Menu

నాగవల్లి = చంద్రముఖి/2

అయిదు భాషల్లో విజయం సాధించన “చంద్రముఖి” సీక్వెల్ వస్తోందంటే అందరిలోనూ ఎంతో ఉత్సుకత వుండటం సహజం. అందునా గతంలో చంద్రముఖి సినిమాతో సంబంధం వున్న నటీనటుల ఆకస్మిక మరణాలు (విష్ణువర్థన్, సౌందర్య) ఈ సినిమా చేసినా తీసినా ప్రమాదమంటూ (నిజమో అబద్ధమో) ప్రచారం జరగటంతో చాలా మందికి “నాగవల్లి” సినిమా పైన ఆసక్తి పెరిగింది. ఎక్కువైన అంచనాలవల్లనో, పాత కథనే తిప్పి తిప్పి కొత్తదిలా చూపించచే ప్రయత్నం వల్లనో “నాగవల్లి” ఆశించనంత గొప్పగా కనిపించలేదు. అయితే హిట్లు లేని సినిమా కష్టాల మధ్య విడుదలైంది కాబట్టి, వెంకటేష్ అభిమానులు వల్లైతేనేమి, అయిదుగురు భామల అయిస్కాంతాల వల్లైతేనేమి, చంద్రముఖి సీక్వెల్ అన్న ఉత్సుకత వల్లైతేనేమి, ఈ సినిమా ఎబవ్ ఏవరేజ్‌గా నిలిచే అవకాశాలున్నాయి.

గతంలో వచ్చిన చంద్రముఖికి సీక్వెల్ అని మొదటినించి చెప్పినట్లే కథ కూడా ఆ సినిమాలో అంశాలను చాలావరకు స్పృసిస్తూ సాగుతుంది. (చంద్రముఖి సినిమాలో) గంగని వదిలిపెట్టిన చంద్రముఖి ఆత్మ సర్ప రూపంలో బయటపడి, చంద్రముఖి చిత్రపటం ద్వారా తన కొత్త స్థావరానికి చేరుకుంటుంది. ఆ ఇంట్లో వుండే కుటుంబంలో అయిదుగురు ఆడపిల్లలో (కమలిని ముఖర్జీ, శ్రద్ధాదాస్, పూనం కౌర్, రిచా గంగోపాధ్యాయ, సుజా ) ఒకరిని చంద్రముఖి ఆవహిస్తుంది. ఆ సమస్యను పరిష్కరించేందుకు గతంలో గంగని కాపాడిన రామచంద్ర సిద్ధాంతి, డాక్టర్ ఈశ్వర్ శిష్యుడు డాక్టర్ విజయ్ (వెంకటేష్) ఇద్దరూ ఆ ఇంటికి చేరుకుంటారు. ఆ ఇద్దరు ఒకరికొకరు పరస్పర విరుద్ధమైన పద్ధతులతో చంద్రముఖి ఎవరో కనిపెట్టే ప్రయత్నం, ఆ క్రమంలో అసలు చంద్రముఖి చంద్రముఖి కాదని – ఆమె అసలు పేరు నాగవల్లి (అనుష్క) అని తెలుసుకుంటరు. అప్పటి రాజా నాగభైరవ రాజశేఖరుడు (వెంకటేష్) ఆమెను బలవంతంగా తన రాజ్యం తీసుకెళ్ళి, తదనంతర పరిణామాలలో ఆమె ప్రియుడు గుణశేఖరుణ్ణి హతమార్చాడని తెలుస్తుంది. ఆ రాజశేఖరుడిపై పగతీర్చుకునేందుకే చంద్రముఖి ఆత్మ ప్రయత్నిస్తోందని తెలుసుకుంటారు సిద్ధాంతి, డాక్టర్. ఇక ఆ తరువాత ఏం జరిగింది? అసలు చంద్రముఖి ఆవహించినది ఎవరిని? చంద్రముఖి తన పగ చల్లార్చుకుందా? వంటి ప్రశ్నలకు సమాధానమే చిత్ర క్లైమాక్స్.

కథ వరకు బాగానే వున్నా, పాత కథని కొత్త కథని కలిపే ప్రయత్నం వల్ల కొంత అయోమయం కలగిందేమో అనిపిస్తోంది. అసలు పాత చంద్రముఖిని అక్కడే వదిలేసి కొత్త కథగా ఈ సినిమా తీసినా బాగుండేదేమో. అలా జరుగకపోగా పాత వాసనలన్నీ ఇందులో చేర్చడంతో ఇదంతా కొత్త సీసా పాత సారా చందాన తయారైంది.. హీరో ఎదుటివారి మనసులో మాటలు వినడం, కమెడియన్ భయంతో హీరో ఆడుకోవడం, ఒక హీరోయిన్ ఆవేశంలో నత్తిగా మాట్లాడటం, క్లైమాక్స్‌కి ముందు హీరో అందరిని కూర్చోపెట్టి జరిగిన కథ వివరించడం, “నాకా చంద్రముఖి తెలియనిది.. నాకా నాకా..” వంటి డైలాగులు అదే రకంగా వాడటం… ఇలాంటివి చిత్రం నిండా కోకొల్లలు. చంద్రముఖి సినిమా రకరకాల భాషల్లో రకరకాల మార్పులతో రకరకాలుగా ఆ కథని చూసినవారికి, ఇది అదే చంద్రముఖి కథకి మరో వర్షనేమో అని అనుమానం వచ్చినా రావచ్చు.

కథ విషయం అలా పక్కన పెడితే ఇందులో పాత్రలు ఎక్కువ వున్నాయి కాబట్టి అనుమానం ఒకరి మీదనుంచి మరొకరి మీదకు మళ్ళిస్తూ టెన్షన్ పుట్టిస్తారేమో అని ఆశించినవారికి నిరాశే ఎదురౌతుంది. ఆ ఇంట్లో వుండే అమ్మాయిల్లో ముగ్గురికి మాత్రమే చంద్రముఖితో(లేదా పేరుతో) సంబంధం పెట్టి ఆ ముగ్గురిమీద మాత్రమే అనుమానం వచ్చేట్టు చేయడంతో సస్పెన్స్ సగానికి పడిపోయింది. చివరిలో అసలు చంద్రముఖి (నాగవల్లి) ఎవరు అనేది చెప్పటప్పుడు కూడా, ఈ అమ్మాయే చంద్రముఖి అని తెలిసిపోయిన అయిదు నిముషాలకు (హీరో ప్రోద్బలంతో) ఆ అమ్మాయిలోని చంద్రముఖి బయటపడుతుంది. దాంతో సస్పెన్సు పోయి, ప్రెక్షకుడు “నాకు ముందే తెలిసిపోయింది” అనుకోడంతో సస్పెన్స్ డ్రామా పండకుండా పోయింది.

అభినయం విషయానికి వస్తే ఈ చిత్రంలో వెంకటేష్ ద్విపాత్రాభినయనం, అనుష్క అందచందాలు, కమలిని ముఖర్జి నటన ప్రధానంగా ఆకట్టుకుంటాయి. ప్రత్యేకించి వెంకటేష్ రెండు విభిన్నమైన గెటప్పుల్లో అభిమనుల్నే కాక, సామాన్య ప్రేక్షకుల్ని కూడా అలరిస్తాడు. మిగిలిన పాత్రల్లో శరత్‌బాబు, ప్రభ, ధర్మవరపు సుబ్రమణ్యం, మిగితా హీరోయిన్‌లు నటీనటులు పాత్ర పరిధి మేరకు నటించారు. బ్రహ్మానందం నిరాశపరచడం పెద్ద మైనస్ పాయింట్. పాటల్లో వెంకటేష్ ఇంట్రడక్షన్ పాట (వెంకటేష్ 25 సంవత్సరాల సినిమా ప్రస్థానం ప్రత్యేకం), నాగవల్లి రాజదర్బారులో నర్తించే – ఘిరణి ఘిరణి పాట ఆకట్టుకుంటాయి.

కామెడి పరంగా చూస్తే పూర్తిగా చంద్రముఖి చిత్రంలో కామెడీ ఫార్మేట్‌నే వాడుకోవడం వల్ల బాగా నిరాశ కలుగుతుంది. భయపడే కమెడియన్ (అక్కడ వడివేలు, ఇక్కడ బ్రహ్మానందం) అతనితో బెడ్‌రూంలో హీరో చేసే కామెడి, కూతుర్లు, భార్య ఎక్కడ హీరోగారి వల్లో పడతారో అని ఖంగారు పడే పాత్ర (అక్కడ నాజర్, ఇక్కడ ధర్మవరపు) ఇలా అన్నీ చూసిన సన్నివేశాలలో కొత్త కామెడీ పండించలేక, బ్రహ్మానందంతో సహా అంతా చతికిలపడ్డారు.

కెమెరా, దర్శకత్వం విషయాలలో చెప్పుకోదగ్గ విషయాలేమీ లేవు. సంభాషణలు, స్క్రీన్ ప్లే విషయాలలో మరికొంత శ్రద్ధ పెడితే ఈ సినిమా మరింత బాగుండేదేమో. ప్రత్యేకించి క్లైమాక్స్ మొదలౌతూనే అయిపోయిందనిపించుకోవడం, ప్రథమార్థంలో హీరో పాత్ర చెయ్యడానికేమి లేనట్టు జరుగుతున్న సంఘటనలను కేవలం వీక్షకుడిగా వుండిపోవటం వంటివి మరికొంత మెరుగుపరిచే అవకాశం కలిగేదేమో.

అన్నట్టు డాక్టర్ విజయ్ పాత్ర (వెంకటేష్) ఈ ఇంటికి బయలుదేరుతున్నప్పుడు ఆయన గురువుగారు డాక్టర్ ఈశ్వర్ (కేవలం ఫొటోల్లో రజనీకాంత్) – “అక్కడ నీకొక సర్‌ప్రైస్ వుంటుంది” అని చెప్తాడు. ఆ సర్‌ప్రైస్ గురించి ఈ సమీక్షలో ప్రస్తావించకపోవడానికి కారణం – దాన్ని సర్‌ప్రైస్‌గా వుంచడానికే. ఆ సర్‌ప్రైస్ కూడా చిత్ర విజయానికి దోహదపడే అవకాశం చాలా వుంది.

మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రముఖి 2 అని ప్రచారం పొందిన నాగమల్లి చంద్రముఖి/2 (చంద్రముఖి బై టూ)గానే మిగిలిపోయింది.

12 Comments
 1. sri December 16, 2010 /
 2. శంకర్ గొంగటి December 16, 2010 /
 3. sasank December 16, 2010 /
 4. కృష్ణారెడ్డి ఉప్పలపాటి December 16, 2010 /
 5. murali December 17, 2010 /
 6. Ash December 20, 2010 /
 7. eswar December 24, 2010 /
 8. Director Teja December 24, 2010 /
  • holyman December 24, 2010 /
 9. joy December 24, 2010 /
 10. anusha January 18, 2011 /
 11. aditya January 25, 2011 /