Menu

గుండె భావాల బాలచందర్

సినిమా అంటే  కేవలం ఎంటర్ టైన్‌ మెంట్‌ కాదు. సినిమా జీవితాన్ని ప్రతిబింబించ గలగాలి, మానవ మనస్తత్వాల్లోని వైచిత్రిని బయటికి తీసుకురాగలగాలి. మానవ సంబంధాలలో వుండే విభిన్న కోణాలను చూపగలగాలి. గుండె లోతున దాగి వున్న భావాలను స్పృశించగలగాలి. అలాంటి సినిమా లు చేసే అతి కొద్దిమంది దర్శకుల్లో  మొదటి వరుసలో వుండే దర్శకుడు కె.బాలచందర్‌.

విప్లవాత్మక ఆలోచనా ధోరణి, మనసు అంతరగాలను దర్శించగల సునిశిత దృష్టి..కె.బాలచందర్‌ ని వెండితెర పై మరపురాని చిత్రాల దర్శకుడి ని చేశాయి.

కె.బాలచందర్‌ ..ఆ పేరు వినగానే మన ముందు ఎన్నో జీవితాలు కదలాడుతాయి. అవును.. ఆయన తీసిన సినిమాలు కథ లు కావు. అనుక్షణం మన కళ్ల ముందు కదులుతున్న జీవితాలనే ఆయన సినిమాలు గా తీశాడు.  జీవితంలో ని వాస్తవాన్ని ఆయన ఆవిష్కరించినట్టుగా సినిమా లో మరే దర్శకుడూ ఆవిష్కరించలేదు. స్త్రీ అంతరంగాన్ని లోతుగా చదివిన దర్శకుడీయన. వివాహ బంధం లో వున్న పురుషాధిపత్యాన్ని తన సినిమాల్లో కళ్లకు కట్టినట్టు చూపిన యదార్థవాది బాలచందర్‌.

బాలచందర్‌ తెలుగు లో తీసిన సినిమాల లో ఇది కథ కాదు, అంతులేని కథ , 47 రోజులు , ఆకలి రాజ్యం, మరోచరిత్ర , సింధుభైరవి, ఆడవాళ్లూ మీరు జోహార్లు , మన్మథ లీల, అక్బోబర్‌ 2 , భార్యలూ జాగ్రత్త, కోటి విద్యలు కూటి కొరకే.. తొలి కోడి కూసింది ముఖ్యమైనవి.

సత్యజిత్ రే, మృణాల్ సేన్‌ , శ్యాంబెనెగళ్‌ వంటి దర్శకులు పూర్తి గా ఆర్ట్‌ సినిమా లు తీస్తున్న సమయంలో అటు కమర్షియల్ పంథాకీ, ఇటు సమాంతర చిత్రాల పంథా కీ మధ్యన తనదైన సరికొత్త మార్గాన సినిమాలు తీసారు బాలచందర్‌. మహిళా ప్రధాన చిత్రాలు తీసినా, ప్రేమ కథా చిత్రాలు తీసినా,  సందేశాత్మక చిత్రాలు తీసినా.. కె.బాలచందర్‌ భారతీయ సినిమా పై ఓ ప్రత్యేకమైన ముద్రను వేశారు.

కొన్ని సినిమా లు చూస్తాం. బాగున్నాయనుకుంటాం. కాలక్రమం లో మరిచిపోతాం. మరికొన్ని సినిమాలు అలా కాదు..సినిమా చూస్తూన్నంత సేపూ గొప్ప అనుభూతికి లోనవుతాం. చూసిన తర్వాత కూడా ఆ పాత్రలు, ఆ కథ ,ఆ సన్నివేశాలు మనలని వెంటాడుతూ వుంటాయి. మనం మళ్లీ మళ్లీ చూడాలనుకుంటాం. మరిచిపోలేం. కొన్ని రోజులు కాదు, నెలలు కాదు..ఎన్ని ఏళ్లయినా అవి మన మనసు లో అలాగే స్థిరంగా వుండిపోతాయి. అలాంటి అద్బుత కళాఖండాలు తీసిన దర్శకులలో ముఖ్యమైన దర్శకుడు కె.బాలచందర్‌ .

కె.బాలచందర్‌ తీసిన అత్యాద్బుత  చిత్రాల లో ఇది కథ కాదు ఒకటి.  ప్రేమ , పెళ్లీ రెండూ విఫలమయ్యాక ఓ స్త్రీ కి మళ్లీ పాత ప్రియుడు ఎదురవుతాడు.  మళ్లీ మనసులో ఆశ చిగురిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. సరిగ్గా ఇప్పుడే చెడ్డవాడైన భర్త మంచివాడి గా  మళ్లీ తన జీవితం లోకి వస్తానని అంటాడు.  మాజీ భర్త, మాజీ ప్రియుడు..ఈ రెండింటి మధ్యా నలుగుతున్న ఓ స్త్రీ హృదయం ని చూపిస్తూ ..సాగుతుందీ సినిమా.

కె.బాలచందర్‌ సినిమాల లో చూసిన ప్రతిసారీ ఏదో ఓ కొత్త కోణం కనిపిస్తుంది. గొప్ప సినిమాకు వుండే లక్షణాల లో ఇదొకటి. అలాంటి ఓ గొప్ప సినిమా ఇదికథకాదు. జయసుధ,శరత్‌ బాబు, కమలహాసన్‌ , చిరంజీవి ప్రధాన పాత్ర లు గా వచ్చిన ఈ సినిమా లో అడుగడుగునా పరితపించే స్తీ హృదయాన్నీ, తర తరాలుగా పురుషుడు స్త్రీ ని బానిస గా చేస్తున్న సమాజాన్నీ చూపించారు కె.బాలచందర్‌. సినిమా ప్రారంభం లో రచయిత చలం రాసిన ఓ పుస్తకం లోని కొటేషన్‌ వేసారు బాలచందర్‌. తమిళ వాడైన బాలచందర్‌ తెలుగు రచయిత చలం ని కోట్ చేయటం బట్టే  సమకాలీన రచనలు , రచయిత ల పట్ల ఆయనకున్న నాలెడ్జ్‌ ఏ పాటిదో మనం అర్ధం చేసుకోవచ్చు.

“జీవితం లోని ప్రతి సమస్య కు చావే పరిష్కారమైతే..ఇప్పటికి నేను ఎన్ని సార్లు చావాలా అని లెక్కపెట్టుకుంటున్నాను” అని జయసుధ తో చెప్పించి తన కథ ను చెప్పటం ప్రారంభిస్తాడు. తన కథ చూస్తుంటే జీవితం అంటే ఇంతే కాబోలు అనిపిస్తుంది. కొన్ని ఆశలు వెంటనే అడియాశలైపోవటం, కోరుకున్నది దొరకక మామాలు జీవనం లో పడితే ఊహించని ప్రమాదాలు ఎదురవటం.. ఆ ప్రమాదాన్ని వదిలించుకున్నాక మళ్లీ కొత్త ఆశ చిగురించటం.. అది కాస్తా తీరే సమయానికి ఊహించని ప్రమాదం.. జయసుధ కథ అంతా ఇలాగే కొనసాగుతుంది. తన కథ ను ఎవరైనా సినిమాగా తీస్తే ఇది కథ కాదు , కథానాయిక ఎక్కడా ఏడవనే ఏడవటం లేదు అని తిప్పికొడతారు అని తన పాత్ర గురించి తన తో నే చెప్పిస్తాడు కె.బాలచందర్‌.

అడుగడుగునా మారుతున్న పరిస్థితులకు సున్నితమైన స్త్రీ హృదయం ఎలా స్ఫందిస్తుందో గుండె లోతట్టు భావాలను తట్టిలేపేలా చెప్పాడు బాలచందర్‌.. ఇది కథ కాదు లోని ప్రతి సన్నివేశం లో స్త్రీ ల మానసిక, సామాజిక పరిస్థితిని వివరించటానికి పెద్ద పీట వేశాడు బాలచందర్‌ . నేను రాసిన ఉత్తరాలకు సమాధానం ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న కు శరత్‌ బాబు తన చెల్లి భర్త చనిపోయిన తర్వాత ఒకలా ప్రవర్తిస్తోందని, సంతోషంగా వున్న ఏ జంటనూ చూసిన ద్వేషించటం మొదలుపెట్టింది. తను చనిపోయిన తర్వాత తన రూంలో ఉత్తరాలు కనిపించాయని చెపుతాడు. ఉత్తరాలు మిస్‌ అయిపోవటానికి ఇలాంటి కారణాన్ని చెప్పటం లోనే బాలచందర్‌ గొప్పతనం అర్థం చేసుకోవచ్చు.

అంది వచ్చిన అవకాశాన్ని వదులుకొని జీవితం లో రాబోయే మలుపు కోసం ఎదురుచూస్తోందా అన్నట్టు వుంటుంది ఆ పాత్ర తత్వం. జీవితం నేర్పిన పాఠాలు ఆమె ని అలా ఒంటరిగా సాగమనే చెప్పాయి అన్నట్టు గా ముగిస్తాడు సినిమాని బాలచందర్‌.

కె.బాలచందర్‌ తీసిన మరో ఆణిముత్యం అంతులేని కథ. జీవితం లో ఎంత సంక్లిష్టత వుందో ఆ సినిమా కథ లోనూ, ఆ పాత్రల్లోనూ అంత సంక్లిష్టత వుంది. పైకి కఠినం గా కనిపించే జయప్రద పాత్ర మనసులో ఎంత సున్నితమో చెపుతాడు బాలచందర్‌…కుటుంబం కోసం త్యాగాలు చేస్తూ, తన ఆశలను చంపేసుకుంటూ బతుకుతున్నా, విధి అనేక రకాలుగా తన తో ఆడుకుంటూ వుంటే ఏమీ చేయలేక , దీనికో అంతం లేదు అని వదిలేస్తాడు బాలచందర్‌

విధవరాలైన చెల్లెలు, పెళ్లి కావలసిన మరో చెల్లెలు, గుడ్డి తమ్ముడు, తాగి తందానాలు ఆడే అన్నయ్యా, అన్నయ్య పిల్లలు….వీళ్ల భారాన్నంతా మోస్తూ పెళ్లి కావలసిన వయసులో త్యాగాలు చేసే ఓ స్త్రీ జీవితం ఈ సినిమా. తను ప్రేమించిన అబ్బాయి ని సైతం తన చెల్లి కోసం త్యాగం చేస్తుంది. తనని పెళ్లి చేసుకోవటానికి సిద్దం గా వున్న వాడిని మరో చెల్లి కిచ్చి పెళ్లి చేస్తుంది.

అంతులేని కథ లో వున్న మరో కోణం..ఫటాఫట్ జయలక్ష్మి పాత్ర.. ఈ సినిమా లో త్యాగాలు చేసే ఓ పాత్ర ను ఒకవైపు, జీవితాన్ని ఎంజాయ్ చేస్తూన్న పాత్రని ఓ వైపు చూపిస్తూ..రెండు వేరు వేరు లైఫ్‌ స్టైల్స్‌ ను చూపిస్తాడు.. చివరకు తప్పులు చేసిన  పాత్రకు సైతం పెళ్ళి జరిగి సుఖాంతం అవుతుంది.. కానీ ఈ మధ్యతరగతి బంధనాల్లో చిక్కుకున్న ఈ అమ్మాయి జీవితం మాత్రం అలాగే ఉంటుంది.

అంతులేని కథ సినిమాలోని ఔట్ డోర్‌ సన్నివేశాలన్నిటినీ వైజాగ్ లో చిత్రీకరించారు. బాలచందర్‌ వైజాగ్ లో షూట్ చేసిన మొదటి సినిమా ఇది. బాలచందర్‌ తమిళ్‌ లో తీసిన ఓ హిట్ సినిమా కు రీమేక్‌ గా వచ్చిన అంతులేని కథ తెలుగు లో సూపర్‌ హిట్ అయ్యింది.దీంతో ఈ సినిమా నిర్మాత ఆ తర్వాత బాలచందర్‌ తో తెలుగు స్ట్రయిట్‌ చిత్రం మరోచరిత్ర నిర్మించారు.

కె.బాలచందర్‌ తీసిన గొప్ప సినిమా ల లో గుప్పెడు మనసు ఒకటి. ఇందులో ఓ స్త్రీ హృదయమంతా పరచి వుంది. గుప్పెడంత మనసు లో సహజంగా చెలరేగిన సరికొత్త ఆశని చూపించి ,చివరకు ఈ సమాజం కోసం ఆ మనసు ను కాస్తా చంపేస్తాడు బాలచందర్‌. సుజాత, సరిత, శరత్‌ బాబు లతో బాలచందర్‌ తీసిన సినిమా గుప్పెడు మనసు.  ఎప్పుడూ జీవచైతన్యం తొణికిసలాడే ఓ యువతి..అనుకోకుండా తనకంటే పెద్దవాడైన వాడి తో శారీరకంగా కలిస్తుంది..ఇప్పుడిప్పుడే చిగురుస్తున్న ఆ మనసు లో ఆ వ్యక్తి పట్ల ఓ ఆరాధనాభావం ఏర్పడుతుంది. ఆ మనసులో అలాంటి భావం ఏర్పడటం ఎంతో సహజం అని చెప్పిన బాలచందర్‌ ఆ పాత్రని చంపేసి ..సమాజం కోసం తప్పదంటాడు. సున్నితమైన ఈ కథ లో వున్న మరో కోణం.. సుజాత క్యారెక్టర్‌ .. అభ్యుదయభావాలున్న ఓ రచయిత్రి గా, ఓ మామూలు ఆడదాని గా ఆ క్యారెక్టర్‌ పడిన సంఘర్షణ ని అద్బుతంగా చూపిస్తాడు బాలచందర్‌.

దేశం లో దరిద్రాన్ని చూపిస్తూ, ఆకలి బాధ ను చెప్పే ప్రయత్నం గా తీసిన సినిమా ఆకలిరాజ్యం. ఎమ్‌. ఏ లు చదివినా ఏ ఉద్యోగం లేక, ఆకలి బాధ ను నీళ్ల తో తీర్చుకుంటూ గడుపుతున్న నలుగురు యువకుల విషాద గాథ  ఆకలిరాజ్యం. అప్పటి దేశ పరిస్థితికి అద్దం పట్టిన సినిమా ఇది.

ఆకలి రాజ్యం సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఆకలి బాధ ఎలా వుంటుందో అనుభవం లోకి వస్తుంది. ఈ సినిమా లో కమలహాసన్ కీ, కమలహాసన్‌ ఫాదర్‌ క్యారెక్టర్ కీ మధ్య ఆలోచనాల విధానాల లోని అంతరాన్ని బాలచందర్‌ చెప్పిన తీరు అద్బుతం. ఈ సినిమా లో శ్రీ శ్రీ కవితలు వినిపిస్తాయి. తమిళ దర్శకుడైన బాలచందర్‌ కు సమకాలీన సాహిత్యం పై పూర్తి అవగాహన ఉందనటానికి ఇదొక నిదర్శనం. శ్రీ శ్రీ పుస్తకాలు చదువుతూ వుండే కమల్ చివరకు ఒకానొక సందర్బంలో డబ్బుల కోసం శ్రీ శ్రీ పుస్తకాలను అమ్ముతాడు. అదీ కేవలం రెండు రూపాయలకి. అప్పటి సిట్యుయేషన్ ను ఇంతకంటే గొప్పగా చెప్పటం అసాధ్యం.. కమలహాసన్‌ బురద లో మునిగిపోతున్న ఆపిల్ పండు ని చూస్తుండటం, తినటానికి ఏమీ లేకపోయినా అన్నీ తింటున్నట్టు నటించే సన్నివేశం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆకలి రాజ్యం సినిమా లో ప్రతి సన్నివేశం మన హృదయాలను ఆర్ద్రత తో నింపుతుంది.  ఈ సినిమా లో శ్రీదేవి తండ్రి డబ్బుల కోసం దొంగతనాలు చేస్తుంటాడు.. ఈ పాత్ర ద్వారా కూడా ఆకలి రాజ్యాన్ని చూపే ప్రయత్నం చేసాడు బాలచందర్‌.

కె.బాలచందర్‌ చిరంజీవి తో తీసిన సినిమా రుద్రవీణ. ఏ ప్రయోజనం లేని కళా సేవ కన్నా తోటివారికి సాయపడటం గొప్పవిషయం అని చాటి చెప్పిన సినిమా ఇది. బాలచందర్‌ ఈ సినిమా లో బ్రాహ్మణ కుటుంబాల లో వుండే ఛాందస భావాలను ఖండించాడు. మానవత్వపు విలువ తో పాటు సమాజం లోని మార్పుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సందేశాన్నిచ్చాడు.అడుక్కుతినే వాడి ఆకలి అరుపుల కన్నా సంగీత సాధన ఏమంత ముఖ్యం కాదు అని చెప్పాడు బాలచందర్‌. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన బాలచందర్‌ బ్రాహ్మణ కుటుంబపు సంప్రదాయా లలో వున్న మూర్ఖత్వాన్ని గట్టిగా ఖండించాడు.

ప్రేమికులు చనిపోయినా బీచ్‌ బండల మీద, కూలిపోతున్న గోడల మీద వాళ్ల పేర్లను రాయించి ప్రేమ బతికేవుందనీ  ఇది సరికొత్త చరిత్ర అంటూ బాలచందర్‌ మలిచిన ప్రేమకథా చిత్రం మరోచరిత్ర..  ప్రేమ కథాచిత్రా లలో ఓ సంచలనం ఈ సినిమా. అప్పటికి ఇది ఓ విప్లవాత్మకమైన సినిమా. చాలా అడ్వాన్స్ డ్‌ మూవీ ఇది అన్నారు అందరూ.

ప్రేమకు జాతీ, భాషా, ప్రాంతం ఇవేమీ అడ్డంకి కావు అని చెపుతుందీ సినిమా. ఈ సినిమా విషాదాంతం అవటం పట్ల సినీ విమర్శకులు ఎందరో అభ్యంతరాలు చెప్పారు. చివరకు వాళ్లిద్దరినీ చంపవలసిన అవసరమే లేదనేది వీరి వాదన. అయితే సినిమా లో ఆ రెండు పాత్రలను నిశితం గా పరిశీలిస్తే కొన్ని కారణాలు కనిపించక మానవు. కమలహాసన్‌ క్యారెక్టర్ లో వున్న ఆవేశం.. హీరోయిన్‌ ని తప్పుగా అర్దం చేసుకోవటం…ఇంకో అమ్మాయిని ప్రేమించి పెళ్లి వరకూ వెళ్లటం …ఇలా చూస్తే కమలహాసన్‌ ను చంపినందుకు ఓ అర్థం కనిపిస్తుంది. ఇక సరిత విషయానికొస్తే..నిజానికి ఆ అమ్మాయిని కథ లో చంపేయటానికి చిన్న చిన్న కారణాలు తప్ప బలమైన కారణాలు పెద్ద గా కనపడవు.  ఏది ఏమైనా ప్రేమకథా చిత్రాల ల లో ఓ వైవిధ్యం మరోచరిత్ర అని చెప్పవచ్చు. వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించాక దానిని దృశ్య రూపంలో చెప్పిన విధానం సైతం బ్రిలియంట్‌ అని అనాలి.

కె.బాలచందర్‌ తమిళం లో తీసిన అపూర్వ రాగంగల్ కథావస్తువు పరంగా ఓ పెద్ద సంచలనం సృష్టించింది. తండ్రీ, కొడుకులు ఇద్దరూ వారి వారి వయసు లకి  ఎంతో తేడా వున్న వారితో ప్రేమ లో పడతారు. చివరలో  కొడుకు ప్రేమించే అమ్మాయి తండ్రి ప్రేమించిన అమ్మాయికి తల్లి అవుతుంది అని రివీల్‌ చేస్తాడు. ఇంత సంక్లిష్టమైన కథ ను ఎంచుకోవటం లోనే బాలచందర్‌ గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది.

ఇలాంటి కథావస్తువు ను డీల్ చేయటం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఈ సినిమా ను తెలుగు లో దాసరి నారాయణ రావు తూర్పు పడమర గా తీయటం జరిగింది.

కె.బాలచందర్‌ సరిత ప్రధాన పాత్రధారిగా చేసిన సినిమా కోకిలమ్మ. ఇంటింటి కీ తిరిగి అంట్లు తోముకునే ఓ పేద స్త్రీ జీవితం ఈ సినిమా. తను ప్రేమించే అబ్బాయి సంగీతం నేర్చుకోవటం కోసం ఓ సంగీత మాస్టర్‌ ఇంట్లో పనులు చేయటానికి కుదురుతుంది కోకిలమ్మ. అన్ని ఆశలూ పెట్టుకున్న ఆ కుర్రాడు కాస్తా కాల క్రమం లో ఈ అమ్మయిని మరిచిపోతాడు. ఈ కథాంశం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది.

కె.బాలచందర్‌ చేసిన సినిమా లలో ముఖ్యమైన మరో  సినిమా సింధుభైరవి. ఈ సినిమా కర్నాటక సంగీత నేపథ్యం లో సాగినా దీంట్లో నూ ఓ స్త్రీ అంతరంగాన్ని చూపించాడు. అనాథ గా పెరిగిన సుహాసిని కి తన తల్లి ఎవరో తెలుసు కానీ వెళ్లి తన తో కలిసి ఉండే అవకాశం లేదు. ఈ విషయాన్ని చెప్పటానికన్నట్టూ ప్రస్తుతం అలాంటి సిట్యుయేషణ ను క్రియేట్ చేస్తాడు బాలచందర్‌. ఓ కర్నాటక సంగీత విద్వాంసుడు కీ, మ్యూజిక్‌ అంటే ఇష్టపడే ఓ మ్యూజిక్‌ క్రిటిక్‌ కీ మధ్య ప్రేమ. అదీ సమాజం ఒప్పుకోని ఫ్రేమ. ఓ సారి వాళ్లిద్దరూ శారీరకంగా కూడా కలుస్తారు. తద్వారా ఓ పాప పుడుతుంది. ఇలా ఒకప్పటి సిట్యుయేషన్  మళ్లీ ఇక్కడ కనిపిస్తుంది.

ఈ కథాంశానికి దాసరి తీసిన మేఘసందేశం కు కొన్ని పోలికలు కనిపిస్తాయి. ( మేఘ సందేశం కీ, దీనికీ చిన్న చిన్న పోలికలు తప్పితే, కథ లు డీల్ చేయబడిన విధానం, కథ కు ప్రధాన వస్తువు లలో ఏ మాత్రం సంబంధం లేదు )

ఆడవాళ్లూ మీకు జోహార్లు లో నూ స్త్రీ విలువ ను తెలియ చేసే ప్రయత్నం చేసాడు. ఇందులో కొన్ని సన్నివేశాలు సీన్ ఎలా రాయాలి అనేదానికి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణ కు ఓ సన్నివేశం రాస్తున్నాను.

కుండలు అమ్ముకోవటానికి వెళ్లి ఏ ఒక్కటీ అమ్ముడు కాక వస్తూన్న సరిత కు dssxx  తను ప్రేమించే అబ్బాయి ప్రెసిడెంట్ కొడుకు కనిపిస్తాడు. ఓ మట్టి దారి అంచున తన బైక్‌ ని పార్క్ చేసి చేతులు తల కింద పెట్టుకొని ఆకాశంలోకి చూస్తుంటాడు పడుకొని.  అటుగా వచ్చిన సరిత తనని పలకరిస్తుంది. మాటల్లో ఓ కుండ తీసుకుంటారా అని అడుగుతుంది. దానికి అతడు వద్దని ఓ రెండు రూపాయలు ఇస్తాడు. వట్టిగా ఎలా తీసుకోవటం అని మీ ఇంటికొచ్చి ఏదైనా పనిచేస్తాను. బట్టలు పిండేస్తాను. అంటుంది. దానికి అతడు ఒప్పుకోడు. అప్పుడు అయ్యో వట్టిగా ఎలా తీసుకోను..ఏదో ఒకటి చెప్పండి అంటుంది సరిత. దానికి సరే..అటు చూడు అని ఆకాశంలో గుంపుగా ఎగురుతున్న పక్షుల ను చూపించి అవి ఎన్ని వున్నాయో లెక్కపెట్టు అని అంటాడు.. సరే అని లెక్క పెట్టటం మొదలు పెడుతుంది సరిత. మొదటి సారి తన 18 వరకూ లెక్కపెట్టే సరికి ఆ పక్షులు కాస్తా వాటి దిశ ను మారుస్తాయి. అంతే..లెక్క పోతుంది. మళ్లీ లెక్క పెట్టటం స్టార్ట్‌ చేస్తుంది.  ఈ సారి ఓ 20 లెక్క పెడుతుంది. ఈ లోగా ఆ పక్షులు కాస్తా మళ్లీ ఎగిరే దిశ( డైరెక్షన్‌ ) ను మారుస్తాయి. అయ్యో అనుకుంటుంది. మూడోసారి మళ్లీ లెక్క వేయటానికి ఉపక్రమిస్తుంది. ఈ సారి లెక్క పూర్తవతుంది. మొత్తం ఇన్ని తను ఆనందం తో చెప్పటానికి అతడి వైపు కు తిరుగుతుంది. చూస్తే..అప్పటికే కొంత దూరం వెళ్లున్న తన బైక్ కనిపిస్తుంది. సరిత మొహంలో ఎక్స్‌ ప్రెషన్‌ ఛేంజ్ చూపిస్తాడు బాలచందర్‌. సీన్‌ కట్‌.

ఈ సినిమా లో ఇలా గొప్పగా రాసిన సీన్లు కొన్ని కనిపిస్తాయి. ఈ సినిమా లో కృష్ణం రాజు కీ , కల్లు దుకాణం నడిపే ఓ అమ్మాయికీ మధ్య వున్న అనుబంధాన్ని చూపిన విధానం లో బాలచందర్‌ గొప్పతనం ఏంటనేది అర్థమవుతుంది.

ఈ సినిమా చూసిన తర్వాత మనకు బాగా గుర్తుండిపోయే పాత్ర, గొప్పగా అనిపించే పాత్ర సాక్షి రంగా రావు పోషించిన పాత్ర. తను ఒక స్కూల్ టీచర్‌. స్కూల్ బిల్డింగ్ కూలిపోయి తన కళ్ల ముందే పిల్లలంతా చనిపోయే సరికి పిచ్చివాడవుతాడు. పిచ్చివాడైనా తను ఎప్పుడూ వేమన పద్యాలు చెపుతుంటాడు.. సందర్బానుసారంగా ఆ పాత్ర చేత  Do you know what Vemana told ? అనో..లేక వేమన ఈ విషయం ఎప్పుడో చెప్పాడు రా అంటూనో వేమన పద్యాలు చెపుతుంటాడు సినిమా మొత్తం. జీవిత తత్వాన్ని చెపుతున్నట్టుగా వుంటుంది ఈ పాత్ర. ఇలాంటి పాత్ర ను క్రియేట్ చేసిన బాలచందర్‌ నిజంగా గ్రేట్ అనిపిస్తుంది.

కె.బాలచందర్‌ సినిమా లలో సంగీతం గురించి ప్రత్యేకం గా చెప్పుకోవాలి.  సంగీత దర్శకుడు ఎమ్‌. ఎస్‌. విశ్వనాధన్‌ బాలచందర్‌ కాంబినేషన్‌ సూపర్‌ హిట్ పాటల ను అందిచ్చాయి. ఇది కథ కాదు, అంతులేని కథ, ,మరో చరిత్ర,, గుప్పెడు మనసు సినిమా ల లోని పాటలు ఎప్పుడు విన్నా మన మనసును కదిలిస్తాయి.

కె.బాలచందర్‌ మ్యూజిక్‌ మెస్ట్రో ఇళయరాజా కాంబినేషన్‌ సైతం అద్బుతమైన పాటలను అందించారు. సుహాసినీ ప్రధాన పాత్రగా బాలచందర్‌ చేసిన సంగీత భరిత చిత్రం సింధుభైరవి. ఈ సినిమా కి గాను ఇళయరాజా బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా నేషనల్ అవార్డ్‌ అందుకున్నారు.  అంతేకాదు చిరంజీవి తో బాలచందర్‌ తీసిన రుద్రవీణ కు కూడా ఇళయరాజా నేషనల్ అవార్డ్‌ అందుకున్నారు. బాలచందర్‌ కమలహాసన్‌ ను చార్లీ చాప్లిన్‌ తీరు లో చూపించిన సినిమా డాన్స్‌ మాస్టర్‌. ఈ సినిమా కు ఇళయరాజా అందించిన సంగీతం చెప్పకోదగ్గది.

కె.బాలచందర్ తన సినిమాల ద్వారా ఇద్దరు గొప్ప నటులను వెండితెరకు పరిచయం చేశారు. ఒకరు కమలహాసన్‌, ఇంకొకరు రజనీకాంత్. వీరిధ్దరినీ అపూర్వ రాగంగల్ తో ఇంట్రడ్యూస్‌ చేశారు బాలచందర్‌. వీరిధ్దరి కాంబినేషన్‌ లో ఎక్కువ సినిమాలు చేసిన దర్శకుడు కూడా కె.బాలచందరే.హీరోయిన్ లలో సైతం ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌ లు గా  వెలుగొందిన తారలు జయప్రద, శ్రీదేవీల ను వెండితెరకు పరిచయం చేసింది కె.బాలచందరే.సహజనటులు గా పేరు గాంచిన సరిత, జయసుధ, సుజాత లను ఇంట్రడ్యూస్‌ చేసింది కూడా కె.బాలచందరే.

బాలచందర్‌ ఈ మధ్య కాలం లో తీసిన సినిమా అబద్దం. ఈ సినిమా లో బాలచందర్‌ నటించారు కూడా. కె.బాలచందర్‌ దర్శకుడి గా నే కాకుండా నిర్మాత గా కూడా సినిమా లు నిర్మించారు. మణిరత్నం తీసిన రోజా సినిమా కు నిర్మాత కె.బాలచందర్‌. అలా ఎ.ఆర్‌. రెహమాన్‌ ను ఇంట్రడ్యూస్‌ చేసింది బాలచందరే. ఆ తర్వాత బాలచందర్‌ తీసిన డ్యూయెట్, పరవశం సినిమా లకు రెహమాన్‌ సంగీతాన్నందిచారు.

భారత దేశం గర్వించదగ్గ దర్శకుడైన బాలచందర్‌ కు ఓ రకంగా చెప్పాలంటే నేషనల్ స్థాయి లో రావలసినంత గుర్తింపు రాలేదు. ఇటీవల కాలం లో ప్రకటించిన అత్యుత్తమ భారతీయ సినిమాల లిస్ట్‌ లో బాలచందర్‌ ది ఒక్క సినిమా కూడా లేకపోవటం విషాదం.ఏది ఎలా ఉన్నాకథా వస్తువు పరంగా బాలచందర్‌ చేసిన ప్రయోగాలు ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గవి. బాలచందర్‌  తీసిన సినిమాల లో 6 సినిమా లకి  ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీ లో నేషనల్ అవార్డ్‌ లభించింది.సినిమా ద్వారా తను చేసిన కళాసేవ కు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1987 లో కె.బాలచందర్‌ ను పద్మ శ్రీ అవార్డు తో సత్కరించింది.

article written by  —team of janrise advertisements

http://janrise.in/

14 Comments
 1. rahul December 21, 2010 /
 2. కొత్తపాళీ December 21, 2010 /
 3. అబ్రకదబ్ర December 23, 2010 /
 4. Manjula December 23, 2010 /
  • చక్రధారి December 23, 2010 /
  • AAAAAAAA December 25, 2010 /
   • Manjula January 1, 2011 /
   • holyman January 1, 2011 /
 5. Janrise December 23, 2010 /
 6. baleandu December 23, 2010 /
 7. Nagarjuna G December 25, 2010 /
 8. టి.యస్.కళాధర్ శర్మ December 28, 2010 /
 9. Janrise December 30, 2010 /