Menu

కన్నీళ్ళ రుచి – గుల్జార్ ‘నమ్కీన్’

ఎనభైల్లో దూరదర్శన్ లో చాలా మంచి సినిమాలూ ధారావాహికలూ వచ్చేవి. నమ్మలేకపోయినా ఇది నిజం!

ఆ రోజుల్లో ఎన్నో గొప్ప చిత్రాలని నేను ఇంట్లో కూర్చుని చూసి నా ప్రపంచ ఙ్ఞానాన్ని (?) పెంచుకున్నాను. అలాటి రోజుల్లో గుల్జార్ అంటే పిచ్చి ఇష్టం వుండేది నాకు. (ఇప్పటికీ ఆ ఇష్టం వుందనుకోండి!) గుల్జార్ పాటలని విశ్లేషిస్తూ పాడుకోవటానికనే నా చుట్టూ ఒక స్నేహ బృందం కూడా వుండేది.

ఒకరోజు టీవీలో గుల్జార్ దర్శకత్వం వహించిన “నమ్కీన్” అనే సినిమా వస్తుందని మహా ఉత్సాహంగా కూర్చున్నాను. మా టీవీ ఆ రోజు రాత్రి పాడయ్యింది. నాకు ఏడుపొక్కటే తక్కువ! నా బాధ చూసి మా ఇంట్లో వాళ్ళు విసుక్కున్నారు.

ఇన్నేళ్ళ తరువాత అడిలైడ్ లైబ్రరీలో ఆ డీవీడీ కనిపించింది. తేవటమూ చూడటమూ కూడా జరిగాయి. ఆ సినిమా డిస్త్రిబ్యూటర్లు దొరకక సినిమాల్లో విడుదల కాలేదు. దూరదర్శన్ లో వచ్చి తరువాత డీవీడీ గా వచ్చింది.

గుల్జార్ గురించి మాట్లాడుతూ ఎవరో (రాఖీ గుల్జార్ అనుకుంటా బహుశా!) “అతనెంత సున్నిత మనస్కుడంటే దాదాపు ఆడదానంత!” అన్నారు. నాకీ సినిమా చూసినంత సేపూ అ మాటే గుర్తొచ్చింది. నిజానికి అన్ని గుల్జార్ సినిమాల్లోనూ కొంచెం సున్నితత్వం కనబడుతూనే వుంటుంది, అయితే ఈ సినిమా అంతా ముగ్గురు అమ్మాయిల గురించి కావటంతో ఇంకా సెన్సిటివ్ గా అనిపించింది.

కులూ-మనాలి దగ్గర ఒక చిన్న పల్లెటూళ్ళో వుంటుంది ఒక వృధ్ధురాలైన నర్తకి, జుగ్నీ (వహీదా రెహమాన్). ఆమెకి ముగ్గురు కూతుళ్ళు, నింకీ (షర్మిలా టాగూర్), మిట్టూ (షబానా ఆజ్మీ), చింకీ (కిరణ్ వైరెలీ). పేదరికంలో మగ్గుతూ ముగ్గురు వయసులో వున్న ఆడపిల్లలని కాపాడుకోవటానికి తల్లి గయ్యాళి నోరుతో అందరినీ దూరంగా వుంచుతుంది, ముఖ్యంగా తన భర్త కిషన్ చంద్ ను. తన కూతుళ్ళల్లో ఒక్కరినైనా మళ్ళీ డాన్సరు గా తయారు చేసి తన జీవితం గడుపుకోవాలన్నది తాగుబోతు కిషన్ చంద్ పథకం. అతన్ని దగ్గరికి కూడా రానివ్వదు తల్లి.

పాడుబడి కూలిపోతున్న వాళ్ళ ఇంట్లో అద్దెకి దిగుతాడు లారీ డ్రైవర్ గేరూలాల్ (సంజీవ్ కుమార్). ఆ ముగ్గురు అమాయకురాళ్ళకూ లారీ డ్రైవర్ కీ నడుమ పెరిగిన అనుబంధమే మిగతా సినిమా. ఆ ముగ్గురిలో ఎవరిని గేరూ ప్రేమించాడు? అతనికెవరికి దక్కాడు? ఆ తల్లి పరిస్థితి ఏమైంది? ఈ ప్రశ్నలన్నిటికీ సినిమాలో సమాధానం దొరుకుతుంది.

గుల్జార్ సినిమాల్లో వుండే సౌలభ్యం ఏమిటంటే చాలా వరకు పాత్రలంతా మామూలు మనుషులు. కాబట్టి వాళ్ళ కొరకు విచిత్రమైన ఫైటింగులో, అతి తెలివి సంభాషణలో పెట్టక్కర్లేదు. మామూలు మనుషులు ఎలా వుంటారో, ఎలా మాట్లాడతారో ఊహించగలిగితే చాలు. అందుకే గుల్జార్ దర్శకుడిగా ఎంత ప్రతిభ చూపొస్తారో మాటల రచయితగా అంతే ప్రతిభా చూపిస్తారు.

(పిడకల వేట1- “నరం గరం” సినిమాలో స్వరూప్ సంపత్ అమోల్ పాలేకర్ తో “నిన్ను ప్రేమించిన ఆడదాన్ని ఇలా నటించమంటావా? నువ్వేం మనిషివి?” (తుం కైసే ఆద్మి హో)అంటుంది కోపంగా. దానికి పాలేకర్, “ఆద్మీ? మైన్ ఆద్మీ కహా హూ? మై తో గరీబ్ హూ!” అంటాడు. ఎంత గొప్ప డైలాగు! ఆ సినిమాకి దర్శకత్వం వహించింది హృషీకేష్ ముఖర్జీ, మాటలు రాసింది గుల్జార్. )

ఈ సినిమాలో కూడా సంభాషణలు చాలా సరళంగా కానీ చాలా లోతుగా వుంటాయి. నటీ నటుల గురించి చెప్పనే అక్కర్లేదు. చెల్లెళ్ళ కోసం తల్లి కోసం తాపత్రయ పడే అక్కగా షర్మిలా, గయ్యాళిదైనా అమాయకంగా వుండే తల్లిలా వహీదా అద్భుతంగా నటించారు. మూగదైన శృతి మించని చిలిపిదనం వున్న అమ్మాయిలా షబానా కూడా చాలా గొప్పగా నటించారు. అయితే మొత్తం సినిమా షర్మిలానే డామినేట్ చేసింది. అది పాత్రల స్వభావమై వుండ వచ్చు. మొరటుగా వుంటూ ఆడ వాళ్ళను చూడగానే కంగారు పడే డ్రైవరుగా సంజీవ్ కుమార్ నటన ఎప్పట్లానే వంక పెట్టలేకుండా వుంది. చివరిలో ఆయన కంట తడి పెట్టినప్పుడు చాలా కన్విన్సింగ్ గా అనిపించింది.

ఈ సినిమాలో ఏదైనా నిరాశ పరిచిందీ అంటే అది సంగీతమే! గుల్జార్ ఆర్.డి.బర్మన్ కాంబినేషన్ లో వచ్చిన అద్భుతమైన (పరిచయ్, మాసూం, ఆంధీ)  పాటలతో పోలిస్తే ఈ సినిమాలో పాటలు కొంచెం తేలిపోయాయి.  ఒక్క “ఫిర్ సే ఆయో బద్రా బిదేసీ” పాట మాత్రం చాలా బాగుంది. సంగీతం, సాహిత్యం, చిత్రీకరణ అన్నీ కూడా. ఈ సినిమాలో ఆర్.డి. ఒక ప్రయోగం చేసారనిపించింది నాకు. పాట చరణాల్లో మొదటి సగం ఒక లయతో, రెండో సగం ఇంకో లయతో వుంటాయి.

(పిడకల వేట 2- “ఇజాజత్” లో గుల్జార్ బర్మన్ తో ” ఈ పాటకి బాణీ కట్టూ” అని “మెరా కుఛ్ సామాన్ తుమ్హారే పాస్ పడా హై” అని మొత్తం కవితా వినిపించారట. అది విని బర్మన్, “ఇలాగే వుంటే ఒక రోజు నువ్వు పేపరులో హెడ్ లైన్లకి కూడా బాణీలు కట్టమంటావు” అని విసుక్కున్నారట!)

కవి గుల్జార్! ఏమని చెప్పగలం ఆ కలం నించి జాలువారిన కవిత్వం గురించి? ఇంకొన్ని పేజీలు రాయటం తప్ప.

”బీతీ హుయీ బతియా కొయీ దొహరాయే” (పరిచయ్) అన్నా,

“ఏక్ ఆసూ చుపాకే రఖ్ఖా థా” (మాసూం) అన్నా,

“ఛోటి ఛోటీ బాతొ కీ హై యాదే బడీ” (ఆనంద్) అన్నా

“ఓ యార్ మెరీ ఖుష్బూ కి తరహ ఔర్ జిస్కి జుబా ఉర్దూ కి తరహ” (దిల్ సే) అన్నా

“తారో కో దేఖ్ తె రహే చత్ పర్ పడే హుయే” (మౌసం) అన్నా

ఆఖరికి

“బడీ ధిరే జలీ” (ఇష్కియా) అన్నా

ఆయనకే చెల్లింది.

చాలా యేళ్ళ తరువాత ప్రియ మిత్రుణ్ణి కలుసుకున్నభావన!

సినిమా చూసింతరువాత ఒక ప్రశ్న నా మనసులో మెదిలిన మాట నిజం! వయసులో వుండి, అమాయకంగా వుండే ముగ్గురు అందగత్తెలు అందుబాటులో వుంటే వాళ్ళని  exploit చేయకుండా వాళ్ళతో అనుబంధం పెంచుకునేంత సెన్సిటివ్, మంచి మగవాళ్ళు ఎక్కడైనా వున్నారా? వుండే వుంటారు. Three cheers to such men.

– శారదా మురళి

5 Comments
  1. రవి November 26, 2010 /
  2. Murali Raju November 26, 2010 /
  3. ramakrishna November 26, 2010 /
  4. జంపాల చౌదరి November 27, 2010 /
  5. Venkat Uppaluri November 27, 2010 /