Menu

సాహసంతో తీసిన ధీరుడి నిజమైన కథ 127 Hours

(Caution: Spoilers ahead; towards the end of the article)

రన్ రాల్‌స్టన్ సాహసక్రీడలపై మోజున్న యువకుడు. నిర్జనమైన కొండలమధ్య సన్నని లోయలో సాహసయాత్రకు బయలుదేరాడు. ఉన్నట్టుండి కాలు జారింది. ఆ పాటులో కదిలిన పెద్ద బండరాయి అతని కుడి చేతిని కొండకు నొక్కిపెట్టేసింది. మోచేతికి కొంతకిందనించి అరచేతిదాకా రాయికీ కొండకూమధ్య నలిగిపోతుంది. ఆ చేయి కదిపే వీలు కూడా లేదు. ఆ బండని కదపటానికి ఎంత ప్రయత్నించినా అతని బలం చాలటంలేదు.

అతని దగ్గర ఉన్నదల్లా ఒక చిన్న సీసాడు నీళ్ళు, ఒక పూటకు సరిపడే ఆహారం, ఒక విడియో కెమెరా, పర్వతాలెక్కటానికి పనికి వచ్చే తాళ్ళూ, కొక్కాలు, కొన్ని బట్టలు, ఒక చిన్న యుటిలిటీ నైఫ్. దాన్లో ఉన్న ఒక్క చిన్నచాకుతో ఆ రాయిని తొలచటానికి ప్రయత్నించాడు. చౌకబారు చాకు, పనికిరాలేదు, మొండిదయింది.
తనంత తనుగా బయటపడే మార్గమేమీ లేదు. ఎవరైనా అటుగా వస్తే వాళ్ళు రక్షించాలి. లేకపోతే తాను తప్పిపోయానని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెదకటానికి వచ్చిన వాళ్ళు రక్షించాలి. తాను ఎక్కడకి వెళ్తున్నదీ ఎవరికీ చెప్పకుండా బయలుదేరాడు. అందుచేత ఎవరైనా వెదకటం మొదలుపెట్టినా, తాను ఈ లోయలో ఉన్న సంగతి వాళ్ళకు తెలిసే ప్రసక్తి లేదు. మరెలా? చేతిని కోసేసుకోంటే తప్పించి ఆ బండ నుంచి తన శరీరాన్ని విడిపించుకోలేడు. కానీ ఈ మొండిచిన్నచాకుతో ముంజేతి ఎముకలను ఎలా కోయగలడు?

ఒక రోజు గడిచింది. రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు కూడా అయింది. కుడిచేతి వేళ్ళు చచ్చుబడి ఊదారంగులోకి మారిపోయాయి. ఒంటరిగా ఆ లోయలో. అప్పుడప్పుడూ వచ్చిపోయే జ్ఞాపకాలు, ఊహలు, భ్రమలలో (hallucinations) మాత్రమే ఇతర మనుషులు కనిపించొచ్చు, వినిపించొచ్చు. అంతవరకే. చెట్టూచేమా కూడాలేని ఆ నిర్జన ప్రదేశంలో అతని మాటలు తప్ప వేరే అలికిడేం లేదు. దగ్గర ఉన్న నీరూ, తిండీ అయిపోయాయి. రెండు మూడు చీమలు తప్ప దగ్గర్లో ఇంకో ప్రాణి కూడా లేదు.

బతుకుతానన్న ఆశ పోయింది. విడియో కెమెరాలో తన కుటుంబానికి చివరి సందేశం రికార్డ్ చేశాడు. దాంట్లో బాటరీ కూడా అయిపోయింది. పక్కన కొండగోడ మీద తన పేరూ, పుట్టినరోజూ, చనిపోబోతున్న తేదీ పేరూ చెక్కాడు. చావు తప్పదు. ఎదురు చూస్తూ నిలుచున్నాడు. ప్రకృతి సహకరించనప్పుడు లొంగిపోక మనిషి ఏం చేయగలడు?

ఇది 2003లో అమెరికాలో యూటా రాష్ట్రంలో బ్లూజాన్ కాన్యన్‌లో నిజంగా జరిగిన సంఘటన. ఇలాంటి సంఘటనను సినిమా తీయాలని ఎవరికైనా ఎలా తోస్తుంది? ఒకవేళ తోచినా, ప్రేక్షకులకు ఉత్కంఠనెలా కలిగించడం? రాయి కింద చేయి చిక్కుకున్న హీరో. సినిమాలో 90 శాతం కనపడేది అతనొక్కడే. కెమెరా అతన్నుంచి పక్కకి తప్పిస్తే చూపించడానికి పెద్దగా వేరే ఏమీ లేదు. ఈ సినిమా తీసి వ్యాపారాత్మకంగా విజయం సాధించగలను అనుకోవడానికి ఆ తీసేవాడికెంత ధైర్యం కావాలి? ఆ పాత్ర వేసేవాడికెంత ధైర్యం కావాలి? ఒకరిమీద ఒకరికి ఎంత నమ్మకం ఉండాలి? స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌ల మీద ఎంత పట్టు ఉండాలి?
ఈ సంఘటనను 127 Hours పేరుతో సినిమాగా తీసిన దర్శకుడు డానీ బాయిల్ (Slumdog Millionaire చిత్ర దర్శకుడు). స్చ్రీన్‌ప్లే రాసింది డానీ బాయిల్, సైమన్ బెఫో. హీరో జేమ్స్ ఫ్రాంకో. అతన్ని చూస్తుంటే నిజంగానే ఆ కాన్యన్‌లో అలా ఇరుక్కున్నట్టే ఉంటాదు. ఎక్కడా కృతకంగా కనిపించడు. అతిగానూ చేయడు. అతని బాధల్ని మన బాధలు చేస్తాడు.

సినిమా మొదలైన దగ్గరనుంచి చివరిదాకా ఎక్కడా విసుగు అనిపించదు. భయం వేస్తుంది. బాధ కల్గుతుంది. ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అప్పుడప్పుడూ నవ్వొస్తుంది. విసుగు మాత్రం కలగదు (నాకు ఈ కథ ఎలా ముగుస్తుందో ముందే తెలుసు, అయినా కూడా).

ఏకాకి మనిషితో తీసిన ఈ చిత్రానికి నేపధ్య సంగీతం ఇంకో ప్రాణం. మనవాడు ఏ.ఆర్.రెహ్మాన్ మళ్ళీ ఇంకోసారి తన ప్రతిభని మరోసారి నిరూపించుకొన్నాడు. ఒకోసారి మందంగా, మంద్రంగా, ఒకోసారి ఝరీప్రవాహపు వడి, ఇంకోసారి పూర్తి నిశ్శబ్దం.

సన్నటిలోయలో కెమేరా కదలటానికీ లైట్లు పెట్టుకోవడానికీ ఖాళీ లేని ఇరుకులో అత్యంత సహజత్వం ఉట్టిపడేలా చిత్రీకరించింది Anthony Dod Mantle (SlumDog Millionaireకి పని చేశాడు), Enrique Chediak. ఎడిటర్ Jon Harris పనితనమూ మెచ్చుకోవాల్సిందే.

ఈ చిత్రానికి ఆరు ఆస్కార్ అవార్డు నామినేషన్లు వచ్చాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ నేపధ్య సంగీతం, ఉత్తమ గేయం, ఉత్తమ ఎడిటింగ్.

అన్నట్టు, ఈ సినిమా విషాదాంతం కాదు. ప్రకృతి వైపరీత్యాలతో పోరాడి అధిగమించే మానసిక ధైర్యం కొంతమంది అసామాన్య మానవులకి ఉంటుంది. ఆ కోవకు చెందిన వాడే ఏరన్ రాల్‌స్టన్. మనం ఊహించలేని ధీరత్వంతో, సాహసంతో, గుండె నిబ్బరంతో, ప్రపంచమంతా ముక్కున వేలేసుకొనేలా ప్రవర్తించి, తనంతట తనే ఆ విపత్తునుంచి బయటపడ్డాడు. ఇప్పటికీ కొండలవెంటా, కోనల వెంటా తిరుగుతూనే ఉన్నాడు. ఐతే బయటకువెళ్ళే ముందు, ఎక్కడకు వెళ్తున్నాడొ ఇంట్లోవాళ్ళకు చెప్పి మరీ వెళ్తున్నాట్ట.

ఈ సినిమా గురించి నిజం ఏరన్ రాల్‌స్టన్ ఏమన్నాడంటే, ”…so factually accurate it is as close to a documentary as you can get and still be a drama.”. అంతకన్నా గొప్ప కితాబు ఏముంటుంది?

V. Chowdary Jampala

2 Comments
  1. SKJ March 26, 2011 /
  2. రాయము March 27, 2011 /