Menu

10 సినిమాల… ఎందుకు? ఏమిటి? ఎలా?

హజంగా ఎవరినన్నా అడిగితే తమ ఇంటర్మీడియేట్, డిగ్రీ ఆ సమయాల్లో ఎక్కువ సినిమాలు చూశామని చెపుతారు. క్లా౨సులెగ్గొట్టి సినిమాలకూ, షికార్లకూ వెళ్ళటం గొప్ప థ్రిల్. కొన్నాళ్ళు ఒక పనిని విపరీతంగా చెయ్యటం, ఆ తరువాత విసుగెత్తిపోవటం అన్నది అందరిలోనూ సహజమైన ప్రక్రియే. చిన్నతనం నుండీ, నాకు బాగా ఇంటరెస్టైనవి, సైన్స్, స్పోర్ట్స్, సినిమా. పైన చెప్పినట్టు ఇంటర్మీడియేటో, అలా కొన్నాళ్ళో కాక, జీవితాంతం నాకు నచ్చేవిషయాలవి. ఎన్ని సినిమాలు చూసినా, ఎన్ని గంటలు ఆటలు చూసినా, రోజంతా సైన్సులో మునిగి తేలినా లేశ మాత్రం కూడా విసుగనిపించదు. సంవత్సరానికి మహా అయితే పాతికో, ముప్పైయ్యో సినిమాలు చూసే నాకు నవతరంగంలోకి అడుగు పెట్టక మునుపు సినిమాల గురించి పెద్ద అవగాహన లేదు. సినిమాలంటే ఎక్కువగా చూసే తెలుగు సినిమాలు, రజనీ కాంత్ అరవ డబ్బింగు సినిమాలు, అప్పుడప్పుడూ చూసే హిందీ సినిమాలు. అంతే!

చిత్రంగా ఈ సంవత్సరం నేను దాదాపూ రెండొందల పైన సినిమాలు చూశాను. వాటిలో సింహభాగం కొరియన్ సినిమాలు కాగా, ఇతరదేశాల సినిమాలు కూడా ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఎన్‌సెంబుల్ వ్యూయింగ్ అన్నమాట. అలా అన్ని సినిమాలు చూశాక వాటిలో ఏది బాగా నచ్చిందనే ప్రశ్న వచ్చింది. కొన్ని సినిమాల్ని అక్కడక్కడా స్కిప్ చేస్తూ చూశాను. మరి కొన్నిటిలో కొన్ని సీన్లను రిపీట్ చేస్తూ చూశాను. ఇంకొన్నిటిని మాత్రం సినిమా మొత్తాన్నే రిపీట్ చేశాను. కొన్నిటిని బా౨క్‌గ్రౌండ్ స్కోర్ కోసమని చూస్తే, మరి కొన్నిటిని వాటిలో ఉన్న వయొలెన్స్ కోసమని రిపీటెడ్ గా చూడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని కొద్దిగా వివరించాల్సి వస్తుంది. కొన్నిటిలో ఆ వయొలెన్స్ స్టైలిష్ గా ఉండి సరదాగా చూడాలనిపిస్తే కొన్నిటిలో మాత్రం కడుపులో దేవేసి, తప్పని సరి పరిస్థితుల్లో ఆ కాసేపటికి వదిలేసి, మళ్ళా చూడాల్సి వచ్చింది. ఎడిటింగ్ ను పరిశీలించటానికి కొన్నీ, ఆల్రెడీ వాటిలోని టెక్నికల్ అంశాల గురించి చదివీ, వినీ, అవగాహనేమన్నా అవుతాయేమో అని కొన్నీ, క్లా౨సిక్స్ గా ముద్ర పడితే వాటిని ఎందుకలా ముద్ర వేశారా అని కొన్నీ, చెత్త అని ఒక మూల పడేసిన వాటిని ఎందుకలా మూల పడేశారా అని మరికొన్నిటినీ, ఫలానా సినిమా మరోదానికి కాపీ అంటే ముందా ఒరిజినలునూ, ఆపైన ఒరిజినకలునూ, వాతిలో ఉన్న సామ్యాలనూ, భేదాలనూ, ఆర్టిస్టిక్ విలువలనూ అంచనా వేసే దుస్సాహసం చేస్తూ, అలా చూసితిని ఎన్నో చిత్ర రాజములు. చెప్పాలంటే భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పిన చదివితి… చదువులలో మర్మము పద్యంలో లాగా.

ఇలా ఇన్ని సినిమాలు చూసినందు వల్ల చూసిన వాటిలో ఏవి గొప్పవి అన్న ప్రశ్న వచ్చింది. చాలా వరకూ దేనికదే గొప్ప సినిమా అనిపించింది. కానీ కొన్ని మటుకూ నన్నలా వెంటాడి వేటాడుతూనే ఉన్నాయి. నా సినిమా చూచుటలో ఒక లాం౨డ్ మార్కల్లే నిల్చిపోయిన ఆ కొన్నిటి పరిచయమే ఇక్కడ.

10. సిటీ లైట్స్ (చార్లీ చాప్లిన్)

ఎందుకు?

చార్లీ చాప్లినంటే చిన్నప్పుడు టీవీలో వేసే హాస్య సిరీసుల్లో ఆసెగాడు అన్న భ్రమలలో ఉన్న రోజుల్నుంచీ ఒక రకమైన ఆసక్తి. మనా, పరా అన్న తేడా లేకుండా చాలా మంది పెద్ద (అనుకున్న) ఆ౨క్టర్లు చాప్లిన్ వేషం కట్టటం వల్ల అతనో గొప్ప మనిషి అన్న భావనా ఉండేది. అయినా చాప్లిన్ సినిమాలెక్కువ నాకు దొరకలేదు. దొరికిన ఒకటీ అరా పెద్ద చెప్పుకోదగ్గవి కాదు. మేధావులంతా కోడై కూసిన గొప్ప సినిమా ద గ్రేట్ డిక్టేటర్ చూద్దామని ప్రయత్నించినా పూర్తిగా చూడలేక పోయాను. ద కిడ్ మాత్రం బాగా నచ్చింది. మొత్తానికీ ఈ మధ్య నా ప్రపంచం కాస్త విశాలమవ్వటంతో చాప్లిన్ సినిమాల సెట్ దొరికింది. హ! దొరికా౨వయ్యా అనుకుంటూ అన్నిటినీ లాగించాను.

ఏమిటి?

ఒక ప్రేమ కథ. ఎప్పటి లాగే మన ట్రాం౨ప్ గారికి ఒక గుడ్డి పిల్ల తగలటం, ఆపిల్ల పైన ప్రేమా, ఒక స్నేహితుడూ, అతని త్రాగుడూ, ఇలా చిందరవందరగా చెప్పుకోవచ్చు. ఒక త్రాగుమోతుని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడిన మన ట్రాం౨ప్, అతనికి ఆప్త మిత్రుడిగా మారటం, అతని వల్లే ఆ గుడ్డి పిల్ల కష్టాలను తీర్చే డబ్బు పొందటం (అతను నిషాలో ఉన్నప్పుడే), చివరకు ఆ నిషా దిగిన ఆ త్రాగుమోతు మిలియనీయెర్ చాప్లిన్ని అరెస్టు చేయించటం, బయటకొచ్చాక ఆ పిల్ల కోసమని వెదుకుతూ ఆ౨క్సిడెంటల్‌గా ఆ పిల్ల కళ్ళు బాగయ్యాక పెట్టుకున్న పూల షాపు దగ్గరకు రావటం, చిన్న ఇన్సిడెంటు తర్వాత ఆ పిల్ల అతన్ని గుర్తు పట్టటం… ఇదన్నమాట అందరికీ తెలిసిన కథ. ఆ త్రాగుమోతుతో చాప్లిన్ స్నేహంలో గొప్ప ఐరనీ కనిపిస్తుంది. అలాగే, స్వచ్ఛమైన ప్రేమ, మనసుబంధాలూ, సున్నితమైన హాస్యం. గొప్ప విజువల్ ఫీస్ట్. మాటలు నేర్చిన పసిపిల్ల సినిమా చేత మాటల్లేకుండా ఉంచగలిగీ విజయం సాధించటమన్నది గొప్పన్నర విషయం. ఏ ఇతర సినిమాలూ కాదు. అసలు చాప్లినంటే నటనా వైదుష్యం తెలుసుకోవాలంటే చూడాల్సిన సినిమా ఇది. హార్ట్ టచింగ్ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే చూడాల్సిన సినిమా ఇది. హృదయాన్నలా చక్కిలిగింతలు పెడుతుంది.

ఎలా?

డెల్లీ ప్రయాణంలో బోరుకొట్టకుండా నా మొబైల్లో చూసిన నాలుగు సినిమాల్లో ఇదొకటి. ఎవరి రికమెండేషనూ లేకుండా నా అంతట నేను వెతుక్కుని మరీ చూసిన సినిమా కూడా. మనసునెక్కడో మీటా౨డీ సినిమాతో చాప్లిన్ (అంత చిన్న స్క్రీన్ మీద చూసినా ఎక్కడా అలాంటి భావమే రాకుండా లకథలో లీనమయ్యేలా చేసిన చాప్లిన్ కు ఎన్ని వేల సార్లు నమస్కారాలు చేయాలో నాకిప్పటికీ లెక్క తేలటం లేదు. ఇన్ఫినిటీ అంటే ఎంత అని ఎవరన్నా నన్ను అడిగితే చాప్లిన్ నటనంత అని ఢంకా బజాయించి చెప్తానేమో 🙂 )

9. రషోమన్ (అకీరా కురసోవా, తోషిరో మిఫునె)

ఎందుకు?

సౌమ్య తన బ్లాగులో వ్రాసుకున్న పాత టపాలను తిరగేస్తున్నప్పుడు ఆసక్తికరంగా వ్రాసిన విధానం వల్ల కురసావా మీద అంతకు ముందున్న క్యూరియాసిటీ బాగా పెరిగి, వెరతుక్కుని మరీ చూసిన సినిమా ఇది. కురసావా సినిమాల్నిచ్చింది నాకు మహేష్. మొదట చూసింది సెవెన్ సమురాయ్. కొత్త పాళీ గారి లెజెండరీ టపాల వల్ల ఈ సినిమాని అమిత ఆసక్తిగా, అన్ని అంశాలనూ పరిశీలుస్తూ మరీ చూశాను. ఆపైన చూడాలనుకుంది యోజింబో. మహేష్ ఇచ్చిన వాటిలో అది లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకలేదది. అసలు యోజింబో మీద అంత ఆసక్తి కలుగటానికి కారణం… ఇది పోకిరికి మూలమని ఎవరో అనటం వల్ల. ప్లస్ ఆ తరువాత సౌమ్య వ్రాసిన టపాల వల్ల కలిగిన ఆసక్తి. ఎట్టకేలకు నాకు పరిచయమైన పెద్ద ప్రపంచం వల్ల కురసావా కలెక్షనంతా దొరకగానే దాన్ని చూసినా మనసులో నిలిచిపోయింది మాత్రం రషోమన్!

ఏమిటి?

థియరీ ఆఫ్ రిలేటివిటీని, సినిమాటిగ్గా చెప్పాలంటే ఈ సినిమాని చూపొచ్చు. నిజమన్నది ఎవరికి వారికి ఎలా మారుతుందో, ఒక సంఘటనని గురించి చెప్పటంలో ఒక్కొక్కరి వైనమెలా ఉంటుందో, అసలు జరిగిన సంఘటనలను తమ తమ అవసరాల్ని బట్టీ, అవకాశాలను బట్టీ ఎలా మారుస్తారో, అలా మార్చటంలో వారి మాసనసిక శారీరక అంత:చేతనావస్థలు ఎలాంటి పాత్రను పోషిస్తాయో ఈ సినిమా ప్రధానాంశం.

ఒక బందిపోటు తనకెదురైన సమురాయ్ ని మోసబుచ్చి అతని భార్యను మాన భంగం చేయటం, ఆపైన ఆ సమురాయ్ హతుడవటం, దానికి నలుగురు ప్రత్యక్ష సాక్షులుండటం, అందులో ముగ్గురు ఆ సంఘటనలో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కావటం, వారి వారి వెర్షన్లు మనకు తెలియటం, సంఘటనలో ఏ ప్రమేయముండక పోయినా దగ్గరగా చూసిన ఒక గొర్ల కాపరి చెప్పిన వెర్షన్ నిజం కావటం… ఆగండాగండి. అది నిజం, ఇది నిజం అని ఎక్కడా కురసావచించడు. మనిషి యొక్క బేసిక్ మెంటాలిటీని చూపెట్టి, చివరకు ఎవరెలాంటి వారో మననే తెలుసుకోమని ఆపైన మననే డిసైడ్ చేసుకునేలా చేస్తాడు. బ్లా౨కండ్ వైట్లో ఉన్న ఈ సినిమాకి కురసావా ఆత్మైతే, సినిమాటోగ్రఫీ హాం౨డిల్జేసిన కజువో మియగవ, మ్యూజిక్కిచ్చిన ఫుమియో హయసక శరీరం లాంటి వారు. మిఫునె నటన గుండె కాయ, మిగిలిన వారు కళ్ళూ, చెవులూనూ. సమురాయ్ ర్యగా నటంచినామె అద్తమైన  హావావాలను ప్రదర్శించింది. ఆమె నటనలో మూడు ఆ౨స్పెక్‍ట్స్ ను మనం గమనించాలి(స్తాము). ఫ్లాష్‌బా౨క్ లో ఒక సమురాయ్ భార్యగా ఉన్నప్పుడు, రేప్‌కు గురయ్యి భర్త మరణం తరువాత తన వెర్షన్ను చెపుతున్నప్పుడు, ఆపైన భర్త చనిపోయి ఉన్నాడు కనుక అతని ఆత్మ వేరొకరిని ఆవహించి తన వెర్షన్ను చెప్పే సందర్భంలో ఆమె చూపిన వేరియేషన్స్ అన్నీ, నటన అంటే ఆసక్తి ఉన్న ఎవరైనా సరే పరిశీలించి తీరాల్సిందే.

యోజింబో, సెవన్ సమురాయ్, సంజురో, దీన్లో మిఫునె నటనను పరిశీలించి చూస్తే… హ్హ! చెప్పటం కాదు. అనుభవించి చూడాల్సిందే ఆతని వైదుష్యం

ఎలా?

చక్కగా హై స్టీరియో హోమ్ థియేటర్ ఉన్న కంప్యూటర్లో, వెంకట్ అనువదించిన దీనికి సంబంధించిన షార్ట్ స్టోరీని దగ్గర పెట్టుకుని మరీ… (అలా చూస్తేనే ఈ సినిమా లోకంలో మునిగి తేలేది)

8. ఐమె సైబోర్గ్, బట్ దట్సోకే (పార్క్ చాన్-వుక్, ఇమ్ సు-జియొంగ్)

ఎందుకు?

వెన్జెన్స్ ట్రైలజీ ద్వారా పరిచయమైన పార్క్ చాన్-వుక్ ఇతర సినిమాల కోసమని అన్వేషిస్తుంటే దొరికిందిది. ఒక పిచ్చి ప్రేమ కథ. అదే స్పెషల్. విపరీతమైన వయొలెన్స్ తో నన్ను ఫుట్బాలాడిన పార్క్ తీసిన రొమాంటిక్కామిడీ కావటం వల్ల మరింత క్యూరియాసిటీ పెరిగింది చూడాలని. వెతక్కుండానే దొరికింది. ఒక కొరియన్ మిత్రుడి వల్ల. సినిమా ఒక సర్రియలిస్టిక్ మాస్టర్‌పీస్. పిచి వాళ్ళ లోకమెలా ఉంటుందో, అత్యంత సహజంగా, పిచ్చిగా (అదే అసలు సహజం 😉 ), ఆసక్తికరంగా చూపటమన్నది ఈ సినిమాలో చూడొచ్చు. పార్క్ పాత సినిమాలను బట్టీ చాలా మందికి నచ్చకపోవచ్చు, అలాగే కథాంశం కాస్త కన్ఫ్యూజింగా ఉంటం వల్ల కూడా చూడాలని మనస్కరించకపోవచ్చు కానీ, ఒక ఆల్టర్నేటివ్ రొమాంటిక్కామెడీని చూడాలంటే మటుకూ తప్పక చూడదగ్గ పిచ్చి గొప్ప సినిమా.

ఏమిటి?

తనను తాను ఒక సైబోర్గనుకునే ఒకమ్మాయికి తనను చేర్చిన మెంటల్ ఇన్‌స్టిట్యూట్లో ఇతరుల ఆత్మలనూ, వారి వారి (ప్రత్యేకమైన) లక్షణాలనూ దొంగిలించ గలను అనుకునే మరో వ్యక్తి తగులుతాడు. వారి స్నేహమెలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అన్నదే ఈ సినిమా కథాంశం. పిచ్చి వాళ్ళకూ, మామూలు వారికీ మధ్యన ఉన్న ఒక సన్నని విభజన రేఖను బాగా పట్టుకుని, ఎక్కడా శృతి మించకుండా సహజత్వానికి లోటు లేకుండా పార్క్ తెరకెక్కించిన విధానం, పిచ్చి వాళ్ళనే పేరుతో ఎబ్సర్డుగా మన వారు చేసే విన్యాసాలకు చెంప పెట్టు లాంటిది. (మన దగ్గరా కొన్ని ఎక్సెప్షన్లున్నాయనుకోండి). ఇమ్ సు నటనా, పార్క్ దర్శకత్వపు ప్రతిభా సినిమాకు గొప్ప బలాన్నిచ్చాయి.

ఎలా?

డీవీడీ, నెట్బుక్ (సినిమా చూడాలనే ఆసక్తి ఉండాలి. వీలైనంతలో ఒంటరిగా ఉండాలి. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. అప్పుడే మనం పార్ చాన్-వుక్ సృష్టించిన లోకంలో లీనమవగలిగేది. ఇదరు మెంటల్ పేషంట్స్ మధ్య ప్రేమ కథనింత గొప్పగా ఎలా హాం౨డిల్ చేయగలిగాడా అని ఆశ్చర్యం కలుగక మానదు. ఒక చిన్న హెచ్చరిక… సినిమా మొదటి ఆరు నిమిషాలూ నచ్చకపోతే చూడకపోవటమే మంచిది)

7. షాడోసాఫ్ ఫర్‌గాటెన్ ఆ౨న్సెస్టర్స్ (సెర్జీయ్ పరజనొవ్, ఇవాన్ మికొలాయ్‌చుక్)

ఎందుకు?

నవతరంగంలోనే ఈ సినిమా దర్శకుని (పరజనొవ్) పరిచయం. ఫోకస్ విభాగంలో తెలుసుకున్న దర్శకవరేణ్యుడు. చదువుతుంటేనే అమితాసక్తికరమైన వ్యక్తనిపించి, నా రీసెర్చింగ్ లో పరజనొవ్ సినిమాలు చూడాల్సిందే అనిపించి చూశాను. ఈపైన చెప్పిన సినిమాని మహేష్ ఇస్తే, ఇతర సినిమాల్ని నేనే సంపాదించి చూశాను. రంగులను ఉపయోగించి కథా కథనాలనాలలో గాఢతను ఎలా తీసుకు రావచ్చు అన్నది ఇతనిని చూసి నేర్చుకోవచ్చు. ఈ సినిమాలో ఉక్రేనియెన్ హుత్సుల్  సంస్కృతీ సంప్రదాయాల్నీ, వారిలో వారికున్న వైరాల్నీ, అనుబంధాలనీ, వారుండే ప్రదేశాల్లోని వాతావరణ పరిస్థితులనూ గొప్పగా చూపిస్తాడు. చూసిన ఇతని మూడు సినిమాల్లో నాకు అమితంగా నచ్చిందిదే.

ఏమిటి?

ఇవాన్ అనే వ్యక్తి జీవితాన్ని ఈ సినిమా పరిశీలిస్తుంది. తన తండ్రిని చంపిన వ్యక్తి కూతురునే అతను ప్రేమించటం, ఆమెను పెళ్ళాడి, సంసారం పెట్టేందుకవసరమైన డబ్బును సంపాదించుకునేందుకు వెళ్ళి వచ్చేలోగా ఆ౨క్సిడెంటల్ గా ఆ అమ్మాయి మరణించటం, అతను విషాదంలో మునిగి పోవటం, క్రమంగా వేరొక స్త్రీని వివాహం చేసుకోవటం, తన ప్రేయసి ఙ్ఞాపకాలను మరచిపోలేక ఇబ్బంది పడటం. తననే విధంగానూ పట్టించుకోని భర్తకు దూరమయ్యి ఒక మంత్ర గాడి మాయాజాలంలో భార్య పడటం… ఇలా సాగుతుంది కథ. సినిమా అంతా విషాద భరితంగా ఉండి నా మూడ్ కు సూట్ కాకపోయినా ఓపిక చేసుకుని చూశాను. ఏ క్లా౨సిక్. రైట్!

ఎలా?

డీవీడీ, కంప్యూటర్ (వంటరిగా చూడటమే బెటర్. ఏ డిస్టర్బెన్సెస్ లఏకుండా. లేదా సినిమాల పరిశీలనాసక్తి ఉన్న వారి కంపనీ అయితే మరీ మంచిది)

6. రోబో(శంకర్, రజనీ కాంత్)

ఎందుకు?

క్రొత్తదో, పాతదో ఈ సంవత్సరం చూసిన సినిమాల్ని లెక్కేసుకుంటే రోబో కూడా నాకు బాగా నచ్చిన వాటిలో చేరుతుంది. ఎంత కాలంగానో ఎదురుజూసిన శంకర్, రజనీ కాంబినేషన్లోని ఈ సినిమా నన్నెక్కడా డిజప్పాయింట్ చెయ్యలేదు. స్వదేశంలోనూ, విదేశంలోనూ చూసిన అరవ తెలుగు సినిమా ఇది.

ఏమిటి, ఎలా? ఈమధ్యవే కనుక ప్రత్యేక పరిచయమక్కర్లేదనుకుంటాను?

5. …ఇంగ్ (…Ing) (లీ ఇయోన్-హీ, ఇమ్ సు-జియొంగ్)

ఎందుకు?

ఈసినిమా నాకు పరిచయమైంది సృజన ద్వారా. సింపుల్ రొమాంటిక్ టేల్. హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది కథా, కథనం. మెలోడ్రామాకవకాశమున్నా దర్శకురాలెక్కడా శృతి మించకుండా, కళ్ళు చమర్చాయే 🙂 అనిపించే రీతిలో, అబ్బ, ఎంత బాగుందీ సన్నివేశం! అనిపించే రీతిలో నడిపిస్తుంది. పెద్ద ఆసక్తి లేకుండా మొదటి సారి చూసినా క్రమంగా ఇందులోని హార్ట్‌వామింగ్ సన్నివేశాలకు ఎడిక్టయిపోయాను.

ఏమిటి?

కధ విషయానికొస్తే ఇది మిన్-ఆ అనే అమ్మాయి కధ. ఎన్ని రోజులు బతుకుతుందో తెలియని పరిస్థితి ఆ పిల్లది. తన ఒంటరి జీవితపు సవాళ్ళనెదుర్కుంటూ కూతురు గడిపే ప్రతి క్షణాన్నీ, అమూల్యమైన బహుమతిలా మలచాలనే తాపత్రయమున్న అమ్మ. వీరి జీవితంలోకి అనుకోకుండా (అచ్చు సినిమాల్లోలానే) యంగ్ జే అనే కుర్రాడొస్తాడు. వాళ్ళుండే అపార్ట్మెంట్లో కింద పోర్షన్ లోకి. అతనో ఫొటోగ్రాఫర్. ముచ్చటగా ఉండే మిన్-ఆ అతనికి బాగా నచ్చుతుంది. అప్పటినుంచీ అతను మిన్ అంటే తన ఇష్టాన్ని చూపుతుంటాడు. ఆమె తల్లి కూడా అతన్ని ప్రోత్సహిస్తుంటుంది. కానీ మిన్ మటుకూ అతన్ని అంత త్వరగా తన దరి చేరనివ్వదు. కారణం… మిన్ కి ఉన్న అనారోగ్యం. My daughter must enjoy her life to the fullest, even tasting love అనుకునే మి-సుక్ పడే సంఘర్షణ, క్రమంగా యంగ్ తో మిన్ స్నేహం చెయ్యటం, అంతిమంగా గుండెల్ని పిండేసే ట్రాజడీ…

కానీ కథలో ఉన్న కొన్ని సన్నివేశాలు హౄదయంలోకలా చొచ్చుకుని పోతాయి. బా౨క్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. సన్నివేశాలలోని సున్నితత్వాన్నీ, భావుకతనూ, ఆనంద విషాదాలనూ, చాలా గొప్పగా ఎలివేట్ చేసేలా ఉంది. సినిమాటోగ్రఫీ గురించి చెప్పేకన్నా చూడటమే  మంచిది. ప్రతి సన్నివేశం ఒక దృశ్య కావ్యంలా ఉంటుంది. మన ఎదురుగానే జరుగుతున్నట్టుండే సన్నివేశాలు, పాత్రల్లో ఇమిడిపోయినట్టుండే నటులూ. ఇవన్నీ ఈ సినిమా సొత్తు. కేవలం మూడూ ప్రధాన పాత్రలచుట్టే తిరిగినా, మనకెక్కడా బోర్ కొట్టదు. ముఖ్యంగా మిన్ పాత్రధారిణి ఇమ్ సూ-జంగ్ మనని కట్టిపడేస్తుంది. తన కూతురు టీనేజ్ ముగిసేలోగానే మరణిస్తుందని తెలిసినా బాధని దిగ మింగి, వర్తమానాన్ని స్వర్గంలా మార్చే ప్రయత్నం చేసే అమ్మ పాత్రని చూస్తే ఎవరికైనా అలాంటి అమ్మ కావాలనిపించక మానదు. బాయ్ ఫ్రెండ్ గా వేసిన కిమ్ రే-వన్ చాలా లైవ్లీగా ఉంటాడు. సినిమా ఆఖరులో మిన్-ఆ తన డైరీలో రాసుకున్న ఊసులని అమ్మ చదువుతున్నప్పుడు మన కళ్ళలో తెలియకుండానే ఒక కన్నీటి బిందువైనా రాలకుండా ఉండదు. సినిమా ప్రీక్లైమాక్టిక్ ట్విస్ట్ ను ఊహించగలిగినా ఊహించలేక పోయినా మనం ఒకరకమైన ఆశ్చర్యానికి లోనవుతాము.

అమ్మా కూతుళ్ళ అనుబంధానికి పట్టాభిషేకం చేసిన ఈ సినిమాని ఒక్క సారైనా చూసి తీరాల్సిందే.

ఎలా?

యూట్యూబ్ లో సినిమా మొత్తం దొరుకుతోంది. అంత గొప్ప క్లా౨రిటీ ఉండకపోయినా చూడబుల్ గానే ఉంది. అలాంటి సందర్భంలోనే సినిమా కన్నుల పండువగా ఉంటే మాంఛి క్వాలిటీ ఉన్న డిస్క్ మీద చూస్తే… అదన్నమాట సంగతి. విజువల్ ఫీస్ట్

4. ఏ ఫిస్ట్‌ఫుల్ ఆఫ్ డాలర్స్ (సెర్జియో లియోన్న్, క్లింట్ ఈస్ట్‌వుడ్)

ఎందుకు?

అబ్బ! కౌబాయ్ సినిమాలంటే పిచ్చ ఇష్టం. హా౨ట్ పెట్టుకుని గుర్రాల మీద జామ్ జామ్మని పోతూ, తుపాకులు పట్టుకుని కాల్చుకుంటూ, కొండలూ, గుట్టలూ అన్న భేదం లేకుండా తిరుగుతుండే కౌబాయ్ లంటే ఒకరకమైన పా౨షన్. సూపర్‌స్టార్ కృష్ణ మోసగాళ్ళకు మోసగాడు ఎన్ని సార్లో చూసిన అనుభవం, కాస్త పెద్దయ్యాక దాని గురించి చదువుతున్నప్పుడు తెలిసిన ద గుడ్, ద బా౨డ్, అండ్ ద అగ్లీ. కొసరుతో పాటూ అసలుగురించెక్కువ ఆలోచించే నాకు ఎన్నాళ్ళో వెతికాక చెన్నై మూర్ మార్కెట్లో ఓ రెండు సినిమాలు దొరికాయి. ద గుడ్, ద బా౨డ్, అండ్ ద అగ్లీ, మరియూ ఫర్ ఏ ఫ్యూ డాలర్స్ మోర్ అని కవర్ మీద ఉన్న ఏ ఫిస్ట్‌ఫుల్ ఆఫ్ డాలర్స్. అవీ గొప్ప క్వాలిటీ లేక పరమ బోరనిపించి వదిలేశాక… ఈ మధ్య మెక్సికో సిటీలో దొరికించుకున్న వెస్ట్రన్ కలెక్షన్లో మొత్తం లియోన్న్, మరియూ ఈస్ట్‌వుడ్ సినిమాలు ఎన్నిసార్లు వీలయితే అన్ని సార్లు చూశాను. అందులోనూ డాలర్స్ ట్రైలజీలో ఉన్న మ్యూజిక్కు, లియోనెస్క్ స్టోరీ (సినా౨రియో అనాలేమో) టెల్లింకూ ఎడిక్టయ్యాను. వాటన్నిటిలో బాగా నచ్చిందిదీ…

ఏమిటి?

కురసావా యోజింబోకు నకలుగా వచ్చినా తనదైన ముద్ర వేసి, కొండకచో దాన్నే మించిన క్లా౨సిగ్గా నిలబడ్డ సినిమా ఇది. సాధారణంగా నాకు కొసరు కంటే అసలు మీదే మోజెక్కువ. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి తారుమారైంది. కురసావా కథను మక్కికి మక్కీ దించినట్టనిపించే సన్నివేశాలున్నా, దాదాపూ అలాంటి డైలాగులే ఉన్నా, వెస్ట్రన్ నేపథ్యానికి తగ్గట్టు లియోన్న్ చేసుకున్న మార్పు చేర్పులూ, ఎన్నిసార్లు విన్నా తనివి తీరక వెంటాడి వేటాడే ఎన్నియో మోరికోన్న్ సంగీతం, మిఫునె ను మరపించే ఈస్ట్‌వుడ్ (ఏమాత్రం అనుకరించకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ను ఏర్పరచుకుని, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని, ఇప్పుడు ఎంతగా ఎదిగాడో మనందరి కళ్ళ ముందున్న చరిత్రేగా), కథా కథనాల్లో జరిగిన ఇంప్రొవైజేషన్స్ అన్నీ కలిపి ఈ సినిమాని ఒక లాం౨డ్ మార్క్ గా నిలిపాయి.

ఒక సినిమాకు నకలుగా వచ్చి, ఆ సినిమా డైరెక్టరు ఆగ్రహానికి గురయ్యి కూడా ఇంత సంచలనం సృష్టించిందంటేనే తెలుస్తుంది ఈ సినిమా సత్తా. అసలు సినిమానే మరపించిన (అంటే యోజింబో కన్నా ఇదే ఎక్కువ మందికి నచ్చే అవకాశమెక్కువ) ఈ కొసరు సినిమాని ఒక ఒరిజినకలు క్లా౨సిక్ అంటే అతిశయోక్తి కాదు. పైగా సినీ ప్రపంచానికో క్రొత్త స్టార్ ను ఇచ్చిందాయే. యోజింబోతో పోలిస్తే నా వోటు దీనికే ఎందుకంటే యోజింబో పొందిన ఇన్స్పిరేషనూ తక్కువేమీ కాదుగా. ఈ మాట కురసావాని తక్కువ చేస్తూ అన్న మాట కాదు. అతనిచ్చిన సినిమాలు చూసిన ఎవరూ ఆమాట అనరు. ఫిస్ట్‌ఫుల్ యొక్క గొప్పతనాన్ని చెప్పాల్సి వచ్చింది కనుక అనాల్సి వచ్చిందంతే.

ఎలా?

మొబైల్ నుంచీ, డెస్క్‌టాప్ నుంచీ, ప్రొజెక్టర్ దొరికినప్పుడు పెద్ద స్క్రీన్ (రూము గోడ మీద) మీద వరకూ ఎన్ని రకాలుగా చూడాలో అన్ని రకాలుగానూ చూశాను. ఎంత పెద్ద తెర అయితే అంత మంచిది. రెంటిలో ఏది ముందు చూడాలో నిర్ణయించుకోవాలి. రెండో సారి చూసిన సినిమాకు ఎడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి 😉

3. మదర్ (వీ ఐ పుదొవ్కిన్, వేరా బరనొవ్‌స్కాయా)

ఎందుకు?

నవతరంగం కోసమని వీ ఐ పుదొవ్కిన్ వ్రాసిన ఫిల్మ్ టెక్నిక్ అండ్ ఆ౨క్టింగ్ అన్న పుస్తకాన్ని అనువదిస్తున్నప్పుడు పుదొవ్కిన్ గురించి చేసిన రీసెర్చిలో భాగంగా ఈ సినిమాను గురించి తెలుసుకున్నాను. అప్పుడు దొరక్క పోయినా తరువాత దొరికిందీ మధ్య. మాంటేజ్ షాట్స్ గురించి తెలుసుకోవాలంటే చూసి తీరాల్సిన సినిమా ఇది. సైలెంట్ మూవీస్ లో నాకు బాగా నచ్చిన ఐదు సినిమాల్లో దీనిదే అగ్ర స్థానం. ఫిలిమ్మేకర్లవాలనుకునే ఎవరైనా చూసి తీరాల్సిన సినిమా ఇది.

ఏమిటి?

మా౨క్సిమ్ గోర్కీ వ్రాసిన అమ్మ నవలకు తెర రూపమిది. ఆ నవలలో ఉన్న ఇంటెన్సిటీ అంతటినీ పుదొవ్కిన్ తెర మీద ఆవిష్కరిస్తాడు. ఆ నవల ఎంత గొప్పదో, ఈ సినిమా అంత గొప్పది. నవల నచ్చకపోవటమంటూ ఉండ వచ్చు, చదవకుండా స్కిప్ చేయవచ్చు కానీ, పుదొవ్కిన్ సినిమాలను మాత్రం స్కిప్ చేయకూడదు. The best part of the film is the editing. It is always sharp and quick. When there is action, the edits are fast and give the viewer a sense of chaos. The Soviets were masters of montage and this film is a prime example. The acting is also better than in most silent films. For those who need lessons on editing, should start with this movie. That’s all

ఎలా?

ఎక్కడా దొరకలా. ఒక పెద్దాయన ప్రెషస్ కలెక్షన్లో కనిపిస్తే, ఆయన్ని బ్రతిమాలీ, బెదిరించీ, భయపెట్టీ, నస పెట్టీ… చివరకు ఇక లాభం లేదనుకుని, నాయనా నా దగ్గరే చూడు అని చూపిస్తే కమ్ప్యూటర్ లో చూశాను. ఎలా చూసినా ఫరవాలేదు. కానీ, ఎడిటింగ్ ను పరిశీలిస్తూ చూడకపోతే మటుకూ అసలు చూడటమే దండుగ.

2. ద టెర్మినేటర్

ఎందుకు?

ఒక గొప్ప, ఘనమైన, విజనరీ, సైంటిస్టు లాంటి, ఎన్ని కావల్సి వస్తే అన్ని ఉపమానాలు, ఎడ్జెక్టివ్స్ పెట్టుకోండి. కా౨మెరాన్ ఆవిర్భావం. గ్రాం౨డ్ స్కేల్ సినిమా అంటే ఏమిటన్నది తెలుసుకోవాలంటే, మానవుని ఊహ ఎంత గొప్పగా ఉండగలదో తెలుసుకోవాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే… Ayn Rand చెప్పినట్టు, CINEMA AS IT COULD BE, SHOULD BE AND OUGHT TO BE అన్నది అర్థమవాలంటే… ఎన్ని సినిమాలు తీసినా కా౨మెరానావిర్భవించిన సినిమా కనుక దీని సిగిన్ఫికెన్స్ ఎక్కువ.

ఏమిటి?

అందరికీ తెలిసిందే, తెలుస్తూన్నదే, తెలియబోయేదే… నడుస్తున్న చరిత్ర.

ఎలా?

ఎలా అయినా, ఎన్ని సార్లయినా… ఈ సంవత్సరమే కా౨మరాన్ తీసిన సినిమాల్ని ఒక్కోటీ కనీసం పాతిక సార్లు కొంచం కొంచంగానైనా చూశాను

1. ఓల్డ్‌బాయ్ (పార్క్ చాన్-వుక్, చోయ్ మిన్-సుక్)

ఎందుకు?

ఒళ్ళు గగుర్పొడిచే కాంబినేషన్. తల్చుకుంటుంటేనే నరాలు జివ్వున లాగేసినట్టుంటుంది. కడుపులో మెలిద్రిప్పుతుంది. వద్దు బాబోయ్ అనిపిస్తుంది. అయినా చూడాలనిపిస్తుంది. వెంటాడుతుంది. వేటాడుతుంది. వేధిస్తుంది. నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. కోపం తెప్పిస్తుంది. చిరాకు తెప్పిస్తుంది. అయినా మళ్ళా చూసేలా చేస్తుంది. ఈ సంవత్సరం నా సినీ దండ యాత్ర మొదలవటానికీ సినిమానే కారణం.

పా౨షన్ ఫర్ సినిమా లో బఖా సటాంగ్ (పెప్పెర్‌మింట్ కాండీ) గురించి వ్రాసినప్పుడు మహేష్ శ్రీనివాస్ చెప్పారీ సినిమా గురించి. వెతికి వెతికి మరీ సంపాదించాను. నవతరంగంలో కనబడే విప్లవ్ ద్వారా మరికొంత సమాచారం దొరికింది. చివరకు, ముసలి కుర్రోడి కోసం వెతుకులాటనే వెంట్రుకేస్తే… వెన్జెన్స్ ట్రైలజీ అనే కొండ దొరికింది. ఆ కొండెక్కితే కొరియన్ సినిమా అనే నిధి దొరికింది. గత పదేళ్ళుగా అద్భుతాలు చేస్తున్న కొరియన్ సినిమాల ద్వారా, కలిసొచ్చిన పరిస్థితుల వల్ల నాకు దొరికిన అనేకానేక గొప్ప సినిమాల ద్వారా ఈ సంవత్సరం పండుగ చేసుకున్నాను.

ఏమిటి? ఎలా?

ఎలా ఏముంది? ఈ సినిమా గురించి చెప్పటం దండుగ. అడగటం దండుగ. దొరికితే చూసెయ్యటమే. పార్క్ లాంటి దర్శకుడూ, చోయ్ లాంటి నటుడూ ఇప్పట్లో మళ్ళా దొరకటం కష్టం. ఇంతకు ముందు ఉండ వచ్చు కానీ, ఇక పైన. పార్క్ అన్ని సినిమాలూ చూస్తిని. ఈ లిస్టులోనే రెండున్నాయి. ఓల్డ్‌బాయ్ లో ట్రా౨జిక్ హీరోగా, దీని తరువాతొచ్చిన సింపతీ ఫర్ లేడి వెన్జెన్స్ లో విలన్ గా అతని నటన…

పీఎస్:

1. …ఇంగ్ సినిమా గురించి వ్రాసిన దానిలో “ఏమిటి” క్రింద వ్రాసిన మూడు పేరాలూ సృజన వ్రాసిన ఆర్టికిల్ నుంచీ తీసుకున్నాను. అనుమతి పొంది. అందుకు కృతఙ్ఞతలు.

2. ఫోకస్ ద్వారా సినిమాల గురించి సరి అయిన అవగాహన పొందటానికి కారణమైన వెంకట్ కు, లియోనెస్క్ వెస్ట్రన్స్ లో ఉన్న అందాన్ని అస్వాదించటానికి సహాయం చేసిన రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారికి, కొరియన్ సినిమా ప్రపంచంలోకి అడుగుబెట్టి, ఎలాంటి సినిమానైనా చూడగలిగేలా మారటానికి కారణమైన మహేష్ శ్రీనివాస్ కు, నేను దొరికించుకునే సమయం వచ్చేలోపున నాకు కొన్ని గొప్ప సినిమాలిచ్చిన కత్తి మహేష్ కుమార్ కు… Many thanks

3. లియోన్న్ సినిమాల్లో వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ద వెస్ట్ ఇంకా చూడలేదు. అదే ఇంకా గొప్పగా ఉంటుందని విన్నాను. అయినా ఆ ప్రస్థానాన్ని మొదలెట్టించిన ఫిస్ట్‌ఫుల్లే ముఖ్యం

4. ఇంతకన్నా గొప్ప సినిమాలు లేవా? ఉన్నాయి, కానీ నేను వాటిననుభవించలేదింకా. ఇవే గొప్పవా? చూస్తే అర్థమవుతుంది

6 Comments
  1. sandeep December 28, 2010 /
    • Vasant Jurru January 23, 2011 /
  2. maggi December 29, 2010 /
  3. raj January 5, 2011 /