Menu

‘విలన్’ అను రావణాయణం: ఓ మహా ప్రణయ ‘వీర’గాథ

మద్రాస్ టాకీస్ వారి ‘విలన్’ విడుదలైన నాల్గునెలలకి ఇదీ రాస్తూ ‘దొంగలు బడ్డ ఆర్నెల్లకి…’ సామెతని గుర్తుకుతెస్తున్నా, నేను ఈ మధ్య చూశాననే సంజాయిషీతో కొంత నేర పరిహారం ఆశిస్తున్నా!
ఇది సమీక్ష కాదు; ఒకానొక ప్రతిస్పందన తాలూకూ ప్రశ్నావళి. ముందు వెనకలు, ముగింపు జాగ్రత్తలు… వంటివేవీలేని కొన్ని అడ్డదిడ్డమైన అనుమానాల చిట్టా. ఇది కేవలం మగాళ్ళ (‘దమ్ము’, ‘ధైర్యా’లకి పర్యాయపదం కాదు)కి సంబంధించిన సందేహాల జాబితా. ఆడవాళ్ళు చదవడానికి నిషేధాలు ఏమీ లేవుగానీ, సహజంగా enegmatic అయిన ఆ వర్గాన్ని ఈ ‘మగగొడవ’లోకి లాగి, (నా) సమస్యని మరింత జఠిలం చేయకూడదన్న బలమైన కోర్కెవల్ల ఆడవాళ్ళు ఇది చదవకపోవడం నయమనుకుంటాను.
* * *    * * *     * * *     * * *

సగభాగం సాధించుకొని సామాజికంగా ఖరారైపోయిన సతీమణినో, మూరెడంత దూరాలు కూడా లేకుండా ముంచుకొచ్చే ముహూర్తాల్లో ఖాయం కాబోతున్న ధర్నపత్నిని గానీ మర్యాదగా, సాధికారంగా, బహు జాగ్రత్తగా ఇష్టపడే ఉండుంటారు మీరు. స్విచ్ వేస్తే బల్బు వెలిగినంత, ములుగర్ర పోటుకి గానుగెద్దు తిరిగినంత ఠంచనుగా, లెక్క ప్రకారం ప్రేమిస్తూనే ఉండుంటారు.
కానీ, అలా గత్యంతరంలేని ఇష్టాలు కాకుండా, పొరుగింటి పుల్లకూర కోసం దొంగ చొంగలు కార్చేసి, లోలొట్టలేసేసి ఆయాచిత అవకాశాలు కోసం వెంపర్లాడటం కాకుండా, ఎదురైన ఎంజిలా జోలాలు, ఐశ్వర్యారాయి… రప్పలు ఎవరితోనైనా మానసిక మైథున స్వైరకల్పనలో తలమునకలవ్వడం కాకుండా ఎవర్నైనా ఒక అమ్మాయిని ఇష్టపడ్డారా?
నూనూగు మీసాలు బిరుసెక్కే ఆర్భాటాలలో, మోహపు మొలతాళ్ళ బిగింపు అనివార్యాలలో, యవ్వనోద్రేకాల ఆరంభ కంగాళీలో…

‘నా ఫస్ట్ క్రష్’ అని గొప్పలు పోడానికి సమ్మర్ క్యాంప్లా, క్రాష్ కోర్సుగా, ఆటవిడుపులానో, ఆటలో అరటిపండుగానో కాకుండా, ఎవర్నైనా ఒకామెని బాగా ఇష్టపడ్డారా?

సొంత లాభాలు, పోరు నష్టాలు, కుడితిలో ఎలుకలు, బోనులో చిలకలు, శ్లేష్మంలో ఈగలు, బావిలో కప్పలు, పుట్టలో చీమలు, మందలో గొర్రెలు, వైకుంఠపాళులు, అరచేతి వైకుంఠాలు… రొంపి… రొచ్చు… ఉరుకుల పరుగుల తొడతొక్కిడి బతుకుల్లో, కలుగుల్లో…. సకలం లిప్తపాటైనా రద్దు చేసి ఎవరైనా ఒక స్త్రీని గాఢంగా ఇష్టపడ్డారా?

నిత్యనైమిత్తికాల యథాలాపాలలో  రోజూ చూసే రొటీన్ రూపంలో ఏవో కొత్త అందాలు చటుక్కున స్ఫురించి అబ్బురపడ్డారా?
బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ… ఇత్యాది మీ ఆశ్రమాలతో, ధర్మ, అర్థ, కామ… వంటి మీ పురుషార్థాలతో నిమిత్తం లేకుండా ఎదురైన ఓ అపరిచిత సౌందర్యరాశి మారిటల్ స్టేటస్ చిహ్నాలు కళ్ళతో తడుములాడారా? మెట్టెలు, మాంగల్యాలు… వంటివేవో వెక్కిరిస్తే దిగులు పడ్డారా? ఆ దొండపండును దర్జాగా, ధీమాగా దొరకబుచ్చుకున్న కాకిని చూసి వెగటుపడ్డారా?
సదరు మొగుడుగారి మరగుజ్జు ధీరత్వాలకి కూడా ఆమె మురిసిపోతుంటే, ఆ ‘పుణ్యం కొద్ది దొరికిన పురుష పుంగవుడి’తో చెట్టాపట్టాలేసుకుంటుంటే… మురికి గుంటలో, తేటైన తటాకంలో కూడా ప్రతిఫలించే బింబం ఒకేలా ఉంటుంది లెమ్మ’ని సరిపెట్టుకోలేక, కడుపు రగిలిపోయేంత అసూయపడ్డారా?

తుమ్మెదల జల్సా జాజర దులపరింతల్లోంచి ఎంగిలి పుప్పొడ్లు రాలినట్లో, జీబురు తలల చెట్టులోంచి తుంపుల వెన్నెల తరగలు జారినట్లో, నురగల పడగల మీద గాలి తప్పటడుగులు చిట్లినట్లో… విరిసీ విరియని అరనవ్వు, తాకీతాకని కొన చూపు, చేరీ చేరని కన్సైగ…. ఆమె నుంచి మీకు బట్వాడా అయ్యి, జన్మ సార్థకతతో సాగిలపడ్డారా?

అంతు చిక్కని గమ్యాలు, కరుడుకట్టిన లక్ష్యాలు, చావుకొచ్చే సాధనలు, నేలవిడిచి సాములు… అన్నీ కూడా ‘ఆమె’ని ఆరాధించడమనే మహత్కార్యం ముందు పిపీలికమాత్రమై చిన్నబోయి గర్వపడ్డారా?
‘పోనీ పోనీ… పోతేపోనీ… సతుల్, సుతుల్ హితుల్… రానీ రానీ కష్టాల్… నష్టాల్…శాపాల్… పాపాల్…’ అనుకునే త్యాగాలకి ఆమె కోసం కనీసం కలలోనైనా సిద్ధపడ్డారా?

…పై ప్రశ్నలకి ఎక్కువ శాతం ‘లేదు’, ‘లేనేలేదు’, ‘బొత్తిగా లేదు’… వంటి జవాబులే ఉంటే మీకు వీరయ్య, ‘విలన్’ వీరయ్య, మణిరత్నం మలిచిన పదితలల రావణుడంటి వీరయ్య మీకు అర్థమయ్యే అవకాశమే లేదు.

ఈ సినిమా ఘోర వైఫల్యం గురించి బిగ్ బితో సహా చాలా మంది ఉద్దండులు చాలా విలువైన విమర్శలు చేశారు. కథా సంవిధానం, ఎడిటింగ్ లోపాలు,… ఇంకా ఎన్నో సాంకేతిక వైఫల్యాలతో సహా ఆ చిట్టా చాలా పెద్దది (హిట్, బంపర్ హిట్టు, సూపరు హిట్టు అవుతున్న నేటి సినిమాలన్నీ అటువంటి లోపాలకి అతీతమని సినీ పండితుల అభిప్రాయమైనా, అదంత వాస్తవం కాదని సగటు ప్రేక్షకుడికి కూడా తెలిసిందే).    రాగిణిని చంపడమే లక్ష్యమైతే పడవని ఢీకొన్నప్పుడే చంపొచ్చుకదా; ఆమెని కిడ్నాప్ చేసి పోలీస్ బాస్ దేవ్ని వేధించడమే లక్ష్యమైతే కొండ మీద ఆమెని చంపాలని వీర ఎందుకు పూనుకున్నాడు? ….. వంటి హేతుబద్ధమైన ఎన్నో ప్రశ్నలు విశ్లేషకులు నేర్పుగా లేవనెత్తారు. ఎంతో తర్కహితమైన, సబబైన అటువంటి ప్రశ్నలకు తావులేకుండా, ‘విలన్ వీర’లోంచి కథ నాకు మరోలా కనిపించింది:

అచ్చం ఐశ్వర్యా రాయ్ అంత అందంగా ఉన్న రాగిణిని వీర తొలిచూపులోనే వలచలేదు. తొలి మాత్రమే కాదు, మరి కొన్ని మలి చూపుల్లో కూడా ఆమె శత్రువు పెళ్ళాం మాత్రమే. తాను ప్రతీకారం తీర్చుకోవడానికి పనికొచ్చే ప్రాణి మాత్రమే. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, కన్నీటి కడవలు నెత్తిన ఉన్న, ‘నైతికత’ కలగలిసిన శబ్దాలు ఎక్కువగా చేసే ఆడప్రాణి.

తన చావు పరాయివాడి ఒక పాపిష్టివాడి చెప్పుచేతల్లో ఉండటం సహించలేక, రోషంతో కొండ మీంచీ దూకేస్తుంది రాగిణి. అలా దూకేయడానికి ముందు ఆమె ఒక చలి చీమ; నలిపేయబడ్డానికి సిద్ధంగా ఉన్న చలి చీమ. అమాంతం అగాథంలోకి దూకిన దుస్సాహసానికి ఆమెని ‘తెలివితక్కువ మొద్దు’గానే చూశాడు వీర. ఆ తర్వాతే అతనికి అర్థమయింది, కొండమీంచి సెలనీటి తేరుమీదకి జారిన సౌగంధికే ఆమె అని. కనిపించని ద్వారాలేవో హఠాత్తుగా తెరుచుకునే అటువంటి మహత్తర సన్నివేశం జీవితంలో ఎదురైనప్పుడు ఎటూపాలుపోక, ఆ నిరుత్తర క్షణాల నుంచి తలతిప్పుకొని భద్రంగా మందలో కలిసిపోతే సగటు మగాడు అవుతాడు; అవే క్షణాలకు వివశుడై ఆ దివ్యానుభవానికి జీవితాన్నీ ఒడ్డితే ‘వీరయ్య’ అవుతాడు. ఇక 14 రోజులన్న కాలవ్యవధి ఒక నెపమవుతుంది. ’14 గంటలు… 14 రోజులయ్యింది. రాసి పెట్టుకోండి… పద్నాలుగు సంవత్సరాలైనా ఈయన ఆవిడ్ని వదలడు’ అని కుండబద్దలు కొడతాడు వీరా తమ్ముడు చక్రి. చక్రికి, ఇంకా అక్కడ జనానికి మట్టుకు ఆమె సౌగంధికో, పారిజాతమో కాదు, కులక్షయానికి, జాతి వినాశనానికి దాపురించిన ‘మోహనాంగి’!

‘పద్నాలుగు రోజులు ఇంత పెద్దవా?’ అని ఆశ్చర్యపడిపొతాడు వీరా, ఆమె సాహచర్య సౌరభాన్ని తలపోస్తూ. ఇది వీరా సందేహమే కాదు, వీరా దగ్గరైన, వీరాతో ఇడెంటిఫై అయిన అందరి సందేహం కూడా! మన ఇరుకిరుకు ప్రపంచాల్లో అంతటి ప్రేమ, త్యాగం, ఔన్నత్యాలకి చోటుండకపోవచ్చు. కానీ, ఒకట్రెండు గంటల పాటు ‘వీరా’తో  మమేకం కూడా కాలేనంత, ‘వీరా’లో ప్రతిక్షేపించుకునేటంత వీలు కూడా చిక్కనంత మర్యాదస్తులమై పోయామా?

”సరే… ఈ విధంగా (మాతోపాటు ఉండమని) అడిగుండకూడదు. అప్పుడు, ఎస్పీ మిమ్మల్ని కలిసుండకూడదు, పెళ్ళి చేసుకొని ఉండకూడదు……………. మిమ్మల్ని కాల్చాలని అనుకోనుండకూడదు, మీరు ధైర్యంగా పై నుంచి దూకుండకూడదు, నేను కంగారుగా మీ వెనకే వచ్చుండకూడదు, మీరు కళ్ళు తెరిచిన వెంటనే నా ప్రాణం నా దగ్గరకి తిరిగొచ్చుండకూడదు. అన్నీ జరిగిపోయాయి, కర్మ! దేన్నీ మార్చడం కుదరదు. నా మనసు చేసుకున్న కర్మని దేన్నీ ఇప్పుడు మార్చడం కుదరదు…”  అంటూ ఒక మేరునగధీరుడు, ఒకానొక సీమకి ప్రభువు, అక్కడి ప్రజల గుండెల్లో కొలువైన దేవుడు…. తనకే తెలియని ఏవో బలవత్తర శక్తుల ముందు బేల అయిపోతాడు; తన ప్రమేయం లేకుండానే తీగలు సాగిన అంతరంగిక అనంగరాగాలకి దాసుడైపోతాడు; మహా ప్రేమికుడైపోతాడు.

‘దేవుడి’వంటి దేవ్మీద రాగిణికున్న ప్రేమని చూసి అసూయపడి మరింత పునీతుడవుతాడు. శుభ్రవేదనలో తనని నిలువెల్లా కడిగిన ఆ ‘అసూయ’ వల్ల తాను దేవ్ కన్నా, ఇంకా ఎందరికన్నానో ఎక్కువ ఉన్నతుడ్నయ్యానని గ్రహించడంతో వీరయ్య ప్రేమర్షి అయ్యాడు.

”నీ పెళ్ళాం కోసం నిన్ను చంపొచ్చు, అదే పెళ్ళాంకోసం నిన్ను ప్రాణాలతో వదలొచ్చు” అంటాడు వీరా, తన చేతుల ఆసరాతో లోయలోకి వేలాడుతున్న రాగిణి భర్తతో.  ‘ఇత్తడి మనిషికి పుత్తడిలాంటి పెళ్ళాం’… అని ఎంత బాధపడతాడో. తన లోలోపల రేగుతున్న తగవు తీరక (తన మనసు మారక) ముందే ఆమెని తీసుకొని వెళ్ళిపొమ్మని, ఆమెభర్తకి ప్రాణాలు (అపాత్ర)దానం చేస్తాడు.

ఆ దేవతకి ఇదేమీ తెలియదు. తనకి తన దేవుడే ముఖ్యం. తన దేవుడంటే ఎంత ఇష్టమంటే, తాడుకొస వదిలేసి వీరాని లోయలో పడేయడానికి కూడా సిద్ధమయ్యేంత, వీరా ఇచ్చిన తుపాకితోనే వీరాని కాల్చేయగలిగినంత.  ఆమెలోని ప్రేమ-ద్వేషం అనే అనివార్య ద్వంద్వాన్ని చూసి కూడా సహిస్తూ, నవ్వుతూ, ఆమె ముఖాన్ని గుండెలనిండా నింపుకొని, ‘మనసులో ఉన్న చండాలం, చంచలమైన వేదన’లతో సహా పదినిమిషాల్లో, లేదా ప్రేమ, పాశం, ప్రాణాలతో సహ ఒక్క క్షణంలోనైనా చావడానికి, ‘చెదిరిపోడా’నికి సిద్ధం. ఎలాంటి మృత్యువునైనా సంతోషంగా ఆహ్వానించగలిగేలా ఆ మొండి సాహసిని వంచింది, ఓడించింది ఆమె త్యాగం కన్నా, ఆమె మీద తనకున్న ప్రేమే.
‘నేనిక్కడుంటే వారినోదిలేస్తారా?’ అడుగుతుంది రాగిణి.
‘ఉంటారా? నిజమా?’

ఆమె అవుననడం ఆమె త్యాగం; తన భర్త మీద ఉన్న ఇష్టం. కానీ, ఆమె అలా ఉండిపోతే అది తన ప్రేమకే అవమానం. వేళ్ళ మధ్య నలిగి కాలిపోయే మట్టి పెళ్ళ కాదు వీరా ప్రేమ, తలెత్తి చూసినా అంతు అందని ఎత్తైనకొండ. అందుకే, ఆమె భర్తకి ప్రాణ భిక్ష, ఆమెకి విముక్తి.

కానీ, ఆమె తిరిగొస్తుంది.  కారణమేదయితేనేం, ఆమె మళ్ళీ తన దగ్గర కొచ్చింది. అంతకు మించిన ఉద్వేగ క్షణాలేమిటి జీవితంలో.
‘రొప్పొస్తుంది… చెవులు పని చేయడంలేదు… సంతోషంతో తలతిరుగుతుంది…’
దుఃఖానందాలు, సంయోగ-వియోగాలు; ప్రేమ- ద్వేషాలు… వంటి ఎన్నో శిఖర ద్వంద్వాల్ని ఆ యోధుడు అమాంతం లంఘించి దూకేసిన క్షణాలు, మానవాతీత క్షణాలవి.

ఆమె తిరిగొచ్చింది కూడా తన శీల నిరూపణకి ఎంత మాత్రం కాదు. తన దేవుడు తనమీద నిందవేశాడు. ఆ నిందకి ప్రతినాయకుడిని సాకుగా వాడాడు. ఆ ఖల్నాయక్ మీద, ఆ రాక్షస రావణుని ప్రేమ మీద ఆమెకి ఎంత నమ్మకమంటే, ఆ విలన్ నోట (మాత్రమే) సత్యాన్ని తెలుసుకోవడానికి తిరిగొచ్చినంత నమ్మకం. తన నమ్మకం వమ్ము కానందుకు సంతోషం. ఎంత సంతోషమంటే, దుఃఖం వల్ల కూడా రానంత ఎక్కువ కన్నీరు పొగిలివచ్చేంత సంతోషం. పెదవులతో చప్పుడు చేసే వీరా మేనరిజాన్ని అనుకరించి, తన మోదాన్ని, తన గుండెలోతుల్లో అతనిమీద ఒక దీర్ఘకావ్యానికి సరిపడినంత అనురాగాన్ని ప్రకటించేంత  సంతోషం.

ఇంకేం కావాలి ఆ ఆరాధకుడికి, కలలో కూడా ఊహించని ప్రేమ, ప్రశంస దక్కాక! అతనికి రక్షా కవచమయ్యేంత, అతని ప్రాణాలకి తన ప్రాణాల్ని అడ్డువేసేంత చొరవ, తెగువ, ప్రేమ ఆమె చూపడం మించి వీరా విజయానికి వేరే రుజువులేందుకు? అందుకే, ఎదుర్రొమ్ము అప్పగించి హీరోతో సవాల్ చేస్తాడా విజేత – ”నా  సంతోషాన్ని చంపలేవు…” అని.

ఈ సవాల్తో, అసలే అంగుష్ఠమాత్రుడిగా ఉన్న హీరోదేవుడ్ని మరింత వామనుడ్ని చేస్తాడు వీరా. నిజానికి, కథకుడు (లేదా దర్శకుడు) ఈ వామన దేవుడ్ని అర్థం చేసుకున్నంత, చిత్రించినంత స్పష్టంగా మరింకెవర్నీ అర్థం చేసుకోలేదేమో. ఆయన పోలీసు ఉన్నతాధికారి అందులోనూ, నీతి, నిజాయితి, నిబద్ధత వంటి భుజకీర్తులు కూడా ఉన్నవాడు. తన చుట్టూ సమాజానికి, దాని నవ్వులకి, ఏడ్పులకి, ముఖ్యంగా ప్రేమాసూయల వంటి సహజ మానవోద్వేగాలకి  ఎంత మాత్రం సంబంధం లేని జీవి. నేరం, పాపం… వంటి అంశాల్ని మెదడు, మనసులతో సాపేక్షంగా కాకుండా, మొండి చట్టాల లోంచి మాత్రమే చూడగలిగే సగటు పోలీసుకి దేవ్ని మించిన ప్రతినిధి మరొకడు ఉండడు. వీరయ్య మీద ప్రజల భక్తి, గూడెం మనుషుల వాగ్మూలాలు, తన వ్యక్తిగత అనుభవాలు, భార్య మొత్తుకోళ్లు… ఏవీ చెవికెక్కని యాంత్రికుడతను. వీరయ్య ఔన్నత్యం అతనికి అర్థమయ్యే అవకాశమే లేదు; సరికదా, తన బ్రతుకు కూడా అతను పెట్టిన భిక్షే అని  కూడా గుర్తించలేనంత అమానవుడు. ‘రాముడు మంచి బాలుడు’ అనిపించుకోడానికి ఎన్ని జిత్తులకైనా పాల్పడగల దేవుడు(!).

వీరా! వేదవతిని తొలి చూపులోనే వలచి, ఆ వలపుని జన్మ జన్మాంతరాలకూ సీత వరకూ దాచుకొని, దానికోసం రాజ్యాన్ని, వంశాన్నీ, తన ప్రాణాన్ని కూడా బలిపెట్టిన రావణ బ్రహ్మ కథని మించిన ఐతిహాసిక  వృత్తాతం నీది. స్త్రీమూర్తిని ప్రణయాధి దేవతగా గుండెల్లో నిలిపి కొలిచే మహౌన్నత్యం నీది. ఆమెనొక ఆటబొమ్మగా, ఓడించే ఆయుధంగా, లేదా ఒట్టి సాకుగా మాత్రమే వాడుకునే అత్యల్పత్వం మా ‘దేవ్’డిది, మర్యాదస్తులమైన మాదీనూ. ‘విలన్’, ‘రావణన్’, లేదా ‘రావణ్’… అనే నీ వీరగాథ అంటే అందుకే అంతకంత కంటగింపు మాకు!

-నరేష్ నున్నా

43 Comments
 1. Phani October 7, 2010 / Reply
  • naresh Nunna October 19, 2010 / Reply
 2. సుజాత October 7, 2010 / Reply
  • naresh Nunna October 19, 2010 / Reply
 3. srinivas October 7, 2010 / Reply
 4. vennelakanti ramarao October 7, 2010 / Reply
  • naresh Nunna October 7, 2010 / Reply
   • అబ్రకదబ్ర October 19, 2010 /
 5. ప్రవీణ October 7, 2010 / Reply
 6. sudha October 7, 2010 / Reply
 7. indraprasad October 7, 2010 / Reply
 8. కావేరి October 7, 2010 / Reply
 9. A. Saye Sekhar October 7, 2010 / Reply
 10. rama sundari October 7, 2010 / Reply
 11. hkpt16384@gmail.com October 7, 2010 / Reply
 12. satmali October 7, 2010 / Reply
 13. i. ma October 7, 2010 / Reply
 14. చన్ద్ర శెఖర్.బి October 8, 2010 / Reply
 15. desaraju October 8, 2010 / Reply
 16. Arunkumar Marapatla October 8, 2010 / Reply
 17. శేఖర్ October 9, 2010 / Reply
 18. CVD Ramesh Babu October 10, 2010 / Reply
  • anonymous November 13, 2010 / Reply
 19. చెళ్ళపిళ్ళ కామేశ్వరరావు (సుమనశ్రీ) October 10, 2010 / Reply
 20. ఆ.సౌమ్య October 12, 2010 / Reply
 21. sreeram October 12, 2010 / Reply
 22. sriram velamuri October 14, 2010 / Reply
 23. aditya October 18, 2010 / Reply
 24. Sripal Sama October 19, 2010 / Reply
 25. chakri November 13, 2010 / Reply
 26. Mauli January 25, 2011 / Reply
 27. Keshav May 25, 2013 / Reply
  • Keshav May 25, 2013 / Reply
 28. mamtha June 26, 2013 / Reply
 29. reddem July 2, 2013 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *