిషిగా చేసిన సిద్దు నటనలో పరిణితి కనిపిస్తుంది. కొంతసానపెడితే తెలుగు తెరకు మరో యంగ్ విలన్ దక్కుతాడు. అను గా నిషాంతి is refreshing. తన గొంతు ఉచ్చారణ చాలా ప్లస్ అయ్యే విషయాలు. మొత్తానికి ఒక తెలుగు మాట్లాడే అమ్మాయి హీరోయిన్ గా దొరికింది.

రోహన్ పాత్రకు సరిపోయాడు. నటన ఫరవాలేదు. రాధికగా చిన్మయి సహజంగా ఉంది. మేకప్, హెయిర్ డ్రస్సింగ్ మీద శ్రద్ధపెట్టాల్సిన అవసరం చాలా ఉంది. వరుణ్ గా అసిఫ్ మరీ Americanized body language and accent తో కొంచెం విసిగించినా, కొన్ని సీన్లలో నవ్వించాడు.

సంగీతం: అనిల్ సంగీతం వినసొంపుగా ఉంది. కృష్ణచైతన్య సాహిత్యంలోని ఘాఢత సన్నివేశాలకు చిక్కదనాన్ని కూర్చింది.

సినెమాటోగ్రఫీ: ఆండ్రూరెడ్ సినెమాటోగ్రఫీ ఒకవైపు డల్లాస్ అందాల్ని, పాత్రల మూడ్స్ ని ప్రతిభావంతంగా తెరపైకి అనువదిస్తే, హైదరాబాద్ అందాల్ని కొత్తకోణంలో చూపించిన క్రెడిట్ సురేష్ బాబుకు దక్కుతుంది. నిజంగానే మామూలుగా మన సినిమాల్లో చూడని కొత్త ప్రదేశాల్ని చూపించడంతోపాటూ ఉన్నవాటిని కొత్తగా చూపించడంలో సఫలమయ్యాడు.

ఎడిటింగ్: ధర్మేంద్ర ఎడిటింగ్ సినిమాకు చాలా హాయకారి అయ్యింది. ద్వితీయార్థంలో సినిమాని ఇంకొంచెం ట్రిమ్ చేసుంటే సీన్లు మరింత పండేవి.

కథ- కథనం-మాటలు- దర్శకత్వం: ఈ సినిమాకు కర్తకర్మక్రియ అన్నీ నూతన దర్శకుడు ప్రవీణ్. మాటలు పేజీలపేజీల డైలాగుల్లాగానో లేక పంచ్ ల పేరుతో ప్రాసలతోనూ వెటకారపు చేష్టలతోనూ లేకుండా మామూలుగా ఉన్నాయి. అదే పెద్ద రిలీఫ్. రెండు కథల కలయికగా ఉన్న ఈ కథలో కథనం అక్కడక్కడా గతి నిరోధకంగా మారినా సినిమా చివరకొచ్చేసరికీ ‘అనుకున్నంతనే జరగవు అన్నీ, అనుకున్నా జరగవు కొన్ని, మనం ఒకలా అనుకుంటున్నప్పుడు ఏదోలా మనప్రమేయం లేకుండా జరిగిపోయేదే జీవితం’ తరహాలో ఉన్న ముగింపు అన్నింటినీ justify చేసేస్తుంది.

మొదటి సినిమా అయినా, తగినంత హోంవర్క్ చేసిన తరహా తడబడని టేకింగులో కనిపిస్తుంది. అక్కడక్కడా అమెచ్యూరిష్ గా అనిపించడం సహజమే కాబట్టి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటీనటులదగ్గర నటన రాబట్టుకోవడంలో సఫలమైనా, వారి జీవితాల్లోకేతప్ప మనసుల్లోకి తొంగిచూసే depth దర్శకుడు చూపించలేకపోయాడు. జై పాత్రలోని complexity, రుషి పాత్రకున్న complex, రోహన్ పాత్రలో ఉన్న బలహీనతల్ని బాహ్యరూపంగానే తప్ప మరింత మానసికంగా ప్రేక్షకులకు దగ్గర చెయ్యలేకపోయాడు. ఎన్నో పొరలకు ఆస్కారమున్న సినిమాను కొంత సింపుల్గా తీసినట్లు అనిపిస్తుంది. అయినా అర్థవంతంగానే ఉంది. ముఖ్యంగా ఊహించని ముగింపు as a matter of fact గా ఉంచడం ద్వారా దర్శకుడు తన conviction ను చాటిచెప్పాడు.

తప్పకుండా చూడవలసిన చిత్రం.

కానీ మన తెలుగు పరిశ్రమ ఖర్మ ఏంటంటే…ఈ మల్టిప్లెక్స్ సినిమా అన్ని మల్టిప్లెక్సుల్లోనూ లేకపోవడం. ఉన్నా ఎవరికీ కుదరని ఆడ్ టైమ్స్ లో ఉండటం. ఫ్లాపు సినిమాల్ని ఇన్ని సెంటర్లు ఆడాయని చెప్పుకోవడానికి ఆక్యుపెన్సీ లేకపోయినా నడిపే పంపిణీదారులు, స్టార్ నటుడున్నాడనీ స్టార్ దర్శకుడు తోసాడనో అని పరమ చెత్త సినిమా మల్టిప్లెక్సులో రోజుకు పదేసి షోలు రన్ చేసే ఎగ్జిబిటర్ల పోకడకు ఈ సినిమా కూడా బలవ్వాలా!? ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూసే అవకాశం లేకుండా పోవాలా!?! అనేవి నాదగ్గర జవాబుల్లేని ప్రశ్నలు

9 Comments
  1. A. Saye Sekhar February 21, 2011 /
  2. sas February 27, 2011 /
  3. Sudhakar March 4, 2011 /
  4. MADHU March 6, 2011 /
  5. madhu March 6, 2011 /
  6. MADHU March 6, 2011 /
  7. MADHU March 6, 2011 /
  8. Venkat March 7, 2011 /
  9. Sanjeev March 15, 2011 /