Menu

రసోవైసః – ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్

ఉద్యానవనం,విహారయాత్ర., పుస్తకాలు,చదువులు…ఆటలు…పాటలు..రాజకీయాలు…అరవై నాలుగు కళలు..సర్కస్,ఇంద్రజాలం,ఇలాంటివన్నీ ఉండగా….
మనం!!!…………….సినిమానే ఎందుకు చూడాలి?!!!!!

సినిమా ఎందుకు చూస్తున్నాం?? ఒక్కో మనిషికి ఎంతలేదన్నా యాభై నుండి వందరూపాయల ఖర్చు.రెండు నుంచి మూడు గంటల సమయం వృధా. సినిమా బాగోకపోతే అసలే చిందరవందరగా ఉన్న లోకం గందరగోళంగా కనిపిస్తుంది..బాగుంటుందన్న పూచి లేదు..టికెట్ దొరుకుతుందన్ననమ్మకం లేదు. చూడటం అనే పెట్టుబడికి వచ్చే లాభంలేదు…పైగా ప్రదర్శనాశాలలో అమ్మకపు పన్నుకి అదనపు పన్ను వేసి అమ్మే  తినుబండారాలు,పానీయాలు…మొదటిరోజైతే తుఫాను బాధితులకి ఆహారం అందించినట్టు ఇచ్చే టికెట్లు….బాధ్యత లేకుండా సినిమాని ఆడించే/తీయించే యజమానులు, ప్రేక్షకులపై ఆధారపడి జీవిస్తూ వారికి కనీస గౌరవం కూడా ఇవ్వని ధియేటర్ ఉద్యోగులు,.కనీస సౌకర్యాలు లేని ధియేటర్లు…పైగా సినిమా నాకోసం నేను తీసుకుంటాను ఇష్టం ఉంటే రండి లేకపోతే నా సినిమా గురించి ఆలోచించకండి(ఈ మాటలు వాస్తవానికి ప్రేక్షకుల్ని ఉద్దేశించి అన్నవి కావు ) …అని కలవరపెట్టే మాటలు ఇన్ని అయోగ్యతలున్న సినిమాని… మరి… ప్రేక్షకులు,అభిమానులు తమ అవసరాల్లో ఒక భాగంగా ఎందుకు గుర్తిస్తున్నారు??ఎందుకింత సమయం దానికి వెచ్చిస్తున్నారు?కొంతమంది సినిమాని జీవితంగాను,ఇంకొంతమంది కాలక్షేపంగాను,అలవాటుగాను,వ్యసనంగాను,ప్రవృత్తిగాను భావించేలా చేస్తూ, ఇంతమందిని తన ఆకర్షణకి లోబడేలా చేసుకుంటున్న సినిమాల్లో ఏముంది??సినిమా చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది?మొదటి ఆటకే ప్రేక్షకుల్నిసినిమాకి రప్పించే శక్తి ఉన్నదెవరికి??సినిమాలో వీరిని ఇంతగా ఆకర్షిస్తున్నదేమిటి??……

సినిమాలో ముందుగా తయారయ్యేది కథ…ప్రేక్షకులకి ముందుగా సినిమా గురించి తెలియజేసేది ప్రకటన.ఈ రెండూ తప్ప మిగతావన్నీమిధ్య.ఏ నిర్మాత,హీరో,దర్శకుడు తన ఆకర్షణని ఎల్లకాలం నిలుపుకోలేరు.సినిమా ఉంది కాబట్టి వీరున్నారు.ప్రతిభో,సామర్ధ్యమో,అదృష్టమో ఉన్నంత కాలం వీరుంటారు తర్వాత పోతారు(కాలచక్ర ప్రభావాన్ని తట్టుకునే అతికొద్దిమందిని మినహాయించి).కాంత, కనకం మనిషిని తరతరాలుగా ఆకర్షిస్తున్నట్టు — సినిమా తన అయస్కాంతక్షేత్ర ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది.మరి వీరు పోయినా సినిమాలో ఎప్పటికీ పోనిదేమిటి??అసలున్నదేమిటి? ఏది ముందుగా తయారవకపోతే సినిమా నిర్మాణం జరగదో ఎవడుపోయినా,ఎవడు వచ్చినా ఆధారపడేది దేనిమీదో అదే ఈ ఆకర్షణకి కారణం..అదే “కథ”.(కథ గురించి సమాచారంకోసం గత వ్యాసాల్లో చూడండి)మరి కథకి ఇంత ఆకర్షణ ఏర్పడటానికి కారణం ఏదో ఉండే వుండాలి…మరి కథలో ఉన్నదేమిటి?పండిత,పామర బేధం లేకుండా రచయిత ఏడిపిస్తే ఏడుస్తూ,నవ్విస్తే నవ్వుతూ,కోపం తెప్పిస్తే కోపం తెచ్చుకుంటూ,నవరస తరంగాల్లో తరిస్తూ…రచయిత తన చేతుల్లో మనల్ని కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తున్నా??వెలకట్టలేని అభిమానంతో,కష్టించి సంపాదించిన ధనం ధారపోస్తున్నది దేనికి????భావోద్వేగాలు సంతృప్తిపడుతున్నాయనా???కాదే…అదే నిజమయిన పక్షంలో డబ్బుతోనో,సమాజపు కట్టుబాట్లకి లోబడో(అతిక్రమించో),కార్యకారణాల చేతనో,చర్య ప్రతిచర్యల వల్లనో ప్రతి భావోద్వేగాన్ని మనం వాస్తవ ప్రపంచంలోనే వాస్తవంగా అనుభవిస్తున్నాం కదా!!!???శృంగారం,హాస్యం మొదలైన రసాలు నిజజీవితంలో పొందటమే సులువు,ఇక్కడ రచయిత/దర్శకుడు పంచే వరకు ఓపికపట్టాలి…ఐనా అది కూడా వాస్తవం కాదే…అంతా కల్పితమే కదా….సినిమా చూస్తూ మనం పొందుతున్నదేమిటి?…..మనిషి దేన్ని పొందడానికి ప్రయత్నం చేసి అలసిపోతాడో అదే ఇక్కడ మనకి చౌకగా దొరుకుతుంది…..సరసమైన ధరకి దొరికే ఆ విషయమే ఆనందం.

సినిమా చూస్తూ మనం పొందేది ఆనందం…కేవలం ఆనందం పొందే సమయంలోనే మనల్ని మనం మరిచిపోయే అవకాశం ఉంది…ఆనందం అంటే సుఖమో,సంతోషమో కాదు…అదొక అనిర్వచనీయమైన మానసిక స్థితి…మనల్ని మనం మరిచిపోయి ఇంకొకరిలో లీనమయి…అన్ని మానసిక వృత్తులు శాంతించి ఆలోచనలు తటస్థమయి…సమస్త ద్వంద్వాలని సమంగా చూసే స్థితే ఆనందమయ స్థితి.

ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్ = ఆనందం పరబ్రహ్మ స్వరూపం……..

వేదాల్లో,పురాణాల్లో తరతరాలుగా ఋషులు,మునులు ఎవరిగురించి కీర్తిస్తూ ఆయన స్వరూపాన్ని వర్ణిస్తూ సత్ చిత్ ఆనంద స్వరూపుడిగా ఆయన్ని గుర్తిస్తున్నారో ఆ సృష్టికర్త(భగవంతుడు) అనుభవించే నిజరూప ఆనందాన్ని తాత్కాలికంగా,ఛాయా మాత్రంగా ఇక్కడ మనం అనుభవిస్తున్నాం…సినిమా చూసిన కాసేపు మనం సమయాన్ని,మనం ఉన్నామనే స్పృహని(అహం),లోకాన్ని,బంధువుల్ని,స్నేహితుల్ని అందర్నీ మరచి…. మైమరిచిపోతున్నాం…..సినిమా చూస్తూ ఆనందం పొందుతాం… సినిమా పూర్తి అవగానే భావోద్వేగాలన్నీ బయటకు నెట్టబడి,భావశుద్ధి జరిగి మనసు ప్రక్షాళన అయి,ప్రశాంతతని అనుభవిస్తాం.మానసిక పరిణామానికి దగ్గరిదారి ఇది.

ఆనందం అంటే??

ఓ రచయిత కథని రాసుకుంటూ హీరోకి అసలెలాంటి కష్టమూ రాకుండా ఉండాలి…వాడిలో ఎదుగుదల ఉండకూడదు..ప్రస్తుతం ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి వీడి స్థితి ఇప్పుడు ఆనందంగా వుందిగా ఇక కష్టాలూ కన్నీళ్లూ ఎందుకు? అనుకుంటాడా??హీరోని అతనున్న స్థితి నుండి మానసికంగా ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి అతనికి ఓ కోరికని,దాన్ని సాధించడానికి పెద్ద అడ్డంకిని పెడతాడు,అడ్డంకి పెద్దదయినపుడు..ఓ స్నేహ వారధిని ఏర్పాటుచేస్తాడు…అడ్డంకులన్నీ దాటి అనుకున్నది సాధించి జీవితంపై తన దృక్పధాన్ని మార్చుకుని ఙ్ఞాని అవుతాడు.మరి దీన్లో ఆనందం ఎక్కడ ఉంది??కథ రాసేప్పుడు రచయిత, చూస్తున్న ప్రేక్షకుడూ అనుభవించేది ఆనందం ఎలా అవుతుంది….ఆనందం అంటే ఏమిటో తెలిస్తే ఆ స్థితికి అర్ధం తెలుస్తుంది….

నిజ జీవితంలో ఏడ్చినా..సినిమా చూస్తూ ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. దీనికి దానికి భేదం ఏంటంటే నిజజీవితంలో జరిగే విషయాల్లో మనం వాటికి అంటుకుంటాం(కర్తృత్వ భావన)..ఈ పని నేనే చేస్తున్నాను..నా వల్లనే ఇది జరుగుతుంది…నేనే లేనట్లయితే ఈ పనులు జరుగవు…అని వాటిలో విషయాల్లో పూర్తిగా తాదాత్మ్యం చెంది మనల్ని మనం మరిచే స్థితి… సినిమాలో జరుగుతున్న విషయాలని సాక్షీ మాత్రంగా చూస్తుంటాం హీరోతో పూర్తిగా తాదాత్మ్యం చెందినప్పటికీ మనమున్న స్థితి మనకి తెలుసు.సినిమా చూస్తూ మనం సంయమనం పాటిస్తాం.ద్వంద్వాలని సమంగా చూసే స్థితి ఇది. భగవంతుడ్ని సత్ చిత్ ఆనంద స్వరూపుడని తలచేప్పుడు ఉపయోగించే ఆనందం….ఈ ఆనందమే…… అన్నీ తానే అనుభవిస్తూ కూడా దాని వల్ల తనకి కలిగే భావోద్వేగాలపై పూర్తి సాధికారకత కలిగి ,వాటికి తనకి మధ్య అనుబంధం లేకుండా ఉండే స్థితి…వాటికి అంటకుండా దూరంగా ఉండి చూసే స్థితి.ఆనందం అంటే భావోద్వేగాలని సాక్షీ మాత్రంగా అనుభవించే స్థితి.అత్యున్నతమైన ఈ స్థితిని నిజజీవితంలో కూడా అందుకోమనే ఙ్ఞానులు చెప్పేది.సృష్టికర్త( భగవంతుడు) ఆడ మగ,విషయాలు-వస్తువులు,సమస్త జీవులు,కష్టాలూ,సుఖాలు అన్నింటిలో,అందరిలోనూ ఉంటూనే వాటికి అంటకుండా సాక్షిగా చూస్తూ ఆనందాన్ని అనుభవిస్తుంటాడు అని కదా శాస్త్రాలు చెప్తున్నాయి ..భావోద్వేగాలకి అతీతమైన స్థితిలో కష్టమూ సుఖమూ సంతోషమూ దుఃఖమూ, అనే ద్వంద్వాలని సమంగా స్వీకరిస్తాం..ఇప్పుడు మనకి ఇది కావాలి..ఇది ఇక్కడ జరగాలి అనే కోరిక లేకుండా వచ్చినదాన్ని వచ్చినట్టు స్వీకరించే స్థితి అది.మనం సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇదే స్థితిని అనుభవిస్తూ వుంటాం…..హీరోతో పాటు ఏడుస్తాం,నవ్వుతాం,కష్టాలు సుఖాలు పంచుకుంటాం.స్పందిస్తాం……..అతని(హీరో) అనుభవాలనే మన(ప్రేక్షకుడు) అనుభవాలుగా భావించే ఐక్యత ఇరువురికి ఉన్నప్పటికి…. అతనికి మనకీ మధ్యనున్న భేదం మనకి స్పష్టంగా తెలుసు..భావోద్వేగాలని సాక్షీ మాత్రంగా అనుభవించే ఈ స్థితినే ఆనందమయ స్థితి అంటారు..ఆనందం అంటే సుఖం కాదు.సమస్త ద్వంద్వాలని సమంగా చూసే స్థితి…సినిమా చూస్తున్నప్పుడు మనం ఈ స్థితిలోకే చేరుకుంటాం..

వాస్తవ జీవితంలో మనల్ని వ్యంగంగా విమర్శిస్తే??పైకి నవ్వినా లోపల ఏడుస్తాం…నిజమైన ఓ యాక్సిడెంట్ ని మనం చూసినప్పుడు భయం,జుగుప్స లాంటి భావోద్వేగాలు కలిగి..ఓ రెండు రోజుల వరకూ అన్నం తినబుద్ధి కాదు..చావు వార్త విన్నాకూడా అంతే..అదే యాక్సిడెంట్ సినిమాలో చూస్తే?? ఆనందిస్తాం…సరిగా చూపించకపోతే అసంతృప్తికి లోనవుతాం…కరుణరస పూరితమైన సన్నివేశాలని,హాస్య సన్నివేశాలలాగానే మనం ఆస్వాదిస్తాం….. ఎందుకు??అది వాస్తవజీవితం కాదనా??నూరు శాతం తప్పు..సినిమా వాస్తవం అని రచయిత/దర్శకుడు మనల్ని నమ్మించాలని సినిమా ప్రకటన చూసినప్పుడే ప్రార్ధిస్తాం…మరిక్కడ జరుతున్నదేమిటి??భగవంతుడు(లేడని “నమ్మేవారి కోసం” ఈ వ్యాసం నేను రాయలేదు)..సృష్టిలో మంచి,చెడు లేవా?

చావు,పుట్టుకలు లేవా?భగవంతుడు మంచి.చెడు,చావు పుట్టుకలు అనే సమస్త ద్వంద్వాలను సమంగా చూస్తున్నాడనేగా శాస్త్రాలు చెప్తున్నది….వాస్తవజీవితంలో కష్టాలు మనం అనుభవిస్తున్నట్టుగా భావించి వాటితో తాదాత్మ్య స్థితి పొంది,కష్టాలు మనం ఒకటే అనే భావనతో ఉంటాం…పూర్తి అహంకార పూరితమైన భావన..అహంభావన అంటే కర్తృత్వ భావన (నేనే చేస్తున్నాను)..అలాగే సినిమాలో కూడా మనం హీరోతో ఐక్యత కలిగివుంటాం అతని కష్టాలు మనవిగా భావిస్తాం,అతను ఏడిస్తే మనమూ ఏడుస్తాం,నవ్వితే మనమూ నవ్వుతాం…ఇంత ఐక్యభావన కలిగివున్నప్పటికీ మనం అతని నుండి వేరుపడి కథని చూస్తూ ఉంటాం…ఙ్ఞానులు ఏ భావన కలిగి ఉంటారో లేశమాత్రంగా ఐనా ఆ రెండు గంటలు మనం ఆ భావన కలిగివుంటాం.ప్రఙ్ఞానం బ్రహ్మ అన్నారు…పుస్తక ఙ్ఞానం కాదు.

ఉదా: నిద్రలో వచ్చే కలలో మనల్ని ఎవడైనా పొట్టలో పొడిచాడనుకోండి మనకి నొప్పి కలుగుతుంది,మెలకువ వస్తుంది…మనల్ని మనం స్పష్టంగా కలలో చూసుకుంటున్నాం..అంటే!!మనం కలలో కొన్ని రూపాలు ధరించి కలలో లీనమయి వాటిని అనుభవిస్తూ కూడా…కల నుండి వేరుపడి ఆ కలని చూస్తున్నాం కదా.అంతేగాక కలలో వచ్చే ప్రతి రూపం మన సృష్టే….విలనూ మనం కల్పించిన ఒక రూపమే,హీరో మనమే కానీ విలన్ తో మనకి తాదాత్మ్యత ఉండదు… కలలో అన్ని వస్తువులుగా,దానిలో ఇతర పాత్రలుగా కూడా మనమే అన్ని రూపాలూ ధరిస్తున్నాం కదా??సినిమాని కూడా మనం అదే ఐక్యభావనలో,తాదాత్మ్యత చెంది చూస్తూనే దాని నుండి వేరుపడి చూస్తున్నాం కదా.భావోద్వేగాలని అనుభవిస్తూనే వాటికి అంటకుండా ఉంటాం…ఇదే కదా తామరాకు పై నీటిబొట్టులా ఉండటం అంటే….నిజ జీవితంలో దీనికి విరుద్ధంగా ఆ కష్టాలు,కన్నీరు అన్నీ మనమే అనే భావనలో ఉంటాం.నిజజీవితంలో కూడా ఆ భావోద్వేగాలు మనల్ని బాధించడంలేదు…బాధిస్తున్నయని మనం భావిస్తున్నాం…అలాంటి భావనకు అలవాటుపడ్డాం.

పాతకాలంలో NTR సినిమాల్లో ఆయన్ని కొట్టడానికి వచ్చిన విలన్ మనుషుల్ని ఎదురించడానికి వెళ్లిన ఒకరిద్దరు ప్రేక్షకుల గురించి ఎప్పుడైనా వినేవుంటారు…వారిని చూస్తే మనకేమనిపిస్తుంది….వారికి మనకి బేధం ఏమిటి??వారిలాగే మనమూ అదే స్థితిని అనుభవిస్తున్నాం కదా,మనం కేవలం స్పందిస్తున్నాం..వారు ప్రతిస్పందిస్తున్నారు..సినిమా చూస్తూ అలా ప్రతిస్పందిస్తే ఏం జరుగుతుందో అందరికి తెలుసుకదా… అలాగే నిజజీవితంలో మన ప్రతిస్పందన చూసి భగవంతుడు కూడా అలాగే నవ్వుకుంటాడు.భగవంతుడిలా సమస్త ద్వంద్వాలని సమంగా భావించే ఆనందమయ స్థితి ఓ రెండు గంటలు వస్తుంటే ఎవడు మాత్రం ఒదులుకుంటాడు??ఇదీ సినిమాలో ఉన్న ఆకర్షణ శక్తి.సినిమా చూస్తూ మనం అనుభవించేది ఆనందం.సినిమా చూస్తున్న ప్రేక్షకుడు భావోద్వేగాలకి స్పందిస్తూ,సాక్షీ మాత్రంగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు కదా…ఐతే అతనిలో స్పందన కలిగిస్తున్న భావోద్వేగాల గురించి తెలుసుకుందాం…

ఈ భావోద్వేగాల్ని కలిగిస్తున్నదేమిటి??
భావోద్వేగాలే కథ(సినిమాలో) ప్రధాన పాత్ర వహిస్తాయి…భావోద్వేగాలు చూడటానికి అంటే రసాస్వాదన కోసమే ప్రేక్షకులు సినిమాకి వస్తారు..
నవరసాలు కలిగిన రూపకం సినిమా…దీనిలో నవరసాలు ఆస్వాదించడం ద్వారా మనం ఆనందాన్ని పొందుతాం..సినిమా పరిభాషలో దీన్నే వినోదం అంటాం..వినోదం అంటే హాస్యం కాదు.సృష్టికర్తకి వేదంలో కవి అని పేరుంది. కవిః కవిత్వాది విరూపం అసృజత్ అని ఋగ్వేదంలో చెప్పారు…సృష్టికర్త తన కల్పనా శక్తితో ఇన్ని రూపాలు సృష్టించాడు అని అర్ధం.రచయిత ఓ కథ ఇలా ఉండాలి అని భావించడంచేత ఇంత కల్పన జరుతుంది.అతను కథ రాస్తూ పొందే అనుభూతినే ప్రేక్షకులు చూస్తూ పొందుతారు…
దీన్నే రసోవైసః అని ఉపనిషత్తులలో అన్నారు.రసోవైసః అంటే రసానుభవ స్వరూపమే భగవంతుడు అని అర్ధం.
కథలో ఉండే రసాలు(Genres)…ఇది కథని ఫలానా కథ అని భావించేలా చేస్తాయి….హాస్య కథ,శృంగార కావ్యం,వీరోచిత గాధ..ఇలా…

నవరసాలు :
1.శృంగారం 2.హాస్యం 3.కరుణ 4.రౌద్రం 5.వీరం 6.భయానకం 7.భీభత్సం 8.అద్భుతం 9.శాంతం

1.శృంగారం: ఇది రతి అనే స్థాయీభావం నుండి పుడుతుంది.సౌందర్యం శృంగారంలో ప్రధానమైన అంశం.అందంగా ఉన్న వాటికి మనసు హత్తుకుపోతుంది. ఇవి రెండు రకాలుగా ఉత్పన్నమవుతుంది …1.సంయోగం 2.వియోగం.
సంయోగం అంటే కలయిక…వియోగం అంటే ఎడబాటు…

2.హాస్యం : ఇది హాసం అనే స్థాయీభావం నుండి పుడుతుంది.ఇది రెండు రకాలు
1.ఆత్మస్థ = తాను నవ్వటం 2. పరస్థ = ఇతరులను నవ్వించటం
నవ్వు ఆరు రకాలుగా ఉంటుంది. అవి
1.స్మితము (Gentle Smile) : చెక్కిళ్లు లేతగా వికసించి పలువరుస కనబడకుండా గంభీరంగా ఉండే నవ్వు.
2.హసితము (Smile) : చెక్కిళ్లు వికసించి, పలువరుస కొంచెంగా కనిపిస్తుండే నవ్వు.
3.విహసితము (Laughter) : సమయోచితమైన నవ్వు.ముఖం ఎరుపెక్కి పలువరుస కనిపిస్తూ శిరస్సు ముడుకుని ఉంటుంది.
4.ఉపహసితము (Laughter with ridicule) : ముక్కుపుటాలు విప్పారి.చూపులు వక్రంగా ఉండే నవ్వు.
5.అపహసితము (Uprorious Laughter) : ఏడుపు వస్తున్నప్పుడు వచ్చే నవ్వు.
6.అతిహసితము (Convulsive Laughter) : నవ్వు పెద్దదయినపుడు వచ్చే ఆనందబాష్పాలు.స్వరం మారటం,చేతులు కదలడం దీనిలో గమనించవచ్చు.

3.కరుణ : ఇది శోకం అనే స్థాయీభావం నుండి పుడుతుంది.ఇవి మూడు రకాలు.
1.ధర్మోపగతము : కరుణ దండన నుండి పుడుతుంది
2.అర్ధోపచేయము : ధననష్టం వల్ల కలుగుతుంది.
3.శోకం : ఇష్టజనుల వియోగం వల్ల కలుతుంది.

4.రౌద్రం : క్రోధం అనే స్థాయీభావం నుండి పుడుతుంది.రాక్షస ప్రకృతులకు సంబంధించినది.సంగ్రామం వల్ల పుడుతుంది.చేయిదాటిపోయిన వికారస్థితి ఇది.
1.క్రోధం,ఆధర్షణము(ఇతరుల భార్యలను చెరచటం వల్ల కలిగేది)
2..అధిక్షేపం (దేవ,జాతి,అభిజన,,విద్య,కర్మలను నిందించటం వల్ల కలిగేది)
3.అవమానం,అసత్యవచనం,ఉపఘాతం (పనివారిని బాధించడం వల్ల కలిగేది)
4వాక్పారుష్యం
5.అభిద్రోహం (హత్యాప్రయత్నం)
6.అసూయ.
వీటి వల్ల కలుతుంది.

5.వీరం : ఉత్సాహం అనే స్థాయీభావం నుండి పుడుతుంది.ఇది మూడు రకములు.ఆలోచన ఆధిపత్యం కలిగివున్న ఉన్నత ప్రకృతికి చెందిన స్థితి ఇది.
1.దాన వీరము 2.దయా వీరము 3.యుద్ధ వీరం.
1.అసంమోహం (కలత చెందకుండటం) 2.అధ్యవసాయం ( పట్టుదల) 3.నయము (సంధి,విగ్రహాల ప్రయోగం 4.వినయం (ఇంద్రియ జయం)
5.బలం (చతురంగ బలం కలిగివుండటం) 6.పరాక్రమం (శతృవుల జయించటం) 7.శక్తి ( యుద్ధాదులయందు సామర్ధ్యం)
8.ప్రతాపం (శతృవులకు సంతాపం కలిగించే ప్రసిద్ధి) 9.ప్రభావం (అభిజన,ధన,మంత్రి సంపద) వల్ల ఉత్సాహం కలుగుతుంది.

6.భయానకం : ఇది భయం అనే స్థాయీభావం వల్ల కలుగుతుంది.అపరాధం వల్ల,మోసం వల్ల,హింస వల్ల కలుగుతుంది.ఇవి రెండు రకములు
1.స్వభావసిద్ధమైనది 2.కృత్రిమమైనది

7.భీభత్సం : జుగుప్స అనే స్థాయీభావం నుండి పుడుతుంది.కోపం,అయిష్టం,విసుగు,అసహ్యం వల్ల జుగుప్స కలుగుతుంది.

8.అద్భుతం : ఇది విస్మయం అనే స్థాయీభావం నుండి పుడుతుంది.దైవ సంబంధిత విషయాలు,మహాత్ముల దర్శనం,ఇంద్రజాల,మహేంద్రజాలాదులను
ప్రత్యక్షంగా చూడటంవల్ల…మనోవాంఛలు తీరటం వల్ల ఈ రసానుభవం కలుగుతుంది.

9.శాంతం : ఇది శమము అనే స్థాయీభావం వల్ల కలుగుతుంది.తత్వఙ్ఞానం,వైరాగ్యం,ఆశయ శుద్ధి వల్ల ఇది జన్మిస్తుంది.మోక్షము పట్ల ఆసక్తి కలిగిస్తుంది.

రసోవైసః

ఆదిత్య చౌదరి.మూల్పూరి.
(ఔత్సాహిక దర్శకుడు)
greenlong2498@gmail.com

8 Comments
  1. sri October 30, 2010 /
  2. viplove October 30, 2010 /
  3. chakri November 1, 2010 /
    • Aditya November 8, 2010 /
  4. wb November 1, 2010 /
  5. rathnamsjcc October 12, 2011 /