Menu

‘సిత్ర’మైన సినీ బ్లాక్ మార్కెట్ విధానాలు

రెక్కలొచ్చిన తెలుగు సినిమా టికెట్ రేట్లు!

ఈ మధ్య ‘రగడ‌’ చిత్రం పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ హీరో నాగార్జున, అలాగే అంతకు కొన్ని వారాల ముందు ‘ఆరెంజ్‌’ చిత్ర పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, హీరో చిరంజీవి చాలా ఆవేశంగా పైరసీదారులపై విరుచుకుపడ్డారు. ఎంతో కష్టపడి, కోట్ల రూపాయలు వెచ్చించి, చిత్ర నిర్మాతలు సినిమా తీస్తుంటే, వాళ్ళ మొత్తం కష్టాన్ని పది రూపాయల సీడీలతో పైరసీదారులు తేలిగ్గా కొట్టేసి, దొంగ సొమ్ము సంపాదించేస్తున్నారంటూ దుయ్యబట్టారు. నిజమే! చిత్రసీమకు పట్టిన దౌర్భాగ్యం – దారుణమైన పైరసీ! దీన్ని అందరూ ఖండించాల్సిందే! పైరసీని నిరోధించాల్సిందే! ఒక్క క్షణం ఆ సంగతి అటుంచి, ఇప్పుడు నాణానికి రెండో కోణం చూద్దాం. ఇంత పైరసీ అసలు ఎలా పెరుగుతోంది? దీనికి హీరోలు, దర్శక – నిర్మాతల బాధ్యత ఏమిటి? ప్రేక్షకులు హాలుకు వెళ్ళడం మానేసి, పైరసీ సీడీలను ఎందుకు ఆశ్రయిస్తున్నారు? ఈ విషయాలన్నీ లోతుగా ఆలోచిస్తే, పైరసీకి కారణమై, ఊరూరా పాకుతూ, తెలుగు సినిమాను తినేస్తున్న క్యాన్సర్‌ కనిపిస్తుంది. అది ఏమిటంటే – సామాన్యుడికి అందుబాటులో లేని సినిమా టికెట్‌ రేట్లు!

టికెట్ రేట్ల వ్యవహారం ఎప్పుడూ ఉన్నదే కదా అని తేలిగ్గా కొట్టిపారేయకండి. ఆంధ్రప్రదేశ్ లోని పెద్ద నగరాలను కాస్త పక్కనపెడదాం. రాష్ట్రంలోని మిగిలిన ఏ ఊళ్ళోనైనా అగ్ర హీరోల సినిమాకు విడుదలైన తొలి రోజుల్లో వెళ్ళి చూశారా. వెళ్ళి చూస్తే, చూద్దాం. సినిమా హాళ్ళలో పబ్లిక్‌గా ప్రేక్షక జనానికి జరుగుతున్న నిలువు దోపిడీ కళ్ళెదురుగా కనబడుతుంది. సినిమాకున్న క్రేజును బట్టి హాలు కౌంటర్‌లోనే అధికారికంగా టికెట్లను ఎక్కువ రేట్లకు అమ్మేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద హీరోల తెలుగు చిత్రాలు సగటున 250 నుంచి 300 కేంద్రాల్లో విడుదలవుతున్నాయి.
సినీ వ్యాపార పరిభాషలో ఈ కేంద్రాలను ఏ ప్లస్ (హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటివి), ఏ (తెనాలి, ఒంగోలు, నరసరావుపేట, చిలకలూరిపేట లాంటివి), మేజర్ బి, మైనర్ బి, మేజర్ సి, మైనర్ సి – అనే ఆరు వర్గాలుగా వర్గీకరిస్తుంటారు.

ఇందులో ప్రభుత్వ అధికారుల నిఘా ఎంతో కొంత ఉండే ‘ఏ ప్లస్‌’ కేంద్రాల్లో తప్ప, మిగిలిన అన్ని కేంద్రాల్లో ఈ అడ్డగోలు టికెట్‌ రేట్ల విధానం ఇష్టారాజ్యంగా సాగుతోంది. …రాష్ట్రంలో మహా అయితే ఓ 10 కేంద్రాలు మినహా, మిగిలిన అన్ని చోట్లా ఈ దోపిడీ సాగుతోంది. ఒకప్పుడు హాలు బయట ఎవరో, అదీ కొన్ని టికెట్లే బ్లాకులో అమ్మేవారు, అమ్మించేవారు. కానీ, ఇవాళ బాహాటంగా బుకింగ్ లోనే అన్ని టికెట్లూ బ్లాకులో అమ్మేస్తున్నారు… అని సినిమా పంపిణీ, ప్రదర్శక రంగాలపై పట్టున్న కొమ్మినేని వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.

ఇటీవలి కాలంలో ఏ తెలుగు సినిమా అయినా చూడండి. ఆరంభంలోని ఈ అడ్డగోలు టికెట్ రేట్ల పుణ్యమా అని ప్రతి అగ్రహీరో తెలుగు సినిమా తొలి వారంలోనే కోట్ల కొద్దీ ఆర్జిస్తోంది. చిత్రం ఏమిటంటే – బాగా లేదని టాక్ వచ్చిన సినిమాకు కూడా తొలినాళ్ళ కలెక్షన్లు కళ్ళు తిరిగేలా ఉంటున్నాయి. దీనికి కారణం – ఇలా అడ్డగోలు రేట్లకు టికెట్లను అమ్మే విధానమే. నిజానికి, ప్రభుత్వపరంగా ఈ విధానానికి అనుమతి లేదు. గతంలో జై చిరంజీవ (2005 డిసెంబర్) చిత్రం విడుదల సమయంలో మన సినిమా పెద్దలే తమ పలుకుబడితో, అప్పటి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో ఓ ఉత్తర్వు ఇప్పించుకున్నారు. విడుదలైన కొత్త సినిమాకు రెండు వారాల పాటు హాలులోని పై రెండు తరగతుల టికెట్ రేట్లనూ పెంచుకొనేందుకు అనుమతి పొందారు. అలా టికెట్ రేట్లు ఒక్కసారిగా అందని ఎత్తుకు వెళ్ళాయి. దాదాపు 40 రూపాయల బాల్కనీ టికెట్ కాస్తా రూ. 70 దాకా వెళ్ళింది. అలా టికెట్లను అధికారికంగానే ఎక్కువ రేట్లకు అమ్మే ఏర్పాటును తెలివిగా చేసుకున్నారు. భారీ ఖర్చు పెట్టి జై చిరంజీవ తీసినవాళ్ళూ, భారీ రేట్లకు ప్రాంతాల వారీగా సినిమా హక్కులు కొన్నవారూ ఈ రేట్ల పెంపు వెనుక ఉన్నారని అప్పట్లో కృష్ణానగర్ జనం కోడై కూశారు.

అది అలా ఉంచితే, మొత్తానికి ఈ పద్ధతి వల్ల తొలివారాల్లో పెద్ద సినిమాలకు వసూళ్ళు పెరిగినా, పోను పోనూ పైరసీకి ఇది యథోచితంగా తోడ్పడింది. దానికి చిత్రపరిశ్రమలోని వర్గ రాజకీయాలు వచ్చి చేరడంతో – మళ్ళీ అదే సినీ పెద్దలు ఆ రెండు వారాల టికెట్ రేట్ల పెంపు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో రద్దు చేయించారు. కాగా, మళ్ళీ ఇటీవలే కొద్ది నెలల క్రితం మళ్ళీ రోశయ్య నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఈ సారి మొదటి రెండు వారాలనే కాకుండా శాశ్వతంగా టికెట్ రేట్లు పెంచుకొనే అనుమతి తెచ్చుకున్నారు. దీంతో ఇప్పుడు పెద్ద ఊళ్ళలో బాల్కనీ టికెట్ రేటు రూ. 40 నుంచి రూ. 50 అయింది. ఇక, మల్టీప్లెక్సుల్లో టికెట్ రూ. 100 నుంచి రూ. 150 అయింది. …ఈ అనుమతులన్నీ పరిశ్రమ కోసం, ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు కానే కావు. భారీ రేటుకు తాము ఏరియాల వారీగా కొన్న సినిమాల మీద డబ్బులు వెనక్కి రాబట్టుకోవడం కోసమే. ఇవన్నీ ప్రభుత్వాన్ని మభ్యపెట్టి సంకుచిత, స్వార్థ ప్రయోజనాలతో చేసిన పనులే… అని చిత్రపరిశ్రమ అంతర్గత వర్గాలు లోగుట్టు బయటపెట్టాయి.

అసలు ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా, ఎక్కడికక్కడ లోపాయకారీగా జరుగుతున్న అడ్డగోలు టికెట్ల రేట్ల దోపిడీ విధానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రబలమైన జాఢ్యంగా విస్తరిస్తోంది. తెలుగునాట సినిమా హాళ్ళలో ప్రస్తుతం టికెట్లను రెండు రకాలుగా అక్షరాలా అధికారికంగా బ్లాకులో అమ్మేస్తున్నారు. అందులో మొదటిది – ‘ఫ్లాట్‌ రేట్ల విధానం’. అంటే – బాల్కనీ నుంచి నేల వరకు హాలులోని అన్ని తరగతుల టికెట్లనూ ‘ఫ్లాట్‌’ రేటున బాల్కనీ టికెట్‌ ధరకే కౌంటర్‌లోనే అమ్మేస్తారు. ఈ పద్ధతిలో ‘ముందు వచ్చినవారిని మున్ముందు’ పద్ధతిలో, పైనుంచి కిందికి తరగతుల సీట్లను క్రమంగా నింపుతారు. ముందుగా హాల్లోకి వెళితే బాల్కనీలో కూర్చుంటే, పై తరగతులు నిండిపోయాక వెళితే బాల్కనీ రేటిచ్చి కొన్న టికెట్‌తో నేల తరగతిలో కూర్చొని సినిమా చూడాల్సి వస్తుంది. ఇది చాలా ఏళ్ళుగా చిన్న కేంద్రాల్లో సాగుతున్న వ్యవహారం.

ఇక, రెండోది – ‘జంపింగ్‌ రేట్ల విధానం’. అంటే – సినిమాకున్న క్రేజును బట్టి, బాల్కనీ అసలు రేటుకు అయిదారు రెట్ల ధరకు టికెట్లన్నీ అధికారికంగా కౌంటర్‌లోనే అమ్మేస్తారు. రోజులు గడిచి, క్రేజు తగ్గే కొద్దీ అడ్డగోలు ధరను తగ్గించుకుంటూ అసలు సిసలు అధికారిక టికెట్‌ రేటు వద్దకు వస్తారు. ఆ లోగా సినిమా చూడాలంటే, ప్రేక్షకుడికి పెనుభారమే. ఈ దశాబ్దం మొదట్లో ఆరంభమైన ఈ అక్రమ వ్యాపారం ఒకప్పటి ‘ఇంద్ర’ దగ్గర నుంచి నేటి ‘రోబో’, ‘ఆరెంజ్‌’ల వరకు అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతోంది.

కొన్ని ఊళ్ళలో అయితే, సినిమా తొలి నుంచి ఆఖరి రోజు వరకూ హాలులోని అన్ని తరగతులకూ ఒకే టికెట్‌ రేటుతో దోపిడీ సాగడం విచిత్రం. ఉదాహరణకు, ప్రకాశం జిల్లా కందుకూరు అనే చిన్న కేంద్రం సంగతే తీసుకుందాం. (తెలుగు సినిమా వ్యాపార పరిభాషలో ‘పాత నెల్లూరు జిల్లా’ పరిధిలోకి వచ్చే ఈ కేంద్రాన్ని చిన్నస్థాయి ‘బి’ సెంటర్ (మైనర్ బి) అంటారు). అక్కడ అధికారికంగా సినిమా హాలులో గరిష్ఠ టికెట్ రేటు సుమారు రూ. 20 మాత్రమే. కానీ, అక్కడ ఏ సినిమా కైనా సరే పై నుంచి కింది దాకా అన్ని తరగతుల టికెట్లనూ రూ. 25 నుంచి రూ. 30 వరకు అమ్ముతుంటారు. ‘‘ఇక్కడ ఆఖరికి నేల టికెట్ కూడా అదే 25 – 30 రూపాయలే. ఈ రోజుతో సినిమా ఆఖరు అన్నప్పుడు మాత్రం ఆ ఒక్క రోజుకు ఏ తరగతి టికెట్ ను ఆ తరగతి రేటుకే అమ్ముతారు’’ అని ఆ ఊరి సినిమా ప్రదర్శన సంగతులు తెలిసిన ఓ ప్రేక్షకుడు వివరించారు.

ఇదీ తమిళం నుంచి దిగుమతే!

రజనీకాంత్‌ లాంటి క్రేజీ పెద్ద హీరోల చిత్రాలకు తమిళనాట ఈ ‘ఫ్లాట్‌ రేట్లు’, ‘జంపింగ్‌ రేట్ల’ పద్ధతులు అమలులో ఉన్నాయి. అక్కడ నుంచి ఈ జాడ్యాన్ని తెలుగు చిత్రసీమ కూడా చాలా ఏళ్ళ క్రితమే అంటించుకుంది. అంతకు ముందు ఒకటి రెండు చిత్రాలకు జరిగినా, ప్రధానంగా చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ (2002) చిత్రం నుంచి ఈ ‘జంపింగ్‌ రేట్ల విధానం’ తెలుగు నాట విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పట్లో చీరాల లాంటి చిన్న పట్నంలోనే మొదటి రోజున ఒక్కో టికెట్ రూ. 400 చొప్పున కౌంటర్ లో అమ్మేసినట్లు తెలుగు సినీ వ్యాపారవర్గాలు ఆ చరిత్రంతా చెబుతున్నాయి. కాగా, జనంలో క్రేజున్న సినిమాలకు ఇలా దర్జాగా కౌంటర్ లోనే అసలు రేటు కన్నా ఎక్కువ రేటుకు టికెట్లను అమ్మే ‘జంపింగ్ రేట్ల’ విధానం తెలుగునాట ఇప్పుడు ఊరూరా పాకింది. ఇలా వచ్చిన అనధికారిక సొమ్ముతో ఏ సినిమాకు ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించి, జబ్బలు చరుచుకుంటోంది.

పెట్టిన ఖర్చును గబగబా వెనక్కి రప్పించుకోవాలని భారీయెత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన ‘రోబో’ సినిమాకు టికెట్ల రేట్లు కూడా భారీగానే పెట్టారు. తమిళనాట పెద్ద పెద్ద మల్టీప్లెక్సుల్లో సైతం రూ. 120కి మించి టికెట్‌ రేటు ఉండకూడదనే ప్రభుత్వ నిబంధన ఉంది. దాన్ని పాటిస్తున్నట్లు నటిస్తూ, టికెట్‌ మీద మాత్రం మామూలు రేటే ముద్రించి, ‘రోబో’ / ‘యంతిరన్‌’ ప్రేక్షకులకు మాత్రం ఒక్కో టికెట్‌నూ రూ. 200 నుంచి రూ. 500 వరకు అధికారికంగా, కౌంటర్‌లోనే అమ్మేశారు. మద్రాసులో సాగిన ఈ నిలువుదోపిడీకి నేను ప్రత్యక్షసాక్షినే కాక, బాధితుణ్ణి కూడా. తమిళనాట తెలుగు అనువాద చిత్రం ‘రోబో’ను ప్రదర్శిస్తున్న హాళ్ళు కూడా ఈ దోపిడీలో యథేచ్ఛగా పాల్గొన్నాయి. ఆ రకంగా తొలినాళ్ళలోనే సినిమా చూడాలన్న ప్రేక్షకుల ఆసక్తినీ, బలహీనతనూ ఆసరాగా తీసుకొని, డబ్బులు దండుకుంటున్నారు.

బ్లాక్ టికెట్లతో మన హీరోల భారీ రికార్డులు

స్థానిక ప్రభుత్వ, పోలీసు యంత్రాంగం కావాలని కళ్ళు మూసుకుంటూ ఉండడంతో, ఇవాళ అధికారికంగా సినిమా హాలు కౌంటర్ లోనే బ్లాకులో టికెట్లు అమ్మే విధానాలు ఆంధ్రదేశంలో ప్రతి అగ్ర హీరో సినిమాకూ నిత్యకృత్యమయ్యాయి. విడుదలైన సినిమాకు క్రేజు ఉన్నన్ని రోజులూ ఈ జంపింగ్ రేట్లు, ఫ్లాట్ రేట్ల విధానంలోనే టికెట్లు అమ్ముతున్నారు. అత్యధిక శాతం హాళ్ళ వారందరూ ఒక్కో టికెట్‌ రూ. 200 – 300 ఉండే ‘జంపింగ్‌ రేట్ల’ విధానాన్నే ఆశ్రయిస్తున్నారు. గత పోస్టులోనే చెప్పినట్లు – తెలుగు హీరోల చిత్రాలతో పాటు, తాజా అనువాద చిత్రం ‘రోబో’కు కూడా ఈ పద్ధతే యథేచ్ఛగా కొనసాగింది. ఆ నేపథ్యంలో ‘రోబో’ వసూళ్ళు తొలి వారం పది రోజులకు రికార్డుల మీద రికార్డులు సృష్టించాయి.

భారీ రికార్డుల్లో బలుపు కన్నా వాపే ఎక్కువ

అగ్ర హీరోల సగటు తెలుగు సినిమా కలెక్షన్లకు సంబంధించి ఓ ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఈ అడ్డగోలు టికెట్‌ రేట్లతో వస్తున్న తొలి వారం వసూళ్ళే ఆ సినిమాకు మొత్తం మీద వచ్చే కలెక్షన్లలో 60 నుంచి 70 శాతం! ఇది విస్మయం కలిగించే వాస్తవం. ఉదాహరణకు, చిన్న ఎన్టీయార్ నటించిన ‘అదుర్స్’ చిత్రం గుంటూరు జిల్లాలో ఆడిన అన్ని వారాలూ కలిపి మొత్తం రూ. 2.7 కోట్ల మేర వసూళ్ళు సాధించింది. అయితే, అందులో ఒక్క తొలి వారంలో వచ్చినవే రూ. 1.75 నుంచి 1.78 కోట్లు. దీన్నిబట్టి సగటు తెలుగు చిత్రాల మొదటి ఒకటి రెండు వారాల వసూళ్ళలో బలుపు కన్నా వాపే ఎక్కువని ఇట్టే గ్రహించవచ్చు.

ప్రేక్షకులను దోచేస్తున్న ఈ పద్ధతి వల్ల ఒకే ఒక్క ప్రయోజనం ఉంది. ఫ్లాపైన సినిమా కూడా భారీగా నష్టపోకుండా, మొదటి వారం రోజుల కలెక్షన్లతో కొంత మేర పెట్టుబడిని వెనక్కి రప్పించడానికే ఈ పద్ధతి ఉపయోగపడుతోంది. దాదాపు రూ. 35 కోట్ల పైగా ఖర్చుతో రూపొంది, టైటిల్‌ విషయంలో తెలంగాణ ప్రాంతంలో వివాదాస్పదమైన ఓ ప్రముఖ హీరో చిత్రం ఇటీవల పెద్ద ఫ్లాపైంది. అయినా సరే, రాష్ట్రంలో ఆ చిత్రానికి వచ్చిన నికర వసూళ్ళు దాదాపు రూ. 15 కోట్లు. లెక్క చూస్తే, అందులో సగం ఇలా అడ్డగోలు టికెట్లతో తొలి రోజుల్లో వచ్చిన అక్రమ సొమ్మే! ఈ అడ్డగోలు టికెట్‌ అమ్మకాలే లేకపోతే, ఆ సినిమా మరింత నష్టపోయేది. కౌంటర్‌లోనే అమ్మిన బ్లాక్‌ పుణ్యమా అని అంత పెద్ద ఫ్లాప్‌లో కూడా నష్టాన్ని కొంత పూడ్చుకోగలిగింది.

పారిపోతున్న ప్రేక్షకులు – పెరిగిపోతున్న పైరసీ

గతంలో కింది పట్నాల్లో ఇలాంటి వినాశకర ధోరణి ఉన్నా, నెల్లూరు లాంటి పెద్ద పట్నాల్లో అధికారుల నిఘాకు వెరచేవారు. మామూలు రేట్లకే టికెట్లు అమ్మేవారు. కానీ, ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితి మారిపోయింది. అగ్ర హీరోల సినిమాను తొలి రోజుల్లో చూడాలంటే, అయిదుగురు సభ్యుల కుటుంబానికి కనీసం వెయ్యి రూపాయలు టికెట్లకే అవుతోంది! గుంటూరు జిల్లా సంగతే చూస్తే, అక్కడ సగటున ప్రతి పెద్ద సినిమా 22 ప్రింట్లతో విడుదలవుతుంది. ఇప్పుడు వాటిలో 21 ప్రింట్లు ఈ రకంగా అడ్డగోలు టికెట్ రేట్లతోనే ప్రదర్శితమవుతున్నాయి. ఈ రేట్ల దెబ్బతో – హాలుకొచ్చి సినిమా చూడాలంటే ప్రేక్షకుడు భయపడి పారిపోతున్నాడు. అదే సమయంలో సినిమా చూడాలనే కోరికను చంపుకోలేక, చౌకగా దొరికే పైరసీ సీడీలను అనివార్యంగా ఆశ్రయిస్తున్నాడు.

”ఇది చిత్రపరిశ్రమ స్వయంకృతాపరాధం. ప్రేక్షకులను దేవుళ్ళుగా పేర్కొంటూనే, ఎక్కువ రేట్లతో వాళ్ళను మేమే హింసిస్తున్నాం. వాళ్ళను అక్షరాలా దేవుళ్ళ లాగా చూసుకుంటేనే, వాళ్ళు ఒకటికి పదిసార్లు హాళ్ళలో సినిమా చూసి, వరాలిస్తారు. దీర్ఘకాలం పాటు పరిశ్రమను పరిరక్షిస్తారు. కానీ, అలా జరగడం లేదు” అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్‌ వాపోయారు. ”పరిస్థితి ఎలా ఉందంటే – ఇవాళ వేగంగా కోడిని కోసుకు తిందామని అనుకుంటున్నామే తప్ప, గుడ్లు పెట్టే దాకా ఆగడం లేదు. రోజుకో గుడ్డు తిందామని అనుకోవడం లేదు. అదే జరుగుతున్న పెద్ద తప్పు” అని ఆయన ఆవేదనగా వ్యాఖ్యానించారు.

సర్కారీ ఖజానాకు సినిమా దొంగల గండి

అధికారికంగా సినిమా హాలు కౌంటర్ లోనే బ్లాకులో టికెట్లు అమ్మేస్తున్న ఈ పద్ధతుల వల్ల ప్రభుత్వానికి కూడా భారీ నష్టం కలుగుతోంది. నిజానికి, తెలుగు సినిమా తనకు వచ్చే మొత్తం వసూళ్ళ (గ్రాస్‌)లో సగటున 15 శాతం దాకా వినోదపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ‘రోబో’ లాంటి అనువాద, పరభాషా చిత్రాలకైతే ఆ పన్ను 20 శాతం దాకా ఉంటుంది. కానీ, చిత్ర ప్రదర్శకులు తాము నిజంగా అమ్మిన టికెట్ల సంఖ్య కానీ, వాటి అడ్డగోలు రేటు కానీ బయటపెట్టరు. తక్కువ టికెట్లే, అదీ మామూలు రేటుకే అమ్ముడైనట్లు చూపిస్తారు. అలా వీలైనంత తక్కువ వినోదపు పన్ను చెల్లిస్తారు. అంటే, అడ్డగోలు టికెట్‌ రేట్లతో ప్రేక్షకులకే కాక, ఆ రేట్ల లెక్కన వినోదపు పన్ను కట్టరు కాబట్టి ప్రభుత్వానికి కూడా చాలా నష్టమే!

ఉదాహరణకు, కేవలం 3 లక్షల చిల్లర జనాభాతో రాష్ట్రంలో కెల్లా అతి తక్కువ జనాభా ఉన్న నగరపాలక సంస్థ కడప. ఆ నగరంలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ ‘మగధీర’ (2009) చిత్రానికి రూ. 95 లక్షల దాకా నికర వసూళ్ళు (నెట్ కలెక్షన్స్) లభించాయి. ఇందులో తొలి వారం అడ్డగోలు టికెట్ రేట్లతో సంపాదించినదే రూ. 45 లక్షల దాకా ఉన్నట్లు భోగట్టా. అలాగే, కడపలోనే బాలకృష్ణ ‘సింహా’ (2010) చిత్రం రూ. 75 – 80 లక్షలు, రజనీకాంత్ – శంకర్ ల ‘రోబో’ చిత్రం రూ. 85 లక్షలు నికర వసూళ్ళు సాధించాయి. ఉన్న వాస్తవం చెప్పాలంటే, ఆ యా హాళ్ళలోని సీట్ల సంఖ్య, ప్రభుత్వం వారి అధికారిక టికెట్ రేట్ల ప్రకారమైతే – ఈ చిత్రాలు కనీసం రెండేళ్ళు హౌస్ ఫుల్ గా అడినా సరే రావడం అసాధ్యమైన నికర వసూళ్ళు ఇవి. ఇది ప్రేక్షకుల నుంచి చేసిన దోపిడీ అయితే, ప్రభుత్వ ఖజానాకు కూడా మరో దోపిడీ జరుగుతోంది. ఈ వచ్చిన కలెక్షన్లలో 20 నుంచి 25 శాతం మాత్రమే ప్రభుత్వానికి లెక్క చూపిస్తున్నారు. ఆ మేర మాత్రమే వినోదపు పన్ను కడుతున్నారు. మిగతాదంతా జేబులో వేసేసుకుంటున్నారు. ఇలా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టేస్తున్నారు.

దొంగలకు దొంగ

ఈ అడ్డగోలు టికెట్‌ రేట్ల విధానం ఓ విషవలయం. ఈ పద్ధతిలో వచ్చిన భారీ కలెక్షన్లను సాకుగా చూపెడుతూ, హీరోలు తమ మామూలు పారితోషికాలను సగటున మూడింతలు పెంచేశారు. నటీనటుల పారితోషికాలు, తద్వారా నిర్మాణ వ్యయం, వగైరా పెరిగాయి. ఫలితంగా, ఆ యా ప్రాంతాలకు సినిమాల అమ్మకాల రేట్లు మారిపోయాయి. అంతలేసి మొత్తాలిచ్చి కొన్నవారు పెట్టుబడిని వెనక్కి రాబట్టుకోవడం కోసం ఇలా మళ్ళీ అడ్డగోలు టికెట్ రేట్లనే ఆశ్రయిస్తున్నారు. వెరసి మొత్తం సినిమా వ్యాపారమే మారిపోయింది. పైరసీతో సహా అనేక రోగాలకు ఇదే మూలం. సినిమా చూడడాన్ని ప్రేక్షకుడికి భారంగా మార్చేయడం పరిశ్రమ వాళ్ళు చేస్తున్న తప్పు. అలా మొదటి తప్పును, అన్నిటికీ మూలమైన తప్పును సినిమా పరిశ్రమవాళ్ళే చేస్తూ, మళ్ళీ పైరసీ లాంటి అవతలివాళ్ళ తప్పుల గురించి గొంతు చించుకుంటున్నారు.

సమస్యలకు మూలమైన ఈ దోషాన్ని కనుక్కొని, దానికి సరైన మందివ్వాల్సింది పోయి, తాత్కాలిక ఉపశమనాల వైపు మన సినిమా పరిశ్రమ పరుగులు తీస్తోంది. ”ఇంతింత రేట్లు పెట్టి టికెట్లు అమ్మడం అన్యాయం, అక్రమం కాదా! పైరసీని తిడుతున్న వారికి దానికి మూలమైన తాము చేస్తున్న ఈ తప్పు గురించి తెలియదా! ఇది ఎలా ఉందంటే – (టికెట్లను అడ్డగోలు రేట్లకు అమ్ముతున్న) ఒక దొంగ, (పైరసీ చేస్తున్న) మరొక దొంగను చూపెడుతూ, ‘దొంగ… దొంగ…’ అని అరుస్తున్నట్లుంది” అని తొలితరం సినీ పాత్రికేయుల్లో ఒకరైన మద్దాలి సత్యనారాయణ శర్మ విమర్శించారు.

పత్రికల వారి పరోక్ష పాపం

అసలు, ఈ పాపంలో సమాచార ప్రసార సాధనాలకూ పరోక్షంగా పాత్ర ఉందంటున్నారు – తెలుగు సినీ రంగ వ్యాపార, పబ్లిసిటీ ధోరణులను 60 ఏళ్ళ పైగా నిశితంగా పరిశీలిస్తున్న సీనియర్‌ సినీ విశ్లేషకులు కాట్రగడ్డ నరసయ్య. ”ఇవాళ దినపత్రికల్లోని సినిమా కాలమ్స్‌లో ఎంతసేపటికీ చిత్ర నిర్మాణ వార్తలు, గ్లామర్‌ వార్తలే ప్రచురిస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా కూడా అందచందాల ప్రదర్శనలోనే పడి కొట్టుకుపోతోంది. చిత్ర పరిశ్రమలోని సమస్యలు, వర్తమానంలో ఎదురవుతున్న సంక్షోభాల గురించి రావడమే లేదు. దీని ఫలితం చాలా తీవ్రంగా ఉంటోంది” అని నరసయ్య వాపోయారు. చిత్ర నిర్మాణ వార్తలతో పాటు పంపిణీ, ప్రదర్శక రంగాలతో కూడిన చిత్ర మార్కెటింగ్‌ వ్యవహారాల వార్తలు, విశ్లేషణలు కూడా విరివిగా మీడియాలో రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి విశ్లేషణాత్మక కథనాల వల్ల మేడిపండు లాంటి చిత్ర పరిశ్రమ లోలోపలి సమస్యలు నలుగురి దృష్టికీ వస్తాయి. పరిష్కారం దిశగా ప్రయత్నాలూ జరుగుతాయి.

మరి, గడచిన వారం నుంచి రానున్న సంక్రాంతి వరకు ఎన్నో క్రేజీ చిత్రాలు విడుదలవుతున్నాయి. పైరసీ గురించి, ఆ దోపిడీ – దొంగ సొమ్ముల గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలిస్తున్న పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ చిత్రాల టికెట్‌ రేట్ల ద్వారా చేస్తున్న దోపిడీని ఆపేస్తారా? ముందుగా ప్రేక్షకులనూ, ఆ తరువాత వినోదపు పన్ను తక్కువ చెల్లింపుతో ప్రభుత్వాన్నీ నిస్సిగ్గుగా దోచేస్తూ ఆర్జిస్తున్న దొంగ సొమ్మును వదిలేస్తారా? అన్నీ తెలిసినా, ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్న మన ప్రభుత్వాధికారులు, పాలకులు కళ్ళు తెరుస్తారా? సామాన్యులు అడుగుతున్న ఈ ప్రశ్నలకు బదులేది!?

రెంటాల జయదేవ

http://ishtapadi.blogspot.com/

5 Comments
  1. holyman December 23, 2010 /
  2. raj January 5, 2011 /
  3. raj January 5, 2011 /
  4. టి.యస్.కళాధర్ శర్మ January 12, 2011 /
  5. వెంకట్ ఉప్పలూరి April 27, 2013 /