Menu

నన్ను “గజని” చెయ్యద్దు!!!

రెగ్యులర్ గా  తెలుగు సినిమాలు చూసే ప్రేక్షకుడుకి రీసెంట్ గా ఓ కొత్త భయం పట్టుకుంది.  తనను తెలుగు దర్సకులు,రచయితలు,నిర్మాతలు కలిసి “గజని” (సూర్య సినిమా) గా మార్చేస్తున్నారేమోనని.. వాస్తవానికి  అలాంటిదేం జరగటం లేదు…అతన్ని  ఆల్రెడీ తెలుగు సినిమా “గజని” గా   ట్రీట్ చేయటం మొదలెట్టి చాలా కాలమైంది. కాకపోతే కాస్త లేటుగా అదీ  ఇన్నాళ్ళకు కొద్దిగా ప్రేక్షకుడు  రియలైజ్ అయి వరస ఫ్లాప్ లు ఇస్తున్నాడు అంతే తేడా. ఇంతకీ “చక్కగా రాముడు మంచి బాలుడు” లా మనమేది  తీసినా,టిక్కెట్లు రేట్లు పెంచి చూపిస్తున్నా కిమ్మనకుండా ఉండే  ఈ ప్రేక్షకుడుకి ఏం పోయే కాలం వచ్చింది. అప్పటికీ అతన్ని స్టేజిల మీద “ప్రేక్షక దేవుళ్ళు”  అని ఎంతో మర్యాదిచ్చి పిలుస్తున్నామే అని సినిమావాళ్ళు డౌట్ పడొచ్చు…పనిలో పనిగా ఒకింత కోపం కూడా తెచ్చుకోవచ్చు. అయితే సగటు తెలుగు సినిమా  ప్రేక్షకుడు తనను తాను  “గజని”  లా  ఫీలవటంలో అర్ధం ఉంది. పరిశ్రమకు అనర్దం ఉంది.  “గజని”  సినిమాలో సూర్య పాత్రకి మెమరీ ప్రతీ పావు గంటకీ రిప్రెష్ అయినట్లే…ప్రతీ సినిమాకీ ప్రేక్షకుడుకీ తాను చూసిన  గత సినిమాలు రిప్రెష్  (మర్చిపోతాడు)అవుతున్నాడనుకుని  అదే కథని హీరోని మార్చి వదులుతున్నారు.

ఇదంతా నమ్మబుద్ది కావటం లేదా…ఓ చిన్న మల్టిఫుల్ ఛాయెస్ ప్రశ్న..

హీరో…తనకు సంభంధం లేని  రెండు కుటుంబాలలో (లేదా ఇద్దరు వ్యక్తులలో) పరివర్తన తెచ్చి కలపాలని నిర్ణయంచుకునే పాయింట్  ఏ చిత్రం లోది?

ఎ)బృందావనం

బి)రెడీ

సి)డాన్ శ్రీను

డి)బిందాస్

ఇ)కలిసుందాం రా

ఎఫ్)రామ రామ కృష్ణ కృష్ణ

జి)శంఖం

ఎఫ్) ఏం పిల్లో ఏం పిల్లడో

మీకూ ఇంకా చాలా  సినిమా పేర్లు గుర్తుకొస్తున్నాయి కదా..అవన్ని  రాసుకుంటూ పోతే ఇంగ్లీషులో అక్షరాలు చాలవు.  ఒకే పాయింట్ తో వచ్చే సినిమాల లిస్టు మాత్రం పూర్తి కాదు. ప్రతీ హీరో..ఒక్కసారైనా ఇలాంటి పాత్ర (అలాగని ఈ హీరో పాత్రకి అధ్బుతమైన ప్రత్యేకత ఏమీ ఉండదు) చేయాలన్నట్లుగా ఓకే చేసి చేసేస్తూంటాడు. దాంతో తీసే వాళ్ళకు తాము హిట్టయిన పాయింట్ తో తీస్తున్నామని హ్యాపీగా అనిపించినా చూసే వాళ్ళకు మాత్రం ఏడుపు ఒకటే తక్కువ అనిపిస్తుంది. అలాంటప్పుడు కోపంగా …ఆ నిర్మాతల్ని ఏమండీ…మీ హీరో అంత గొప్ప వాడైతే రెండు కుటుంబాల లాంటి  పాకిస్ధాన్, ఇండియా గొడవలు సర్ధుబాటు చేయమనండి అని అడగాలనిపిస్తుంది.

ఈ కుటుంబాలను కలిపే పాయింట్ అనే కాదు…హీరో…విలన్ ఇంట్లోకి తానెవరో చెప్పకుండా వెళ్ళి సెటిలై ఆ ఇంటి సమస్యలను తన ఇంటి సమస్యలుగా భావించి,వినే వాడుంటే ఉపన్యాసాలు గట్రా ఇచ్చి, చివరకు ఆ ఇంటి పిల్లనే పెళ్ళి చేసుకుని ఉడాయిస్తాడు. షారూఖ్ ఖాన్ డిడెఎల్ జె నుంచి మొదలైన ఈ ట్రెండ్ తెలుగు సినిమాను నిన్నా మొన్నటి వరకూ పీడించింది. మొదట్లో జనం కొత్తగా ఉందని, ఆ తర్వాత తెలిసిందే అయినా ఫరవాలేదనో ..ఆ తర్వాత తప్పక భరించారు.  కానీ రాను రాను  ఇంత పాత కథని చాడటానికి మనసొప్పక..తమ మీద తమకే విరక్తి కలగి…  టీవీల్లో వచ్చినప్పుడు చూద్దాంలే అని డిసైడ్ అయ్యి ధియోటర్ కి వచ్చి చూడ్డం  ఆపేసాక సినిమాలు ఆగాయి.

అంతెందుకు…మీకు గుర్తుండే ఉంటుంది..అయినా అది  ఏమన్నా మర్చి పోయేంత చిన్న  విషయమా…”భాషా” వచ్చిన తర్వాత అది ఓ హిట్   ఫార్ములాగా తయారై “మొదటినుంచి హీరోని ఓ మామూలు వాడిగా చూపించి …ఆ తర్వాత హఠాత్తుగా వాడో పెద్ద పుడింగి..పిస్తా అని రివల్ చేయటం”..ఎక్కువై పోలేదూ. అది ఎంతలా తెలుగు సినిమాలో జీర్ణమైపోయింది అంటే…ఇంటర్వెల్ వచ్చిందంటే..అప్పటిదాకా రిక్షా తొక్కుకునో..లేదా ఆటో నడిపే, లేదా హోటల్ లో సర్వర్ గా చేసే హీరో..హఠాత్తుగా ఏ డాన్ గానో, లేక ఏ   సమరసింహా రెడ్డిగానో, నరసింహా నాయుడుగానో, సింహాద్రిగానో, ఇంద్ర గానో, మగధీరగానో రివిల్ అవుతాడేమోనని గుండెలు బిగపట్టుకు  చూసే స్ధితికి వచ్చేసారు జనం. ఎందుకంటే ఏ ఇంటర్వెల్ లో ఏ ఫ్లాష్ బ్యాక్ కి లీడ్ దాగుందో తెలియదు కదా.  ఈ భాషా ఫార్ములాకు ముందు చిత్రం,నువ్వే కావాలి  ఫార్ములాతో కాలేజీ జోకులు, చిన్న పిల్లల ప్రేమ కథలు చూపి కొంత కాలం  జనాల్ని చావ బాదేసారు.ఇప్పటికీ అడపా దడపా ఆ తరహా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ (ఎవరూ భుజాలు తడుముకోవద్దు) ఆ స్పీడు, ఊపు లేదు(బ్రతికాం).

అయితే ఇలా చాలా సార్లు వచ్చిన పాయింట్ తోనే ధైర్యంగా  సినిమా వాళ్ళు ఒకటి వాదించవచ్చు… “దేముడు ఒక్కడే..కానీ రూపాలు అనేకం” అనేది ఎప్పుడునుంచో ఉన్నదేగా ..అదే మెం చెప్తున్నా అని. అయినా హాలీవుడ్ సినిమాలు తీసుకుంటే “అదిగో కాపీ” అంటూ నానా గొడవ చేస్తారు. ఇదిగో ఇలా మీకు ఇష్టమైన కథనే  మళ్ళీ తీసాం..రండి చూద్దురుగానీ అంటే ఏడుస్తారు..ఇక ఇలాంటి మ్యాటర్ పై ఓ జోకుంది. “ఒకావిడ మొగుడుకి వంకాయ కూరేసి అన్నం పెట్టిందిట. ఆయన ఆ వంకాయ కూర వాసన రావటంతో ఇదేమిటే..ఇది ఎప్పటిది అన్నాట్ట. అప్పుడావిడ నిన్న మీరు అన్నం తినేటప్పుడు వంకాయ కూర అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారుగా..అందుకే దాచి వేసానందిట..ఆ మహా తల్లి. అలాఉంటుంది మన సినిమా వాళ్ళ తెలివి” .అంతెందుకు  “బొమ్మరిల్లు” హిట్టయితే..వెంటనే నిర్మాతలంతా “రైటర్లను..ఏవండి బొమ్మరిల్లు  లాంటి కథ ఉందా?” అని అడుగుతూంటారు. అలాంటప్పుడే  ఇలాంటి సమస్యలు వస్తూంటాయి.

ఇక ఈ సినిమాల వల్ల ప్రేక్షకులకు వచ్చే లాభమేమంటే  నెక్ట్స్ వచ్చే పదో సీన్ లో ఏం జరుగుతుందో  ఇన్ని ఒకే రకమైన కథలు చూసిన అనుభవంతో వెంటనే ఊహించేయ.గలరు. దాంతో చక్కగా ధియోటర్స్ కి ఇద్దరు ముగ్గురు ప్రెండ్స్ తో వెళ్తే …ఏ సీన్ ఎప్పుడు వస్తుందో అని బెట్టింగ్ లు కాసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆడుకోవటం సాధ్యమవుతుంది. అలాగే ఈ తెలిసిన  కథల వల్ల ట్విస్టుల దగ్గర పెద్దగా టెన్షన్ అదీ ఉండదు కాబట్టి చాలా కూల్ గా తెరపై ఏం జరిగినా చూడచ్చు. అంతేగాక గబుక్కున నిద్ర పట్టి మెలుకవ వస్తే తెరపై ఏం జరుగుతోంది..ఏం మిస్సై పోయాం అన్నది తెలుసుకోవాలని  ప్రక్కనే నిద్రపోతున్న వారిని డిస్ట్రబ్ చేయాల్సిన పని ఉండదు. ఎందుకంటే ఆ కథలో ఏం మెలిక  వస్తోందో మనకు ముందే తెలుస్తుంది కాబట్టి.ఫాలో అయిపోవచ్చు.   ఇక ఇలా ఒక సారి తీసిన కధలతోనే సినిమాలు  తీయటం వల్ల ప్రేక్షకుడు ప్రతీసారి ధియోటర్ కి వెళ్లి వచ్చిన ప్రతీ సినిమా చూడాల్సిన పని ఉండదు. ఎవరన్నా మీరు ఫలానా సినిమా చూసారా అంటే తనకు తెలిసిన కథే కాబట్టి  తడుముకోకుండా…గుక్క తిప్పుకోకుండా సినిమా కథ మొత్తం చెప్పేసి మార్కులు కొట్టయగలడు.

ఫైనల్ గా  రైటర్స్  కీ పెద్దగా ఆలోచించాల్సిన పని ఈ సినిమాలు పెట్టవు గాబట్టి హ్యాపీ. అలాగే హీరోలకూ సినిమా సినిమాకూ పెద్దగా మారే ఎమోషన్స్ ఏమీ ఉండవు..ప్రక్క వాడు చేసిందే మనమూ చేయవచ్చు. ఇక దర్శకుల అయితే సృజనాత్మకతను చెప్పిన కథనే మళ్ళీ కొత్తగా చెప్పటంలో చూపే అవకాశం ఉంటుంది. అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మరింత బాగా చేయటం ఈజీ కదా. కాబట్టి ఈ ఫార్ములా సేఫ్. అయితే ప్రేక్షకుడు గజనిలా ఫీలై మళ్ళీ మళ్ళీ మనం చూపిందే చూస్తే ఇబ్బంది లేదు. అలాకాకుండా గజనీలాగే పగ పెంచేసుకుని సినిమా మూలాలను కష్టపడి దెబ్బకొడితేనే అసలు కష్టం..నష్టమూను. ఎందుకంటే ప్రేక్షకుడు “గజని”  అయినా మరొకడు అయినా నిజమైన హీరో అతనే.

(ఆంధ్రభూమి “వెన్నెల” 29-10-2010 సంచికలో ప్రచురితం)

8 Comments
  1. gopi kiran October 29, 2010 /
  2. అరిపిరాల October 29, 2010 /
  3. Ravindra October 29, 2010 /
  4. Indian Minerva October 29, 2010 /
  5. Anonymous October 29, 2010 /
    • j.surya prakash October 29, 2010 /
  6. vamsi October 29, 2010 /