Menu

అనగనగా ఒక మంచు ఐరేంద్రి !

డుమల్లెలెత్తు రాకుమారి, ధీరుడైన ఒక యువకుడు,ఒక మాంత్రికుడు ఆవిడనెత్తుకుపోడం, లేదా  రాక్షసి ఆవిణ్ణి బంధించడం, మన యువకుడు అది దుష్ట శక్తి కాబట్టి దార్లో కనపడ్డ ఏ మునీశ్వరుడినో అడిగి ప్రాణాల రహస్యం తెలుసుకోవడం …వాణ్ణి చంపి ఆవిణ్ణి రక్షించడం,పెళ్ళాడ్డం! ఎన్ని వేల కథలు చదివుంటాం? ఇక్కడా అదే కథ! కాకపోతే ఎప్పుడో మరణించిన మాంత్రికురాలు ప్రేతాత్మగా తిరిగి అవతరించి ఊరిమీద పడ్డం కొంచెం కొత్త!

ఈ మధ్య సినిమాలెక్కువయ్యాయి కాబట్టి, ఈ సీజన్ కి ఇదే లాస్టు సినిమా.. అని చెప్పుకుని కనుమ రోజు ఐనాక్స్ లో అనగనగా ఒక ధీరుడు సినిమాకెళ్ళాము!

కన్నీటి    బిందువు ఆకారంలో ఉండే (శ్రీలంకేమో) ఉండే రాజ్యం మీద ఎప్పుడో , తన వంశస్థురాలి మెడలోనే ఉండే ఒక లాకెట్ లో  ప్రవేశించి గుప్తంగా ఉండిపోయిన ఒక ప్రేతాత్మ ఐరేంద్రి తిరిగి పునరుత్తేజం పొంది లేచి, రాజ్యం మీద పడుతుంది. తన వంశంలో ఆఖరిదైన ప్రియను బంధించి రోజుకో రక్తపు బొట్టు ఆమెనుంచి తీసుకుని ఏ రోజుకారోజు జీవం పొందుతుంటుంది. ఆమె తిరిగి జీవశక్తి పొందాలంటే మోక్ష అనే పసి పిల్లను చంపి ఆమె రక్తాన్ని, ప్రియ రక్తాన్ని కలిపి తీసుకోవాలి. మరో పక్క ఐరేంద్రి ని అంతం చేయాలన్నా మోక్షకే సాధ్యం!

రాజ్యంలో ఐరేంద్రి అనుచరులైన సర్పాల బారిన పడి అచేతనంగా పడిపోయిన పిల్లలను రక్షించడానికి మోక్షను తీసుకుని అంధుడైన ఒక వీర యువకుడు ఆ రాజ్యానికొస్తాడు.

ప్రియకూ ఆ యువకుడికీ ఉన్న బంధం ఏమిటో,ఐరేంద్రి అసలు మళ్ళీ ఎలా పునరుజ్జీవం పొందిందో,మోక్ష ఐరేంద్రిని చంపగలిగిందా లేదా, వీరుడికి కళ్ళెలా పోయాయో, ఇవన్నీ తెరమీద చూడ్డమే మిగిలిన కథ!

నిస్సందేహంగా ఈ సినిమాలో నటనకు కొద్దిగా అవకాశం ఉంది ఐరేంద్రి పాత్ర వేసిన మంచు లక్ష్మికే! పెద్దగా అందచందాలు డిమాండ్ చేసే పాత్ర కాదు కాబట్టి మరింత బాగా రాణించింది ఈ పాత్రలో మంచమ్మాయి!(మంచు+అమ్మాయి)! ఆమెకు వేసిన మేకప్, మొహంలో ఆ కౄరత్వం,  ఇవన్నీ బాగా పండాయనే చెప్పాలి. అసలే విలక్షణమైన తెలుగు మాట్లాడుతుందాయె! డబ్బింగ్ ఆవిడే చెప్తుందంటే భయం వేసింది కానీ జీ టాక్ షో లోని “అసలు తెలుగుని” కాస్త నివారించి పాత్రకు తగ్గట్టు బాగానే చెప్పింది. అక్కడక్కడా “వివ్ రించి  షెప్పు”(వివరించి చెప్పు )  ” కొండ్లూ, కోన్లూ(కొండలూ కోనలూ) అడువులూ తిర్గి ఖనిపెట్ట్ ండి” వంటి మాటలు మాత్రం తప్పించుకోలేం! కానీ అంతకంటే ఘోరంగా ఊహించుకుంటాం కాబట్టి రిలీఫ్ గానే ఉంది డబ్బింగ్! దీన్ని బట్టి అర్థమైందేమిటంటే ప్రయత్నిస్తే ఆ కృతకమైన భాషను వదిలించుకోగలదని!:-))

సినిమా మొత్తం మీద మార్కులెక్కువ పడేది లక్ష్మీ ప్రసన్నకే!

ఆమె చీటికీ మాటికీ చేసే వికటాట్టహాసాలు తెలుగు టీవీ ప్రేక్షకులకు అలవాటే కాబట్టి సినిమాలో వాటిని బాగానే ఎంజాయ్ చేశారు..పైగా పాత్రకి అవసరం కూడా కదా!

సిద్దార్థ పాత్ర చాలా లైట్ గా ఉంది. కోరమీసం లేనివాడిని తెలుగు ప్రేక్షకులు “ధీరుడిగా” ఎలా అంగీకరిస్తారసలు? అది పెద్ద లోపం! కొన్ని ఫైట్లు మినహా అతడి ధీరత్వాన్ని నిరూపించే దృశ్యాలేమీ ఉండవు.పైగా ఎప్పుడెప్పుడు సారా తాగుదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. పోనీ అలాగని చిలిదనం ఉందాంటే అదీ లేదు.ధీరుడి పాత్రకు అల్లు అర్జున్ అయితే కొంచెం రొమాంటిక్ గా ఉండేదనిపించింది నాకు.(అందం సంగతి పక్కన పెట్టండి)

ఇక శృతి హాసన్ ఒక గాజు బొమ్మలా ఉంది! ఈ హీరోయిన్ల డైటింగ్ లేమో కానీ మరీ శవాకారాలు దాలుస్తున్నారు. మొహంలో కళా కాంతీ లేవు. గట్టిగా పట్టుకుంటే ఎముకలు విరిగి ఢామ్మని కిందపడుతుందేమో అన్నంత బలహీనంగా పాలిపోయి ఉంది. కొన్ని సార్లైతే ఆమె ధరించిన బరువైన దుస్తుల్ని కూడా మోయలేదేమో అన్నంతగా వంగిపోయింది(మోడల్ ఆ అయితే బాగా రాణిస్తుందేమో) మేకప్ కూడా అంతంత మాత్రంగా చేశారు. కళ్ళ నిండా కాటుక పెట్టి ఉంటే కాస్త బావుండేదనిపించింది. ఇంత లేత మొగ్గకి సునీత డబ్బింగ్ సరిగ్గా అమరలేదు. చిన్మయి చేతో సౌమ్య చేతో చెప్పిస్తే బాగుండేది. సునీత కమలిని లెవెల్లో హావభావాలు గొంతులో పలికించడం, శృతి నటనకు మాచ్ కాలేదు.

మొత్తం సినిమా లో గ్రాఫిక్స్ దాదాపు గంటంబావు సేపు ఉన్నాయి. గ్రాఫిక్స్  చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి నిజంగా! క్లైమాక్స్ లో ఐరేంద్రి మహా సర్పంగా మారే దృశ్యాలు చూపు తిప్పుకోనివ్వవు. (మహా సర్పానికి ఐరేంద్రి మొహం ఉంచితే బాగుండేది కానీ సర్పం మొహమే ఉంచేశారు) అలాగే ఐరేంద్రి నీటి కొలనులో దిగినప్పుడల్లా ఆమె కేశాలు సర్పిణి రూపం దాల్చి మాట్లాడ్డం,అలల్లా చుట్లు తిరుగుతూ సర్పాల్లా మెలితిరగడం..ఇవన్నీ చాలా బాగా నచ్చాయి నాకు!

అంతటి మహాసర్పంతో జరిగిన భీకర పోరాటంలో, (అదీ మంత్ర గత్తెతో )హీరో కి పెద్దగా దెబ్బలు తగలకపోగా చివరికి అతడు కొట్టిన ఒకే దెబ్బతో మంత్రగత్తె ఠప్పున నేలకూల్తుంది. తన మంత్రాలేవీ ప్రయోగించదు. హీరో హీరోయిన్లకు కుటుంబాలున్నాయో లేవో చూపించరు. గాలికి తిరుగుతుంటారు.  అలాగే కన్నీటి బిందువు ఆకారంలో ఉన్న రాజ్యాన్ని ఐరేంద్రి స్వాధీనపరుచుకుంటే ఆ రాజ్యం తాలూకు రాజు , మంత్రి ఏమయ్యారో చూపిస్తే బాగుండేది.  ఇలాంటి చిన్న చిన్న లోపాలు తప్పించి ప్రకాష్ దర్శకత్వం బాగానే ఉంది

సినిమాలో హాస్యం కోసం చూడకూడదు. ఒక్క సీను బ్రహ్మానందంతో పెట్టి దాన్ని కాస్తా  అపహాస్యం చేసేశారు.  పాటలు బాగానే ఉన్నాయి. ఒకపాట లో హర్మోనియం వాడటం నాకు బాగా నచ్చింది.

మొత్తం మీద సినిమా బావుంది. పిల్లలు మరీ బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లల సినిమాలు ఎంజాయ్ చేసే పెద్దాళ్ళు కూడా!
పైసా వసూల్ అనే అనిపించింది
భయపడకుండా హాయిగా చూసి రావొచ్చు  .

–సుజాత (మనసులో మాట)

29 Comments
 1. srikanth January 17, 2011 / Reply
 2. Mauli January 18, 2011 / Reply
 3. పారదర్శి January 18, 2011 / Reply
  • అబ్రకదబ్ర January 18, 2011 / Reply
 4. సుజాత January 18, 2011 / Reply
 5. అబ్రకదబ్ర January 18, 2011 / Reply
 6. సుజాత January 18, 2011 / Reply
  • అబ్రకదబ్ర January 18, 2011 / Reply
 7. Sujata January 18, 2011 / Reply
  • Sanjeev January 18, 2011 / Reply
 8. Krshany January 18, 2011 / Reply
 9. సివ.కె January 18, 2011 / Reply
 10. SKJ January 18, 2011 / Reply
 11. holyman January 18, 2011 / Reply
 12. Abhishek Rangaraju January 19, 2011 / Reply
 13. Seenu January 19, 2011 / Reply
 14. సుజాత January 19, 2011 / Reply
  • Sanjeev January 21, 2011 / Reply
  • holyman January 21, 2011 / Reply
 15. కుసుమ January 20, 2011 / Reply
 16. shankar Gongati January 21, 2011 / Reply
  • kusuma January 21, 2011 / Reply
   • shankar Gongati January 22, 2011 /
 17. Ram January 21, 2011 / Reply
 18. Tanjavur Rohan January 21, 2011 / Reply
 19. chinnari January 21, 2011 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *