Menu

జెసికాని ఎవరూ చంపలేదు(రు) (No One Killed Jessica)

1999 ఏప్రియల్‌లో ఒక హత్య జరిగింది. రాజధాని ఢిల్లీ నగర శివారుల్లో ఒక పార్టీలో “సెలబ్రిటీ బార్ టెండర్” గా వున్న జసికా లాల్ అనే అమ్మాయిని ఒక బడా రాజకీయవేత్త కొడుకు కాల్చి చంపాడు. ఆ హత్యని కళ్ళారా చూసిన చాలామంది మాకెందుకులే అని వెనక్కి తగ్గారు. ధైర్యం చేసి సాక్ష్యం సైతం చెప్తామన్న వారు క్రమ క్రమంగా జారుకున్నారు. కళ్ళు లేని చట్టంలో వున్న లొసుగులతో హంతకుడు, అతని అనుచరులు తప్పించుకున్నారు. ఆ తరువాతే మొదలైంది అసలు కథ. జసికా అక్క సబరినా చేసిన పోరాటం, తెహల్కా, ఎన్‌డీటీవి వంటి మీడియావారి ప్రచారంతో దేశం మొత్తం జసికాకి న్యాయం జరగాలని పోరాడింది. కేసు మళ్ళీ మొదలైంది. హంతకుడికి కొమ్ము కాస్తున్న రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు ఎదురుదెబ్బలు తిన్నారు. చివరికి న్యాయం గెలిచింది.

***

మామూలుగా సినిమా సమీక్షలంటే కథ చెప్పకుండా వ్రాస్తారు. కానీ ఈ సినిమా సమీక్షకి అలాంటి ప్రతిబంధకం లేదు. ఎందుకంటే ఈ కథ అందరికీ తెలుసు. లోపభూష్టమైన న్యాయ వవస్థను, డబ్బుకు అమ్ముడుపోయిన చట్టాన్ని నిలబెట్టి కడిగిన “పబ్లిక్ ఏక్టివిజం” కేసుగా ఇది అందరికీ గుర్తుండిపోయిన కథ. అలాంటి కథతో సినిమా తీయాలనుకోవడం కత్తి మీద సాము లాంటిదే. అయినా ఈ సినిమాని పట్టు సడలకుండా, ప్రేక్షకుణ్ణి కట్టిపడేసేలా తీయగలిగాడు దర్శకుడు రాజ్‌కుమార్ శర్మ. తెర మీద జసికా కనపడాగానే ఆ అమ్మాయి చచ్చిపోతుందని మనకి తెలుసు, అయినా బాధపడతాం. సాక్షులు ఒక్కొక్కరే జారుకుంటారని తెలుసు, అయినా ఆశ్చర్యపోతాం. హంతకుడికి చివర శిక్ష పడుతుందని తెలుసు, అయినా సంతోషపడతాం. తెలిసిన కథతో ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా తీయగలగడం దర్శకుడి ప్రతిభకు నిలువుటద్దం. పకడ్బందీ స్క్రీన్‌ప్లే, ఆ కథని పండించగలిగిన నటీనటులు వుంటే అది ఎలా సాధ్యమో చూపించే నిదర్శనం.

కథలోనూ మన సమాజంలోనూ వున్న బాధ్యతారాహిత్యం, నిరాసక్తత, హిపోక్రసి నుంచి అవసరమైనప్పుడే పుట్టుకొచ్చే సామాజిక చైతన్యం వరకూ అన్నీ వాస్తవంగానూ, స్వాభావికంగానూ కనిపిస్తాయి. “ఒక కోటీ రూపాయలు, ఒక బులెట్.. ఏదో ఒకటే సాధ్యం అయితే నేనేం చెయ్యాలి.. నాకు కోటి వద్దు, కాని బులెట్ కూడా వద్దు” అంటూ చెప్పే ప్రత్యక్ష సాక్షిని చూస్తే జాలేస్తుందే తప్ప కోపం రాదు. వస్తే గిస్తే కోపం వ్యవస్థ మీద వస్తుంది.. డబ్బులు వెదజల్లి తప్పుల్ని కప్పిపుచ్చుకోగలం అనుకునే బడా నాయకుల మీద వస్తుంది. బహుశా దర్శకుడు సాధించాలనుకుంది అదేనేమో. ఇదే కథాంశానికి దగ్గరగా “హల్లా బోల్” అనే చిత్రం వచ్చింది. జసికా గురించి ప్రజలు చేసిన పోరాటంలో జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శన, దాదాపు అదే విధంగా “రంగ్ దే బసంతి”లో వాడేశారు. అయినా ఆయా సన్నివేశాలు తెరపై వచినప్పుడు ఎక్కడో చూసిన ఛాయలు లేకపోగా సందర్భోచితంగా అనిపిస్తాయి.

ఇక నటీ నటుల నటన ఈ సినిమా విజయవంతమవ్వడానికి అన్నింటికన్నా ముఖ్య కారణం అయ్యే అవకాశం వుంది. అసభ్యమనిపించే పదాలను అలవోకగా వాడేసే టీవీ ఏంకరుగా, అవసరమైతే మాటల్తోనే ప్రజల్లో చైతన్యం కలిగించగలిగిన సమర్థవంతమైన బాధ్యతాయుతమైన జర్నలిస్ట్ (మీరా)గా రాణీ ముఖర్జీ అద్భుతంగా నటించింది. జసికా పాత్రలో కొత్తమ్మాయి మైరా బాగుంది. చెడుకి మంచికి మధ్య నలిగే పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో రాజేష్ శర్మ ఆకట్టుకుంటాడు. ఇక సినిమా మొత్తానికి ఆయువుపట్టు అయిన సబరినా పాత్రని అత్యద్భుతంగా పోషించింది విద్యా బాలన్. ఎలాంటి హడావిడీ చెయ్యకుండా కేవలం ఎక్స్‌ప్రషన్ల‌తో, కొన్ని సార్లు కేవలం కళ్ళతో, మరికొన్ని సార్లు “బాడి లాంగ్వేజ్‌తో” చాలా బాగా నటించింది. “పా”, “ఇష్కియా”, వంటి చిత్రాల్లో ప్రధానపాత్రలు  పోషించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్‌కి ఈ చిత్రం కూడా ఒక మైలు రాయిలా నిలిచే అవకాశం వుంది.

కథ ముందే తెలుసు కాబట్టి ఇందులో వున్న కొత్త కోణం గురించి ఒక మాట. సబరినా (విద్య బాలన్) తన చెల్లెలి కోసం న్యాయ పోరాటంతో మొదలుపెట్టి, కోర్టు కేసు విఫలమవడంతో నిరుత్సాహంతో ఆగిపోతుంది. అప్పటిదాకా సాదా సీదా కేసని తీసి పారేసిన మీరా (రాణి ముఖర్జీ) ఆ కేస్ కోసం పోరాటం సరిగ్గా అప్పుడే మొదలుపెడుతుంది. ఆ తరువాత ఇద్దరూ కలిసి నేరస్థులని చట్టం ముందు ఎలా నిలబెట్టారనేదే మిగతా కథ. ఆ రకంగా ఇద్దరు ఆడవాళ్ళు ఒకరి తరువాత ఒకరు న్యాయం కోసం చేసే పోరాటం ఈ సినిమా.

సినిమాపరంగా కథలో కొన్ని మార్పులు చేసుకున్నా, అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు వున్నా, ఒకటి రెండుసార్లు సాగుతోందనిపించినా, సినిమా పూర్తైయ్యాక మంచి సినిమా చూశామన్న అనుభూతి మిగుల్తుంది. నిజమైన జసికాకి, ఆ న్యాయ పోరాటానికి ఈ చిత్రం నివాళిగా చెప్పుకోవచ్చు. జసికా అక్క సబరినా ఈ చిత్రం చూసి చెప్పినట్లు “ఈ సినిమా జసికాని అజరామరం చేసింది”

అమిత్ త్రివేది సంగీతం సినిమాకి తగిన మోతాదులో బాగుంది. ముఖ్యంగా “దిల్లీ” గురించి వచ్చే పాట వెంటాడుతుంది.

ఏది ఏమైనా ఈ సినిమా వల్ల ముగ్గురికి తప్పకుండా పేరొస్తుంది – 1. రాజ్ కుమార్ గుప్తా (దర్శకుడు) 2. విద్యా బాలన్ (సబరినా లాల్) 3. రాణి ముఖర్జీ (మీరా గైటీ).

తప్పక చూడాల్సిన చిత్రం.

చిత్రం: నో వన్ కిల్డ్ జసికా (No One Killed Jessica)
నటీనటులు: విద్యా బాలన్, రాణీ ముఖర్జి, రాజేష్ శర్మ, మైరా
దర్శకత్వం: రాజ్‌కుమార్ గుప్త
సంగీతం: అమిత్ త్రివేది
నిర్మాత: రోనీ స్క్రూవాలా

విడుదల: 07.01.2011

18 Comments
  • G January 8, 2011 /
 1. Vamsi K Kumar January 8, 2011 /
 2. vijay January 8, 2011 /
 3. bonagiri January 9, 2011 /
  • holyman January 9, 2011 /
 4. Sowmya January 11, 2011 /
  • Sowmya January 16, 2011 /
   • Krshany January 17, 2011 /
   • Sowmya January 26, 2011 /
   • krshany January 26, 2011 /
 5. maggi January 15, 2011 /
 6. సుజాత January 17, 2011 /
 7. aditya January 25, 2011 /