Menu

రగడ: అభిమానులకి చెరకుగడ – మిగతా జనానికి గడబిడ

సంవత్సరానికి(2010) చివరి పెద్ద (హీరో) చిత్రంగా రగడ భారి అంచనాలతో విడుదలైంది. రొటీన్ కథ, ఒడిదుడుకుల స్క్రీన్‌ప్లే వున్నా ఈ చిత్రం టేకింగ్ పరంగా, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా మంచి మార్కులు కొట్టేయడంతో ఫర్వాలేదనిపించుకునే చిత్రంగా మిగిలిపోయింది. అయితే నాగార్జున అభిమానులకు, ముఖ్యం బి, సీ సెంటర్లవారికి ఈ సినిమా బాగా నచ్చే అవకాశం వుంది.

కడపకి చెందిన సత్య (నాగార్జున) ఒక ఫైటు నాలుగు పంచ్ డైలాగుల్తో హైదరాబాద్ రావడంతో కథ మొదలౌతుంది. అప్పటికే చాలా సినిమాల్లోలాగ రెండువర్గాలుగా కొట్టుకుంటున్న గ్రూపుల్లో జీ.కే. (దేవ్ గిల్) గ్యాంగులో చేరి, అతని ప్రత్యర్థి పెద్దన్న (ప్రదీప్ రావత్) గ్యాంగులో ఒక్కొకర్నే చంపుతుంటాడు. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా మొదట కనిపించినా ఇలా చంపడానికి బలమైన సెంటిమెంట్ ఫ్లాష్‌బ్యాక్ ఒకటి వుంటుంది. ఈలోగా జీ.కే ప్రేమిస్తున్న బులెట్‌లాంటి శిరీష (అనుష్క) సత్యని ప్రేమించడం, మరో పక్క చాక్లెట్‌లాంటి అష్టలక్ష్మి (ప్రియమణి)తన సకుటుంబ సపరివార సమేతంగా సత్య ఇంటికి చేరడంతో ఇద్దరు భామలతో ఆట మొదలెడతాడు హీరో. అసలు ఆటలో విలన్‌ని హీరో ఎలా ఎదుర్కున్నాడు? బులెట్‌లాంటి అమ్మాయి నిజనికి చాక్లెట్ అనీ, చాక్లెట్ లాంటి అమ్మాయి నిజానికి బులెట్ అనీ తెలుసుకోని సత్య ఏం చేశాడు? లెక్కకు అందనంత మంది విలన్లలో ఎవరెవరికి ఎలాంటి కనెక్షన్ వుంది? లాంటి సహజమైన ప్రశ్నలకి సర్వసాధారణమైన జవాబే మిగతా చిత్రం.

ఇలా హీరో ఏదో ఒక గ్యాంగులో చేరి ప్రత్యర్థి గ్యాంగుని హతమార్చడం లేదా రెండు గ్యాంగుల్ని ముంచడం ఇప్పటికే మనం చూసేసిన సినిమాల కథ. అలాగే సాధారణమైన వ్యక్తిగా మొదలై, విలన్ల భరతం పట్టిన హీరోగారి కుటుంబంపైనో, దగ్గరివారిపైనో ఎప్పుడో ఎక్కడో విలన్లు అన్యాయం చేసి వుండటం అనే కథని కూడ తెలుగు ప్రజలు చాలా సార్లు చూశారు, భరించారు. మరి ఈ సినిమా గొప్పదనం ఏమిటయ్యా అంటే – ప్రజంటేషన్. తొలి సగం మొత్తం హీరోగారి పవరు, స్టైల్, తెలివితేటలు, సెన్స్ ఆఫ్ హ్యూమరు, సరస సంభాషణలు, పంచ్‌లతో నింపేశారు. నాగార్జున ఆ లక్షణాలన్ని సమర్థవంతగా పోషించి మెప్పించాడు. ప్రత్యేకించి రాయలసీమ యాస (ప్రయత్నం) బాగుంది. ఇక రెండో సగంలో అడుగడుగునా ఎదురయ్యే ట్విస్టులు కథా పరంగా బాగున్నా అవి ప్రేక్షకులకి బలంగా తగల్లేదు. ఎక్కువమంది విలన్లు వుండటం కూడా కొంచం గడబిడగానే వుంది.

వెరసి నాగార్జునని చూడటానికే వెళ్ళేవారికి (అభిమానులకి) ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇక ఇద్దరు హీరోయిన్లు పోటీపడి ప్రదర్శించిన అందాలు ఆకట్టుకుంటాయి. సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూసిన కాంబినేషన్ – నాగార్జున, అనుష్క అంచనాలు తగ్గట్టుగానే జోడీ బాగుందనిపించుకున్నారు. ప్రియమణి రెండు రకాల పాత్రల్లోను ఇమడలేకపోయిందనిపిస్తుంది. బ్రహ్మానందం కామెడి ఎటు పోతుందో అర్థం కాకుండ వుంటే, ధర్మవరపు కామెడీ ఎటూ పోకుండ ఒకచోటే వుండి విసుగెత్తించింది. అయితే ధర్మవరపు గ్యాంగ్‌లో మాస్టర్ భరత్ మెప్పిస్తాడు. రఘు బాబు పాత్రోచితంగా రెండు మూడు సెటైర్లతో నవ్వించే ప్రయత్నం చేశాడు. ప్రత్యేక పాటలో “ఛా”ర్మీ తనవంతు ప్రయత్నం చేసింది.

దర్శకత్వం, ఫోటోగ్రఫీ అక్కడక్కడ ఫర్లేదనిపిస్తుంది. చాలా సన్నివేశాల్లో పాత్రలు నల్ల కల్లజోడు పెట్టుకుంటే అందులో ఎదురుగా వున్నవాళ్ళు కనిపించేట్టు తీయడం కొత్తగా బాగుంది. ఫైట్లు చిత్రీకరించడంలోను, వాటిని ప్రజంట్ చేయడంలోను కొత్తదనం కనిపించింది. పాటలు, వాటి లొకేషన్లు కంటికి ఇంపుగా వున్నాయి.  మొదటి సగంలో కూడా కథ వుండి, స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొంచెం జాగ్రత్త పడివుంటే ఇంకొంచెం బాగుండేదేమో. కామెడీ విషయంలో కొంత నవ్వులు పండినా, చాలా వరకు (బ్రహ్మానందం కామెడీ ట్రాక్) మూల కథకు సంబంధం లేకుండా పోవటం, ద్వితీయార్థానికి అవసరంలేకుండా పోవటం నిరశపరుస్తుంది. సంగీతం ఒకటి రెండు మినహా గుర్తుంచుకోదగ్గ పాటలు ఏవీ లేవు.

ఏది ఏమైనా నాగార్జున 25 సంవత్సరాల కానుకగా వచ్చిన ఈ చిత్రం అభిమానుల్ని అలరించడం ఖాయం. మిగతా ప్రేక్షకులు ఎంతమాత్రం ఆదరిస్తారో అన్నదాన్ని బట్టి విజయం సాధించే అవకాశాలు వున్నాయి. ఇప్పుడు నడుస్తున్న చిత్రాల్లో మరేవి అంత ఆశాజనకంగా లేవు కాబట్టి – ఇదో ఆముదపు వృక్షమై నిలబడే అవకాశమూ లేకపోలేదు.

చిత్రం: రగడా

నటీనటులు – హీరో: నాగార్జున, హీరోయిన్లు: అనుష్క, ప్రియమణి, కమెడియన్లు: బ్రహ్మానందం, ధర్మవరపు, సన, మాస్టర్ భరత్, రఘుబాబు, విలన్లు: ప్రదీప్ రావత్, దేవ్ గిల్, కోట శ్రీనివాసరావు, సుప్రీత్, సత్యప్రకాష్, సుశాంత్, తనికెళ్ళ భరణి, బెనర్జీ, ఇతర పాత్రలు: వెన్నిరాడై నిర్మల, శ్రీలలిత, (ప్రత్యేక పాటలో) చార్మి

సంగీతం: తమన్

ఎడిటింగ్: మార్తాండ్ కే. వెంకటేష్

బేనర్: శ్రీ కామాక్షీ ఎంటర్‌ప్రైజెస్

నిర్మాత: D. శివ ప్రసాద్‌రెడ్డి

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వీరు పోట్ల

23 Comments
 1. sriram December 26, 2010 /
 2. rahul December 26, 2010 /
 3. సినిమా Bond December 26, 2010 /
 4. సాధారణ ప్రేక్శకుడు December 26, 2010 /
 5. జయదేవ్ December 26, 2010 /
 6. chakri December 27, 2010 /
  • joy December 27, 2010 /
   • chakri December 27, 2010 /
   • joy December 27, 2010 /
   • chakri December 27, 2010 /
   • Venugoud January 3, 2011 /
   • అబ్రకదబ్ర December 29, 2010 /
 7. joy December 27, 2010 /
  • సాధారణ ప్రేక్శకుడు December 27, 2010 /
  • joy December 27, 2010 /
 8. raj January 9, 2011 /
 9. aditya January 25, 2011 /