Menu

శ్యామ్ బెనెగళ్ తెలుగు సినిమాలు తీయలేడా? Part 2

వ్యాసం మొదటి భాగం కొరకు ఇక్కడ నొక్కండి.

ఆంక్ష తప్పిన ఆవేశం

బలైన నిండు జీవితం!

మూలిక గంధాన్ని తీసి,నీళ్ళలో కలిపి తీర్ధంలా తాగిస్తాడు బలవంతాన పార్వతి చేత పరశురాముడు.అప్పుడు చెప్తాడు భైరవుడు,-“నాకు సంతానం లేదు,నా అన్న అవిటి కొడుకు వాసుగాడికి పుట్టబోయే అవిటిపిల్లల్ని నానెత్తికెక్కించుకుని,ఇంత ఆస్తీ రాసిచ్చేసేటంత వెధవని కాను”అంటూ నవ్వుతాడు.వాసు వాసు తండ్రి కొడుకే,వాసూకి పుట్టబోయే బిడ్డా వాసు కొడుకేనంటాడు.తన ఆసి వాసు సంతానానికి దక్కనీయకుండా చేసేందుకే అబద్ధం ఆడానంటూ అరుస్తాడు.

తలతిరిగి పోయింది పరశురాముడికి.భైరవుడి మాటలు నమ్మి పవిత్రమైన గర్భాన్ని చంపి పాపం చేసానని క్షోభిస్తాడు.దేవత దగ్గర మొరపెట్టుకోవాలనీ,రోజూ తనను ఆవహించే ఆ దేవతను పిలవమనీ భార్యను ప్రాధేయపడతాడు.భార్య కాళ్లు పట్టుకుంటాడు.అనసూయ కిదేం అర్ధం కాదు.తికమక పడిపోతుంది.

చివరికో నిర్ణయానికి వస్తాడు.ఒక పాపాన్ని రూపుమాపటానికి మరో పాపం చెయ్యాలి-తప్పదు-అంతకాలం జాగ్రత్తగా గడుపుకొస్తున్న బ్రహ్మచర్యాన్ని సడలిస్తే ఆ మూలిక ప్రభావం పోతుంది,పార్వతి గర్భం పోదు అనుకుంటాడు.బలవంతాన భార్యని అనుభవిస్తాడు.

అంతకుముందే పరశురాముడి నాటకం గమనించిన తల్లి ముందుగానే వార్నింగ్ ఇచ్చి మరీ పంపుతుంది.తలుపుతియ్యంగనే అత్తగారు!నలిగిపోయిన శరీరంతో తను – ఈ సంగతి ఊరువాళ్ళకు తెలిస్తే పతివ్రతలా చూస్తున్నతనని ఎంత అసహ్యించుకుంటారు?అవమానం భరించలేకపోతుంది.నీళ్ళులేని నూతిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.

నిద్రలో ఉన్న పరశురాముడికి గంటలు వినిపించి వెంటనే ఆగిపోతాయి.గంటలు వినిపించడం లేదంటే పార్వతి గర్భానికి హాని కలగలేదన్నమాట.తన పవిత్రత దెబ్బతిన్నా ఫర్వాలేదు.శిశుహత్య దోషం అంటుకోదు-సంతోషంగా “అనసూయా”-అంటూ బయటకు వస్తాడు.ఆమె కనిపించదు.వెతుక్కుంటూ..వెతుక్కుంటూ వస్తే…నూతిలో శవం..రక్తసిక్తమై పడి ఉంటుంది.

“అనసూయా” కెవ్వున అరుస్తాడు.లుంగీని పైకి మడిచేస్తాడుఅప్పికొండస్వామీ-అంటూ కొండల్లోకి,లోయల్లోకి,వాగుల్లోకి,దిక్కులేని శూన్యం లోకి అలా పరుగెడుతూనే వుంటాడు పరశురాముడు.

అనసూయ శవానికి అంత్యక్రియల సన్నాహాలు జరుగుతుంటాయి.మాష్టారు అల్లంతదూరాన ఆగిపోయి,బిత్తరపోయి చూస్తుంటాడు.పక్కన అంత తతంగం జరుగుతున్నా ఎరగనట్టు ఇట్నుంచటునుంచి పార్వతి ఒక పిల్లణ్ణెత్తుకుని నడిచి వెళ్తుంటుంది.

మళ్ళీ మొదటికొస్తుంది కధ.సముద్రం ఉవ్వెత్తున ఎగిరిపడ్తుంటుంది.ఆఘోషలోంచి వ్యాఖ్యాత వినిపిస్తాడు-పరశురాముడు అవేశంతో పోయి,ఆలోచన లేకుండా చేసుకున్నాడు.ఉద్రేకంతోపోయి వివేకం కోల్పోయాడు.లేకపోతే అప్పికొండస్వామిచ్చిన వరం(?)తో ఆ దంపతులిద్దరూ ఎంత సుఖంగానైనా ఉండేవారు కాదా?ఈ సముద్రతరంగాలు,ఇక్కడి ప్రజలు,కధలుకధలుగా వార్ని గూర్చి చెప్పుకునేవారు కాదా?అనడుతాడు.

కథ ముగుస్తుంది.

టేకింగ్ ఫైన్

కథనీ,కథనాన్నీ(ట్రీట్ మెంట్)చాలా బిగువుగా నడిపించాడు దర్శకుడు బెనెగల్.బెనెగల్ చిత్రాలన్నీ వివాదాస్పదమైనవే.‘నిశాంత్’సినిమా తెలుగుదేశంలో గొప్ప కాంట్రవర్సీని సృష్టించింది.అది లేకపోతే బెనెగల్ తెలుగు ప్రేక్షకులకందరికీ తెలిసుండేవాడుకాదు.అనుగ్రహం కూడా ఆకోవకు చెందిన చిత్రమే!

మరాఠీ రచయిత సి.టి.ఖదోర్కర్ రచించిన ‘కొండూర’నవల ఆధారంగా ఒకేసారి తెలుగు,హిందీ భాషల్లో నిర్మించబడ్డదీ చిత్రం.అందులోనూ ఆరుద్ర,గిరీష్ కర్నాడ్,శ్యాం బెనెగల్ -ముగ్గురు మహారధుల చేత చిత్రానుసరణ(స్క్రీన్ ప్లే)రచింపబడింది.

“ఒయమ్మా ఇది నీ సీమంతం” ” ఇది వరమా?శాపమా?”పాటలతో పాటు ప్రేక్షకుణ్ణి చిత్రంలో లీనమయ్యేట్టు చేసింది వనరాజ్ భాటియా సంగీతం.

ఇవన్నీ ఒక ఎత్తు-చిత్రానికి ప్రాణం పోసింది గోవింద్ నిహలానీ కేమెరా.

అన్ని బాగానే ఉన్నాయి అయినా చిత్రం చూసాక ప్రేక్షకుడి మనసులో మిగిలింది కొశ్చనుమార్కులు వేసుక్కూర్చున్న అసంతృప్తే!పై పెచ్చు పాత్రల పోషణలో పూర్తి న్యాయం జరగలేదు.

అన్యాయమైన అనసూయ!

పరశురాముడి దగ్గర శక్తుంది.దేవతవరం,అప్పికొండస్వామి అండా వున్నాయి.ఆ యిద్దరూ సమాజశ్రేయస్సుకూ,పాపరాహిత్యానికీ కృషి చెయ్యమని ఆదేశించిన వారే!కానీ,అతనందుకోసం చేసింది అతి స్వల్పం.పరశురాముడికి దేవతమీదా,స్వామి మీదా ఉన్న మూఢ(?)నమ్మకం వలన వివేకాన్నీ,ఆలొచనా శక్తినీ కోల్పోయి పూజలు చేయించుకోవడం,చేయడం వినా మరేవీ సాధించలేకపోతాడు.అతనికన్నా ఊరికి ఉపకారం చేస్తున్న గొర్రెలకాపరి నయం.ఎటువంటి ప్రతిఫలాఫేక్ష లేకుండా,జలను కనిపెట్తున్నాడు.పరశురాముడు చివరకు తనకోసం కూడా ఏమీ మిగుల్చుకోలేకపోయాడు.

పరశురాముడు తన మూఢనమ్మకం వలన అలా విషాదాంత చరిత్రను సృష్టించుకున్నాడా?గొర్రెలకాపరీ వరం పొందినవాడేగా?అతను మూఢనమ్మకాలు లేని వాడా?అందువలనే అంతా ఎడారి అన్నచోట నీరున్నదని చెప్పి నిరూపించగలిగాడా?అసలు దేవతలూ,వరాలూ ఉన్నయా?ఉండబట్టే గొర్రెలకాపరి సాధించాడనుకోవాలా?…మొత్తం మీద మూఢనమ్మకాల్ని స్ట్రెస్ చేసి,తను చెప్పదల్చుకున్న దాన్ని సూటిగా చెప్పడంలో ఎస్కేపయ్యాడు బెనెగల్.

ఆద్యంతం పరశురాముడి పాత్రమీద అనురాగం,సానుభూతీ కలుగుతాయి ప్రేక్షకుడికి,చివరికి వాణ్ణి దిక్కుమాలిన వాణ్ణి చేసి,”అది వాడి అవివేకం,ఆలోచనలేకుండా పోయాడు”అంటాడు వ్య్ఖాఖ్యాత.అనసూయ పాత్ర కూడా ఇలాగే దారుణమైన అన్యాయానికి గురయ్యింది.

వరం పొందింది పరశురాముడు.పూజలు పొందిందీ పరశురాముడే.కష్టాలు మాత్రం ఆమెకు తప్పలేదు.బ్రహ్మచర్య శిక్ష ఆమెకు విధింపబడాలా?కేవలం పరశురాముణ్ణి కట్టుకోవడమేనా ఆమె చేసిన తప్పు.నీళ్ళుమొయ్యడం,ఇంటిచాకిరీ చెయ్యడం ఆమె డ్యూటీ.అయినా బెనెగల్ ఆమె మీద కొంచెమైనా సానుభూతి చూపించలేదు.క్రూరాతిక్రూరంగా ఆమెను చంపేశాడు.అసలీ చిత్రానికి ఆమె పాత్రకు ప్రాముఖ్యమివ్వడం వేస్ట్.ఇస్తే ఇంకా గంభీరంగా ఉండాలి.లేకపోతే తగ్గించెయ్యాలి.మధ్యలో పెట్టి ఎటూ కాకుండా చేసాడు.

భైరవుడిపాత్ర అంతకంటే అర్ధం లేనిదిగా తయారయ్యింది.ఆయన నిత్య శృంగారి.అందులోనూ రావుగోపాల రావుగారు అసహజమైన నటనని అందంగా.వొళ్ళుమండేలా ప్రదర్శించడంలో మహాదిట్ట.పరశురాముడడిగీ అడగంగానే-సరే-పో-ఎంతకావాలంటే అంతా తీసుకెళ్ళి గుడిని బాగు చేయించెయమంటాడు.ఇక్కడ ఆయనది ఔదార్యం అనుకోవడానికా,అంటే ఒక పక్కన పాపిగా చూపిస్తునారు.మూఢనమ్మకాలను ప్రేరేపించి ప్రజానీకాన్ని గుప్పెట్లో పెట్టుకోవడానికా అంటే ఎంతసేపూ శృంగారం తప్ప అటువంటి రాజకీయాలు ప్రయోగించినట్టు  కనిపించదు.పోనీ,పాపపరిహారానికా అంటే దేవతనీ,స్వామినీ హేళన చేస్తూ ‘మీ అమ్మవారు’అంటూ సంభోదిస్తూ ఉంటాడు.మరి ఆపాత్ర చిత్రీకరణలో ఔచిత్యం ఏమిటో…?దేవతే అడిగెయ్యంగానే డబ్బిచ్చేట్లు ప్రేరేపించిందా అంటే- ప్రేరేపిస్తే ఆ ప్రజలది మూఢనమ్మకం ఎలాగౌతుంది?ఈ గందరగోళానికి తగ్గట్టే ఉంది ఆయన నటన కూడా.

ఊరి జనం అనుకునేది తప్పనీ,వాసు తండ్రి తన అన్నేననీ,పర్వతి గర్భానికి వాసె కారణమనీ ఆ తర్వాత చెప్తాడు భైరవుడు.ఈ మాటలూ నమ్మాడు పరశురాముడు.అసలతని మాటలు ఎందుకు నమ్మాలి?దేవతకూడా పొరబడిందా?భైరవుణ్ణి ఏంచెయ్యమంటుంది?ఏం చెయ్యగలడనీ?ఏదిపడ్తే అది నమ్మే వ్యక్తికి మూఢనమ్మకాలూ,మంచి నమ్మకాలూ అంటూ తేడాలుండవు.పైపెచ్చు ఈ పరశురాముడికి,రాచరికాన్ని,బూర్జువా వ్యవస్థనీ నరికేసే శక్తి లేదు.అది అతను పుట్టుకతోనే సాధించుకున్న బలహీనత.దానికీ తను చెప్పదలిచిన మూఢనమ్మకాలకీ సంబంధం లేదు.ఈ సబ్జెక్టులో మూఢనమ్మకాల మీద ఎలాంటి కాన్సంట్రేషనూ లేదు.

మేధావితనం ప్రదర్శన

ఫ్రేంటూ ఫ్రేం ఈ చిత్రములో బెనెగల్ కనిపిస్తాడు.క్షణక్షణానికీ ఆలోచింపజేస్తాడు.‘అమ్మో’అనిపించేలా తీసాడు.అయినా ఏదో వెలితి…..

ముఖ్యంగా పూర్తి తెలుగువాతావరణంలో తీసినప్పటికీ,ఈ చిత్రంలో తెలుగుతనం  తక్కువగాఉంది.తెలుగుభాషలోకి డబ్ చేసిన హిందీసినిమాలావుంది.

కథగురించి,తీసిన దృశ్యం గురించి ఆలోచించుకోవడానికి బోలెడంత సమయము ఇచ్చాడు బెనెగల్.చిత్రాన్ని అనవసరంగా డ్రాగ్ చేసి,అయినా ఆ ఆలోచన,ఆ కాన్సంట్రేషనూ ప్రేక్షకుడు కథపైన నిలపలేకపోయాడు.ఎంతసేపూ చిత్రీకరణా అందులో దర్శకుడు ఎత్తుగడలూ గురించి ఆలోచించడంతో సరిపోతుంది.దృశ్యాన్ని సాధారణ ప్రేక్షకుడు అర్థం చేసుకుని కథను ఫాలో అవటానికి అవకాశం ఇవ్వలేదు.ఒక సీన్ కి,తర్వాత వచ్చే మరొక సీన్ అంటించినట్టుంది.రెంటినీ కలుపుకుని ఇంటికివచ్చి మనం కథను ఊహించుకోవాలి.అందువలన దృశ్యం మీద మనసు లగ్నం చేసే సరికి కథమీద,దాని ప్రయోజనం మీద దృష్టి దెబ్బతింది.ఫలితంగా బయటకువచ్చాక  “ఏదో తీసాడు,అంతా గందరగోళంగా ఉంది” అంటున్నాడు కామన్ ప్రేక్షకుడు.నిజానికి చాలామందికి ఈ చిత్రం అంతుబట్టలేదు.

ప్రయోగం వల్ల ప్రయోజనం దెబ్బతింది

తెలుగువాళ్ళకిది ‘టచ్’లేని సబ్ఝక్టు.ఇంతవరకూ మనకు సూపర్ట్సిషన్స్ మీద చిత్రాలు లేవు.కథకూడా బలమైనదే.అయినా మేధావితనమే ఈ చిత్రాన్ని బాగా దెబ్బతీసింది.సామాజికప్రయోజనం కలిగిన చిత్రాలు సూటిగా చెప్పగలిగినప్పుడు,సామాన్యప్రేక్షకుడికి కూడా గుండెకు పడ్తుంది.అందులో ప్రయోగాలు చేస్తే కన్ఫూజనే మిగులుతుంది.అందువలన ఏదో చెప్పాలనుకున్నా ఆదర్శానికి ఫలితం దక్కలేదు.

దానికితోడు డబ్బింగ్ చెయ్యడంలో లోపాలవల్ల చిత్రం అభాసుపాలయ్యింది.చూపించిందే చూపించిండం,చూపించిందాన్ని గంటలకొద్దీ చూపించడం వల్ల బోరుకూడా ఫీలయ్యాడు ప్రేక్షకుడు.మొత్తం మీద ఈ చిత్రం ప్రేక్షకుల అనుగ్రహానికి నోచుకోలేదనే చెప్పాలి.పైపెచ్చు ఆగ్రహానికి కూడా బలయ్యే ప్రమాదముంది.

********

(సేకరణ)

2 Comments
  1. MOHAN RAM PRASAD November 3, 2010 /
  2. SRRao November 5, 2010 /