Menu

మోస్ట్ అన్ ‘వాంటెడ్’.

కథ : ప్రేమ కొసం చావడానికి సిద్దమయ్యే బేవార్స్ హీరోని, “నా కోసం చావకు. చంపు”  అనే ఒక భారీ ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ కథ ఈ సినిమా.

నటీనటులు:
గోపీచంద్ పాత్ర, తింగరి అమ్మానాన్నల పనీపాటా లేని బంగారు  బేవార్స్ కొడుకు పాత్ర. హఠాత్తుగా హీరోయిన్ కోరికతో సరదాగా మాఫియా మనుషుల్ని హత్యచెయ్యడానికి తయారవుతాడు. ప్రత్యేకంగా చెయ్యడానికి ఫైటింగులు తప్ప మరేమీ లేవుకాబట్టి పాత్రకు తగ్గట్టే నటించాడు. దీక్షాసేథ్ రెండుమూడు ముఖకవళికలు తప్ప భావాలు పలికించలేకున్నా, డిజైనర్ డ్రస్సులో అక్కడక్కడా అందంగానే కనిపించింది. నటించడానికి కాస్తో కూస్తో అవకాశం ఉన్న పాత్రాయినా, నటన రాదుగనక పెద్దగా శ్రమించలేదు. తింగరి అమ్మానాన్నలుగా జయసుధ, చంద్రమోహన్ యధాశక్తీ నటించినా, పాత్రల ఔచిత్యాలతో చిరాకు తెప్పించారు. కామెడీ కోసం పెట్టిన బ్రహ్మానందం ట్రాక్ కు థియేటర్లో నవ్వులు కురిసాయి. కానీ ప్రేక్షకులు నిజంగా నవ్వుతున్నారో లేక నవ్వులపాలైనందుకు కసితో నవ్వారో అర్థం కాదు. ప్రకాశ్ రాజ్ మళ్ళీ ఒక మూసపాత్రలో కనిపించారు. సుబ్బరాజు అప్పుడప్పుడూ హీరోయిన్ వెంటపడుతూ కనిపించి కనువిందు చేస్తాడు. నాజర్ ఈ సినిమాలో “పోకిరి”గా దర్శనమిస్తాడు. నటనపరంగా నాజర్ ఏలోటూ చెయ్యలేదు. షఫి అదే వెర్రినవ్వును కంటిన్యూచేస్తూ ఈ సినిమాలోనూ కనిపిస్తాడు. మిగతావారి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.

మాటలు:
పంచ్ డైలాగులు పుష్కలంగా ఉన్నా, ఉండకూడని చోట ఉండటంతో తగలకూడని చోట తగిలి నొప్పికలిగిస్తాయేగానీ నప్పించలేవు.

సంగీతం: పాటలైతే సినిమాలో ఉన్నాయిగానీ చూస్తున్నంతసేపూ వినపడవు, ఆపైన గుర్తుండవు… కాబట్టి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సంగీతం కూర్చింది మాత్రం చక్రి.

సినెమాటోగ్రఫీ: రసూల్ పెద్దగా శ్రమపడినట్లు మనకు కనిపించకపోయినా, కంటికి శ్రమ మాత్రం కలిగించలేదు. కాబట్టి సంతోషమే.

ఎడిటింగ్: శంకర్ ఎడిటింగ్ బాగుంది. సినిమా మొత్తాని కట్ చేసి పడేసుండే ఇంకా బాగుండేది.

దర్శకత్వం: తెలుగు ప్రేక్షకులకు చాలాబాగా తెలిసిన దశాదిశలో, మూసని అస్సలు దాటకుండా నూతన దర్శకుడు BVS రవి శమకోర్చి దర్శకత్వం వహించారు. సినిమాలో లేని కథని, చాలారకూ పేలని మాటల్ని కూడా దర్శకుడే అందించడం ముదావహం.

మొత్తానికి ఈ వాంటెడ్ అనే సినిమా ఇటు పరిశ్రమకూ, అటు ప్రేక్షకుడికీ మోస్ట్ అన్ వాంటెడ్. ఈ సినిమాతో పరిచయమైన కొత్త దర్శకుడిదీ అదే పరిస్థితి.

27 Comments
  1. srikanth January 27, 2011 /
  2. chakri January 27, 2011 /
  3. ఎలక్ట్రాన్ January 27, 2011 /
  4. j.surya prakash January 27, 2011 /
  5. phanindra January 27, 2011 /
  6. శ్రీనివాస్ పప్పు January 27, 2011 /
  7. KISH January 27, 2011 /
  8. gopi kiran January 27, 2011 /
  9. ఆ.సౌమ్య January 27, 2011 /
  10. shankar Gongati January 27, 2011 /
  11. srinivasamouli January 27, 2011 /
  12. Rishi January 27, 2011 /
  13. సుజాత January 27, 2011 /
  14. SRINIVAS January 27, 2011 /
  15. ksridhar January 27, 2011 /
  16. srinu January 27, 2011 /
  17. Shiva ki January 27, 2011 /
  18. Shiva ki January 27, 2011 /
  19. రాజశేఖర్ January 28, 2011 /
  20. eravindar January 28, 2011 /
  21. రమణ మూర్తి January 30, 2011 /
  22. Srikanth Prattipati January 30, 2011 /
  23. Aravind February 5, 2011 /