Menu

చిత్రాల్లో దీపావళి ‘సిత్రాలు’

‘‘హాయ్… ఉమాదేవి… హ్యాపీ దీపావళి’’ అంటూ శివాజీ (రజనీకాంత్) వచ్చేస్తాడు. అతన్ని చూడగానే కంగారుగా ఉమాదేవి (శ్రీయ) లోపలకి పరుగెత్తి ….‘అమ్మా… వచ్చేసారే!’’ అంటుంది. దాంతో ఆమె తల్లి ‘వెళ్లి ఆ తలుపెయ్యవే!’ అని పురమాయిస్తుంది. ‘అలాగలాగే…’ అంటూ శ్రీయ వెళ్లి తలుపు వేద్దామని పరుగెత్తుకెళ్ళేసరికి అక్కడ ఆల్రెడి శివాజి, అతని తల్లి, తండ్రి, ఫ్రెండ్ కూర్చుని ‘హాయ్’ అని పలకరిస్తారు. అదిచూసి … ‘అమ్మా… అమ్మా… వాళ్ళు లోపలకి వచ్చేసారే’ అంటూ మళ్ళీ అరుస్తుంది. ఇంతలోకి ఉమాదేవి తండ్రి వచ్చి… వీళ్లని చూసి…’’ ఆ రోజే మీకూ మాకూ రాం రాం అని చెప్పాం కదా…. ఇలా చీటికి మాటికీ వచ్చి ఎందకయ్యా విసిగిస్తారు’’ అంటారు. దాంతో శివాజి…‘‘ అందరం కలిసి దీపావళి పండుగ చేసుకుని గారె, నాటు కోడి పులుసు తిని పరిచయం పెంచుకుందామ’ని వచ్చానంటాడు. అయినా ఆయన వినక వీళ్లను బయటకు గెంటేస్తాడు. అప్పుడు ఎదురింటి ముసలాయన వచ్చి ‘‘నాకు ఇద్దరు కూతుళ్లున్నారు…. నా ఇంటిలో దీపావళి జరుపుకుని… నా కూతుళ్లతో పరిచయం పెంచుకోండి’’ అంటూ ఆఫర్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ‘‘శివాజీ’ చిత్రం చూసిన మనకందరకి తెలిసిందే.

నిజానికి ‘దీపావళి… తెలుగు సినిమా’ ఎంతసేపు ఆలోచించినా ఈ సీనే గుర్తుకు వస్తోంది. మంచి సీనేగా ప్రాబ్లం ఏంటీ అంటే అది ‘తమిళ డబ్బింగ్ సినిమా’ కదా. కాస్త మన తెలుగు సినిమాలో సీన్‌జ్ఞాపకం వస్తే ఎంత బాగుండును అని బాధేస్తుంది. అలా గుర్తుకు రాకపోవటానికి కారణం మన తెలుగు సినిమాల్లో మన తెలుగు పండుగలకు సంబంధించిన సన్నివేశాలు ఈ మధ్యన పెట్టకపోవడమే! తెలుగు సినిమా ప్రజల జీవితాన్ని దాటి ఎప్పుడో వెళ్లిపోయింది అన్నది వాస్తవమే అయినా, ప్రక్కనున్న వారిని చూసి ప్రేరణ పొందే మనం వారు తమ సినిమాల్లో సంస్కృతి… సంద్రాయాలకు ఇస్తున్న ప్రాధాన్యత మనమెందుకు ఇవ్వటం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పండుగ పూట మనని మనం తిట్టుకోవటంకన్నా… మనకున్నంతలో మనవాళ్ళు గతంలో తీసిన సినిమాల్లోని పండుగలకు… ముఖ్యంగా దీపావళికి ఇచ్చిన ప్రాధాన్యత గుర్తు చేసుకోవటం బెస్ట్ కదా.

కాస్త వెనక్కి వెళ్లి… ‘షావుకారు’ (విజయవారి తొలి చిత్రం)లో సీన్ గుర్తుకు చేసుకుంటే… దీపావళి పండుగనాడు శాంతమ్మ (శాంతకుమారి) సుబ్బులు (జానకి) ఎంతో ఆత్మీయంగా, ఆనందంగా ‘‘దీపావళి, దీపావళి… ఇంటింట ఆనంద దీపావళి… మా యింట మాణిక్యావళి’’ అంటూ పాడుతుంది. అలాగే అంతా కలిసి ఉన్నప్పుడు పాడుకునే ఆ పాటని సెకండాఫ్‌లో గొడవలు వచ్చి విడిపోయినప్పుడు ‘‘దీపావళి, మా యింట శోకాంధ తిమిరావళి’’ అంటూ చూపటం ద్వారా ఓ సింబాలిజంలా వాడుకున్న తీరు మైమరిపిస్తుంది. నిజానికి ఇలాంటి స్క్రీన్‌ప్లే స్క్రీమ్‌లు అప్పట్లో చాలా సినిమాల్లో కనిపిస్తాయి.

‘పెళ్లికానుక’ సినిమాలోనూ మొదట… ‘దీపావళి’ పండుగ చేసుకుంటూ ఆనందంగా హీరో హీరోయిన్స్… ‘ఆడే పాడే పసివాడా ఆడేనోయి నీ తోడ ఆనందం పొంగేనోయి దీపావళి, ఇంటింట వెలుగు, దీపాల మెరుగు, ఎనలేని వేడుకరా’ పాడుకుంటారు. అదే సీన్ రివర్స్ అయినప్పుడు ఆ బాధను స్ఫురింపజేస్తూ… ‘ఆడే పాడే పసివాడ, అమ్మాలేని నినుచూడ కన్నీటి కథ ఆయె దీపావళి, ఊరెల్ల వెలుగు, ఆనందం కనరాని దూరమురా’ అంటూ రిపీట్ అవుతుంది. అంటే ఆ దీపావళికి ఈ దీపావళి ఇలాంటి మార్పు వచ్చిందిని దర్శకుడు భావనాత్మకంగా చెప్పారన్నమాట. దీపావళి అనేది జీవితంలోని వెలుగు నీడలకు ప్రతీక అని దర్శక, రచయితల అభిప్రాయం అయ్యుండొచ్చు.

ఇక ఈ రోజు (దీపావళి)… టీవీ వాళ్ళు, రేడియో వాళ్ళు తప్పనిసరిగా వేసే పాట ఒకటుంది. నిజానికి ఆ పాటని దీపావళి గీతంగా గవర్నమెంటు ప్రకటించేవచ్చు. అదే… ‘‘చీకటి వెలుగుల రంగేళి… జీవితమే ఒక దీపావళి… మన జీవితమే ఒక దీపావళి… అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాలవేళ’’ అంటూ సాగే పాట. విచిత్ర బంధం (1972) చిత్రంలోని ఈ పాట తెలుగువారు ఉన్నత కాలం ఉంటుందనేది అందరూ ఒప్పుకుని తీరే సత్యం. ఇక ‘భలే రాముడు’ క్లైమాక్స్‌లో సావిత్రి ‘ఇంటింటను దీపావళి మా ఇంటను లేదా, ఆ భాగ్యము రాదా’ పాట, ‘రుణానుబంధం’లోని ‘వచ్చింది దీపాల పండుగ ఉన్నోళ్ళ డబ్బంతా దండుగ’ పాటలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోతగ్గవే. ఇవన్నీ మనవైన మన పండుగ పాటలు.

ఆ తరం నుంచి ముందుకు వస్తే దాసరి నారాయణరావు ‘మామగారు‘ చిత్రంలో ‘వెయ్యేళ్ల నిత్యమైన దీపావళి… ఏనాడూ వెళ్లిపోని దీపావళి… ఏరికోరి ఎంచుకుంది మా లోగిలి’’ అంటూ ఓ పాట దీపావళి పండుగ నేపథ్యంలో కొత్త అల్లుడుతో ఆనందంగా పాడుకోవటం కనిపిస్తుంది. సినిమాలాగే ఆ పాట కూడా తెలుగునాట ఓ భాగమై కలిసిపోయింది. అలాగే చిరంజీవి ‘ఠాగూర్’ ప్ల్యాష్‌బ్యాక్ ఎపిసోడ్ (గుర్తొచ్చిందా)లో అపార్టుమెంట్ కూలిపోయే ముందు దీపావళి జరుపుకుంటూ ఓ చిన్న బిట్ సాంగ్ ఉంటుంది. ఇక సూపర్ డూపర్ హిట్ ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ చిత్రంలోనూ దీపావళితో ముడిపెట్టి ఓ కీలకమైన సన్నివేశం ఉంటుంది. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శ్రీకాంత్ కలిసి తమ పెళ్లాల దగ్గర బిల్డప్ ఇవ్వటానికి అప్పుచేసి దీపావళి సామాను తెస్తారు. ఆ తర్వాత ఆ అప్పే వారిని రోడ్డుమీద పారేసేందుకు లీడ్ అవుతుంది. ఇక రెండు మూడేళ్ల క్రితం వచ్చిన కళ్యాణ్‌రామ్… ‘విజయదశమి’ చిత్రంలోనూ దీపావళిపై పాట వుంటుంది. అయితే పెద్ద ట్విస్టు ఏమిటంటే ఈ పైన చెప్పుకున్న చిత్రాలన్నీ తమిళ రీమేక్‌లే. అక్కడ వారు తమ సంస్కృతిలో భాగమైన దీపావళిని వదలలేదు కాబట్టి మనకూ ఆ మాత్రం దీపావళి సోయగాలన్నా దక్కాయి. ఇలాంటప్పుడే తమిళ రీమేక్ లకు జై అని అనాలని తెలుగువారికి అనిపిస్తుంటుంది.

అయినా మరీ చాదస్తం కాకపోతే సినిమాల్లో దీపావళి, సంక్రాంతి, వినాయక చవితి వంటివి పెట్టాలా అంటే… పెద్ద పెద్ద స్క్రీన్‌ప్లే గురువులు (హాలీవుడ్ వారిని అర్థం) కూడా పురాణాలని, పండుగలని స్పృశిస్తూ… ఆ మూలాలని వదలకుండా సినిమాలు తీస్తే అవి జనంలోకి వెళ్లి. జనం ఉన్నంత కాలం నిలిచే అవకాశం ఉందని, వాటికి జీవం వస్తుందని నొక్కి మరీ చెప్తున్నారు… కథలు, పురాణాలు విషయాలపై రీసెర్చ్ చేసిన జోసెఫ్ కాంప్ బెల్ ( ది హీరో విత్ దౌజెజ్ ఫీసెస్) అనే పెద్దాయన…  ఈ విషయాన్ని చెప్పటం గమనించవచ్చు (ఇక్కడ మనవాళ్ళు ఎవరూ చెప్పలేదా అని అడగొచ్చు… కానీ అక్కడవాళ్ళు చెబితే ఆ పవర్ వేరు కదా) కాబట్టి సినిమా చూస్తున్న ప్రేక్షకుడుకి ఇది నా కథ, నాకు తెలిసిన వారి కథే. నా జీవితమే అనిపించాలంటే… ఇలాంటి పండుగలను కలపడం వంటి కొద్దిపాటి జాగ్రత్తలు తప్పనిసరేమో. కాబట్టి దీపావళి కూడ కమర్షియల్ ఎలిమెంటే. అయినా మన తెలుగు హీరో ఇప్పుడు మాఫియో డానో, హిట్ మ్యానో అవుతున్న  నేపథ్యంలో ఈ పండుగలు పెట్టడం కష్టమే.
అయినా ఇలా దీపావళి సీన్ పెట్టిన సినిమాలువల్ల అప్పుడప్పుడూ చూసే జనానికి లాభాలు కూడా కలుగొచ్చు. ఉదాహరణకి… ‘ఫ్యామిలీ సర్కస్’ సినిమాలో దీపావళి జరుగుతూంటే… ఆ ప్రేలుళ్ల శబ్దానికి జగపతిబాబుని ఓ టీనేజ్ అమ్మాయి వాటేసుకుంటుంది. ఇలా దీపావళి ఒక్కోసారి మగవాళ్లకు చాలా ఉపయోగపడుతుందనే విషయం ఈ సీన్ చెప్తుంది. అయితే అక్కడినుంచి ఈ మధ్య వయస్కుడిని అమ్మాయి ప్రేమించానంటూ వెంటబడి కాపురంలో నిప్పులు పోసే సీన్‌కూడా ఉందనుకోండి.
ఇక దీపావళి ఒక వ్యక్తి జీవితాన్ని ఓ భయంకరమైన మలుపు ఎలా త్రిప్పుతుందో… ‘దొంగరాముడు’’ చిత్రంలో గమనించవచ్చు. రాము (అక్కినేని), లక్ష్మీ (జమున) అన్నా చెల్లెళ్ళు. చెల్లెలంటే ఎంతో ప్రేమ ఉన్న రాము… దీపావళి పండుగ రోజున చెల్లికి ఆనందం కలిగిస్తాడు. ఆ టపాకాయల చప్పుడుతో తల్లి షాక్‌కు గురవుతుంది. తల్లి ఆరోగ్యంకోసం మందులు దొంగిలించిన నేరానికి పోలీసులు రామును అరెస్టుచేసి బాల నేరస్థుల జైలుకు పంపుతారు. ఆ తర్వాత అతనే దొంగరాముడై సినిమా చూసిన వారి హృదయాలను దొంగిలిస్తాడు.
‘దీపావళి’ టైటిల్‌తోఇప్పటికి రెండు తెలుగు సినిమాలు వచ్చాయి. మొదటిది దీపావళి (1960) ‘దీపావళి’ అంటే ఏమిటీ ఎలా ఆ పురాణ కథ చెప్పేది అయితే మరొకటి… వేణు హీరోగా వచ్చిన దీపావళి (2008) ఓ ప్లాప్ సినిమా.
ఇక ‘దీపావళి దిక్కుమాలిన రీసెర్చి’ అనే ఈ ప్రోగ్రాం ప్రక్కన పెడితే సినిమా వాళ్ళు దీపావళి రోజు పత్రికల్లో టీవీల్లో శుభాకాంక్షలు జాగ్రత్తలు అవీ చెప్పేసి తన చిన్ననాటి దీపావళి జ్ఞాపకాలు (ఉన్నా లేకపోయినా) గుర్తు చేసుకోవటం, తమ సినిమాలు రిలీజ్‌లు, ప్రమోషన్స్ పెట్టుకోవడం ఇప్పటి ట్రెండ్.
చివరగా దీపావళి (1960) చిత్రంలోని హైలెట్‌గా నిలిచిన డైలాగ్…
సత్యభామ: ఛీ నీచాధమా; పరస్ర్తిలను మాతృసమాన పూజ్యులు. పతివ్రతలు పరాశక్తిస్వరూపిణులు, ఆ పవిత్ర సత్యాన్ని పాటించక పాపచింతనతో పతితుడవైనప్పుడు ఆ మాతృస్వరూపం సంక్షిభించి అగ్నిపర్వతంవలె బ్రద్ధలై భయంకర కోపాగ్ని కీలలు నిన్నావరించి దహించునప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులేకమై వచ్చినా నిన్ను రక్షించలేరు. నీతో భూదేవి కృంగిపోతున్నది. నిన్ను వధించి భూభారం తొలగిస్తారు. కాచుకో. ఓరీ మదోన్మాదీ! నీకు చావు తప్పదు

అని హెచ్చరిక చేస్తుంది.

అదే విధంగా తెలుగు పరిశ్రమలో కూడా  విలువలు పాటించకుండా సినిమాలు తీస్తున్న వారు, సినిమా అంటే అవగాహన లేని వారందరూ నరకాసురులే. ఈ సినీ నరకాసరుల వధ జరిగి మంచి సినిమాలు రావాలంటే ప్రేక్షకులే సత్యభామ, కృష్ణుల అవతారమెత్తాలి.   ఆల్రెడీ అవతారమెత్తిన వారు యుధ్దం ప్రారంభించే సమయం ఆసన్నమైందని తెలుసుకోవాలి.
ఇక ఈ పండుగ పూటనుంచైనా మన దర్శక, నిర్మాతలు… “మనం తెలుగు సినిమాను కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే తీస్తున్నాం” అనే విషయం గుర్తుచేసుకుని ముందుకెళ్తారని, స్క్రిప్టులో మసాలా జోడించినట్లే కాస్త మన పండుగలు, సంప్రదాయాలని కలిపి మనదైన సినిమాని మనకు అందిస్తారని ఆశిద్దాం. పండుగ పూట ప్రార్ధిద్దాం.

దీపావళి శుభాకాంక్షలుతో…

(ఆంధ్రభూమి ‘వెన్నెల’  నవంబర్ 5, 2010 లో ప్రచురితం)

17 Comments
  1. అనిలు November 5, 2010 / Reply
  2. hanu November 5, 2010 / Reply
  3. సినిమా Bond November 5, 2010 / Reply
  4. Rangan November 5, 2010 / Reply
  5. chakri November 6, 2010 / Reply
  6. సుజాత November 7, 2010 / Reply
    • j.surya prakash November 7, 2010 / Reply
  7. రవి November 8, 2010 / Reply
  8. కొత్తపాళీ November 10, 2010 / Reply
  9. సుజాత November 13, 2010 / Reply
  10. chakri November 13, 2010 / Reply
  11. chakri November 13, 2010 / Reply
    • Shafi November 30, 2010 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *