Menu

తెరకవిత ‘ధోభీఘాట్’

కొన్ని నగరాలు మనుషుల్లో భాగమైపోతాయి. కొందరు మనుషులు నగరంలో భాగమైపోతారు. ఆలోచనలూ, అభిప్రాయాలూ, బాధలూ, సుఖాలూ, ఆవేశాలూ, అనుభూతులూ అన్నీ ఆ నగరంతోనే, ఆ ప్రదేశాలతోనే నిర్వచింపబడతాయి. ఈ సినిమాలో ఆనగరం ముంబై. మనుషులు చాకలి ‘మున్నా’, ఆర్టిస్ట్ ‘అరుణ్’, ఫోటోగ్రఫర్/బ్యాంకర్ ‘షాయ్’, కొత్తగా నగరానికొచ్చిన ‘యాస్మిన్’. ఈ నలుగురికథల ముంబై డైరీ, ధోభీఘాట్. తెరపై రాసిన ఒక అందమైన కవిత్వం ధోభీఘాట్.

కొన్ని సినిమాలు చూశాక “సినిమాకు కావలసింది కథ, కథనం, మాటలు కాదు. సినిమా అనేది ప్రత్యేకమైన భాష. అదొక ఆడియో విజువల్ భాష. అంతే!” అనిపిస్తుంది. అలాంటి సినిమా ఇది. కొన్ని జీవితాల్ని చూస్తున్నట్టు, వాళ్ళ భావనల్ని చాలా దగ్గరగా మనం అనుభవిస్తున్నట్టు, ఒక voyeuristic yet artistic అనుభూతి కలిగించే సినిమా ఇది. ఇలాంటి సినిమాకు సమీక్షరాసి, బాగుంది – బాగలేదు, ఇదిబాగుంది – ఇది బాగలేదు, అని చెప్పడం నిజానికి వృధాప్రయాస. కానీ ‘మీరు సినిమాని ప్రేమిస్తే మాత్రం… చూడండి’ అని చెప్పడానికి ఈ కొంతా రాస్తున్నాను.

చిన్నప్పుడే బీహార్ అకలి జీవితాన్ని వదిలి బొంబాయిలో పొట్టపోషించుకోవడానికి చాకలి పనితోపాటూ నానాపనులూ చేస్తూ, సినిమా నటుడవ్వాలనుకునే మున్నా(ప్రతీక్ బబ్బర్). జీవితంలో ఏ దశ, దిశలో ఉన్నాడో తెలీని ఒక చిత్రకారుడు అరుణ్ (అమీర్ ఖాన్). అమెరికానుంచీ బ్రేక్ తీసుకుని, ఒక ఫోటోగ్రఫీ ప్రాజెక్టు మీద ముంబై కొచ్చిన  Investment banker షాయ్ (మోనికా డోగ్రా), ఉత్తరప్రదేశ్ లోని మారుమూల గ్రామం నుంచీ కొత్తగా పెళ్ళిచేసుకుని బొంబాయిలోకి అడుగుపెట్టిన యాస్మిన్ (కృతి మల్హోత్రా). వీళ్ళ జీవితాలు ఎలా ముడిపడ్డాయి?  ఎవరు ఎవరితో స్నేహం చేశారు? ఎవరు ఎవర్ని ప్రేమించారు? ఎవరు ఎవరి జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? ఎవరు అంతర్లీన ప్రేరణగా నిలిచారు? ముంబై నగరం అదృశ్యంగా, సదృశ్యంగా ఈ మనుషుల్ని తనలో ఎలా కలుపుకుంది? ఈ మనుషులు తమ ఆత్మల్ని ముంబై నగరంతో ఎలా మమేకం చేసుకున్నారు? అనేదే ఈ సినిమా.

ఈ సినిమా గురించి తెలిసినప్పటినుండీ అందరూ అమీర్ ఖాన్ సినిమా అనుకుంటున్నా, ఇది అమీర్ ఖాన్ నిర్మించిన చిత్రమే అయినా, భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించినా, ప్రధానపాత్రధారి మాత్రం ప్రతీక్ బబ్బర్ అనే చెప్పుకోవాలి. ఏన్నో ఛాయలు (అవేమిటో సినిమాలో చూడాల్సిందే) కలిగిన ఈ పాత్రని సహజనటనతో ప్రతీక్ రక్తికట్టించాడు. భవిష్యత్తులో ఒక గొప్పనటుడిగా రాణించే అవకాశం కనిపిస్తుంది. అమీర్ ఖాన్ పాత్రోచితంగా నటించాడు. యాస్మిన్ కు ఏమయ్యిందో తెలిసిన క్షణంలో అమీర్ చూపిన నటన ఒక్కదానికే ఉత్తమనటుడు అవార్డు ఇచ్చెయ్యొచ్చు. షాయ్ గా మోనిక అచ్చం ఆ పాత్రలాగానే ఉంది. తన అమెరికన్ యాక్సెంట్, క్షణాల్లో ప్రేమించెయ్యడం, సహజంగా స్నేహం చేసెయ్యడం, బంధాలపట్ల ఒకరకమైన తీవ్ర అనుబంధం ఇలా అన్ని భాగాలనూ (అక్కడక్కడా కొంత తడబడ్డా) జీవించిందనే చెప్పాలి. యాస్మిన్ గా చేసిన కృతి పాత్ర నిడివి, ప్రాధాన్యత, ప్రాముఖ్యతలన బట్టి సరిపోయింది.

కథాపరంగా మన అంచనాలు అక్కడక్కడా తప్పినా, మన predetermined minds నిరాశ చెందినా, ఈ సినిమా ఉద్దేశం ప్రేక్షకులకు వాళ్ళకు కావలసింది ఇవ్వడం కాదుగనక , ఫిల్మ్ మేకర్ తనుచెప్పాలనుకుంది, చూయించాలనుకున్నతరహాలో చూపించడం గనక సర్ధుకోక తప్పదు 🙂

ఈ సినిమాను ఒక visual feast చేసేది ‘తుషార్ రే’ సినెమాటోగ్రఫీ అయితే, మనసుల్లోకి ఒంపేలా చేసేది మాత్రం ‘గుస్టావ్ సాంతల్లోలా’ చేసిన నేపధ్య సంగీతం. ‘నిషాంత్’ కూర్పు, అత్యద్భుతమైన సౌండ్ ఎడిటింగ్/ డిజైనింగ్ ఈ సినిమాని సాంకతికరంగా ఒకమెట్టు పైన నిలిచేలా చేస్తాయి.

అమీర్ ఖాన్ భార్య అమీర్ ని పెట్టి సినిమా తీస్తోందంటే…Its an easy job అని ఎవరికైనా అనిపించుంటే, వాళ్ళకు చాలా బలమైన సమాధానం కిరణ్ రావ్ చెప్పిందనుకోవాలి. అమీర్ ఖాన్ ని పెట్టి తను ఎలాంటి సినిమా అయినా తీసుండొచ్చు, కానీ తను తియ్యాలనుకున్న సినిమా తీసింది. ప్రపంచ సినిమాస్థాయిని అందుకోగలిగిన సినిమా తీసింది. Hats- off to her…she is a filmmaker to look out for.

25 Comments
 1. Madhu January 21, 2011 /
 2. శారద January 22, 2011 /
 3. Sowmya January 22, 2011 /
 4. సుజాత January 22, 2011 /
 5. srikanth January 22, 2011 /
  • vijay kumar January 26, 2011 /
 6. Purnima January 23, 2011 /
 7. aditya January 25, 2011 /
 8. Sanjeev January 26, 2011 /
   • Sanjeev January 31, 2011 /
 9. holyman January 27, 2011 /
 10. chakri January 31, 2011 /
  • Sanjeev January 31, 2011 /
  • ఎవరైతే ఏంటి? January 31, 2011 /
 11. Sanjeev January 31, 2011 /
   • Sanjeev January 31, 2011 /
   • chakri January 31, 2011 /
   • Sanjeev February 1, 2011 /
 12. vinay March 11, 2011 /
 13. balaji April 9, 2011 /