Menu

ఏమైందో ఈ వేళ..!!

సినిమా దర్శకుడు సమాజంలో జరిగే వాస్తవ సంఘటనలు, వ్యక్తులగురించి సినిమా తీయాలనుకోవటం అభినందించదగినదే. అయితే సినిమాలో వుండే వాస్తవాలు సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా చిత్రీకరిస్తే అలాంటి సినిమాలు తాత్కాలిక విజయాన్ని సాధించినా, సభ్య సమాజం నుంచి విమర్శ ఎదురుకోకతప్పదు. సరిగ్గా ఇలాంటి విమర్శలకు గురయ్యే సినిమాగా “ఏమైందీ ఈ వేళ” తయారయ్యింది. సమాజంలో చెడుని ప్రతిబింబించే సినిమాలో ఆ చెడుని ఇది చెడు అని బలంగా చెప్పలేకపోవటం, ఆ చెడుకి ప్రతిగా కనీసం ఒక్క మంచి పాత్రకూడా లేకపోవడంతో ఈ సినిమా చెడుని సమర్థించే సినిమాగా మిగిలిపోయింది. చెడు చెడు అంటూ బోధలేల ఆ సంగతేంటో చెప్పమని మీరడగవచ్చు. సరే ముందు కథ వినండి.

విడిపోయిన భార్యా భర్తలు అవంతిక (నిషా అగర్వాల్), శీను (వరుణ్ సందేశ్) ఇద్దరు రెండో పెళ్ళికి సిద్ధమై తాము పెళ్ళిచేసుకోబోయే వ్యక్తులకు పూర్వ ప్రేమ కథను చెప్పడం ప్రారభిస్తారు. అమీర్‌పేట్‌లో వుంటూ వుద్యోగ ప్రయత్నాలు చేస్తున్న అవంతిక, శీను అనుకోకుండా జరిగే పరిచయం పెరిగి, శారీరికంగా కలిసి ఆ తరువాత పెద్దల ఒప్పని పెళ్ళిగా పరిణమిస్తుంది. ఆ తరువాత జరిగే తేలిక పాటి గొడవ చిలికి చిలికి గాలివానై చివరికి విడాకులదాకా తీసుకెళ్తుంది. ఇద్దరూ రెండో పెళ్ళికి సిద్ధమైన ఈ నేపధ్యంలో తిరిగి కలుసుకోగలిగారా లేదా అనేదే మిగత కథ.

పైన చెప్పినట్టు హైదరాబాద్‌లోని అమీర్‌పేట ప్రాంతంలో కథ జరుగుతుంది. ఇక్కడ అమీర్‌పేట్ గురించి కొంత చెప్పుకోవాలి. సాఫ్ట్‌వేర్ సంస్థలకి హైటెక్ సిటీ కేంద్రంగా మారిన తరువాత, ఆ సంస్థలలో చేరడానికి అవసరమయ్యే అనేక సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, బీపీవో తదితర విషయాలపై ట్రైనింగ్ ఇచ్చే అనేకానేక సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి, ఇక్కడే స్థిరపడ్డాయి. ఆ సంస్థలలో ట్రైనింగ్ తీసుకునే విద్యార్థులు, విద్యార్థినులు రాష్ట్రంలో అనేక ప్రాంతాలనించి వచ్చి ఇక్కడ చేరుకున్నారు. అలా వచ్చిన వారికోసం ఏర్పడ్డ హాస్టల్లు మెస్సులతో ఈ ప్రాంతం నిత్యం కళకళలాడుతుంటుంది. ఒకరకంగా రాష్ట్రం మొత్తంలో వున్న పదిహేడు – ఇరవై అయిదు సంవత్సరాల మధ్య వయసు కలిగిన “యూత్” రిప్రజెన్‌టేటివ్స్ అంతా ఇక్కడే వున్నారు. సరిగ్గా ఇలాంటి యూత్‌ని దృష్టిలో పెట్టుకోని తీసిన సినిమా “ఏమైంది ఏ వేళ”.

ఇంతవరకు సమస్యే లేదు. ఈ సినిమా చూసినవాళ్ళకి అమీర్‌పేట్‌లో వుండే యూత్ అంతా ప్రేమ, సెక్స్ కోసమే బ్రతుకుతున్నారన్నట్టు అనిపించేటట్టు తీయడమే ఈ సినిమాతో వున్న సమస్య. లేడీస్ హాస్టల్లో వున్న అమ్మాయిలంతా బాయ్‌ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకోవడం, తొలిముద్దు అనుభవలని పచ్చిగా వర్ణించుకోవడం, క్యారక్టర్ అనే పదార్థం ఎవ్వరిలోనూ లేదన్నట్టు ప్రవర్తించడం విడ్డూరంగా కనిపిస్తుంది. అప్పటిదాకా ఏమి తెలియని అమాయకురాలిగా కనిపించి,” బాపట్ల నుంచి వచ్చాను… తొలిముద్దంటే తెలియదు” అంటుండే హీరోయిన్ అవంతిక, “(హీరో) శీనుగాడితో సీను ఎక్కదిదాకా వస్తుందో తెలియదు, ఇంకొకణ్ణి వైటింగ్ లిస్ట్‌లో పెడదాం” అనుకోవడంతో దిగజారి ప్రియుడితో శృంగారం జరపడానికి సిద్ధమై బురఖాలో అతని రూంకి వెళ్ళడంతో అధఃపాతాళానికి జారి ఆ పాత్రమీద ఏహ్య భావాన్ని కలిగిస్తుంది.

హీరో హీరోయిన్లు పెళ్ళికి ముందు “శృంగారించడం” ఇంతకు ముందు అనేక సినిమాల్లో వచ్చినా అవన్నీ ప్రమాదవశాత్తూ జరిగినట్టు మనం చూశాం. అయితే ఇందులో అది చాలా స్పష్టంగా ఒక ప్లాండ్ ఏక్టివిటీగా రూపుదిద్దుకోవడంతో ఆ పాత్రలపట్ల మనకున్నసానుకూల అభిప్రాయాలన్నీ అణగారిపోతాయి. “నా వొంట్లో ఏవో ఫ్లూయిడ్లు ప్రవహిస్తున్నాయి.. నాకు “అది” కావాలనిపిస్తోంది” అని హీరో అనే దగ్గరనుంచి, ఇంటి వాచ్‌మెన్ ఆ అమ్మాయి రాగానే “ఎవరైనా అడిగితే ఏ త్రీనాట్ టూ కో టూ నాట్ ఫైవ్‌కో వెళ్తున్నానని చెప్పమ్మా.. పెంట్‌హౌస్ అని చెప్పద్దు” అంటూ చెప్పడంతో ఆ పిల్ల ప్రియుడుతో చేస్తున్నది శృంగారమా లేక చెప్పుకోలేని ప్రాచీన వృత్తా అని అనుమానం వస్తుంది. ఇలా శృంగారించుకున్న తరువాత పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయానికి రావడంతో అది ప్రేమ వల్ల పెళ్ళా లేక చేసిన పని కప్పిపుచ్చుకోడానికి పెళ్ళాని అని ఆ జంట మీద దురభిప్రాయాలు కలుగుతాయి. అలాంటి జంట తరువాత వారి వారి పెళ్ళికి ముందు వర్జినిటీ గురించి వాదించుకోని విడిపోతే ఏ మాత్రం జాలి కలగక పోగా వారి వారి అనుమానాలు నిజమే కదా అనిపిస్తాయి.

చిత్రం తొలి సగం ఇలాంటి అప్రాచ్యమైన సన్నివేశాలతో తయారైతే రెండో సగానికి వచ్చేసరికి ఆ మొదాటి సగానికి ప్రాయశ్చిత్తమా అన్నట్టు నీతి బోధలు ఎక్కువై విసిగించాయి. ప్రతి పాత్ర (ఆఖరికి కమెడియన్ కిశోర్‌తో సహా) ప్రేమ, పెళ్ళి యొక్క వుదాత్తత నుంచి టీ.వీ. డాన్స్ ప్రోగ్రాముల వల్ల చెడిపోయే పిల్లదాకా చాలా విషయాలమీద పాత్రలద్వారా దర్శకుడు తోసుకొచ్చి మరీ సందేశాలిస్తాడు. ఇంక తొలిసగము మలిసగమూ విస్తరించిన ద్వందార్థ డైలాగులు మరింత చిరాకు పుట్టిస్తాయి.

సినిమాని సినిమాగనే చూడాలి ఇలా మోరల్ పోలీసింగ్ తగదు అని ఎవరైనా అడిగే అవకాశం వుంది. సరే ఆ దృష్టితో కూడా ఒకసారి సమీక్షిస్తాను.

సినిమా మొదలవ్వగానే పేరలల్ నరేటివ్ పద్దతిలో ఇద్దరు విడిపోయిన ప్రేమికులు, వారి వారికి కాబోయే భార్య/భర్తలతో తమ పూర్వప్రేమ గురించి చెప్పడంతో మొదలౌతుంది. ఈ తరహా ప్రయత్నం కొత్తగానూ, ఆశాజనకంగనూ కనిపించినా పోను పోను అలా కథ చెప్పాల్సిన అవసరం అర్థంకాదు. కనీసం విడిపోయిన ఆ ప్రేమికులని కలపడంలో ఈ ఇద్దరి పాత్ర వున్నా అలాంటి కథనానికి ఒక సార్థకత వుండేది. ప్రేమ – పెళ్ళి- శృంగారం అనే పద్దతి కాకుండా శృంగారం – ప్రేమ – పెళ్ళి- విడిపోతూ కలవడం అనే వరుసలో వుండటం అసబద్ధంగా వుండటం ఒకటైతే ఆ విడిపోవడం తిరిగి కలవడం అనే రెండు సంఘటనలకి దోహదం చేసే కారణాలు బలంగా లేకపోవటం మరో వైఫల్యం. ఇన్ని “తప్పు చేసే” పాత్రల మధ్య కనీసం ఒక్క “మంచి” పాత్ర లేకపోవటం మరో తప్పు.

ఇక నటీ నటుల విషయానికి వస్తే –

వరుణ్ సందేశ్: గొప్ప నటన కాదు కాని, ఆ పాత్రకి సరిపోయాడు. ఇప్పటికే కొన్ని సినిమాలుగా అతని డైలాగ్ డెలివరీ వుంటున్నాం కాబట్టి కొత్తగా విమర్శించేదుకు ఏమి లేదు.

నిషా అగర్వాల్ (తొలి పరిచయం, ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ సోదరి): చూడ చక్కని ముఖం. కాకపోతే ఒకటే నవ్వు, ఒకటే ఎక్స్‌ప్రషన్. అంతమాత్రంతోనే ఇంత సినిమా చెయ్యగలగడం ఆమె ప్రతిభో, దర్శకుడి ప్రతిభో తెలియదు. డబ్బింగ్ గొంతు కాబట్టి డైలాగ్ డెలివరీ గురించి విమర్శించేందుకు ఏమి లేదు.

‘వెన్నెల’ కిశోర్: సినిమా మొత్తానికి పండిన ఏకైక పాత్ర. కేవలం స్నేహితుడు హీరొ పాత్ర కావడం వల్ల అతని చేతిలో బకరా అవుతూ, తన్నులు తినే రొటీన్ పాత్రకి, రొటీన్‌కి భిన్నమైన నటనతో, డైలాగులతో పండించాడు. ఈ మధ్య హీరో స్థానానికి ఎదిగిపోయిన సునీల్ స్థానాన్ని ఈ నటుడు ఆక్రమించే అవకాశం పుష్కలంగా వుంది.

ఇతరులు: చెప్పుకో తగినంత పాత్రలు ఎమి లేవు. హీరోయిన్ స్నేహితుల్లో ముస్లిం అమ్మాయి పాత్రధారిణి, ఝాన్సి, హీరో తల్లిపాత్రలో ప్రగతి ఎబొవ్ ఏవరేజ్ అనిపిస్తే, ఎం ఎస్ నారాయణతో సహా మిగిలిన అందరూ బిలో ఏవరేజ్ అనిపించారు. బహుశా అంతకన్నా చేసే అవకాశం ఆ పాత్రలకి లేదేమో.

చక్రి సంగీతం, ఫోటోగ్రఫీ అంతంతమాత్రం. కథా స్క్రీన్‌ప్లే మాటలు దర్శకత్వం అన్నీ సంపత్ నందీనే కాబట్టి అత్యధిక పాపభాగం ఈయనకే దక్కుతుంది.

చివరి మాట: విధివశాత్తూ నేను వుండేది అమీర్‌పేట్‌లోనే. ఇప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ప్రతి రెండడుగులమధ్య నిలబడి వుండే ఏ జంటను చూసినా నాకు కొన్ని నీచమైన ఆలోచనలు రావచ్చు. ఇక సైబర్ కేఫ్‌ల వంక చూడాలంటే అనుమానంతోపాటు, అసహ్యం కలగవచ్చు. కాకపోతే ఈ ప్రపంచం సినిమా అంత చిన్నది కాదని సర్దుకుపోతాను. ఎందుకంటే ఈ సినిమా చూసిన ఏ తల్లీతండ్రి వాళ్ళ పిల్లల్ని ముందు ముందు అమీర్‌పేట్‌లో వుండనివ్వరు.

20 Comments
 1. Ravikumar November 21, 2010 /
 2. chakri November 22, 2010 /
 3. viplove November 22, 2010 /
   • viplove November 22, 2010 /
   • chakri November 22, 2010 /
   • chakri November 22, 2010 /
   • viplove November 22, 2010 /
 4. శేఖర్ November 22, 2010 /
  • rahull November 25, 2010 /
 5. j.surya prakash November 23, 2010 /
 6. Desi November 23, 2010 /
   • Desi November 24, 2010 /
 7. premika November 24, 2010 /
 8. chakri November 24, 2010 /