Menu

దిల్ ‘ఏడుపుగొట్టు’ బచ్చా హై జీ

‘చాందినీబార్’ నుంచీ మొన్నటి ‘ఫ్యాషన్’ వరకూ సీరియస్ విషయాల మీద సినిమాలు తీసిన మధుర్ భండార్కర్, “జస్ట్ చిల్ ! లెట్ మి టేకె బ్రేక్” అనుకున్నట్టున్నాడు. అందుకే గతసంవత్సరం సూపర్ హిట్టయిన ‘ఇష్కియా’ సినిమాలోని పాట ‘దిల్ తో బచ్చా హైజీ’ శీర్షికతో ఒక లైట్ హార్టెడ్ కామెడీ సినిమా తీసేశాడు. మధుర్ కు బ్రేక్ సంగతేమోగానీ, సినిమా చూసే ప్రేక్షకుడికి మాత్రం హార్ట్ ఏక్ వచ్చేలా ఉంది ఈ సినిమా.

ఒక విడాకుల వర్జ్ లో ఉన్న మిడిల్ ఏజ్ మగాడు. అమ్మాయిల డబ్బుతో అయ్యాషీ చేసే ప్లేబాయ్ మరొకడు. పవిత్రమైన ప్రేమొకటుందని నమ్మి గుడ్డిగా ప్రేమించే అమాయకుడు ఇంకొకడు. ఈ ముగ్గురు అర్బన్ మిస్ ఫిట్ల ప్రేమాట్లు ‘దిల్ తో బచ్చా హైజీ’. టి.వి.యాంకర్ భార్యతో పడలేక విడాకులు తీసుకోబోతున్న 38 సంవత్సరాల నరేన్ (అజయ్ దేవ్ గన్) ఆఫీసుకు కొత్తగా వచ్చిన ఇరవైఏళ్ళ ఇంటర్న్ జూన్ పింటో (షహనాజ్ పదంసీ) తో ప్రేమలో పడతాడు. అప్పటివరకూ హాయిగా అమ్మాయిలతో ఖుషీచేసే అభయ్ (ఇమ్రాన్ హష్మి) పైసా కోసం అనుష్క నారంగ్ (టిస్కా చోప్రా)తో కంటిన్యూ అవ్వాలో లేక ప్రేమ కోసం తన సవతి కూతురు నిక్కి నారంగ్ (శృతి హసన్) కు జీవితాన్ని అర్పించాలో తెలియని డైలమాలో పడతాడు. అప్పటిదాకా పిచ్చి కవితలు రాసుకుంటూ, జనాల పెళ్ళిళ్ళు చేస్తూ ఒక మ్యారేజ్ ఏజన్సీ  లో పనిచేసే వర్జిన్ మిలింద్ కేల్కర్ (ఓమి వైద్య) హీరోయిన్ అవ్వాలని కలలు కంటూ, అబ్బాయిల్ని కేవలం అవసరాలకు మాత్రమే వాడుకునే ఒక రేడియో జాకీ గున్ గున్ సర్కార్ (శ్రద్దాదాస్) ప్రేమలో విపరీతంగా మునిగిపోతాడు. ఏంచెయ్యడానికైనా సిద్దపడతాడు. ఈ ప్రేమల పర్యవసానం ఏమిటి? చివరికి ఎవరెవరి దిల్ బచ్చాలాగా మిగిలింది? అనేది మిగతా కథ.

పాత్రల పరంగా, పరిస్థితుల పరంగా చూసుకుంటే ఎంతో హస్యానికి అవకాశం ఉన్న సినిమా. కానీ, దర్శకుడి బలహీనతో లేక చేతకానితమో, ఏ సన్నివేశమూ పండినట్లు అనిపించదు. నవ్వు రాదు సరికదా నీరసంగా మిగిలిపోయాయి. సినిమా చివరి పదినిమిషాల్లో పండించిన హాస్యం మినహా సినిమా పరమ బోరింగు సినిమాలాగా తయారయ్యింది. ఎంత బోర్ అంటే, నాతో సినిమాకొచ్చిన మిత్రుడు ఒక సీన్లో “షహనాజ్ చెవి రింగులు చూడూ! ఒకేలా లేవుకదా? సరిగ్గా చూడు” అని చెప్పి, ఇంకాస్సేపటి తరువాత “హేయ్! అవి ఒకలాగా ఎందుకు లేవంటే ఒక చెవి రింగ్ కీ షేపులో ఉంటే…మరొకటి లాక్ షేపులో ఉంది” అనిచెప్పగలిగినంత బోరుకొట్టింది. ఈ ఒక్క ఉదాహరణతో మీరు ఊహించుకోవచ్చు  సినిమాలో ఎంత లాగుడు పీకుడుంటే విషయాన్ని పక్కనబెట్టి హీరోయిన్ చెవి రింగులు గమిస్తాం ! అదీ మగాళ్ళం !?

నటీనటుల పరంగా ఇమ్రాన్ హష్మి నటనను అభినందించొచ్చు. బహుశా తన స్క్రీన్ ఇమేజికి దగ్గరగా ఉన్న పాత్రకూడా కావటం వలన అనుకుంటా, చాలా సహజంగా నటించాడు 😉 అజయ్ దేవ్ గన్ ఈ సినిమాలో చాలా ఇబ్బందిగా కనిపించాడు. ఈ సినిమా కోసం కాకుండా వేరే ఏదో సినిమా కోసం నటిస్తున్నట్టు అనిపించింది. ఓమి వైద్య తనదైన యాసతో ‘త్రీ ఇడియట్స్’లో మెప్పించినా, అదే యాస ఈ సినిమాలో కొనసాగించడంతో కొంత ఎబ్బెట్టుగా ఉంటుంది. బహుశా తన ఒరిజినల్ యాస ఇదే అయితే భవిష్యత్తులో నటుడిగా కొనసాగడం కష్టం కావచ్చు. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ మరో నటి షహనాజ్ పదంసీ. అక్కడక్కడా  జూహీచావ్లా ను తలపించే నటనతో పాత్రోచితంగా నటించింది. టిస్కా చోప్రా కూడా సరిగ్గా సరిపోయింది. శృతి హసన్ ఈ సినిమాలో ఎందుకుందో తనకైనా తెలుసోలేదో అని సందేహం రాక మానదు. తెలుగు సినిమాల్లో రెండో హీరోయిన్ గా కనిపించే శ్రద్దా దాస్ ఈ చిత్రంలో మూడో హీరోయిన్ గా కనిపించడం విశేషం 🙂

సంగీతం మరియూ ఇతర సాంకేతిక విభాగాల గురించి చెప్పుకోవడానికి అస్సలు ఏమీలేవు.

మొత్తంగా ఇదొక ఏడుపుగొట్టు సినిమా. మధుర్ భండర్కర్ మళ్ళీ ఇలాంటి సినిమాల జోలికి రాకుంటే బాగుండును. లేకపోతే ఇప్పటికే, “మంచి విషయాల్ని ఎన్నుకుని సినిమాలు తీస్తాడేగానీ, విషయమున్న దర్శకుడు కాదు” అని అతని మీదున్న అపవాదు ఖచ్చితంగా నిరూపణ అయ్యే ప్రమాదం ఉంది. ఏమీ పనిలేకపోతే ఈ సినిమాకి వెళ్ళండి లేదా ఏదైనా వేరేపని చూసుకోవడానికి వెళ్ళండి. చూడటానికి మాత్రం అస్సలు కాదు.

9 Comments
  1. అరిపిరాల February 2, 2011 /
  2. $hankar Gangadhari February 2, 2011 /
  3. holyman February 2, 2011 /
  4. Arun Kumar Aloori February 2, 2011 /
  5. mohan February 2, 2011 /
  6. srikanth February 2, 2011 /
  7. Anon February 3, 2011 /
  8. rajendra kumar February 5, 2011 /