Menu

గోల్కొండ ’సక్సెస్’ స్కూల్

మన సినిమాలలో ‘మగతనం’మీద వచ్చినన్ని నిర్వచనాలు బహుశా ప్రపంచంలో మరే భాషా సాహిత్యంలోనూ వచ్చి ఉండకపోవచ్చు. ఇక ఇటీవలి తెలుగు సినిమాలలో అయితే ‘నువ్వంత మగాడివా?’ అనే డైలాగులు కామన్ అయిపోయాయి. హీరోయిజమ్‌ను, హీరో ఇమేజ్‌ను మాస్ జనంలో ఆకాశానికి తీస్కెళ్లడం కోసం చేసే డైలాగ్ మ్యాజిక్స్‌లో ఈ పడికట్టు పదం నలిగిపోయింది…ఇదే వీర రొటీన్ డైలాగుకు న్యూజెన్ నిర్వచనాన్ని ఇచ్చిన సినిమాగా ‘గోల్కొండ హైస్కూల్’ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సినిమాలో హీరో క్లైమాక్స్‌లో ‘మగతనమంటే తొడకొట్టడం, మీసాలు మెలేయడం కాదు’ అని చెప్పడం ప్రస్తుత తెలుగు సినిమాలలో వెర్రిపోకడలు పోతున్న విపరీత హీరోయిజమ్‌పై చురకే…అదే సమయంలో సెన్సిటివిటీ…ఇన్‌స్పిరేషన్…హార్డ్‌వర్క్..టాస్క్ వంటి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ప్రిన్సిపుల్సే అసలైన హీరోయిజమ్ అని కొత్త ఆలోచనను
రేకెత్తించింది గోల్కొండ హైస్కూల్!

ఈ సినిమాను ‘ది మెన్ వితిన్’ అనే ఇంగ్లీషు నవల ఆధారంగా తీసారని టైటిల్స్‌లోనే చెప్పారు. అలా సమకాలీన తెలుగు సినిమాల నిర్మాణంలో ఇటీవలి కాలంలో కనుమరుగైపోయిన ఓ మంచి సంప్రదాయాన్ని మళ్లీ ప్రారంభించారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ! తెలుగులో ఒకప్పుడు నవలా చిత్రాలు రాజ్యమేలాయి…ఆ తర్వాత ఇంగ్లీషు సిడీలు, వాటి ఇన్‌స్పైర్డ్ కథలు బాలీవుడ్‌లో యథేచ్ఛగా ఫ్రీమేక్’ అయ్యాయి. ఆ తర్వాత తమిళ డబ్బింగులు..కథలు…ఇన్నాళ్లకి మళ్లీ సినీ నిర్మాత-దర్శకులు ఫ్రెష్ కధలకోసం నవలలని ఆశ్రయించడం సృజనాత్మక రంగంలో ఓ మంచి మలుపు. ఇలా ఇంద్రగంటి ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు రెండు ఆలోచనలను మళ్లీ సరికొత్తగా క్రియేట్ చేశారు. ఒకటేమో స్పోర్ట్స్ నేపథ్య చిత్రాలు, రెండోది నవలా చిత్రాలు!

ఇక కథ విషయానికివస్తే నగరంలో ఒకానొక దీర్ఘ చరిత్ర ఉన్న హైస్కూల్! ఈ స్కూల్ నిర్వాహకులకు లాభాలను లేకపోగా నవ్వులపాలు చేసేస్థాయిలో క్షీణదశకు చేరుకుంటుంది. దాంతో స్కూల్ బోర్డ్ కిరీట్ (సుబ్బరాజు) నేతృత్వంలో ఓ ప్రతిపాదన చేస్తుంది. స్కూల్ ప్లేగ్రౌండ్‌ను కాస్తా తొలగించి ఆ స్థానంలో కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ను, ఓ కోచింగ్ సెంటర్‌ను స్థాపించాలనేదే ఆ ప్రతిపాదన. ప్రిన్సిపాల్ విశ్వనాధ్ (తనికెళ్ల భరణి) ఈ ప్రతిపాదననను వ్యతిరేకిస్తాడు. దాంతో ప్రిన్సిపాల్‌కు బోర్డు మెంబరుకు మధ్య వాగ్వివాదం…విద్యార్థుల సంపూర్ణమూర్తిమత్వ వికాసానికి ప్లేగ్రౌండ్ అత్యవసరం అని ప్రిన్సిపాల్ వాదిస్తాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి అసలు ఆటలే ఆడని విద్యార్థులకు ప్లేగ్రౌండ్ ఎందుకు అని ప్రశ్నిస్తాడు డైరక్టర్! చివరికి ప్లేగ్రౌండ్ అలాగే ఉండాలంటే ‘గోల్కొండ హైస్కూల్’ విద్యార్థులతో ఇంటర్‌స్కూల్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌ని సాధించమని సవాలు విసురుతాడు. ప్రిన్సిపాల్ ప్లేగ్రౌండ్‌ను కాపాడడం కోసం ఒకనాటి క్రికెట్ ఆటగాడు, పూర్వ విద్యార్థి అయిన సంపత్ (సుమంత్)ని కోచ్‌గా నియమిస్తాడు. అసలు ఆటలన్నా, గెలవడం అన్నా ఏమాత్రం ఆసక్తిలేని టీమ్ ఇప్పుడు సంపత్ పాలబడుతోంది. అప్పటివరకు కనీసం ఒక్క క్రికెట్ మ్యాచ్ ఐనా గెలిచిన రికార్డులేని ఆ టీమ్‌ని హీరో సంపత్ ఎలా ట్రెయిన్ చేసాడు? విద్యార్థులలో గెలవాలన్న కాంక్షను ఎలా ఇన్‌స్పైర్ చేశాడు? చివరికి గోల్కొండ హైస్కూల్ టీమ్ క్రికెట్ చాంపియన్ అయిందా? తమ స్కూల్ ప్లేగ్రౌండ్‌ను కాపాడుకోగలిగిందా? అనేది మిగతా ఆసక్తికరమైనకథ! ఫస్ట్ఫా అంతా స్కూల్…సరదాల…విద్యార్థుల కేర్‌నాట్ యాటిట్యూడ్స్…వాటినుంచి పుట్టిన కామెడీ సీన్లతో సినిమాని నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌కొచ్చేసరికి సీరియస్ టాస్క్‌ని సెన్సిటివ్‌గా సెన్సిబుల్‌గా హ్యాండిల్ చేసిన తీరు ప్రశంసనీయంగా ఉంటుంది. నవలలోని నడకకు తగినట్టుగానే స్క్రీన్‌ప్లేను అల్లుకున్న డైరక్టర్ క్లైమాక్స్‌లోని చివరి ఇరవై నిముషాల సినిమాని క్రికెట్ ఆటలోని ఎక్సైటింగ్ సీన్లను చొప్పించి థ్రిల్ కలిగించగలిగాడు. క్రికెట్ సబ్జెక్టుని, అందరూ బాలలని ఉపయోగించుకుని ఓ మంచి సినిమాను తీసిన క్రెడిట్‌కి అన్నివిధాలా అర్హమైన ప్రశంసకు పాత్రుడయ్యాడు ఇంద్రగంటి.

‘గోల్కొండ…’ సినిమా కథను..సినిమా క్రాఫ్ట్‌లలోని సాంకేతిక నిపుణులను నమ్ముకుని తీసిన సినిమా అని ఈ సినిమా ప్రతీ ఫ్రేమ్‌లో మనకు కనిపిస్తుంది…ఈ సినిమాలో క్రికెట్ కోచ్‌గా ప్రధాన కథానాయకుడిగా డిఫరెంట్ ఫ్రెంచ్ బెయిర్డ్‌తో కొత్తగా కనిపించిన సుమంత్, ఆ పాత్రలో తన కెరీర్‌లోనే బెస్ట్‌గా నటించాడని చెప్పాలి…సుబ్బరాజు, తనికెళ్లల నటన ప్రశంసించకుండా ఉండలేం…అయితే ఈ దర్శకుడి గత చిత్రం ‘అష్టాచెమ్మ’లో కథనంతా తన చుట్టూ తిప్పుకున్న ‘కలర్స్’ స్వాతి ఈ సినిమాలో అంత ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించడం ఒకింత ఆశ్చర్యమే! కాకపోతే స్వాతి నటించిన గత సినిమాలన్నింట్లో బబ్లీ అమ్మాయిలానే కనిపించేది…కానీ ఈ సినిమాలో మాత్రం డిఫరెంట్ స్టోరీలకు తగిన నిండుదనంతో హీరోయిన్ లుక్‌లో కనిపించింది. ఇక ఈ సినిమాలో నిజమైన హీరోలెవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా విద్యార్థులుగా నటించిన బాలనటులే అని చెప్పాలి. దివంగత దర్శకులు శోభన్ కుమారులు సంతోష్, సంగీత్‌లు గౌతమ్, కరుణ్‌లుగా, అలాగే మైకీగా ఫారుఖ్ నటించి మంచి మార్కులు కొట్టేసారు. సర్దార్జీ వికెట్ కీపర్‌గా లలిత్, శ్రీనివాస సాయిల నటన ఆకట్టుకుంటుంది.

ఇక సినిమాలోని మూడ్‌ని ఎలివేట్ చేసిన అంశాలలో కళ్యాణీమాలిక్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్…సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రఫీ..రవీందర్ ఆర్ట్ డైరక్షన్ పనితనం ప్రముఖంగా చెప్పుకోవాలి. సెంధిల్, రవీందర్ వంటి టెక్నీషియన్స్, ‘మగధీర’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలనే కాదు, ‘గోల్కొండ…’ వంటి లో బడ్జెట్ సినిమాలలో కూడా అద్భుతమైన ప్రతిభను కనబరచగలరని నిరూపించారు. ‘జాగోర్ జాగో’, ‘విత్తనం సరికొత్తగా మొలకెత్తుతున్న వైనం’ పాటలు క్యాచీగా, సీన్‌లోని ఉత్తేజాన్ని ప్రేక్షకులలో నింపేలాగా ఉండడం విశేషం.

మొత్తంమీద ‘గోల్కొండ హైస్కూల్’ సినిమా ఫ్రెష్ ఫీల్‌ని టాలీవుడ్‌లో కథా-నటనలపరంగా తీసుకువచ్చే దిశగా చేసిన మంచి ప్రయత్నంగా చెప్పాలి. కానీ ఈ సినిమా చూస్తున్నంత సేపూ, బాలీవుడ్‌లో గతంలో వచ్చిన స్పోర్ట్స్ జెనర్ సినిమాల కథలే గుర్తుకు వచ్చేలా ఉండడం ఈ సినిమాలోని ప్రధాన మైనస్..! సుమంత్ క్యారెక్టర్ అంతా చిన్నగడ్డంతో సహా చక్‌దే ఇండియా (2007)లోని షారుఖ్‌ను గుర్తు చేస్తుంది. క్రికెట్ నేపథ్యం లగాన్ (2001), ‘ప్లేగ్రౌండ్‌ను కాపాడుకోవడం కోసం ఆటలో గెలవడం’ అనే థీమ్ ‘సై’ (2004) సినిమాను, ‘్ధన్ ధనాధన్ గోల్’ (2007) సినిమాలను సగటు ప్రేక్షకుడికి సైతం స్ఫురణకు వచ్చేలా చేస్తాయి. ఏది ఏమైనా తెలుగు తెరపై క్లీన్, నీట్ ఎంటర్‌టైనర్‌గా ‘గోల్కొండ…’ మాత్రం ఫస్ట్‌క్లాస్‌లో పాసయింది.

తారాగణం:
సుమంత్, స్వాతి
సుబ్బరాజు, షఫీ
తనికెళ్ల భరణి, రవిప్రకాష్
సంతోష్, సంగీత్, ఫారుక్
సాయ శ్రీనివాస్, లలిత్
శ్రీరాజ్, హేమ తదితరులు.

కెమెరా: సెంథిల్‌కుమార్
సంగీతం: కళ్యాణి మాలిక్
నిర్మాణం: ఆర్ట్ బీట్ క్యాపిటల్
నిర్మాత: రామ్‌మోహన్ .పి
స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:
మోహనకృష్ణ ఇంద్రగంటి

కర్టేసీ: ఆంధ్రభూమి

–మామిడి హరికృష్ణ