Menu

‘సీక్వెల్స్’ రక్షా? శిక్షా?

“ఆ ఆనందం, ఆ అనుభూతి మరో సారి ఆస్వాదించటానికి ..ఇంకా ఇంపార్టెంట్ గా ఇంకొన్ని డబ్బులు కొట్టెయ్యటానికే సీక్వెల్స్ తీస్తూంటా”  ..రామ్ గోపాల్ వర్మ.

ఆయన నమ్మి చెప్పారో..నమ్మించటానికి చెప్పారో గానీ … సీక్వెల్స్ అనేవి ఎప్పుడూ  భాక్సాఫీస్ కు హాట్ ఫేవరెట్సే. ఎందుకంటే ఆల్రెడీ హిట్ అయిన కాన్సెప్టునో, టైటిల్ నో బేస్ చేసుకుని ఈ సీక్వెల్ మన ముందుకు మొహమాటం లేకుండా  దూకుతూంటాయి.  దాంతో ఈ చిత్రాలు  నిర్మాణ సమయంలోనే మంచి పబ్లిసిటీని, క్రేజ్ ని  సంపాదించి ఓపెనింగ్స్ పరంగా ప్లస్ అవుతాయి. అదే సమయంలో  హైప్ ని కూడా క్రియోట్ చేసి ఒరిజినల్ సినిమాతో ప్రేక్షకుడుని పోల్చి చూసుకునేలా చేసే ప్రమాదం కూడా తెచ్చిపెడుతూంటాయి. దాంతో హిట్ ఐడియా   అనుకున్న ఆ నిర్ణయం ఆ తర్వాత పెద్ద ప్లాప్ ప్లాన్ గా మారిపోతుంది. సీక్వెల్ అంటేనే కొనసాగింపు అని అర్దం..సక్సెస్ ను కొనసాగించాలని ఆలోచన వచ్చినప్పుడు,క్యాష్ చేసుకోవాలనుకున్నప్పుడు,మొదటి సినిమా ఆలోచనలు… రూపకర్తలను వీడకుండా వెంబడిస్తున్నప్పుడు  సీక్వెల్స్  ఊపిరి పోసుకుంటూంటాయి.  అలాగని తీసిన ప్రతీ   సీక్వెల్స్ విజయం సాధిస్తోందా అంటే చెప్పలేము.ఛాన్సెస్  ఫిప్టీ ..పిప్టీ ఉంటాయి.

హిందీలో సీక్వెల్స్ వరస విజయాలు సాధిస్తూంటే..తెలుగులో సీక్వెల్స్ నామరూపాలు లేకుండా పోతున్నాయి. ఇక రీసెంట్ గా బాలీవుడ్ సినిమాలకి సీక్వెల్సే బాగా లాభసాటి అని గోల్ మాల్-3 మరో మారు నిరూపించింది. 2006 లో విడుదలైన గోల్ మాల్ చిత్రం 29.75 కోట్లు సంపాదిస్తే..ఆ చిత్రం సీక్వెల్ గోల్ మాల్ రిటన్స్ (2008) వచ్చే సరికి కలెక్షన్స్ 51.75 కోట్లకు దారితీసాయి. ఇప్పుడు మూడో సీక్వెల్ గా వచ్చిన గోల్ మాల్ 3 (2010) దాదాపు 105 కోట్లు వరకూ వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక గతంలోనూ హేరాఫేరీ (2000) చిత్రం 10.75 కోట్లు సంపాదిస్తే..ఫిర్ హేరా ఫేరీ  (2006) – 41.75 కోట్లు తెచ్చిపెట్టి  పెద్ద హిట్టై కూర్చుంది. ఇక మున్నాభాయ్ ఎంబిబియస్ (2003) – 21.25 కోట్లు సంపాదిస్తే..లగే రహో మున్నాభాయ్… (2006) – 71 కోట్లతో రికార్డు క్రియోట్ చేసింది. ఇక  హృతిక్ రోషన్ కోయి మిల్ గయా (2003) – 42 కోట్లు ఆర్జిస్తే…దాని సీక్వెల్ గా వచ్చిన (2006) – 69.25 కోట్లు వసూలు చేసింది. అలాగే ధూమ్ (2004) – 19.50 కోట్లు తెస్తే, ధూమ్ -2  (2006) – 80 కోట్ల లాభం తెచ్చింది. ఇలా చాలావరకూ సీక్వెల్స్ హిందీలో లాభాలనే తెచ్చి పెట్టి ఇప్పుడు హౌస్  ఫుల్ 2, డాన్ 2, దోస్తానా 2, మర్డర్ 2, జన్నత్ 2 వంటి చిత్రాలకు సీక్వెల్స్ కు సై అన్నాయి.

హాలీవుడ్ లో చూస్తే…జేమ్స్‌ బాండ్‌, స్టార్‌వార్స్‌, ఇండియానా జోన్స్‌, ది టర్మినేటర్‌, బాట్‌మాన్‌, ది లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌, పైరేటేస్‌ ఆఫ్‌ ది కారిబ్బేన్‌, ది మాట్రిక్స్‌, స్పైడర్‌ మాన్‌, జుర్రాసిక్‌ పార్క్‌  సీక్వెల్స్‌ చిత్రాలుగా వచ్చి  ప్రేక్షకాదరణ పొందాయి.  ఇక రెండు వారాల క్రితమే హ్యారీ పొట్టర్ ఏడో సీక్వెల్ కూడా రిలైజైంది. అక్కడ సీక్వెల్ అనేది ఎవర్ గ్రీన్ సబ్జెక్టు. మరో ప్రక్క ప్రపంచ ప్రసిద్ద దర్శకుడు జేమ్స్ కెమెరాన్ …అవతార్ చిత్రానికి సీక్వెల్ రెడి చేస్తున్నారు.

అయితే ఈ సీక్వెల్స్ విషయమై సినీ మేధావులు మాత్రం … సీక్వెల్ తీయాలేనే ఆలోచన రావటం అంటే  వారిలో సృజనశక్తి చరమదశకి చేరుకుంటోందని  అర్దం చేసుకోవాలని విమర్శిస్తున్నారు.అలాగే  ప్రపంచంలో ఇంకా ఎన్నో తీయదగ్గ కథలు, ఊహలు,ఆలోచనలు,సమస్యలు ఉండగా తీసిందే తీయాలనుకోవటం ఎంతవరకూ సబబు అని వారి వాదన. అయితే ఇధి కాన్సెప్టు ఓరియెంటెడ్ సీక్వెల్స్ కే వర్తిస్తాయి.

తెలుగులో మాత్రం మనీ మనీ, శంకర్ దాదా జిందాబాద్ , ఆర్య 2, విలేజ్ లో వినాయకుడు, గాయం 2 చిత్రాలు సీక్వెల్స్ గా వచ్చి ప్రేక్షక ఆదరణ పొందలేకపోయాయి. అంటే తెలుగువారికి ఈ సీక్వెల్ కాన్సెప్ట్ నచ్చటం లేదా..లేక సీక్వెల్ గా వచ్చిన సినిమానే నచ్చటంలేదా అన్నది సీక్వెల్ ఫిల్మ్ మేకర్స్ వేసుకోవాల్సిన ప్రశ్న.  సీక్వెల్ ని కార్పోరేట్ స్ట్రాటజీగా వర్ణించేవారు ఉన్నారు.

ఇక సీక్వెల్ అయినా  రీమేక్ అయినా మరొకటి అయినా జనాల్ని ధియోటర్ వరకూ లాక్కొచ్చేవరకూనే సాయిపడతాయన్నది నమ్మితీరాల్సిన నిజం. ఆ తర్వాత ధియోటర్ లో ప్రేక్షకుడు కూర్చున్న తర్వాత లైట్లు ఆపి సినిమా ప్రారంభించాక, అతని ఆలోచనలు మొత్తం తాను చూస్తున్న కొత్త చిత్రం పైనే కేంద్రీకృతం అవతాయి. సినిమా మనస్సుని పడితే టప్పట్లు కొడతాడు. అయితే సీక్వెల్స్ లో క్లిక్ అయిన పాత్రలు కొనసాగిస్తే..వెంటనే కనెక్టు అవుతాడు. బ్రహ్మానందం తెరపై కనపడగానే కామిడీని ఎలా ఎక్సపెక్ట్ చేస్తాడో అలా హిట్టయిన పాత్రని చూడగానే అంతకుముందు ఆ పాత్ర భావోద్వేగాలకు, ఎమోషన్స్  కు లాగ్ ఆన్ అవుతాడు. దాంతో పాత్ర ఐడెంటిటీ దొరికి వెంటనే లీనమవటానికి సాధ్యమవుతుంది. ఆ స్టేజీ దాటిన తర్వాత యధాప్రకారం కథ, కథనం, విజువల్స్ తో కొత్త సినిమా చూసినట్లే  ఫీలే అవుతాడు.  కాబట్టి ఎంత సూపర్ హిట్ సినిమా సీక్వెల్ అయినా సేఫ్ జోన్ గా భావిస్తే  ప్రమాదమే.

ఇక  ఈ రోజున గత నెలలో విడుదలై విజయం సాధించిన ‘రక్త చరిత్ర’ సీక్వెల్ … “రక్త చరిత్ర-2” రిలీజు అవుతోంది. అలాగే  మరి కొద్ది రోజుల్లో “చంద్రముఖి” సీక్వెల్ “నాగవల్లి” కూడా భాక్సాఫీస్ ని పలకరించబోతోంది.  అంతేగాక “మనీ” చిత్రం రెండో సీక్వెల్ గా “మనీ  మనీ మోర్ మనీ” అనే సీక్వెల్ కూడా ప్రారంభమైంది. ఈ కొత్త సీక్వెల్స్  విజయం సాధిస్తేనే ఇంకొన్ని సీక్వెల్స్  ప్రాణం పోసుకుంటాయి.  తెలుగులో సీక్వెల్స్ కు సక్సెస్ తెచ్చిపెట్టే సత్తా ఉందా లేదా అన్నది ఈ రోజు తేలిపోనుంది.

(ఆంధ్రభూమి “వెన్నెల” (03-12-2010) లో ప్రచురితం)

5 Comments
  1. chakri December 3, 2010 /
    • keshavcharan December 7, 2010 /
  2. జయదేవ్ December 3, 2010 /