Menu

ఒక ప్రేక్షకుడి ‘గుజారిష్’అను ఓ ఆటోమేటిజం!

నువ్వొక నిర్వాజమైన వ్యాజ్యానివి. అరణ్యరోదనల కోరస్‌కి తొలి గొంతుకవి. నీ ఇష్టాయిష్టాల గొలుసుల్తో, లేదా మరింకెవరి సంకెళ్ళతోనైనా నీ నేస్తం నిస్తేజ జీవితాన్ని కట్టేయడం నీకయిష్టం. ఫక్తు వకీలు వాసనల నల్లకోటుని కోర్టు ఆవరణ బైట వేసుకోవడం నీ వల్లకాదు. చావు బ్రతుకుల అర్థాల్ని జనరలైజ్ చేయడం. అంగుళం శబ్దమైనా లేని ఆ జంటపదాల ఎనలేని భావాన్ని బౌండు పుస్తకాల మధ్య కుదించడం నీకు కుదిరే పనికాదు. అందుకే, వెర్రిగొంతుక అరువిచ్చి భంగపడిన నువ్వు ఒక అతి చెత్త లాయర్‌వి. కానీ, కన్నీటి రుచి ఉప్పన అని తెలిసిన ఎంతో గొప్ప స్నేహానివి – నువ్వు దేవయాని దత్తావి.

**         **         **

నువ్వు జబ్బు మీద డబ్బు చేయని వెర్రిబాగుల వైద్యానివి. నీ అరచేతిని దీర్ఘరోగి పడక చేసే సత్తెకాలపు స్నేహగ్రస్తుడివి. నిజాలు చేప్పే నీ వృత్తి నీ పాలిట చెవిలో జోరీగ. రేపటిలోకి అలవాటు చొప్పున కొట్టుకు పోయే ప్రవాహం కాదు నీ దృష్టిలో ఫలితముంటే. ఏటి అడుగున పధ్నాలుగేళ్ళుగా బెసగని గులకరాయి కూడా కావొచ్చు. చచ్చుబడుతున్న ఒక్కొక్క అంగాన్నీ క్రొన్నెత్తుటి నదుల్లో ముంచి తీస్తావు. ఇంతకీ నెరిసిపోతున్న వెంట్రుకల్ని పేని ఏనుగంత చావుని ఏ పొలిమేరల ఆవల కట్టేయ చూస్తావు? నువ్వు ఖండితాంగాల్ని కలగనడం ఇష్టంలేని మొద్దునిద్రవి. చావు లాంటి బ్రతుకా… చావులా కన్పించే  విముక్తా… ఏది నయమో తేల్చలేని తర్జన భర్జనవి. నువ్వు డాక్టర్ నాయక్‌వి.

**         **         **

నువ్వు బొటనవేళ్ళతో మిగిలిన ఏకలవ్యుడివి. చాటు విద్యలు నేర్చినా శాపాలు సోకని కర్ణుడివి. అతను నీ గమ్యం, మూర్తీభవించిన నీ ఆదర్శం. నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసిన నీ దేవుడు, నెత్తురు కక్కుకుంటూ నేలకురాలిన దృశ్యాన్ని గుడ్లప్పగించి చూస్తావు. కానీ, నువ్వు తెల్లబోయి చూసేది బీటలు వారి ఎండిపోయిన వర్తమానాన్ని కావొచ్చు- కాకపోవచ్చు; నువ్వు తొంగి చూసేది కోటి తుళ్లింత తుంపర్లు జల్లే జలపాతపు గతాన్ని కావొచ్చు- కాకపోవచ్చు. ఊహలు మోసులెత్తే లేతప్రాయం నీది -నీకిప్పుడు ఐదేళ్ళు. కాదు…కాదు… రెండు దశాబ్దాల నీరీక్షణని రెండు అంగల్తో దాటొచ్చిన అంగదుడివి – నీకిప్పుడు పాతికేళ్ళు. ఏ ఔన్నత్య శిఖరం అంచున వెలిగే దీపమైనా ప్రేమేనని గ్రహించిన నువ్వు- పుట్టగానే పరిమళించిన పువ్వు. మొదళ్ళ బురద అంటని కెందామరవి. నిన్నటి నీ తండ్రి పాపాలకీ, నేటి నీ మోసాలకీ ఒకే ఒక ప్రాయశ్చిత్తాల ప్రేమవి. నువ్వు ఒమర్ సిద్దిఖీవి.

**         **         **

నువ్వు నీకే తెలియని అబద్ధానివి. కళ్ళు చెదిరే అందమైన ఆత్మవంచనవి. మోకాళ్ళలోతే ఉందనిపించే నంగనాచి రాత్రి నదివి. నీ సౌఖ్యానికి బాటలు వేసే మాటలకి నువ్వు భలే కట్టుబడతావు. సానుకూల ప్రమాణాల్ని నువ్వు జవదాటనే దాటవు. కానీ, అదిగో… అదొక మచ్చ. ఆ మహా ప్రేమికుడి పంటి కొన నీ పెదాల మీద వేసిన గాటు కాదు. నీ బ్రతుకు మొత్తాన్నీ సూచిస్తున్న మచ్చ. ఆ మచ్చని నాలుగు కన్నీటి బొట్లతో తుడి చేయగలవా? అతని మరణం నీ న్యూనతల మరకని దాచేస్తుందనేనా నీ ఆశ? బహుశా అందుకే ఎన్నో ‘కాదు”ల తర్వాత, నీ తొలి ‘అవును’ – అతని కఫన్‌పై కొట్టిన మొదటి మేకు! నిన్ను అపార్థంతో ద్వేషించం; అర్థం చెసుకునే అయిష్టపడతాం. అతని ముద్దు ముద్దర్లతో సోలి తేలిన దూదిపింజవి. కానీ, చివరి విందులో ద్రోహపు పెదాల జుడాస్ ముద్దువి. నువ్వు ఇస్టెల్లావి.

**         **         **

నువ్వు గబ్బిలం రెక్కల నల్లకోటువి. అపోహలే ఆద్యంతాలైన బండవాదానివి. నొసటి విరుపులో నీకు కన్పించేది నవ్వు; గొంతు జీరలో విన్పించేది సంగీతం. చిరునవ్వులో మూతి వంకరే చూస్తావు. జీవితపు కలైడోస్కోపులో నీకు రంగుల వక్రీభవనమే అర్థమౌతుంది. అలాగని అందం విలువ నీకు తెలియంది కాదు. అందానికి ‘విలువ’ మాత్రమే చూడగలవు. సౌందర్యానికి, ప్రేమకీ కూడా మోటివ్స్ అంటగడతావ్. అరవై సెకన్ల జీవితం కూడా భరించలేక అలమటిస్తావ్. తిమ్మిని బమ్మిని చేసే తెంపులేని బొంకువి. గిడసబారిన రాజ్యానికి రెండుకాళ్ళ ప్రతినిధివి. నువ్వు పాండరాస్ బాక్స్‌లాంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌వి.

**         **         **

నువ్వు కలతబారిన కొలనులో నిసిగ్గుగా తేలే సిగిరెట్ పీకవి. అందమైన కాన్వాస్ మీద రంగులు చేసుకున్న వాంతివి. అందమంటే నీకున్న అర్థం వేరు. అది ‘విలువ’ కాదు, అలాగని ‘ఆరాధనీయం’ ఎంత మాత్రం కాదు. అది నీ సొంత ఆస్తి, అప్పుడప్పుడూ గుర్తొచ్చే అక్కర. అందుకే, అసూయ నీ ప్రేమకి భారమితి కాదు. వేధింపు వర్ణాలతో ఆమెని పెయింట్ చేస్తానంటావు. వెటకారపు కాన్వాస్ మీద అతని బొమ్మేస్తానంటావు. పూరేకుల్ని నామరూపాలేకుండా రాల్చేయడం, నాజూకు కాడల్ని బెత్తాలు చేయడం, తామరతూడుల పెడరెక్కలు విరవడం నీ సృజనాత్మక స్వేచ్ఛలో భాగం. నువ్వు తారులో ముంచిన కుంచెవి. తెగతెంపుల తలుపులకి దాష్టికంగా వేసిన తాళానివి. నువ్వు నేవల్ డిసౌజావి.

**         **         **

నువ్వొక వెల్తురు సెమ్మెవి. రెపరెప రెక్కల దీపకాంతికి అర్థమిస్తున్న అభావాల నీడవి. నీ దృష్టిలో ‘త్యాగా”నికి ప్రత్యేక అర్థంలేదు. ఏవో ఆశయాల ఉదాత్తతకి ఇష్టాయిష్టాల కవళికలు మార్చడమేనా త్యాగమంటే? కాదు కనుకే నీ మెత్తని అడుగుల్లో ‘త్యాగం’ తాలూకూ రెండుకాళ్ళ చప్పుళ్ళు లేవు. రెండుగా చీల్చి చూసేందుకు ద్వంద్వాలు లేవు, ద్వైతాలూ లేవు. ఘనమైన ఆశయాలు, నీలపు ఆకాశాలు, కాళ్ళు జాపిన గమ్యాలు, పకడ్బందీ కలలు… ఏవీ లేవు; బ్రతుకంతా ‘అతను’ అనే ఏకవచనం, ఒకే ఒక సర్వనామం.

ఒక్క అతనే నీకు, కానీ పెక్కు ‘నీవులు’ నాకు. సలపరించే గాయం – గాయాన్ని మాంపే లేపనం; సతాయించే రోగం – సర్వరోగ నివారకం; ముంచెత్తే ఉప్పెన- ఉపద్రవంలో తొలికేక… అన్నీ నువ్వే. ఇన్ని మాటలెందుకు – బింబం నువ్వే… అద్దమూ నువ్వే. నువ్వు కోపిస్తావు గానీ, అందులో సెగలేదు, కనీసం పొగకూడా లేదు. నువ్వు ఆపాదమస్తకం చుట్టేస్తావు గానీ, దాంట్లో దురాక్రమణ లేదు, నిజానికసలు స్పర్శేలేదు. “పైన మార్బుల్…లోన గ్రానైట్…” అని అతనంటాడు గానీ, అతని ఆంతర్యంలో అది లేదు.

మేఘాల స్థిరాస్థిరపు చలనంతో నువ్వు నర్తిస్తే కన్పించని మువ్వల కెందుకా ఉలుకు? అతని కంటి కొలకల్లో  ఎందుకా చినుకు? ఈలవేటు దూరంలో తిరుగాడే ఒట్టి సేవికవి కానేకాదు. నువ్వు ఎల్లలు లేని ప్రేమానంతానివి. సంగమించాలని పెనుగులాడే సముద్రుడికి ఒకేఒక మోహాంతానివి. నువ్వు కంపించే పెదాల, ప్రకంపించే సౌందర్యాల సోఫియా డిసౌజావి.

**         **         **

నువ్వొక మొక్కవోని విశ్వాస కెరటాల సముద్రుడివి. కానీ ఇప్పుడు కొండపైకి బతుకుబండని మోసిమోసి అలిసిన అవిటి సిసిఫస్‌వి.

వెన్నుపూస నిచ్చెన్లు  ఎక్కలేని జీవనజ్వరం!

నీ వెన్నుపూస నిచ్చెన కాదు; పోనీ తోక తొక్కిన పాముకూడా కాదు. నిచ్చెన్లు, పాములు లేకపోయినా నీ తల వైకుంఠపాళి. నీ బతుకు తెగిన బల్లితోక!

నీ కోటేరేసిన ముక్కు దూలం మీద దురద. నేరం కంతిరి ఈగది కాదు, ఆమె తుంటరి గోరుది. దులుపుకుపోయే ఈగనైతే క్షమించేస్తావ్, కుదుళ్లు జొనిపి నీలోకి పాతుకుపోయిన ఆమెని కాదు. అయితే నేరానికి ప్రాయశ్చిత్తం? నీ వీడ్కోలు పెదాలకి తడారని ఆమె ముద్దు  మృత్యువంత చల్లని ముద్దు!

నీటిబుడగ బ్రతుకుతో యుగళగీతాలాపనే నీ మొత్తం ప్రదర్శన సారాంశం కాబోలు. బైటపెట్టడం కంటే, బహుశా దాచేయడమే జీవితాంతం నీ మేజిక్ కావొచ్చు! నమ్మబలికిన నీళ్ళలో నీలిమంట దాచావు. నరకంలాంటి నీ యాతనకి దూరంగా తల్లిని దాచావు. కన్వీనియెంట్‌గా ముఖం చాటేసిన ప్రియురాల్ని క్షమలో దాచావు. తమలపాకు అరచేతుల నాజూకులతలు పన్నెండేళ్ళుగా నిన్నల్లుకుపోతే, ఆ సంస్పర్శ పొందలేని పారలైజ్డ్  దిగులు దాచావు. నీలిమంటని నిట్టనిలువున వెంటాడే మాయాజాలంలో కరిగి కొవ్వొత్తి పాదాక్రాంతమవుతున్న మైనం పరమాణువుల్ని గుంభనంగా దాచావు. పుప్పొడి నవ్వుల్ని గుండెల్లో, వెచ్చని కన్నీళ్లు పక్క దిండుల్లో, ఒంటరి వెక్కిళ్లు ఇరుగు గదుల్లో దాచావు. శిధిలమౌతున్న ఇంటికప్పు కంతల నుంచి నీ భృకుటి మీద రాలే ఒక్కొక్క వానచుక్క… ఒక జీవితమంత బరువు, చావుకోసం చూసే ఎదురుచూపంత బరువు, తలపుల్ని ఛిద్రం చేసే నిరానుభవమంత బరువు! బహుశ చలనం మిగిలిన నొసటి గీతల మధ్యేనా ఆ బరువంతా దాచావు?

హద్దుల్లేని ప్రేమని పాటించి, ప్రభోదించిన unsung ప్రవక్తవి. తెంపులేని గెలుపు కెరటాలున్నా, తెరపిలేని సముద్ర ఘోషవి. నువ్వు నిశ్చల చైతన్యాల, నిత్య జ్వలిత దీపశిలల ఇథెన్ మాస్కురేన్హస్‌వి

**         **         **

నువ్వు ప్రేమసామ్రాజ్ఞి సొఫియా మనోసౌందర్య మహత్కాంతికి అంధుడివి. నిలిచి గెలిచిన ఇథెన్ నిశ్శబ్ద ప్రేమకి విచలితుడివి.

తిరిగెళ్ళే కెరటం కాలికింద ఇసుకని తోడేయడం కుట్రకాకపోవచ్చు. ఒడ్డు భుజాల మీంచి సొలిసి జారిపోవడం పలాయనం కాదని కూడా నీకు అర్ధమయింది. అయినా, ‘ప్రాజెక్టు యుథనసియా”కి నువ్వు ఔనన లేవు.

ఆమె మెత్తని గుండెల ఎడద తలగడైన స్పర్శ అతన్ని అనేళ్ళుగా అంటకపోయుండొచ్చు. మిగలపండి వెగటు వేయక ముందే ఆ తీపి ప్రేమస్మృతులతోనే మిగిలిపోవాలని అతను అనుకొని ఉండొచ్చు. కానీ, చరిత్ర దస్తావేజులకి సైతం అందని మహత్తర ప్రణయగాథ తమదని అతను గ్రహించాక, అనురాగభారంతో అరమోడ్పులైన ఆ జగత్ప్రేయసి కంట్లో అతని ఆత్మదర్శనమైనట్లు నువ్వు గ్రహించాక, తన ఐచ్చిక మరణాన్ని ఔనని ఎలా అంటావు?

అందుకే నవ్వుల, కేరింతల, హోరెత్తే పాటల, దాచిన కన్నీళ్ళ చివరి విందులో నువ్వు లేవు. నువ్వొక మామూలు ప్రేక్షకుడివి. అతని వీడ్కోలు గీతంలో శ్రుతి కలవలేని దుఃఖితుడివి. ఆమెని విడిచి వెళ్ళొద్దని చేస్తున్న ప్రార్థనవి. నువ్వు అచ్చం ‘నేను’వి!

నరేష్ నున్నా

15 Comments
 1. ramnv December 9, 2010 /
 2. జాయ్ December 9, 2010 /
 3. jagaddhatri December 9, 2010 /
 4. jagaddhatri December 9, 2010 /
 5. jagaddhatri December 9, 2010 /
 6. కొత్తపాళీ December 9, 2010 /
 7. sasank December 10, 2010 /
 8. రమణ December 10, 2010 /
 9. విజయసాయి December 10, 2010 /
 10. Ravindranath Nalam December 10, 2010 /
 11. పూర్ణప్రజ్ఞాభారతి December 11, 2010 /
 12. Nagarjuna G December 12, 2010 /
 13. achari January 14, 2011 /
 14. Nanduri Raj Gopal December 10, 2016 /
 15. A. Srinivasa charyulu. February 9, 2017 /