Menu

మృణాల్ సేన్ ‘ఒక ఊరి కథ’ గురించి భిన్న కోణాలు 1

ఆవార్డుల సినిమా ఏం చెప్పింది?

-మండవ మాధవరావు

ఉచ్చలు పొయ్యడం,కుక్కలు మొరగటం తప్పితే మూడో విషయంలో సహజత్వం లేని  లేని చిత్రం ఇది.చెప్పాలంటే ఉచ్చలు పొయ్యడంలో కూడా సహజత్వం లేదు.తెలంగాణా గ్రామాలలో నిలబడి ఉచ్చలు పొయ్యడం సాధారణంగా వుండదు.తెల్లవారిన తర్వాత సహజత్వం కోసం ఉచ్చలు పొయ్యడంతో ప్రారంభించినారు.ఇంకోదానితో ప్రారంభిస్తే ఇంకా సహజంగా వుండొచ్చు.

తెలుగు ప్రేక్షకుల్లో కొందరికి శ్యామ్ బెనెగళ్ మీద ఉన్న భ్రమలు ‘అనుగ్రహమ్’చిత్రంతో పటాపంచలయినాయి.మృణాళ్ సేన్ మీద ఉన్న భ్రమలు ఈ చిత్రంతో తొలగిపోతాయి.ఇది సంతోషించదగ్గ విషయమే.సోమరిపోతులు,దొంగలు,ఆత్మాభిమానరహితులు,చేసిన ఉపకారం మరిచే కృతఘ్నులు,సాటి మనిషి యమబాధపడుతున్నప్పుడు కొంచెం జాలీ,దయాకలగని క్రూరులూ అయిన  ఇద్దరు తండ్రీకొడుకుల కథ ఇది.

వాళ్లలో మచ్చుకి మంచితనమన్నది లేదు.కానీ వాళ్ళు ఎంతో ఉత్తమంగా మాట్లాడుతూ ఉంటారు.జమీందారు చేసే దోపిడీని విమర్శిస్తారు.బొర్రలు పెంచే షావుకార్లని విమర్శిస్తారు.పేదవాళ్ల కష్టాన్ని పెద్దవాళ్ళు దోచుకుంటారు కాబట్టి అసలు కష్టం చెయ్యొద్దని,దొంగతనం చేసుకు బతకాలని ఈ సోమరిపోతు తండ్రి సిద్ధ్హాంతం.కోడలు నొప్పులు పడుతున్నప్పుడు మంత్రసానిని పిలవకపోవడం వల్ల కోడలు చచ్చిపోతుంది.తెల్లవారాక జనానికి శవాన్ని చూపి డబ్బులు దండుకుంటారు తండ్రికొడుకులిద్దరు,చిత్రం ముగుస్తుంది.

ఏం చెప్పినాడు ఇందులో?

ప్రముఖ హిందీ రచయిత ప్రేమ్ చంద్ ‘కఫన్’(శవం మీద కప్పే గుడ్డ) కథ ఈ సినిమాకి ఆధారం.

‘పాకలో నొప్పులు పడే మనిషి తొందరగా చచ్చిపోతే తొందరగా పడుకుని నిద్రపోవచ్చును’ అని కొన్నాళ్ళ నుంచి ఆ ఆడదాని కష్టం మీద బతికి,ఆమె చావు కోసం ఎదురు చూసే క్షుద్రులు వాళ్ళు.అలాంటి పాత్రల చేత జమీందారులు చేసే దోపిడీ మోసాల్ని విమర్శింపజేస్తాడు రచయిత.అంతే కాదు.”బ్రతికినప్పుడు మంచిబట్టలు కట్టుకోలేక పోయినా చచ్చిన తర్వాత శవానికి కొత్తబట్ట కావాలి,ఏం వింత?”-అనుకుంటారు వాళ్ళు.

ఈ తండ్రీకొడుకులు సాంస్కృతికంగా కూడా విప్లవభావాలను వెల్లడిస్తారు.రచయిత తనలోని చైతన్యంగల భావాలను ‘మాదిగ’కుటుంబంలో,సోమరిపోతు జీవితాలు గడిపే మూర్ఖ పాత్రల చేత చెప్పించినాడు.పాత్రల చైతన్యస్థాయికి పొసగని చైతన్యపు భావాలను వెల్లడింప జేసినాడు.

ప్రేమ్ చంద్ చాలా గొప్ప కథలు వ్రాసిన రచయితే,‘కఫన్’కథ మాత్రం సరైన అవగాహన లేని తప్పు కథ.ఆ సంగతి మార్క్సిస్టు దర్శకుడిగా ‘పేరు’పొందిన మృణాళ్ సేన్ గ్రహించుకోలేక ఈ కథను తీసుకున్నాడు.ప్రేమ్ చంద్ కథలో చిట్టచివరకు ఆ తండ్రీకొడుకు లిద్దరూ డబ్బుపోగుచేసి శవం గొడవ పట్టించుకోకుండా కల్లుపాక లోకిపోయి  చిత్తుగా తినీ,తాగీ అక్కడే పడిపోతారు.ఈ చిత్రంలో ముగింపు అలాగైనా లేదు.కొత్త ఫిలాసఫీ చెప్పించినాడు.”ఈ డబ్బు నాచేతుల్లో ఎంత వెచ్చగా ఉంది.నాచేతులు గట్టిగా అదుము,గట్టిగా అదుము”అని తండ్రి అనడం,కొడుకు తండ్రి చేతులు అదమడం.

లోపంతో ఉన్న కథని మార్క్సిస్టు దర్శకుడిగా పరిగణించబడే మృణాళ్ సేన్ చిత్రంగా తీయడం వలన ఏం చెప్పినాడు?చిత్రం మొత్తంలో ఒక ఘట్టం,ఒక దృశ్యం,ఒక కదలిక, ఒక సంభాషణ,మచ్చుకి ఒక్కటైనా సహజంగా లేవు.ఈ చిత్రంలో సంభాషణల గురించి ప్రత్యేకంగా చెప్పాలి.కథ జరిగేది తెలంగాణా ప్రాంతంలో,కానీ,సంభాషణలు మాత్రం తెలంగాణావి కావు.ఇతర జిల్లాలవి కూడా కాదు.అసలు అవి ప్రజల జీవితాలలో ఉండే సంభాషణలేకావు.కృత్రిమమైన సినిమాల నుంచి,కథలనుంచి ఈ చిత్రానికి సంభాష ణ లు వ్రాసిన వ్యక్తి ఊహల నుంచి తయారైనవి మాత్రమే.ఒకప్రాంతంలో నివశించే ప్రజల జీవితాలను చిత్రించదల్చుకున్న దర్శకుడుగాని,రచయితగాని ఆ ప్రజల జీవితాలను తగినంతగా పరిశీలించి ఉండాలి.ఆప్రాంతంలో కెమెరాను తిప్పి,అక్కడదారేపొయ్యే నలుగురు మనుషులను చూపించినంతమాత్రాన ప్రజాజీవితచిత్రణ కాజాలదు.

ఈ చిత్రం ఇంత ఘోరంగా తయారుకావడానికి కారణం-మొదట:దర్శకుడు మృణాళ్ సేన్,తర్వాత సంభాషణల రచయిత వీరేంద్రనాథ్.ప్రజలలో సోమరిపోతులు,దొంగలు ఈ దోపిడీసమాజప్రభావం వల్ల ఉండవచ్చు.కానీ ప్రజలలో అటువంటివారు బహు కొద్దిమందిమాత్రమే ఉంటారు.వాస్తవానికి,ప్రజలను దుర్భర దారిద్ర్యం లోకి నెట్టే భూస్వామ్య వర్గం మొత్తంగానే సోమరిపోతులవర్గం.

ఇంకా చెప్పాలంటే ప్రజలలో అత్యధికులు కష్టపడే స్వభావం గలిగిన వారు.దివాళాకోరు ఆర్ధిక విధానాల వలన,దోపిడీ ఆస్తి సంబంధాలవలన అనేకులకు కష్టపడదామన్నా పనులు దొరకవు.అటువంటి పరిస్తితులలో ప్రజలలో చాలాఅరుదుగా,స్వల్పంగా కన్పించే వ్యతిరేకాంశాలను ప్రధాన వస్తువుగా తీసుకొనడం,అటువంటి వాళ్ల పోసుకోలు మాటల్ని ఓడించి ఎండగట్టే ప్రయత్నం చిత్రంలో లేకపోవడం క్షమించరాని నేరం.దోపిడికి వ్యతిరేకంగా ప్రజలు ఏం చెయ్యాలో,ఆమార్గం చెప్పకుండా ప్రజల్ని తప్పుదారిపట్టించే చిత్రంగనుకనే దీనికి ఎన్నో ఆవార్డులు,ఎన్నో ప్రశంసలు,చివరికి వినోదపు పన్ను మినహాయింపు.ప్రజలు ప్రజల్నే కించపరచుకోడానికి తప్ప ఎందుకూ పనికిరాదీ చిత్రం.

********************************************************************************************

సరియైన దృక్పథం లేని “ఒక ఊరి కథ”

-యస్సెస్ లాల్

మృణాళ్ సేన్ తెలుగు సినిమారంగములో క్రొత్త చైతన్యాన్ని కలుగజేస్తాడని  ఎవరైనా అనుకుంటే వారు పొరబడ్డారని “ఒక ఊరి కథ”నిరూపించింది.ప్రేక్షకులకు ఒక స్పష్టమైన అవగాహన కలిగించేబదులు,గందరగోళం సృష్టించిందీ చిత్రం.మార్కిస్టు అవగాహన కల రచయిత(ప్రేమ్ చంద్)కథను,మార్క్సిస్టు దర్శకుడు తీసినప్పటికి సినిమా స్పష్టమైన అవగాహననిగానీ,చైతన్యం గాని కలిగించలేదు ప్రేక్షకులకు.

చిత్రం ప్రారంభం లోనే తండ్రి కొడుకు లిద్దరు కాలకృత్యం(ఒకటికి వెళ్తారు) అసహ్యంగా చిత్రీకరించబడింది.సహజత్వం శృతి మించుతుందా అనిపించింది.ఈ చిత్రంలో తండ్రి పనిచెయ్యడు.కొడుకును పని చెయ్యనివ్వడు.”నేనెందుకు పని చెయ్యాలి.మా తాత బాగా కష్టపడేవాడు.మా అయ్యబాగా పనిచేసేవాడు.మరి వారికేం మిగల్లేదు.మరి నేనెందుకు పని చెయ్యాలి,ఊళ్ళో పన్జేసే వాళ్లందిరికేం మిగులుతుంది,వాళ్ళు చేసేపని వాళ్లకొరకు కాదు.జమీందారును పోషించడానికే,అటువంటి పని నేను చెయ్యను,నీవు కూడా చెయ్యొద్దు.పని అనే ఊబిలోకి దిగవద్దు”.

అదీ అతను పనిచెయ్యకపోవడానికి కారణం.

కూలీ చేసే ప్రజలకు ఏమీ మిగలదు నిజమే,మరి పనిమానెయ్యడమే పరిష్కారమా?వాళ్లకెటువంటి చైతన్యమవసరం లేదా?వాళ్ల కర్తవ్యమేమిటి?అనే ప్రశ్నలకు జవాబు దొరకదు ఈ సినిమాలో.సినిమాలో కొన్ని అప్రస్తుతమైన(ఎడ్లబండ్ల పందెం వంటి)సన్నివేశాలున్నవి.పాత్రల భాష సరిగాలేదు.ఒకసారి మాండలికమైన భాషా!ఒకసారి గ్రాంథికభాషా మాట్లాడుతారు.ప్రధాన పాత్ర ఐన వెంకయ్య మాటలు సరిగా అర్ధం కావు.వాటిని “డబ్”చేసారనుకుంటాను.

***********************************************

ఒక వెంకయ్య ఫిలాసఫీ

-డి.కృష్ణప్రసాద్

ఈ చిత్ర కథ సోమరిపోతులైన తండ్రీకొడుకులకు సంబంధించినదే గాని సామాన్యంగా పల్లెల్లో వుండే కూలిప్రజలకు చెందినదిగా లేదు.ఆతండ్రీ కొడుకులా విధంగా సోమరిగా ఉండడానికి భూస్వామ్య దోపిడీ సమాజమే కారణమని చెప్పటానికి గాను ఒకటీరెండు సన్నివేశాలను ఇరికించినా,ఈ చిత్రం పూర్తిగా చూసిన తరువాత ఆ అభిప్రాయం స్ఫురణకే ఉండదు.

వెంకయ్య కొడుకు కిష్టయ్య పెళ్లి చేసుకుంటా నన్నప్పుడు తండ్రి “పెండ్లి అంటే మాటలా?డబ్బుండాలి.బట్టలుండాలి,ఇల్లుండాలి’(అప్పటికే ఇల్లు కూలిపోయుంటుంది)అంటాడు, గానీ,ఇవన్నీ సమకూరుతాయి.ఎట్లా సాధ్యమైనాయో చెప్పడు.ఇల్లు మాత్రం కొత్తతాటాకు,వాసాలు వేసి దిట్టంగా కిష్టయ్య ఒక్కడూ కట్టేస్తాడు.దొంగిలించాడనుకోవాలా?అట్లా అనుకోవడానికి ఆస్కారం లేకుండా,ఒకసారి దడి కట్టడానికి కొద్ది ఆకులు దొంగిలించి పట్టుబడతాడు.ఈసన్నివేశం మరీ విచిత్రంగా ఉంది.కిష్టయ్య తాటాకు జమీందారు తోటలో దొంగిలించి ఇంటికి తెస్తాడు.అది తెలుసుకుని జమీందారు మనిషి నౌకరుని వెంటబెట్టుకుని ఆ ఆకులు తీసుకెళ్లడానికి వస్తే(చిత్రీకరణ చాలా విప్లవాత్మకంగా ఉన్నది!)”ఈ సారికి వదిలేయి(ఇతన్ని కాదు, ఆకుల్ని),అంతగా అయితే ఎంతఖరీదో చెప్పు,కూలీ చేస్తా”అంటాడు.నిశ్శబ్దంగా కూర్చుని ఉన్న తండ్రి దగ్గరకు వచ్చి,”వీళ్లు తాటాకులు తీసికెళ్తుంటే మాట్లాడవేమయ్యా?”అంటాడు.(ఇటువంటి పల్లె ఏ దేశంలో ఉందయ్యా?).

ఈ చిత్రంలో ప్రతి సన్నివేశము వెంకయ్య ఫిలాసఫీ కొరకే చిత్రీకరించబడ్డాయి.అసలు ఈ చిత్రమే ‘ఒక వెంకయ్య ఫిలాసఫీ’.

ఈ చిత్రసీమలో సీజనులని ఉంటాయి.జానపదాల సీజను,పౌరాణిక సీజను,క్రయిం చిత్రాల సీజను,సాంఘిక చిత్రాల సీజనులని.నేటి సీజను :భూసామ్య దోపిడీ చిత్రాల సీజను”.అసకు ఎక్కువ ప్రమాదం ఇటువంటి చిత్రాలమూలానే.మిగిలినవి ఒక కథ చెబుతున్నామని తీసే చిత్రాలు:ఈ సినిమాలు చూడటానికి ఇష్టపడేవారు అంధకారములో ఉంటారు.వీళ్లని కష్టపడి అయినా ఒకదోవలో పెట్టవచ్చును.కాని,సమస్యలను,పరిష్కారమార్గాలను గాని పక్కదోవ పట్టించే ఈ రకమైన చిత్రాల నుంచీ ప్రేక్షకులను రక్షిండం చాలా కష్టం.

క్లబ్ డాన్సులు,డ్యూయెట్స్,డిషిం డిషిం స్టంట్స్ లేనంతమాత్రాన,గుడిసెలు,పొలాలు బురద గట్రా జొప్పించినంతమాత్రాన చిత్రానికి సహజత్వం వచ్చేసిందని భ్రమపడటం తగదు.ఒకప్రాంతపు,ఒకతరగతి చిత్రిస్తున్నప్పుడు,అక్కడున్న పరిస్తితులను సమస్యలను ఆధారంగా తీసుకుని ఒకటో,రెండో కుటుంబాలపై చిత్రీకరించినప్పుడది ‘నాచురల్’అవుతుంది.వాళ్లకున్న పరిధిలో సమస్యలకు పరిష్కారమార్గ్లాలు చూపి చిత్రాన్ని నిర్మించాలి.అంతేగాని,విడ్డూరమైన ఓ రెండు పాత్రలను,ఎంతసేపు గుడిసెలనులోనూ,మట్టిలోనూ చూపితే మాత్రం నేచురాలిటీ వచ్చేస్తుందా?ఇప్పటివరకూ మన ఆవార్డు దర్శకులు(ప్రొఫెషనల్స్ అన్నమాట)నేచురాలిటీ అంటే సెక్సును విచ్చలవిడిగా చూపెట్టటమని భావించారు.కాని,మృణాళ్ సేన్ గారు మాత్రం ఈ విషయంలో గణనీయమైన మార్పులు తెచ్చారు.అవేమిటో తెలుసా?

మలమూత్ర విసర్జనను చిత్రించడం.

***************************************

మృణాళ్ సేన్ వై ఫల్యం

-యం.అరుణ్ కుమార్

ఈ వ్యవస్థలో కోట్లాది శ్రమజీవుల శ్రమమీద కొద్దిమందిగా వున్న పెట్తుబడిదారులు,భూస్వాములు బ్రతుకుతూ తమవిలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని చెప్పటం ముఖ్యోద్దేశంగా ఎంచుకుని ఆ ప్రయత్నంలో సఫలీకృతుడు కాలేక,ప్రజావ్యతిరేకతను ప్రదర్శించాడీ దర్శకుడు-ఒక వూరి కధలో.కష్టపడినా కడుపునిండని వ్యవస్థలో కష్టపడటం  తప్పని మొదట్నుంచీ వెంకయ్య కొడుక్కి ఉద్భోధిస్తూ ఉంటాడు.ఇద్దరూ పరమసోమరుల్లా మారుతారు.తాము కష్టపడకపోగా ఇతరుల యొక్క శ్రమను,వారి శ్రమను,వారి కష్టాన్ని దోచుకోటానికి వీరు సిద్ధపడతారు.

తాము శ్రమపడకుండానే శ్రమగురించి మాట్లాడుతూ ఉంటారు.ఆ పాత్రలు తక్కిన ప్రజల్లో కలసి పోరాడి సాధించుకోవాలనే సత్యాన్ని దర్శకుడు దాటవేసాడు.కోడలు నీల తాను గర్భవతినని తెలిసి కూడా ఆరోగ్యాన్ని సైతం లక్ష్యపెట్టక్కుండా శ్రమిస్తుంది.ఆమె పడుతున్న శ్రమను చూసిగానీ,ఆవూరిలో జరిగే అన్యాయాలను చూచిగాని వీరిరువురిలో ఏమాత్రం స్పందన రాకపోవడం విడ్డూరం.

ప్రజాసాహితి,జనవరి,1979

One Response
  1. Venkat Uppaluri November 30, 2010 /