Menu

హాస్యం సెంటిమెంట్ కలగలిపితే ఈవీవీ (స్మృత్యంజలి)

(ఈ.వి.వి.సత్యనారాయణ శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న ఈవీవీని ఈ నెల 19న అపోలో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స తీసుకుంటుండగానే ఆయన పరిస్థితి విషమించి నిన్నరాత్రి తుదిశ్వాస విడిచారు.)

ప్రపంచ సినిమాతో బేరీజు వేస్తే తెలుగు సినిమా కొన్ని జాన్రాలకు మాత్రమే పరిమితమైపోయిందన్న విమర్శ వుంది. అయితే మనకున్న జాన్రాలనే కలిపి కొత్త రుచిని సృష్టించవచ్చని నిరూపించిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. హాస్య చిత్రాల దర్శకుడిగానే ఎక్కువగా పేరుపడినప్పటికీ ఆయన తీసిన “ఆమె”, “తాళి”, “కన్యాదానం”, “అమ్మో ఒకటో తరీఖు” లాంటి చిత్రాలు ఈవీవీని మిగతా హాస్య చిత్ర దర్శకులకి విభిన్నంగా చూపిస్తాయి. హాస్యం సెంటిమెంట్ కలిపి కొడితే సూపర్ హిట్టు అనే ఫార్ములాని 1994లో కనిపెట్టి, తరువాత మరి కొన్ని చిత్రాలతో నిరూపించారు ఏవీవీ. అదే సమయంలో దాదాపు ఇదే ఫార్ములాతో ఎస్.వి. కృష్ణారెడ్డికూడా చిత్రాలు నిర్మించడంతో ఆ దశకం (1990-2000) తెలుగు సినిమాలకి ఒక కొత్త రూపాన్ని ఇచ్చింది.

1990లో “చెవిలోపువ్వు” సినిమా దర్శకుడిగా పరిచయమైన ఈవీవీ తరువాత తీసిన “ప్రేమ ఖైది”, “అప్పుల అప్పారావు”తో పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోయాడు. అప్పట్లో దాదాపు అందరు అగ్ర హీరోలతో విజయవంతమైన సినిమాలు తీసి సూపర్ డైరెక్టర్ అనిపించుకున్నారు. చిరంజీవితో “అల్లుడా మజాకా”, నాగార్జునతో “వారసుడు”, “హలో బ్రదర్”, “ఆవిడా మా ఆవిడే”, వెంకటేష్‌తో “అబ్బాయిగారు”, “ఇంట్లో ఇల్లాలు – వంటింట్లో ప్రియురాలు”, బాలకృష్ణతో “గొప్పింటి అల్లుడు” వంటి చిత్రాలు తీసారు. ఇక నవ్వుల రేడు రాజేంద్ర ప్రసాద్‌తో ఈవీవీ చిత్రాలు వాళ్ళిద్దరి కెరీర్‌లో వుత్తమ చిత్రాలుగా చెప్పవచ్చు. “చెవిలో పువ్వు”, “అప్పుల అప్పారావ్”, “ఆ ఒక్కటి అడక్కు”, “జంబలకిడిపంబ”, “ఆలీబాబా అరడజను దొంగలు” హాస్య ప్రియులందరికీ గుర్తుండిపోతాయి. పవన్ కల్యాణ్‌ని “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” ద్వారా తెలుగు తెరకి పరిచయం చేసింది కూడా ఈవీవీనే. ఆ తరువాత “సూర్య వంశ్” హిందీ చిత్రానికి అమితాబచ్చన్‌తో కూడా పనిచేశారు. ఈ మధ్యకాలంలో ఈవీవీ తన పిల్లల్ని హీరోలు చేసే ప్రయత్నంలో పేరు డబ్బు రెండూ పోగొట్టుకున్నారన్న విమర్శ వున్నా వారి కాంబినేషన్‌లో కూడా మంచి సినిమాలే వచ్చాయి.  “ఎవడి గోల వాడిది”, “కత్తి కాంతారావు” మొదలైన చిత్రాలతో పాటు ఇప్పుడు నిర్మాణంలో వున్న ఆయన ఆఖరి చిత్రం “బురిడి” కూడా అదే కోవకి వస్తుంది.

చాలా బాగుంది సినిమాతో నటుడిగా పాపులర్ అయిన ఎల్.బీ.శ్రీరాం, ఆ చిత్రంలో తన వూరిపేరు కోరుమామిడి అని చెప్తాడు. అదే కోరుమామిడిలో ఈవీవీ జన్మించారు. అందుకేనేమో ఈవీవీ సినిమాల్లో చాలా చోట్ల ఈ వూరి ప్రస్తావన వస్తుంది. తన స్వంత జిల్లా పశ్చిమ గోదావరి ప్రాంతంలో యాస, భాష ఆధారం చేసుకోని ఆయన పండించిన హాస్యం అందరికీ గుర్తుండిపోతుంది. అయితే ఆ హాశ్యంలో బూతు పాలు ఎక్కువే వుంటుందని విమర్శలూ లేకపోలేదు. అయితే ఇందాక చెప్పినట్టు కేవలం హాస్య చిత్రాలకే పరిమితం కాకుండా ఆయన తీసిన “ఆమె” (నంది అవార్డ్), “తాళి”, “కన్యాదానం”, “అమ్మో ఒకటో తారీఖు”, “మా ఆవిడమీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది” లాంటి సెంటిమెంట్ ప్రధానమైన చిత్రాలు తీసి విమర్శకుల మన్ననలను పొందారు.

ఈవీవీ సినిమా అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆయన పెట్టె టైటిల్స్ – “ఆ ఒక్కటి అడక్కు”, “జంబలకిడి పంబ”, “ఆలీబాబా అరడజను దొంగలు”, “మా ఆవిడమీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది”, “బెండు అప్పారావ్”, “కత్తి కాంతారావు” లాంటి చిత్రమైన పేర్లు పెట్టడం ఆయనకే చెల్లింది.

ఈవీవీ సినిమా అంటే (కొంత బూతు వున్నా) కాస్త నవ్వి కాస్త ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకోవచ్చని తెలుగువాళ్ళకి నమ్మకం. 50 సినిమాలైనా కాకుండానే, 50 యేళ్ళైనా రాకుండానే ఆయన సినిమాకి తరపడిపోయింది.

నవతరంగం ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తోంది.

7 Comments
  1. chakradhar January 22, 2011 /
  2. సుజాత January 22, 2011 /
  3. Dariya hussine sheik January 22, 2011 /
  4. srikanth January 22, 2011 /
  5. Nagarjuna G January 22, 2011 /