Menu

బంగారు పాప (1954)

వందేమాతరం’ చూశాక, అర్జెంటుగా ఇంకో బి.ఎన్.రెడ్డి సినిమా చూడాలి అనేస్కుని, చూసిన సినిమా ఇది.

నటీనటులు: జగ్గయ్య, ఎస్వీ రంగారావు, కృష్ణకుమారి తదితరులు.
నిర్మాత, దర్శకుడు – బి.ఎన్.రెడ్డి
కథ: పాలగుమ్మి పద్మరాజు

కథ విషయానికొస్తే, ఒక పెద్ద కుటుంబానికి చెందిన అబ్బాయి (జగ్గయ్య) తాను ప్రేమించిన అమ్మాయి (జమున) గురించి ఇంట్లో చెప్పే ధైర్యం చేసేలోపు, అతనికి పెళ్ళి నిశ్చయమైపోతుంది. ఇంతలో ఆ ప్రేయసికి పాప కూడా పుడుతుంది. ఈ పెళ్ళి విషయం తెలిసి, ఆమె తన బిడ్డతో సహా అతని ఊరు వస్తూండగా గాలివానలో మరణిస్తుంది. ఆ పాప మాత్రం ఆ ఊర్లోని ఒక కమ్మరి వాడు కోటయ్యకు(రంగారావు) కు దొరుకుతుంది. అక్కణ్ణుంచి అతనే ఆ పిల్లని పెంచుతాడు. ఒకపక్క జగ్గయ్యకి పెళ్ళైపోతుంది కానీ పిల్లలు ఉండరు. కోటయ్య కూతురుగా చలామణి అవుతున్నది తన కూతురే అని అతనికి తెలుసు కనుక, ఆ అమ్మాయిని అభిమానంతో చూస్తూ ఉంటాడు. కాలక్రమంలో ఆ పాప పెద్దదౌతుంది. పాపగానే పిలువబడుతుంది. (కృష్ణకుమారి). జగ్గయ్య మేనల్లుడు (ఆయనెవరో నాకు తెలీదు) తో స్నేహం ప్రేమగా పరిణమిస్తుంది. అయితే, కులాల అంతరాల వల్ల పెళ్ళికి అడ్డు తగుల్తారు పెద్దలు. తరువాత ఏమైంది? పాప ఎవరన్నది అసలు అందరికి తెలుస్తుందా? లేదా? అన్నది మిగితా కథ.

ఎస్వీఆర్ పేరు – రంగారావు అనే వేశారోచ్ 🙂 ఆయనొక్కడికే ఈ సినిమాలో వివిధ దశల్లో గెటప్ మారడం స్పష్టంగా చూపారు. కానీ, మిగితా పాత్రలు – ఉదాహరణకి జగ్గయ్యకి -జుట్టు ఒక ఎకరం ఎగిరి, తెల్లబడ్డం మినహా మరో మార్పు గమనించము. నటీనటుల ఎంపిక సరిగ్గా సరిపోయింది. కృష్ణకుమారి నిజంగా చాలా చిన్నగా ఉంది! 🙂 సినిమా మొత్తం ఆమెని పాప పాప అనడమే కాస్త కొత్తగా ఉండింది. ఏదో ఒక పేరు ఉంటే బాగుండేది ఆ పాపకి.

అసలు అన్నింటికంటే షాకింగ్ విషయం – ఈ సినిమా నిడివి ఒకటిన్నర గంటలు కావడం. నేనసలు నమ్మలేకపోతున్నా. ఈ వీసీడీ ఏమన్నా చాలాసార్లు కత్త్రించారా ఏమిటి? అని సందేహం వచ్చింది కానీ, మరి చూస్తూ ఉంటే ఫ్లో సరిగానే ఉండిందే! ఒకటిన్నర గంటల మాట నిజం అయితే, ఖచ్చితంగా ఈ సినిమా ఫ్లాపై ఉండాలని నా ఊహ 🙂

కథ, కథనం అంతా బానే ఉంది కానీ, ముగింపు సీన్లు మాత్రం చాలా త్వరగా ముగిసిపోయాయి అనిపించింది. బహూశా, ఈ సినిమాలో ప్రధానోద్దేశ్యం అక్కడ సంఘర్షణ ను చూపడం కాదేమో. అది కానప్పుడు, మరేమిటో, నాకర్థం కాలేదు. అలాంటిదంతా వదిలేసి, ఏదో కాలక్షేపానికి, మరీ హెవీ డ్యూటీ స్తఫ్ లేకుండా, అలా అని హాస్యం కూడా లేకుండా కూడా – ఎంటర్టైనింగ్ సినిమా తీయొచ్చని మాత్రం అర్థమైంది.

మొత్తానికి, సినిమా చూడ్డానికి బాగానే ఉంది. ఎక్కడా బోరు కొట్టలేదు. కథ ఇన్నేళ్ళ తరువాత చూస్తే, చాలా సాదాసీదాగా ఉంది. బహుశా, ఆ కాలానికి కొత్తదేమో. తప్పనిసరిగా చూసి తీరాలి అని నేననను కానీ, ఇప్పుడొస్తున్న సినిమాలు చాలావాటితో పోలిస్తే, ఇదెంతో నయం. మంచి తెలుగు వినడానికి మాత్రం తప్పకుండా చూడొచ్చు.

వీసీడీ ఇప్పుడు బయట మార్కెట్లో దొరుకుతోంది. వెల నలభై రూపాయలు. దివ్యా ఎక్స్పోర్ట్స్ అన్న కంపెనీ వారిది.

10 Comments
 1. suresh February 9, 2011 /
  • Sowmya February 10, 2011 /
   • V Chowdary Jampala February 10, 2011 /
 2. Sreenivas Paruchuri February 11, 2011 /
  • Sowmya February 11, 2011 /
  • Sreenivas Paruchuri February 11, 2011 /
 3. Venugoud February 12, 2011 /
 4. అజయ్ వెల్లంకి March 22, 2013 /
 5. అజయ్ వెల్లంకి March 23, 2013 /