Menu

చావు మేళం – గుజారిష్

క్వాడ్రిపిలిక్ తో దాదాపు జీవచ్చవంలా (ఈ సినిమాలో ఒక పాత్ర ఈ స్థితిని వెజిటబుల్ లా పడున్నాడు అని వర్ణిస్తాడు) లాగా బ్రతుకుతున్న ఒక మాజీమెజీషియన్ ‘ఇథెన్ మాస్కరేడ్’ (హృతిక్ రోషన్). అతన్ని బేషరతుగా ప్రేమించి దగ్గరుండి చూసుకునే ఒక నర్సు ‘సోఫియ’(ఐశ్వర్యా రాయ్ బచ్చన్). వీళ్ళిద్దరి జీవితం రోటీన్ గా బోరింగుగా సాగుతున్న తరుణంలో ఇథెన్ కు ఆత్మహత్య చేసుకోవాలనే సరదా కోరిక పుడుతుంది. అంతే అప్పట్నించీ హైడ్రామా మొదలౌతుంది. అతన్ని మొదట వ్యతిరేకించినా, ఏ మీ పెద్ద లాజిక్ లేకుండా “ఫీల్” అయ్యి సరే నేను కేసు వాదిస్తాను అనే లేడీ లాయర్ ఫ్రెండు. డాక్టర్ నాయక్ అనే మరో మెలోడ్రమెటిక్ పాత్ర సినిమాలో తమస్థాయి బోర్ ని నింపేస్తారు. ఇవన్నీ అర్జంటుగా జరిగిపోతున్న తరుణంలో “నాకు మ్యాజిక్ నేర్పించండి” అని ఒక కుర్రాడు ఎక్కడ్నుంచో ఆ సినిమా సెట్టులాంటి ఇంట్లో వచ్చి పడతాడు. అప్పుడు మొదలౌతుంది, జీవించే హక్కున్న మనిషికి చచ్చే హక్కుకూడా తన ఇష్ట ప్రకారం ఛాయ్స్ లాగా ఇవ్వాలనే ఎమోషనల్ విషయాన్ని అపభ్రంశంగా తెరపై అనువదించడానికి ‘ ప్రెస్టీజ్’, ‘ఇల్యూషనిస్ట్’ సినిమాల ఎత్తుగడని ‘ది సీ ఇన్సైడ్’ తో కలిపి ‘సంజయ్ లీలా భంసాలి’ చేసిన ప్రయత్నం ‘గుజారిష్’ అనే చిత్త(త్ర)భ్రమ.

ఎన్నుకున్న విషయం మంచిదే. ఎంచుకున్న నటులూ ఆరితేరినవాళ్ళే. సాంకేతికపరంగా సినిమాలో పేర్లు పెట్టడానికి ఏమీ లేవు…కానీ కథ…ఏదీ!?! సినిమా ఉద్దేశం ఏమిటి?! ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు అర్థమయ్యేది ఏమిటి?! ఏమీ లేదు. రెండు గంటల సుత్తి. నటనబాగున్నా, పాత్రల ఔచిత్యాలూ గమ్యాలూ అర్థంకాక గందరగోళం అయ్యే పరిస్థితి. సినిమా దృశ్యపరంగా బాగున్నా, కథనం అల్లికలోని గజిబిజితో తలనొప్పి తెచ్చుకునే స్థితి. నిజంగా ఇవన్నీ ప్రేక్షకుడికి అవసరమా?! ఒక సంవేదనాత్మక విషయం మీద ఇంత విసుగు పుట్టించే సినిమా నిజంగా అవసరమా!?

నటనా పరంగా హృతిక్ రోషన్ అద్భుతం. ఐశ్వర్య చాలా సినిమాల్లో కన్నా అందంగా కనిపించింది. ఎలాగూ వచ్చేవి కొన్నే హావభావాలు కాబట్టి అవి బాగానే ఉన్నట్టనిపిస్తాయి. సోఫియాగా తన పాత్రకు వేసుకునే బట్టలు, స్కార్ఫ్ లూ చిత్రంగా అనిపిస్తాయి. అక్కడక్కడా  ‘ఫ్రిడా’లో సల్మాహైక్ ను గుర్తుకు తెస్తాయి. మ్యాజిక్ నేర్చుకునే కుర్రాడిగా ఆదిత్య రాయ్ కపూర్ బాగానే ఉన్నాడు. లాయర్ గా హహనాజ్ పటేల్ నటన, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా రజత్ కపూర్, డాక్టర్ గా సుహైల్ సేఠ్ నటన తగిన మోతాదులో ఉన్నాయి. కానీ సీన్లలో ఉన్న అతిడ్రామా వాళ్ల నటనలోకి ఒలికి కొంత విసుగు కలిగిస్తుంది.

సుదీప్ చటర్జీ సినెమాటోగ్రఫీ గోవా అందాల్ని యూరోప్ అందాల్లా చూపించడంలో సఫలమయ్యింది. హేమంత్ కొఠారీ ఎడిటింగ్ పదునుతగ్గి సీను ఎప్పుడైపోతుందా అని ఎదురుచూసే ఘటనలు కోకొల్లలు. సంగీతం ఎవరోగానీ, చాలా యూరోపియన్ ప్రభావం సంగీతంలో కనిపించి, ఏమోషనల గా ప్రేక్షకుడు సినిమాకి కనెక్ట్ కాకుండా చేసింది.

సంజయ్ లీలా భంసాలీని భారతదేశంలో ప్రస్తుతం ఉన్న గొప్ప దర్శకుల్లో ఒకరుగా ఎందుకు అనుకుంటారో సినిమాసినిమాకీ నాకు సందేహం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా గత రెండు చిత్రాల్లో (సావరియా, గుజారిష్) అతని విపరీత సెట్స్, సెటింగ్స్, పాత్రల వేషభాషలు చూస్తుంటే ఏదో నాటకం చూస్తున్న ఫీలింగే తప్ప అసలు సినిమా చూస్తున్న అనుభూతే కలగడం లేదు.

గుజారిష్ చూస్తే హృతిక్ రోషన్ నటన కోసం చూడాలి. లేదా చూడకపోతేనే బెటర్.

17 Comments
 1. అభిమాని November 19, 2010 / Reply
 2. Sinivas November 19, 2010 / Reply
 3. rayraj November 19, 2010 / Reply
 4. sasank November 19, 2010 / Reply
 5. kiran November 20, 2010 / Reply
 6. సుజాత November 20, 2010 / Reply
 7. Pradeep November 21, 2010 / Reply
  • గీతాచార్య November 21, 2010 / Reply
 8. గీతాచార్య November 21, 2010 / Reply
 9. Madhu November 21, 2010 / Reply
 10. j.surya prakash November 23, 2010 / Reply
  • Sridhar November 20, 2016 / Reply
 11. venu November 24, 2010 / Reply
 12. Balaji Sanala November 24, 2010 / Reply
 13. Krishna chaitanya allam July 3, 2011 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *