Menu

చివరకు మిగిలేది (1960)

చివరకు మిగిలేది” అన్న పేరుతో ఒక సినిమా ఉంది అని వినగానే, అది బుచ్చిబాబు గారి నవల ఆధారంగా తీసింది అనుకున్నాను. దానితో పెద్ద ఆసక్తి కనబరచలేదు. కానీ, అది బెంగాలీ రచయిత అశుతోష్ ముఖర్జీ కథ ఆధారంగా తీసినదని తెలిసాక, అందులో సావిత్రి నటన గురించి విన్నాక, ఆ సినిమా చూడాలనిపించింది. సంవత్సరం క్రితం ఎప్పుడో పరుచూరి శ్రీనివాస్ గారు ఈ సినిమా డీవీడీ ఇచ్చారు కానీ, నేను అది హైదరాబాదులో మరచి బెంగళూరు వెళ్ళడంతో చూడలేకపోయాను. ఇన్నాళ్ళకి చూశాను! ఇలాంటి సీరియస్ కథాంతో వచ్చి కూడా నన్ను కట్టిపడేసి పాజ్ చేయకుండా, బ్రేకు తీసుకోకుండా చూసేలా చేసిన చిత్రాలు అరుదు!

కథ: ఒకానొక మానసిక వైద్యకేంద్రంలో కొంతమంది పేషంట్లను వారితో ప్రేమగా మెలగడం ద్వారా నయం చేయొచ్చు అని నమ్మిన కల్నల్ డాక్టర్ గారు ఉన్నారు (డాక్టర్ ప్రభాకర రెడ్డి తొలి చిత్రం ఇది!). ఆ ఆసుపత్రిలో ఒక నర్సు పద్మ (సావిత్రి). ఆవిడ ఈ పద్ధతి లో పేషంట్లను బాగుచేసేందుకు విదేశాల్లో శిక్షణ పొంది వచ్చి ఉంటుంది. ఒక పేషంటుతో ఇలా ప్రేమగా మెలుగుతూ, వారికి తన ప్రేమను పంచుతున్నట్లు అభినయించే ప్రయత్నంలో పద్మ నిజంగానే అతని ప్రేమలో పడుతుంది. అతనూ ఆవిడ్ని ఇష్టపడ్డా, వీళ్ళ చికిత్సా పద్ధతి ఇది అని తెల్సుకుని వెళ్ళిపోతాడు. తరువాత వచ్చిన మరో పేషంటుతో కూడా ఇలాంటి అనుభవమే ఔతుంది. అతను కూడా వెళ్ళిపోయాక, ఈ మానసిక వేదనలో – పద్మ జీవితం ఏమౌతుంది? చివరకి ఆమెకి మిగిలిందేమిటి? స్థూలంగా ఇదీ కథ.

నేనిలా చెప్పి, కథని చాలా నీరుగార్చాను. 🙁 నాకింతకంటే ఎలా చెప్పాలో తోచడంలేదు. ఇక్కడ కథ కంటే కూడా కథనం కట్టిపడేస్తుంది. సంభాషణలు, అందులోని భాషా నాకు విపరీతంగా నచ్చాయి. పిచ్చాసుపత్రి సీన్లలో – కాంతారావు, బాలయ్య, హరనాథ్ ముగ్గురూ బాగా చేశారు. ప్రభాకరరెడ్డి గారి డైలాగ్ డెలివరీ కాలక్రమంలో మారుతూ వచ్చినట్లు ఉంది. ఈ సినిమాలో మామూలుగా ఇతర సినిమాల్లో వినేలా లేదు అనిపించింది. అదంతా ఒక ఎత్తు – సావిత్రి గారు ఒక ఎత్తు. ఆవిడ స్క్రీన్ ప్రెసెన్స్ వల్లనే నన్ను అలా మెస్మరైజ్ చేసేసారు!! ముఖ్యంగా, క్రమంగా పద్మలో వచ్చే మార్పు – అద్భుతంగా చూపారు.

సాధారణంగా కథలు/నవల్లు సినిమాగా తీస్త్తే, మూలాలంత బాగోవు అంటూ ఉంటారు కదా. నాకసలు ఆ మూలకథ ఎలా ఉంటుందో తెలీదు కానీ, ఇంతకంటే బాగా దాన్ని అభినయించలేరేమో! సంగీతం కథనంలో మూడ్ కి బాగా నప్పింది. థీమ్ ట్రాక్ ఒకటే వెంటాడుతోంది చూసినప్పటి నుంచీ! కానీ, పాటలూ అవీ సినిమా కథాగమనానికి డిస్ట్రాక్షన్ అన్న అభిప్రాయం రోజు రోజుకీ ధృవపడుతోంది. ఆమాత్రానికి, సినిమాకి సంబంధం లేని కామెడీ ట్రాక్ నడపడానికి, ఈ పాటలకీ ఏం తేడా ఉందనీ! అన్నట్లు, టైటిల్స్ లో – ’నూతన గాయకి – సునంద’ అని చూసినట్లు గుర్తు. గాయని అని కదా రాస్తారు? ఏది కరెక్టు? అని సందేహం కలిగింది. అలాగే, ఇదే కథ, ఇదే కథనంతో ఇంకెవరన్నా నటించుంటే నాకు నచ్చేదా? అని సందేహం కలిగింది. సినిమా కూడా మెదడులాగే – ప్రత్యేకమైన పనులు చేసే వివిధ విభాగాల ఇంటర్ప్లే అన్న విషయం మరోసారి గుర్తొచ్చింది!

అయినా, ఆ డాక్టరు గారికి అదేం నమ్మకమో! నర్సులకి కూడా హృదయాలుంటాయని ఆ మాత్రం గ్రహించుకోలేడూ! సినిమా ఆఖరుకు వచ్చాక గ్రహించాడు మహానుభావుడు! x-(

ఏమైనా, ఇలాంటి కథను సినిమాగా తీయ సాహసించినందుకు నిర్మాత గారిని అభినందించాలసలు.
చాలా మట్టుకు నో-నాన్సెన్స్ అప్రోచ్ లో వెళ్ళిన దర్శకులకి కూడానూ! (అనవసరపు పాటలు ఉన్నాయ్ అనుకోండి!) ఈయన తీసిన వేరే సినిమాలేవో చూడాలి.

ఇంతకీ, సినిమా బాగా ఆడిందా?
మీగ్గానీ దొరికితే సావిత్రి కోసం తప్పకుండా చూడండీ సినిమా!
పరుచూరి గారికి ధన్యవాదాలు!!

సినిమా వివరాలు:
మంజీరా ఫిల్మ్స్ వారి :చివరకు మిగిలేది
నిర్మాత: వి.పురుషోత్తమ రెడ్డి
దర్శకుడు: జి. రామినీడు
కథ: అషుతోష్ ముఖర్జీ
మాటలు: అట్లూరి పిచ్చేశ్వరరావు, పర్యవేక్షణ: మల్లాది రామకృష్ణశాస్త్రి
పాటలు: మల్లాది, కొసరాజు, ఆరుద్ర
సంగీతం: అశ్వత్థామ

22 Comments
 1. శారద January 24, 2011 /
  • Manjula January 25, 2011 /
   • V. Chowdary Jampala January 25, 2011 /
   • Manjula January 25, 2011 /
  • kusuma January 29, 2011 /
   • L.Venugopal July 1, 2011 /
 2. geetha January 24, 2011 /
 3. తృష్ణ. January 24, 2011 /
 4. Sowmya January 24, 2011 /
 5. naresh nunna January 24, 2011 /
 6. chakri January 24, 2011 /
 7. Praveena January 24, 2011 /
 8. రమణ January 24, 2011 /
 9. chakri January 24, 2011 /
 10. vara January 24, 2011 /
 11. Sowmya January 24, 2011 /
 12. satish January 24, 2011 /
 13. satish January 24, 2011 /
 14. satish January 24, 2011 /
 15. V. Chowdary Jampala January 25, 2011 /
 16. holyman January 25, 2011 /