Menu

Song of life – ఒక కాలేజి అనుభవం

Film-making is about finding your own voice అంటారు. అలాంటిది మీ గొంతే సినిమా అయితే…ఆ సినిమా మనమే అవుతాం. అలాంటి ఒక ప్రయత్నమే “Song of life”.

ధన్ బాద్ లోని ఇంజనీరింగ్ కాలేజిలో సినిమాల గురించి కలలుకనే ఒక తెలుగబ్బాయి చదువు పూర్తిచేసుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. ఓ రెండు సంవత్సరాలు ఉద్యోగం చేశాక, కాలేజిలో కన్న కలల్ని నిజం చేసుకోవాలనిపించింది. తనకు తెలిసిన కాలేజి జీవితాన్ని కథావస్తువుగా ఎన్నుకున్నాడు. తను చదివిన కాలేజికే మళ్ళీ వచ్చాడు. జూనియర్లనే నటులుగా ఎంచుకుని సంవత్సరం రోజులు మళ్ళీ క్యాంస్ లో ఉండి, సినిమా తీసేశాడు. ఆ కుర్రాడి పేరు చల్లా శ్రీకాంత్. ఇప్పుడు ఆ సినిమా రెడీ…రెడీ టు మీట్ ఇట్స్ ఆడియన్స్.

మొదట కథ చూచాయగా తెలియగానే “మరో హ్యాపీడేస్ ఎందుకురా బాబోయ్ !” అని ఆత్మారాముడు ఘోషించాడు. కానీ ఒక సంవత్సరం కాలేజిలో ఉండి, జరిగే ఈవెంట్స్ ని కథకు అనుగుణంగా షూట్ చేశాడని తెలియగానే ఎందుకో అప్రయత్నంగా గౌరవం కలిగింది. సినిమా ఇంటర్వెల్ కొచ్చేసరికీ నా కాలేజి జీవితాన్ని మళ్ళీ ఏదో వీడియోలో నేనే చూస్తున్న అనుభూతి కలిగింది. అప్పుడు అనిపించింది, ‘హ్యాపీడేస్ సినిమా ఒక ఫ్యాంటసీ. ఇది సినిమాగా తీసిన నిజం’ అని. సినిమా ముగిసేసరికీ కాలేజి జీవితపునరానుభవం దొరికింది.

కునాల్ అరోరా (సాహిల్) నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ జీవితం ఈ సినిమా. అతని స్నేహితులు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు, సమస్యలు, రాజకీయాలు, ప్రేమ ఇవే సినిమా అంతా. ‘ఇందులో కొత్తేముంది కాలేజి సినిమాలన్నీ ఇంతేకదా!’ అనుకోవచ్చు, కానీ తేడా ఉంది. అదే దర్శకుడి సిన్సియారిటీ. మొదటిసారిగా సినిమా తీసినా, విషయపరంగా  అనుకున్నది అనుకున్నట్లు తియ్యడంలో సఫలమయ్యాడు. అక్కడక్కడా మామూలు సినిమాకు అలవాటు పడిపోయిన మన కళ్ళూమెదడూ “అబ్బా ఇక్కడొక క్లోజప్పు ఉంటే బాగుండేదే. మరి కొంచెం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పెట్టుంటే ఎమోషన్ పండుండేదే” అని చెబుతున్నా, దర్శకుడి ఉద్దేశం సీన్ ని పండించడం కాదు, తను అనుకున్నది చూపించడం అనే విషయాన్ని చాలా కంట్రోల్డ్ గా గుర్తుచెయ్యడంలో సఫలమయ్యాడు.

నటీనటులు అందరూ మొదటిసారి కెమెరా ముందు నిల్చున్నవారే. అయినా, నటనలో ఏమాత్రం లోపం చెయ్యలేదు. హీరో కునాల్, సీనియర్ గా చేసిన వర్మ, హీరో స్నేహితుడు వీరు గా నటించిన నటులు చాలాబాగా చెశారని చెప్పొచ్చు. ఏ.ఆర్.రహమాన్ మ్యూజిక్ స్కూల్ విద్యార్థులు సమకూర్చిన సంగీతపరంగా ఫరవాలేదు. కానీ, పాటల సాహిత్యం మాత్రం గొప్పగా ఉంది. ఆద్యంతం ఇంగ్లీషులో అక్కడక్కడా హిందీలో సాగే ఈ చిత్రంలోని సంభాషణలు కూడా అలరిస్తాయి.

కెమెరా పనితనం, ఎడిటింగ్ చాలా మొరటుగా ఉన్నాయి. డిజిటల్ హై డెఫినిషన్ కెమెరాతో షూట్ చేసినా, ప్యాన్ చేస్తున్నప్పుడు పిక్సలేట్ అవ్వడం కంటికి కటువుగా అనిపిస్తుంది. అలాగే చాలా సీన్లలో ‘బర్న్’ అవడం, లైట్ కంట్రోల్ లేకపోవడం లోపాలుగా అనిపిస్తాయి. సాంకేతికపరంగా చాలా మెరుగుపరుచుకోవలసిన అవసరం ఉంది. దర్శకుడిగా విషయపరంగా సఫలమైనా, సాంకేతికపరంగా ఎదగాల్సింది చాలా ఉంది. ఈ సినిమా తనకు తెలిసిన ప్రపంచం గురించి అవడం దర్శకుడికి అడ్వాంటేజ్ అనుకుంటే, రెండో సినిమాకి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

దర్శకనిర్మాతకున్న బడ్జెట్ పరిమితులు, అవగాహన, జీవితానుభవం దృష్టిలో ఉంచుకుంటే ఇది చాలా సఫల ప్రయోగం అనుకోవచ్చు. తప్పకుండా చూసి అభినందించాల్సిన చిత్రం.

4 Comments
  1. అరిపిరాల October 31, 2010 /
  2. Jai Sai Varma November 2, 2010 /
  3. sreedhar November 10, 2010 /