Menu

కథ-స్క్రీన్‍ప్లే-దర్శకత్వం భానుమతి

భానుమతి అన్నీ తానై చేసిన సినిమాలు చూడాలంటే నాకు ఒక విధమైన భయం. అందుకే, ఇన్నాళ్ళూ చూడగల అవకాశం ఉన్నా సాహసించలేదు. కానీ, మొన్నేమి పూనిందో కానీ, వరుసగా మూడు సినిమాలు చూశాను. అదొక పెద్ద పొరపాటని అనను కానీ, చాలా కొంచెం గ్రహపాటు. నా మెదడుకి సాపాటు అనుకున్నా కానీ, నా మెదడే అయింది సాపాటు. వెరసి – అదో రకం పాటు.

మొదటి సినిమా – రచయిత్రి.
కథ, స్క్రీన్‍ప్లే, సంభాషణలు, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం – భానుమతి

సినిమా సంగతి తరువాత చెబుతా కానీ, ముందుగా నాకీ సినిమా చూస్తున్నప్పుడు కలిగిన అనుభవాల గురించి చెబుతాను.

అసలు సినిమా టైటిల్స్ పడుతూండగా భానుమతి గొంతుకలో ’విన్నపాలు వినవలె’ వినిపిస్తూ ఉంటే ’నేపథ్య గానం – ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం’ అని చదవడం మహా నవ్వు పుట్టించింది. అలాగే, టైటిల్స్ పడుతున్నప్పుడు – మొదట అన్నీ ఆడపేర్లు వచ్చేశాక తరువాత మగపేర్లు వచ్చాయి. అంటే, ఏదో ఒక ఆర్డర్లో వస్తే వచ్చాయి, నాకనవసరం కానీ, ఏళ్ళ తరబడి ఇలా కాక మరోలా చూసి చూసి కాస్త కొత్తగా అనిపించింది. మొత్తం మూడు సినిమాల్లోనూ ఇదే తీరులో పడ్డాయి టైటిల్స్.

సరే, ఇవి అటు పెడితే, ఇందులో భానుమతి ఒక రచయిత్రి. సినిమా మొదలవగానే తొలిసీన్లో భానుమతి కొందరు రచయిత్రులతో కలిసి కూర్చుని ఉంటుంది. రచయిత్రి రచనల వల్ల సమాజానికి ఉపయోగం కలగాలన్నట్లు ఏదో చెప్పాక – సినిమా మొదలైంది. స్థూలంగా కథ ఏమిటంటే, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వారి కథలు పనిమనిషి ద్వారా వింటూ, ఆ కథల్నే నవలలో రాస్తూ, పరిష్కారమార్గం సూచిస్తూ ఉంటుంది. ఇవి చదివి, వాళ్ళు బాగుపడి, చివర్లో ఆమెకి నమస్కరిస్తారు. అంతే.

అయితే, అసలు ఈ సినిమా మొత్తంగా దృశ్యాలన్నీ ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా వస్తున్నట్లు అనిపించింది. అది వీడియో డిస్క్ లో ఉన్న పొరబాటో, సినిమా తీయడమే అలా ఉందో అర్థం కాలేదు. బహూశా, రచనల ద్వారా సామాజిక ప్రయోజనం ఉండాలి అన్న ఆలోచన బానే ఉంది కానీ, కథ మాత్రం చాలా చెత్తగా ఉంది. కథనం కూడా పెద్ద గొప్పగా ఏమీ లేదు. అసలు భానుమతి సినిమా అనగానే, గుర్తు వచ్చే మార్కు హాస్యం మచ్చుకైనా లేదు – ఇది అన్నింటికంటే నాకు నిరాశ కలిగించిన అంశం.

ఒక చోట ’అసలే వారి ఆరోగ్యం అంతంత మాత్రం. ఈ అవమానంతో వారు హరీ అంటే ఈ కొంపకు దిక్కెవరే’ అంటుంది ఒక పాత్ర. అప్పుడు ఆ ’వారు’ కూడా అక్కడే ఉన్నారు. ’వారికేమన్నా అయితే..’ అంటే బాగుండేదేమో కాస్త, అనిపించింది. 🙂 ఇక, అసాధ్యంగా కనబడే సీన్లు చాలానే ఉన్నాయి. నమ్మశక్యం కానివి. అయితే, మన సినిమాల్లో అంతేలే అనుకుని సరిపెట్టుకోవాలి కాబోలు.

’సన్నజాజి తీవెలోయ్…సంపంగి పూవులోయ్ చిలిపి చిన్నారు లోయ్ పాపలు సిరులొలికే చిన్నారు లోయ్’ పాత పాట మళ్ళీ వాడారు ఇందులో. అయితే, ఆ పాట పెట్టాల్సిన సందర్భమే అనవసరం అనిపించింది. అయినా, కొత్త పాటలు పెట్టుకోవచ్చుగా. ఆ పిల్లలు ఆడుకుంటూ ఉంటే, టీవీలో పాత పాట వస్తూ ఉంటుందట. టీవీలో కూడా భానుమతే కనబడుతూ ఉంటుంది. ఇలాంటి పిల్లల పాటే ఒకటి – ’అంతా మన మంచికే’ లో కూడా ఉంటుంది. అంటే, అది రిపీట్ సాంగ్ కాదనుకోండి. కానీ, ఏమిటో ఆ పాట గుర్తొచ్చింది.

ఈ నమ్మశక్యం కాని దృశ్యాల్లో కూడా బాగా నవ్వు పుట్టించిన దృశ్యం ఒకటుంది –
ఒక చోట ఒక ఆడపాత్ర తన స్నేహితురాలితో – ’మా లెక్చరర్ ఒకతను చూడ్డానికి మీ ఆయన లాగే ఉంటాడు. ఎవరు ఎంత అడిగినా పాడలేదు. కానీ, ఒకమ్మాయి అడగ్గానే పాడడం మొదలుపెట్టాడు. తమాషా ఏమిటంటే ఆ అమ్మాయి అచ్చం నీలాగే ఉంటుంది’ అంటుంది. అనగానే, ఆ స్నేహితురాలి పాత్రకీ, అమె భర్తకీ మధ్య డ్యూయట్!! :)))

అబ్బో…ఇలా ఇలా అబ్సర్డ్ గా సాగిపోతుంది. అబ్స్రర్డిటీలో కామెడీ లేకపోతే మట్టుకు చూడ్డం చాలా చాలా కష్టం, అనవసరం కూడా.

రెండో సినిమా – అసాధ్యురాలు (తమిళ సినిమా – పెరియమ్మ-1993)
కథ-స్క్రీన్‍ప్లే-దర్శకత్వం – భానుమతి
సంగీతం – ఇళయరాజా (!!!!!! హౌ కం??)
సంభాషణలు – డివి నరసరాజు

ఈ సినిమా కథ -ఒక్క ముక్కలో మాడర్న్ ఎరా ’అంతా మన మంచికే’. కాకపోతే, కొన్ని పాత్రల చిత్రణలు మారతాయంతే. ప్రాథమికంగా కథ ఒకటే.

’ఈమేరా భారతి, ఇవ్వాలీ హారతి’ – అన్న పాట, భానుమతిపై చిత్రీకరించినది – భలే ఉంది. కొంచెం నవ్వు కూడా వచ్చింది కానీ, బాగుంది. అన్నట్లీ సినిమాలో భానుమతి అమ్మ పాత్ర కూడా ఉంది! 🙂 ఈ సినిమాలో కూడా వాళ్ళమ్మా వాళ్ళ వృద్ధాశ్రమంలో అంతా భానుమతి సినిమాలు చూస్తూ, ఆహా ఓహో అనుకునే సీన్ ఒకటుంది. భానుమతి కూడా వాళ్ళని జాయిన్ అయి చూస్తుంది :)) చండీరాణి, మల్లీశ్వరి, అంతస్థులు – ఇలా కొన్నింటి దృశ్యాలు చూపారు. ’చండీరాణి’ సినిమా బాగుంటుందేమో అనిపించింది ఆ సీన్లు చూసి.

ఈ సూపర్ వుమన్ మోజేమిటో! అఫ్ కోర్సు, హీరోలకి కూడా అలాగే సూపర్ మ్యాన్ అనుకునే సంప్రదాయం అనుకోండి మనది, అది వేరే విషయం. అయినా, ’రచయిత్రి’ తో పోలిస్తే ఈ సినిమా బాగుంది. పైగా, కొంచెం ఆమె మార్కు డైలాగులు కూడా ఒకటీ అరా ఉన్నాయి.

మూడో సినిమా: ఒకనాటి రాత్రి
కథ-స్క్రీన్‍ప్లే-సంగీతం-దర్శకత్వం : భానుమతి

ఇదొక అపరాధ పరిశోధన కథ. భానుమతే డిటెక్టివ్ 🙂 అయితే, ఇది కూడా, కథా పరంగా ఓ మోస్తరుగా ఉంది కానీ, కథనం విషయానికొస్తే పెద్ద గొప్పగా ఏమీ లేదు. ట్రెయిన్ లో ప్రయాణిస్తున్న భానుమతి పక్క ట్రెయిన్ లో ఒక హత్య జరగడం చూస్తుంది (ఏదీ, రెండు ట్రెయిన్లూ కదలుతూండగానే!). దాన్ని గురించి అన్వేషిస్తూ, అసలా హత్య తాలూకా కుటుంబాన్ని కనిపెట్టీ, వాళ్ళింట్లో వంటమనిషిగా చేరి విషయం కనిపెడుతుంది. అదీ కథ.

ఫర్ అ చేంజ్, ఇందులో భానుమతి కి ఒక భర్త గారు కూడా ఉన్నారు (నటించినదెవరో నాకు తెలీదు). భానుమతి నల్లకళ్ళజోడులో డిటెక్టివ్ గా సూపర్ 🙂 ఇంట్రో సీన్ లో భానుమతి-ఛాయాదేవి ట్రెయిన్ లో మాట్లాడుకునే సీన్ ఒక్కటే సినిమాలో కాస్త సరదాగా ఉంది. ఏమైనా ఇద్దరిదీ భలే కాంబో. అన్నట్లు, ఇందులో కూడా ఒక పిల్లల లాలిపాట ఉంది. ఈసారి ఇదే ఒరిజినల్ లెండి! మొదటి కథలో లాగానే, ఇందులో కూడా భానుమతికి పనిమనిషి నుండే ఎక్కువ సమాచారం వస్తుంది 🙂 ఈ ఇంట్లో బూత్ బంగ్లా సెటప్ మాత్రం భలే ఉంది. ఎక్కడ్నుంచి పట్టుకొచ్చారో ఆ బొమ్మల్ని.

ఈ సినిమా, ’రచయిత్రి’ సినిమా రెండూ ఒకే ఇంట్లో/భవన ప్రాంగణంలో తీశారని నా అనుమానం. నటీ నటవర్గం కూడా ఒకటే. ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ఎక్స్‍ప్రెషన్ పెట్టుకుని అదొక్కటే పెడుతున్నారు సినిమా మొత్తం. ఈ రెండు సినిమాలు ఒకే ఏడులో తీసినవి (1980).

మొత్తానికి, మూడు సినిమాలూ తీవ్రంగా నిరాశపర చాయి. డైలాగులు బాగుంటాయనుకున్నా-లేవు. సంగీతం బాగుంటుందనుకున్నా-అసలు లేదు. కథ సంగతి దేవుడెవరుగు. ఒక భానుమతి సినిమాకి పై రెండూ బాలేకపోతే, భానుమతి ఉన్నా కూడా చూడ్డం కష్టం అని బాగా అర్థమైంది.

7 Comments
  1. అరిపిరాల January 5, 2011 /
    • కమల్ January 5, 2011 /
  2. srikanth January 5, 2011 /
  3. Nageswara Mutnuri January 11, 2011 /
  4. prathap reddy February 7, 2011 /