Menu

శ్యామ్ బెనెగళ్ తెలుగు సినిమాలు తీయలేడా? Part 1

మూఢనమ్మకాలపై ఆయన ప్రకటించిన యుద్ధంలో ఎవరు గెలిచినట్లు?

‘అనుగ్రహం’పై తెలుగు ప్రేక్షకులకు ఆగ్రహమా?

మనిషిని నమ్మకం ముందుకు నడిపిస్తుంది.మూఢనమ్మకం    దిగజారుస్తుంది,దడిపిస్తుంది,వణికిస్తుంది.

ఇది మతపిచ్చి మనిషిని పతనం చేసే మౌఢ్యం.మనదేశంలో ఈ పిచ్చి హద్దూపద్దూ లేకుండా పెరిగిపోతున్న మాట నిజం.రాజకీయనాయకుల.ధనవంతుల అండ దీనివెనుకాల ఉంది.రగులుతున్న సమస్యల్లో ఈ చాదస్తం కూడా ఒకటి.దేశభవిష్యత్తుకు,సమాజప్రగతికి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తున్న తక్షణ సమస్య ఇది.

మూఢనమ్మకాలు ఆత్మవిశ్వాసాన్ని,ఆత్మస్థైర్యాన్ని నశింపచేస్తాయి.వ్యక్తిత్వం కోల్పోతాడు మనిషి.ఆలోచనా శక్తి ఉండదు.పిరికిపందలా,పరాన్నభుక్కులా భయంతో అనుక్షణం గడుపుతుంటాడు.

శ్యాం బెనెగల్‘అనుగ్రహం’చిత్రానికి తీసుకున్న,సామాజిక స్పృహ కల్గిన అంశం ఇదే.

ప్రేక్షకులకు అంతుబట్టని కధ

నోరులేని జీవాలు జాలరుల వలలో పడి గిలగిలా కొట్టుకుంటుంటాయి.భక్తులకోర్కెలు తీర్చే అప్పికొండ స్వామి నివసిస్తున్నాడని చెప్పబడే పర్వత సానువుల పాదాలకు ఉవ్వెత్తున లేచే సముద్రతరంగాలు ఢీ కొంటుంటాయి.సముద్రపు హోరు-తను కనికరించిన వాడికి వరమిచ్చి,వరంతో పాటు కఠోరమైన నియమాలు విధిస్తాడట అప్పికొండస్వామి.అసలా స్వామి ఉన్నాడా?లేడా? అంటూ ఆయన అస్థిత్వాన్ని శంకిస్తాడు తెరవెనుక వ్యాఖ్యాత.

ఇక అసలు కధలోకి వస్తుంది చిత్రం.

ఉన్న ఊరికి,కన్నతల్లికీ పోషిస్తున్న అన్నకీ ఏమాత్రం ఉపయోగపడని అప్రయోజకుడు పరశురామయ్య(అనంతనాగ్),అన్నావదినల సూటిపోటు మాటలకు పౌరుషం వచ్చి,”సంపాదిస్తాను,ఊరోళ్ళంతా నా కాళ్ళు మొక్కేలా సంపాదిస్తాను,అంతవరకూ తిరిగొస్తానేమో చూడు-ఆయనగోరు పరశురామయ్యగోరన్నగోరండీ-అనుకునేటంతై వస్తాను-అంటూ అరుచుకుంటూ వెళ్ళిపోతుండగా….కొండమీది నుంచి అప్పికొండస్వామి కేకేసి ఆపుతాడు.వెనక్కి వెళ్ళిపొమ్మంటాడు.పాపపు గర్భాల్ని కరిగించివేసే మూలికప్రసాదించి,బ్రహ్మచర్యం పాటిస్తేనే పనిచేస్తుంది,పాటించు,ఇది నా ఆదేశం అంటాడు.అది వరమో…శాపమో…అంతుతెలీని పరశురాముడు అప్పికొండ స్వామి శక్తిని పరీక్షించదలచి,తనలాగే ఆ స్వామినుంచి భూగర్భజలాలను కనిపెట్టే వరం పొందిన ఓ గొర్రెలకాపరి చేత తనవాకిట్లో నీరుపడే చోటి చూయించమని,అక్కడ తవ్విస్తాడు.అంతవరకూ అక్కడ నీరుపడే అవకాశమే  లేదనున్నారంతా.జలపడ్తుంది.పడకూడదనీ,తర్వాత బ్రహ్మచర్యపు‘శిక్ష’ తప్పుతుందని ఆశించిన పరశురాముడికి శిక్ష తప్పలేదు.

ఏ చదువూ సంధ్యాలేని గొర్రెలకాపరి అప్పికొండస్వామిని తలచుకుని జలని కనిపెట్టి నిస్వార్ధంగా సేవచేస్తున్నాడు.పాపపు గర్భాన్ని కరిగింపచేసి,అక్రమ జననాల్ని నిరోధించి పవిత్రమైన నవతరాన్ని తయారుచేయాల్సిన బాధ్యత నెరవేర్చగలడా?బ్రహ్మచర్యాన్ని నియమబద్ధంగా పాటించగలడా?

అప్పట్నుంచీ తనగదిలో పడుకోవడం మానేస్తాడు.ఇంట్లో ఆడవాళ్ళు”బైట” చేరినప్పుడు పడుకునే అరుగుమీద రోజూ రాత్రిళ్ళు కాలక్షేపం చేస్తుంటాడు.అప్పికొండస్వామిచ్చిన మూలికని భార్యకిచ్చి దాయిస్తాడు.సమాజశ్రేయస్సు కోసం వుపయోగించే అవకాశం లేదతనికి.అతనిభార్య అనసూయ పురాణస్త్రీల మనస్తత్వం కలది.భర్తను బ్రహ్మచర్యానికే ప్రోత్సహిస్తుంది.

పాపం పెరిగిపోతుంది

గుడిని బాగుచేయించు

ఒకవెన్నెలరాత్రి,చెవులు హోరెత్తే గుడిగంటల చప్పుడు-అది పరశురాముడొక్కడికే వినిపిస్తుంది.ఏదో అదృశ్యశక్తి తనను రమ్మని పిలుస్తున్నట్లనిపిస్తుంది.గుడికి వెళ్తాడు.లోపల అమ్మవారు కనిపించదు.ఆ రాత్రంతా అక్కడే పడుకుంటాడు.తెల్లవారాక వచ్చిన పూజారి,అమ్మవారు రాత్రిళ్ళు సంచరిస్తుంది,మానవమాత్రులు చూస్తే కళ్ళుపోతాయని  బెదిరిస్తాడు.అంధుడిలా ఈ గుళ్ళోనే గడపాల్సొస్తుందంటాడు అన్న.మర్నాటి రాత్రి అవేధ్వనులు….గుడిగంటలతని గుండెల్ని మెలితిప్పేస్తుంటాయి.మళ్లీ గుళ్ళోకి వస్తాడు.దేవత కనిపిస్తుందీ సారి.అతని భార్య అనసూయ రూపములో.”ఈ ఊళ్ళో పాపం పెరిగిపోతోంది,ఈ గుడిని బాగు చేయించు”అని చెప్తుంది.అలాగేనంటాడు పరశురాముడు.

“నిన్ను అమ్మవారు పూని నాకు దర్శనం ఇచ్చింది.నీతలలో పూలు పెట్టాను,అలంకరించాను”అంటే ఆశ్చర్యపోతుంది అనసూయ.తననావహించిన తనకు తెలీదంటుంది.అంతా విచిత్రంగా కనిపిస్తుంది పరశురాముడికి.

పెట్టుబడిదారీ వ్యవస్థపై దెబ్బ

భైరవమూర్తి జమీందారు.బూర్జువా వ్యవస్థకు ప్రతినిధి.కాముకుడు.పరశురాముడు గుడిని బాగుచేయించేందుకు అతన్నాశ్రయిస్తాడు.ఏమాత్రం సంకోచించకుండా అతనడిగినదంతా ఇచ్చేయమంటాడు జమీన్దారు గుమస్తాతో.మధ్యలో కైంకర్యం చేస్తే,ఇది దేవుడి వ్యవహారం అని వారిస్తాడు గుమస్తాని.కాకిక్కూడా చెయ్యివిదల్చని భైరవుడింత ఖర్చుకి అంత తేలిగ్గా లొంగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఊరువాళ్లకి. పరశురాముడు ఘటికుడంటారు అంతాను.అలాంటి పాపిష్టిడబ్బుతో దేవుడి కార్యం చేయిస్తున్నడంటూ నిందించిన మాస్టార్ని,మీరు ఆ డబ్బు తీసుకునేగా ఆయన కోడలికి పాఠాలు చెప్పేది అంటే మాట్లాడడింక మాస్టారు.అమ్మవారి అదేశం,అప్పికొండస్వామి దయ అంటాడు పరశురాముడు.

గుడి బాగవుతుంది.పరశురాముడి ప్రతిష్ట కూడా పెరుగుతుంది.ఊరందరికీ అతను అప్పికొండస్వామి ప్రతిరూపం.రోజురోజుకీ భక్తులు పెరిగిపోతుంటారు.అన్నావదినలు కూడా కాళ్ళుకడిగి నెత్తిన చల్లుకునేటంత ఆరాధకుడవుతాడు.తనని దర్శించవచ్చిన వారిని పూజారడ్డగించి,ముందు ఆలయ ఆచారప్రకారం ‘పుట్ట’ను పూజించి రావాలన్నప్పుడా పుట్టను స్వయంగా తవ్వేస్తాడు పరశురాముడు.

భక్తులంతా భజన చేస్తోండగా నాగుపామొకటి జనాలమధ్యలోకి వస్తుంది.అంతా భయంతో దూరంగా జరుగుతారు.పరశురాముడు మాత్రం ధైర్యంగా కూర్చుంటాడు,భారమంతా దేవతపైన వేసి.నాగు అతన్ని రాసుకుంటూ వెళ్ళిపోతుంది.అప్పటివరకూ నమ్మని పూజారి కూడా ఆ సంఘటనతో భక్తుడై పోతాడు.ఊరు నల్దిశలా అతని కీర్తి వ్యాపిస్తుంది.

పరశురాముడి పూజలతో తృప్తి చెందని దేవత ‘పాపాలు పెరిగిపోతున్నాయి-అవి నశించాలి అంటూ పదేపదే కనిపించి చెప్తుంటుంది.

గుడికట్టిన తాపీ మేస్త్రి సింహాచలం పెళ్ళాన్ని భైరవుడు తగులుకుంటాడు.దేవత పాపం పెరుగుతూనే ఉన్నదంటుంది.గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న పిల్లాడికి పోతపాలు పట్టించి లాలిస్తుంటాడు సింహాచలం.అంతా దేవత చూకుసుకుంటుందంటాడు పరశురాముడు.పాపం చేసిన తల్లికి పుట్టిన బిడ్డ చచ్చిపోతుంది చివరికి.

మానసిక వ్యభిచారీ,బ్రహ్మచారీ

జమీన్దారు అన్న కొడుకు వాసు.అతడు అవిటివాడు.ఆభైరవుడే అన్నని చంపి వదినను చెరిచాడనీ,అందువల్ల వదినకు పిచ్చిపట్టిందనీ,పిచ్చిదానికొడుకుకావటం వల్ల వాసు అవిటివాడయ్యాడనీ ఓ పుకారు!బహిరవుడు అందమైన పార్వతి(స్మితాపాటిల్)ని తెచ్చి వాసుకు కట్టబెడతాడు.

భైరవుడి భవంతికి వెళ్ళినపుడు శ్రీవారి దర్శనం కావాలంటే అర్చన ముందు జరగాలని,స్నానం చేయించి,మడికట్టించి “అభ్యాగతి,ఆదివిష్ణు-“అంటూ భైరవుడి భార్యా,పార్వతీ అతిధిమర్యాదలు చేస్తారు.అన్నం వడ్దిస్తున్న పార్వతి కళ్లలోకి చూస్తాడు బ్రహ్మచారి పరశురాముడు.ఆమెకూడా చూస్తుంది.చూసి వెళ్ళిపోతుంది.ఆచూపులో ఏదో తెలియని అనుభూతి,విచిత్రమైన ఆకర్షణ.అవిటివాడి పెళ్ళాం సుఖాలు పొందలేకపోతుందనే సానుభూతి…ఆమె అతన్ని తన కౌగిట్లోకి రమ్మని పిలుస్తున్నట్లి భ్రమ.రెండు కాళ్ళూ పొట్టపైకి ముడుచుకుని,చేతులు స్తనాల పైన నొక్కుకుంటున్నట్లమిపిస్తుందా కల!మనసు చలిస్తుంది.చలించినప్పుడల్లా సచేలస్నానం చేసి పునీతుడనయ్యాననుకుంటాడు.దేవతకనిపించి పాపం పెరుగుతూనే వున్నదంటుంది.పాపిపేరడిగితే చెప్పకుండానే వెళ్ళిపోతుంది.

“ఎవ్వరికీ అందనంత ఎదిగిపోయాడు,వాడే క్షణానైనా చలించవచ్చు.అదే జరిగితే,అంతవరకూ ఉన్న పేరూ ప్రతిష్ట మంటగలసిపోతాయి.జాగ్రత్త’అంటుంది పరశురాముడి తల్లి అనసూయతో.

పరశురాముడి కలలో పార్వతి కనిపించడం మానలేదు.ఈ మానసిక వ్యభిచారం తన బ్రహ్మచర్యవ్ర్తతాన్ని దెబ్బతీస్తుందని,నిగ్రహశక్తి ప్రసాదించమని ఆ దేవతను కోరనూ లేదతను.కనీసం అందుకోసం ప్రయత్నించలేదు.

బలహీనుడి భార్యకి భర్తెవరు?

భైరవుడి భార్య,వాసూ,పార్వతితో కలసి గుళ్ళోకి వస్తుందో ఉత్శవం రోజు.పార్వతికి నెలతప్పిందనీ,ఆశ్వీరదించమని పరశురాముణ్ణి కోర్తుంది.మనుషుల్లో దేవుడాయన అనుకొంటుంది. పినతల్లి ఆదేశం మేరకు వాసూ నమస్కరిస్తాడతనికి.పార్వతి తిరస్కరిస్తుంది.

పార్వతి శీమంతానికి పరశురాముడి భార్యనీ,

వదిననీఆ గుళ్ళోనే నోటిమాటతోనే ఆహ్వానించేసి వెళ్ళిపోతుంది భైరవుడి భార్య.

శీమంతానికి అనసూయ ఒక్కర్తె వెళ్తుంది.(శీమంతం జరపడంలో ఓ నూతన పద్ధతిని ఇక్కడ మనం చూడవచ్చు)పేరంటానికి వచ్చిన అనసూయమీద భైరవుడి కళ్ళు పడనే పడ్డాయి.చురచురా వెళ్ళిపోతుంది అది గమనించిన అనసూయ.

పార్వతికి చదువు చెప్తున్న మాస్టారు ఏవేవో నూరిపోస్తున్నాడని,అందువల్లే అది అవిటి వాసుని అడ్దం పెట్టుకుని నాటకాలాడ్తోందనీ,మాస్టారి మీద విరుచుకు పడతాడు భైరవుడు.”లేకపోతే వాసు ఈ జన్మకి సంతానం పుట్టించగలడంటే ఎవరైనా నమ్ముతారా? అని ఎదురు ప్రశ్నవేస్తాడు.చదువు చెప్పటం మానేయమంటాడు.మాస్టారు భైరవుణ్ణి తిట్టివెళ్ళిపోతాడు.తనలోతనే కుళ్ళిపోతుంది పినమావ గారి మాటలకి-అబద్ధం-అబద్ధం-అంటూ పార్వతి.పలకరించడానికి వచ్చిన అనసూయ ‘అయ్యో’ అనుకుంటూ వెళ్ళిపోతుండగా-భైరవుడు ఆపి డెలిబరేట్ గా అడిగేస్తాడు.”ముద్దొస్తున్నావ్,రా! పోదాం-“అని.సీతను ముట్టిన పాపానికి లంక నాశనం అయినట్లు ఈ రావణుడు నాశనం కాక తప్పదంటుంది మూగబోయిన ఆమె గొంతుక.”హు..”అంటూ విదిల్చుకుంటుంది.ఆపాపిష్టి చేతులు తగిలిన శరీరాన్ని పవిత్రోదకం కింద నిలబడి కడిగేసుకుంటుంది.

ఊరుప్రజల అనుమానం పార్వతి గర్భానికి భైరవుడే కారణం అని,పరశురాముడూ అంతేననుకుంటాడు.ఆమె గర్భం అక్రమ గర్భం!పాపానికి ఫలితం!తన దగ్గరున్న మూలికతో దాన్ని కరిగించేయొచ్చు.స్వతహాగా ధైర్యం చేసే శక్తి లేదతనికి.అమ్మవారి ఆనతి,అప్పికొండస్వామి ఆదేశం లేనిదే ఏ పనీ చెయ్యలేం అనుకుంటాడు.

ఆ రాత్రి దేవత కనిపించి పాపాలకు భైరవుడే కారణమంటుంది.పరశురాముడు.”పాపాలకు.పార్వతి గర్భానికి కారణం నువ్వే”నంటాడు భైరవుడితో.అవునంటాడు గంభీరంగా భైరవుడు.దాన్ని తాను కరిగించెయ్యగలననీ అనుమతివ్వమనీ అడుగుతాడు పరశురాముడు.సరే నంటాడు భైరవుడు.

Spandana vani monthly dated July 1978.

రెండోభాగం త్వరలో…

8 Comments
 1. విజయవర్ధన్ October 24, 2010 /
  • కుసుమ October 29, 2010 /
 2. mohanramprasad October 24, 2010 /
 3. కుసుమ October 29, 2010 /
 4. Sripal Sama November 2, 2010 /
 5. Venkat Uppaluri March 18, 2011 /
  • rajendra kumar March 18, 2011 /
   • Venkat Uppaluri March 21, 2011 /