Menu

కులగౌరవ హత్యల నేపధ్యంలో ‘ఆక్రోష్’

“ఇంకా కులమేంటండీ?” అనేవాళ్ళు ఎవరూ వారివారి కులాల్ని దాటి పెళ్ళిచేసుకోరు.
ఎంత అభ్యుదయవాదైనా తల్లిదండ్రుల ఇష్టమనో, పెద్దల మాట వినాలనో కుటుంబ గౌరవాన్ని కాపాడేస్తూ కులాన్ని భద్రంగా కొనసాగించేస్తారు. ఇది కేవలం వ్యక్తిగత విషయం.
కానీ… కుటుంబగౌరవం కులగౌరవంగా మారితే… అది కాపాడుకోవడానికి మానవహననం జరిగితే…
అదప్పుడు భయంకరమైన సామాజిక సమస్య. సాంప్రదాయ ఆధిపత్యానికీ ప్రజాస్వామిక చట్టానికీ మధ్య సమస్య.
ఈ సమస్యని అత్యంత సునిశితంగా, అంతే వ్యాపారాత్మకంగా సృజించిన చిత్రం ‘ఆక్రోష్’.

ఈమధ్యకాలంలో బీహార్, హర్యాణా, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ లలో  జరిగిన కులగౌరవ హత్యలు నేపధ్యంగా వచ్చిన ఆక్రోష్, 1988 లో వచ్చిన ‘మిసిసిపి బర్నింగ్’ అనే ఆంగ్లచిత్రం ఛాయలు కలిగిఉన్నా, ఎంచుకున్న విషయం యొక్క తీవ్రత, relevance దాన్ని తీసిన విధానం కారణంగా ఒక ముఖ్యమైన సినిమాగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు.

సత్యఘటనల ఆధారంగా తయారైన ఈ కథ జాఝర్ (హర్యాణా రాష్టంలో జజ్జర్ లో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది) అనే కాల్పనిక గ్రామంలో 2005- 06 సంవత్సరాలలో జరుగుతుంది. కనబడకుండా పోయిన ముగ్గురు ఢిల్లీ మెడికల్ కాలేజ్ విద్యార్థుల కోసం CBI చేసే పరిశోధనగా ప్రారంభమయ్యే కథ మలుపులు తిరుగుతూ దళితులపట్ల అగ్రకులాల (ముఖ్యంగా ఠాకూర్లు, బ్రాహ్మణుల) కుల వివక్ష, హింస, మారణహోమాల సంకుల సమరంగా రూపుదిద్దుకుంటుంది.

యుగాలు మారినా మతం పేరుతో కులం పేరుతో జరిగే దారుణాల చీకట్లు వెలుగులోకి వస్తాయి. ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, తాము చేసిన అన్యాయాల కప్పిపుచ్చడానికి అగ్రకులాలు మతపరమైన మాఫియాగా మారి బెదిరించడాలు, ఎత్తుకుపోవడాలు, ఇళ్ళుతగులబెట్టడాలు, నాలుకలు కొయ్యడాలు, హత్యలు చెయ్యడాల్ని వీలైనంత సహజంగా తెరకెక్కించిన చిత్రమిది.

దళితుడు అవడంవల్ల చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని ఆ తరువాత ప్రేమని పోగొట్టుకున్న మిలిటరీ ఆఫీసర్ ఆన్ డెప్యుటేషన్ గా  అజయ్ దేవ్గన్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంది. అదే విధంగా కులసృహలేని అర్బన్ బ్రాహ్మణుడిగా అక్షయ్ ఖన్నా నటనలో కూడా పరిణితి కనిపిస్తుంది. సినిమా ప్రధమార్థంలో వీరిలోని contrast of character ని వీలైనంతగా  చూపించలేకపోయినా, ద్వితీయార్థంలో మాత్రం వీరి contrast of approach ని చూపించిన విధానం బాగుంది.

బిపాషా బసు నటనతో పెద్దగా ఆట్టుకోలేకపోయినా పాత్ర పరంగా ప్రాధాన్యతతో నెట్టుకొచ్చింది. పోస్టర్ వాల్యూ ఎలాగూ ఉండనే ఉందిగా! సమీరా రెడ్డి ఐటం సాంగ్ సినిమాకు ఎమాత్రం పనికిరాకపోయినా, ప్రమోషన్ల ద్వారా కొందరు ప్రేక్షకుల్ని థియేటర్ వైపు లాగడానికి మాత్రం ఉపయోగపడింది. ఉన్నంతలో రిమా సేన్ బాగానే చేసింది. ఈ సినిమాలో నటనాపరంగా చెప్పుకోవలసింది మాత్రం పరేష్ రావల్ గురించి. భారతదేశం గర్వించదగ్గ అంతర్జాతీయ స్థాయి నటుల్లో ఇతనొకరని ఈ చిత్ర్రం మళ్ళీ నిరూపించింది. అవినీతి పరుడైన పోలీస్ అధికారిగా, abusive husband గా తను పండించిన క్రౌర్యం, (అప) హాస్యం top class.

గర్దిష్ అనే సీరియస్ సినిమాతో హిందీలోకి వచ్చినా, ఆ తరువాత కమల్ హాసన్ క్షత్రియ పుత్రుడు చిత్రాన్ని హిందీలో అనిల్ కపూర్ తో తీసినా, దర్శకుడు ప్రియదర్శన్ ఆ తరువాత వచ్చిన కామెడీల ప్రభావంతో ఒక కామెడీ దర్శకుడిగానే మిగిలిపోయాడు. కానీ ఈ చిత్రం మళ్ళీ తనలోని సీరియస్ ఫిల్మ్ మేకర్ ని బయటికి తీసిందని చెప్పొచ్చు. కథాపరంగా, స్క్రీన్ ప్లే పరంగా కొన్ని లోటుపాట్లు ఉన్నా, ఇంతటి సంక్లిష్టమైన విషయాన్ని జనరంజకంగా చెప్పడంలో ప్రియదర్శన్ చాలా వరకూ సఫలమయ్యాడు. ప్రియదర్శన్ విజయంలో ఆర్ట్ డైరెక్టర్ సాబూ సిరిల్, సినెమాటోగ్రఫర్ తిరు పాత్ర అత్యంత కీలకం. అరుణ్ కుమార్ ఎడిటింగ్, ఆర్పీ యాదవ్ స్టంట్స్ సినిమాను చాలా ప్రభావవంతం చేశాయి.

తప్పకుండా చూడవలసిన చిత్రం.

7 Comments
  1. Balaji Sanala October 20, 2010 /
  2. $hankar Gangadhari October 20, 2010 /
  3. rahul October 20, 2010 /
  4. అరిపిరాల October 20, 2010 /
    • రాచమల్ల October 22, 2010 /
  5. Sree October 21, 2010 /
  6. అబ్రకదబ్ర October 22, 2010 /