Menu

‘ఫిక్కీ ఫ్రేమ్స్‌ 2010’ లో తెలుగు సినిమా కోసం…

హైదరాబాద్ లోని మారియాట్ హోటల్‌లో ఫిక్కీ ఫ్రేమ్స్ ఆధ్వర్యంలో బుధవారం  ప్రారంభమై రెండు రోజుల పాటు మీడియా, వినోద రంగాల వ్యాపార సదస్సు జరిగింది. అందులో మన తెలుగు సినిమా ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లబుచ్చారు.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘బడ్జెట్‌ అనేది సినీ నిర్మాణానికి అవసరమైన ఓ సాధనం మాత్రమే. కథకి అనుగుణంగా దాన్ని ఉపయోగించుకోవాలి. పెట్టుబడిని తిరిగి రాబట్టుకొనేలా చిత్రాన్ని తీర్చిదిద్దుకోవాలి అన్నారు  ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. అలాగే నిర్మాతలు సినిమాలు ఎందుకు తీస్తున్నారు…? ఆ డబ్బును రియల్ ఎస్టేట్‌లోనో, ఫిక్స్‌డిపాజిట్ల రూపంలోనే పెట్టుబడి పెడితే కొన్నాళ్లకు వాటికి రెట్టింపు డబ్బు వస్తుంది కదా…! సినిమా నిర్మాణమంటే ఇష్టం.. అందుకే సినిమాలు నిర్మిస్తున్నారు అని ఉద్వేగపూరితంగా ప్రసంగించారు

అలాగే  సూపర్‌హిట్ సినిమాలకు అత్యధిక బడ్జెట్‌లు ఎంత వరకు అవసరం  అనే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ.. ఇటీవల అపజయాల పాలైన భారీ చిత్రాలను సదరు నిర్మాతలు.. కథను వినకుండా కేవలం కాంబినేషన్, హీరో మార్కెట్ విలువ చూసుకొని సినిమా లు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తను సినిమా లు చేయనని, తను ఏమీ తీయాలనుకుంటాననో దానిపైనే దృష్టిపెడతానని చెప్పారు.

దర్శకుడు తేజ మాట్లాడు తూ.. తన తొలి చిత్రం  ‘చిత్రం’  కేవలం 42 లక్షలతోనే తెరకెక్కించానని, దాదాపు రూ.6 కోట్లు వసూలు చేసింది. కథలో కొత్తదనం, నవ్యరీతిలో ప్రచారం చేయడం వల్లే ప్రేక్షకులు ఆదరించార”ని తేజ చెప్పారు. ప్లాప్ విలువ ఎంతో తెలుసుకొని ఆ బడ్జెట్‌లోనే తన సినిమాలను తీస్తానన్నారు.

అష్టాచెమ్మ ఫేమ్ …ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ…కేవలం  3,500లతో తన తొలి డాక్యుమెం టరీని రూపొందించానని  చెప్పారు.

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ…చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఎంచుకొన్న విషయంలో నాణ్యత ఉండాలి. అలాగే ప్రచారం లాంటి అంశాల్నీ మరువకూడదన్నారు.

దర్శకుడు క్రిష్‌ మాట్లాడుతూ ”నేను తెరకెక్కించిన ‘గమ్యం’ రూ.2.5 కోట్లతో పూర్తయింది. అది చిన్న సినిమానే అయినా కథ, కథనాలు నచ్చడంతో చక్కటి వ్యాపారాన్ని చేసింది. మల్టీప్లెక్స్‌ల్లోనూ ఈ చిత్రం ప్రదర్శితమైంది. ‘వేదం’ చిన్న సినిమానే అయినా స్టార్స్‌ ఉండటంతో పెద్ద సినిమా స్థాయి ప్రచారం లభించింద”న్నారు.

ప్రముఖ నిర్మాత రామోజీ రావు గారు …స్క్రిప్టు బాగాలేక చాలా సినిమాలు అపజయం పొందుతున్నాయి. కథ మీద బాగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకులు ఆయా పాత్రల్లో తమను తాము చూసుకోగల్గిన కథ, చిత్రీకరణ ఉన్న సినిమాలే విజయాన్ని సాధిస్తాయి.  వివిధ రకాల వినోద సాధనాలు ఇంట్లోకే వచ్చి చేరుతున్న ఈ కాలంలో ఎక్కడో దూరంగా ఉన్న థియేటర్‌కు వెళ్లడానికి ప్రేక్షకుడు ఇష్టపడడు. అందుకే పొరుగునే సినిమా థియేటర్లు ఉండేలా ప్రోత్సహించాలి. పట్టణాల్లోని ప్రతి ప్రాంతంలోనూ చిన్న సినిమా హాలు ఉండాలి అన్నారు.

మంచు విష్ణు మాట్లాడుతూ ”డాక్టర్‌ అవ్వాలంటే ఎమ్‌బీబీఎస్‌ చదవాలి. ఇంజనీర్‌ కావాలంటే బీటెక్‌ పూర్తి చేయాలి. పైలెట్‌ అయ్యేందుకు శిక్షణ అవసరం. మరి సినిమా రంగంలో అడుగుపెట్టేవాళ్లకి ప్రత్యేక అర్హతలు అక్కర్లేదా? ఈ ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు. మన పరిశ్రమలోకి నిపుణులు రావాలంటే సినిమా గురించి చెప్పే శిక్షణాలయాలు ఏర్పాటు కావాలి. నటులనే కాదు రచయితల్నీ, దర్శకుల్నీ, సాంకేతిక నిపుణుల్నీ తీర్చిదిద్దేందుకు అవి దోహదపడతాయి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఆహ్వానించి సినిమాలకు ఉపయోగించుకొంటేనే ఫలితాలు వస్తాయ”న్నారు.

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ”తెలుగు సినిమా మార్కెట్‌ విషయంలో మనం ముందుకు వెళ్లాలి. పొరుగున ఉన్న కొన్ని రాష్ట్రాలు, అమెరికా… ఇలా లెక్కలు వేసుకొంటూ పరిమితమైపోకూడదు. ఆగ్నేయాసియా దేశాల వైపూ మనం దృష్టిపెట్టాలి. ఇప్పటికే తమిళ చిత్రాలు ఆ దేశాల్లో విడుదలవుతున్నాయి. సినిమా స్కూళ్ల ద్వారా మంచి లైన్‌ ప్రొడ్యూసర్లనీ మనం తయారు చేసుకోవచ్చు. ఫలితంగా చిత్ర నిర్మాణం, వ్యాపారంలో మంచి మార్పులొస్తాయ”న్నారు.

హీరో సుమంత్ మాట్లాడుతూ..”చిత్ర పరిశ్రమలో మా తాతగారి కాలంలో నలుగురైదుగురు హీరోలకే బలమైన మార్కెట్‌ ఉండేది. ఇప్పుడు మార్కెట్‌ ఉన్న హీరోల సంఖ్య పెరిగింది. ఈ పరిణామాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు పక్కా స్క్రిప్టుతో షూటింగ్‌కి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. స్క్రిప్టుతోనే సెట్స్‌ మీదకు వస్తే నిర్మాణ వ్యయాన్ని అదుపు చేసుకోవచ్చు అన్నారు.

లక్ష్మీ మంచు మాట్లాడుతూ …ప్రాంతీయ భాష అంటూ ఒక రాష్ట్రానికే సినిమాని పరిమితం చేసుకోకూడదు. హద్దులు చెరుపుకొని మార్కెట్‌ పెంచుకొంటేనే మంచి చిత్రాలొస్తాయ న్నారు.

కమల్ హాసన్ మాట్లాడుతూ..”అక్కినేని నాగేశ్వరరావు లాంటి గొప్ప నటులు ఏ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోనూ చదువుకోలేదు. అయితే వారికి నాటక రంగమే గొప్ప శిక్షణ ఇచ్చింది. ఈతరానికి సినిమా స్కూళ్లు ఎంతో ఉపయోగపడతాయి. ఆ శిక్షణాలయాల సంఖ్య పెరగాలి. వాటి ద్వారా చిత్ర పరిశ్రమకి అవసరమైన సృజనశీలుర్ని తయారుచేసుకోవచ్చు. మన ముందు తరంవారు చేసిన గొప్ప చిత్రాల్ని అధ్యయనం చేసి, వారి అనుభవాల్ని తెలుసుకోవాలి. ‘మాయాబజార్‌’కి ఛాయాగ్రాహకుడిగా పని చేసిన మార్కస్‌ బార్‌ట్లే ద్వారా నేను ఎన్నో సాంకేతిక విషయాలు తెలుసుకొన్నాను. ఆ చిత్రానికి సహాయ దర్శకుడిగా వ్యవహరించిన సింగీతం శ్రీనివాసరావు ద్వారా ఆ చిత్ర అనుభవాల్ని తెలుసుకోగలిగాను. ఇవన్నీ మనకి కొత్త సంగతుల్ని చెబుతాయి” అన్నారు.

వాల్ట్‌డిస్నీ ప్రతినిధి స్వాతిశెట్టి మాట్లాడుతూ ”ప్రాంతీయ భాషా చిత్రాల వ్యాపారానికి విదేశీ సినిమాలు ఏ మాత్రం అడ్డంకి కావు. మంచి సినిమా అయితే అన్ని చోట్లా ఆదరణ దక్కుతుంది. ‘అవతార్‌’, ‘రోబో’ మంచి చిత్రాలు కావడంతోనే స్థానిక ప్రేక్షకులు ఆదరించారన్నారు.

ఇవన్నీ వారి అభిప్రాయాలు ..సరే ఇంతకీ మీరు (మనం) ఏమంటారు..మన అభిప్రాయాలు చెప్పుకోవటానికి “నవతరంగమే”..మారియట్ హోటల్  (వేదిక)

5 Comments
  1. విజయవర్ధన్ December 3, 2010 /
  2. చక్రధర్ December 3, 2010 /
  3. కొత్తపాళీ December 3, 2010 /
    • holyman December 4, 2010 /