Menu

తెలుగు సినిమా ! ఎక్కడికి…ఈ పయనం?

2009 సంవత్సరం లో సినీపరిశ్రమ కొచ్చిన నష్టం 170 కోట్లని కొందరు చెబితే, కాదు 230 కోట్లని మరికొన్ని అంచనాలు తేల్చాయి. కేవలం నాలుగు హిట్ చిత్రాలొచ్చిన అత్యంత దారుణమైన సంవత్సరంగా మిగిలింది. ఇన్ని నిరాశలమధ్యా, కనీసం ఈ దెబ్బతోనైనా కాస్త పరిశ్రమ పోకడమారి మంచి సినిమాలు తీస్తారనే ఆశలు కొందరిలో ఉదయించాయి.

2010 ప్రారంభమయ్యింది. జనవరిలో సంక్రాంతికి ఎన్.టి.ఆర్, వెంకటేష్ వంటి అగ్రహీరోల సినిమాలు వచ్చినా నిరాశను మాత్రంమే మిగిల్చాయి. అదుర్స్ పరిస్థితి ఎవరికీ అర్థం కాకపోతే, నమోవెంకటేశ కు పంగనామాలు మిగిలాయని ఇప్పుడు పబ్లిగ్గా తెలిసొస్తున్న నిజం. ఇదే నెలలో ‘ఓంశాంతి’ అనే వైవిధ్యమైన multiple nerrative హడావిడి ప్రయోగం, మళ్ళీ ప్రయోగాలంటే భయపడేలా చేసింది. కిక్ తరువాత రవితేజ క్రేజిని క్యాష్ చేసుకోవడానికి ‘శంభో శివ శంభో’ తయారుగా వచ్చినా, వైవిధ్యాన్ని అభినందిస్తూనే కలెక్షన్లు మాత్రం నిల్లు చేశారు ప్రేక్షకులు. మొత్తానికి కలెక్షన్ల పరంగా ఒక యావేజ్ సినిమాగా నిలబడింది. తమిళంలో తీసిన బడ్జెట్టుకి ఐదింతలు తెలుగులో పెట్టడం బహుశా ఈ సినిమాకు వ్యాపారపరంగా పెద్ద మైనస్.

ఫిబ్రవరిలో ఎన్నో ఆశలతో వచ్చిన లీడర్ నిరాశపరచలేదుగానీ, శంకర్ సినిమా స్థాయి కథకు శేఖర్ ట్రీట్మెంట్ ఇంతే అని పెదవి విరిచేలా చేసింది. దగ్గుబాటి రానా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. రానాకు సినిమా ప్లస్ అయినా, బిజినెస్ పరంగా ఈ చిత్రం అంచనాల్ని అందుకోలేదు. ‘బిందాస్’ సినిమా హిట్టని ఎంత డప్పుకొట్టినా, ఖర్చెక్కువ ఆదాయం తక్కువని బిజినెస్ పండితులు తేల్చేశారు. చిన్నచిత్రాల హవా మళ్ళీ వస్తుందేమో అని ఆశలు రేపిన ‘ఇంకోసారి’ వైపు ప్రేక్షకులు ఒకసారికూడా చూడలేదు. ఈ నెలలో వచ్చిన స్రప్రైజ్ మాత్రం ‘ఏమాయ చేసావె’. ప్రేక్షకుల నుంచీ మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చినా, చిరుబడ్జెట్లో తీసిన ఈ చిత్రం చివరికి నిలబడి మార్కెట్ లో మాత్రం మాయ చేసిందనే చెప్పాలి. నాగార్జున ‘కేడి’ ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పొయ్యిందో ఎవరికీ తెలీదు.

మార్చిలో ఎండలకు భూముతో పాటూ థియేటర్లూ బీడువారాయి.వచ్చిన 13 సినిమాలనూ ప్రేక్షకులు ఆదరించలేదు. ‘మరోచరిత్ర’ అనే ఘోరమైన తప్పు ఈ నెలలో జరిగిందే. ఎంత అగ్రెస్సివ్ గా ప్రమోట్ చేసినా అట్టర్ ఫ్లాప్ అనే చరిత్రలోని కళంకాన్ని మాత్రమే మూటగట్టుకుంది ఈ చిత్రం. అంతేస్థాయిలో ఏమార్చిన చిత్రం ‘వరుడు’. కోట్లు పెట్టి సెట్లు కట్టినా, కథ మీద కనీసం శ్రద్ధపెట్టని ఈ సినిమా పద్నాలుగు రోజుల పెళ్ళికాదుకదా, మూడు రాత్రులు కూడా థియేటర్లో నిలబడలేకపోయింది.

ఏప్రిల్లో బెట్టింగ్ బంగార్రాజు యావరేజ్ అయితే, సింహ కలెక్షన్ల రికార్డుల్ని బద్దలు కొట్టింది. ఈ సంవత్సరంలో అత్యంత పెద్ద హిట్టుగా నిలిచింది. ప్రయోగంగా ‘ప్రస్థానం’ కథావిలువల ప్రాముఖ్యతని నిలిపినా, బిజినెస్ పరంగా నోలాస్ – నోగెయిన్ అనిపించింది.

మేలో వచ్చిన ‘అందరి బంధువయా’ అందరినీ కాకపోయినా కొందరికైనా బంధువయ్యింది. కానీ నిర్మాతకు లాసే మిగిలింది. దాసరి తీసిన ‘యంగ్ ఇండియా’ అడ్రస్ లేకుండా పోయింది. పూరీజన్నాథ్ ‘గోలీమార్’, B-C సెంట్రలలో నిలబడినా, అనుకున్నంత విజయం సాధించలేదు.

జూన్ లో ఎన్నో అంచనాలతో వచ్చిన గమ్యం కిష్ ‘వేదం’, నిర్మాతలకు నిర్వేదాన్ని మిగిల్చొంది. ప్రయోగం సఫలమయినా, ఫలితం మాత్రం దక్కలేదనిపించింది. పంచాక్షరిలో అరుధంతి మ్యాజిక్ మిస్సై మిస్ ఫైర్ అయ్యింది. కృష్టుడు హీరో గా వచ్చిన ‘పప్పు’ ఏమయ్యిందో ఎవరికీ తెలీదు.

జూలైలో ‘ఝుమ్మంది నాదం’ బాక్సాఫీసుపై మోగకపోయినా, హీరోయిన్ తాప్సీ మాత్రం కొన్ని నాదాల్ని మ్రోగించించి. సినిమా కమర్షియల్ గా నిలబడలేదు. ‘భీమిలీ కబడి జట్టు’ సైలెంటుగా వచ్చినా, పట్టుదలగా నిలబడింది. వ్యాపారపరంగా మిరాకిల్స్ చెయ్యపోయినా, మంచి చిత్రాల్ని ఆదరిస్తారనే నిజాన్ని మాత్రం తేల్చి చెప్పింది. కానీ ఈ చిత్రాన్ని చాలా కాలంగా రిలీజు చేసుకోక కష్టాలు పడిన నిర్మాత కేవలం గట్టేక్కేస్థాయిలో మాత్రమే ఈ చిత్ర విజయం నిలిపింది. ‘స్నేహగీతం’ కొంత తాజాదనంతో వచ్చినా, చిన్నసినిమాగా మాత్రమే మిగిలింది. బిజినెస్ పరంగా నష్టపోకపోయినా, మళ్ళీ ఇలాంటి సినిమా తియ్యాలనే ఉత్సాహాన్ని నింపలేకపోయింది. కె.విశ్వనాథ్ ‘శుభప్రదం’ వచ్చింది. పొయ్యింది. ఇదే నెలలో వచ్చి సక్సెస్ సాధించిన చిత్రాలు ‘మర్యాద రామన్న’, ‘బ్రహ్మలోకం టు యమలోకం – వయా భూలోకం’. ఒకటి రాజమౌళి బ్రాండ్ వాల్యూని ప్రూవ్ చేస్తే, మరొటి యముడి పైన సినిమాలు తీస్తే ఎందుకో తెలుగు ప్రేక్షకులు చూసేస్తారనే సెంటిమెంటుకి ఊతమిచ్చింది.

అగష్టులో ‘డాన్ శీను’ తప్ప మరే సినిమాకూ సరైన ఓపనింగ్స్ రాలేదు. ఈ సినిమా కూడా పొయ్యిందేమో అనుకునేంతలో, పోటీలేక వ్యాపారపరంగా నిలబడింది.

అగష్టు వరకూ దాదాపు 92 సినిమాలు రిలీజైతే వ్యాపారపరంగా నష్టం ని సినిమాలు దాదాపు ఆరు. లాభాలు గడించి సినిమాలు నాలుగు. పది సినిమాలు తీసేస్తే, మిగిలింది 82 సినిమాకి యావరేజిన రెండుకోట్లు అనుకున్నా నష్టం 164 కోట్లు.

సెప్టెంబరులో వచ్చిన హిట్లేవీ లేవు. సినిమాలు మాత్రం ఆరేడు రిలీజయ్యాయి. ఇప్పుడు మరో మూడు పెద్ద సినిమాలు రిలీజుకు సిద్ధంగా ఉన్నాయి. ఖలేజా, కొమరం పులి, రోబో. ఈ మూడు చిత్రాల బడ్జెట్ కలిపి 130 కోట్లని అంచనా. ఇవి హిట్టవుతాయా ఫట్టవుతాయా అనేది తెలీపోయినా, పెట్టినంత స్థాయిలో లాభాలు మాత్రం గడిస్తాయా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా సందేహమే.

తెలుగు సినిమా స్థాయి పెరుగుతోంది ఖర్చు విషయంలోనా, నష్టం విషయంలోనా అనేది అందరూ ప్రశ్నించాల్సిన తరుణం ఇది.
“సినిమా అంటే ఎలాగూ జూదమే, ఎవడిదో తెలివి మీద బెట్ కట్టేకన్నా నా మూర్ఖత్వం మీద నేను బెట్ కట్టుకుంటాను” అనే నిర్మాతల ధోరణి, “దర్శకత్వమంటే మంచి కాంబినేషన్ను మ్యానేజ్ చెయ్యడమే” అనే దర్శకుల అపోహ కలగలిపి ప్రేక్షకుల ముందుకు ఇలాంటి సినిమాల్ని తెస్తున్నంతకాలం పరిస్థితి ఇలాగే ఉంటుంది. ప్రేక్షకుల గురించి కాకపోయినా, తమ గురించి తాము ఆలోచించుకోకపోతే పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమవ్వడం ఖాయం.

ఇప్పటికైనా మేలుకుంటారా? తెలుగు సినిమా ! ఎక్కడికి…ఈ పయనం?

24 Comments
 1. Krshany September 8, 2010 /
 2. Sharath Chandra September 8, 2010 /
 3. viplove September 8, 2010 /
 4. sreenivas pappu September 8, 2010 /
 5. అబ్రకదబ్ర September 8, 2010 /
 6. SK Reddy September 8, 2010 /
 7. cbrao September 9, 2010 /
 8. Pradeep September 11, 2010 /
 9. shankar Gongati September 11, 2010 /
 10. sri September 12, 2010 /
 11. chakri September 13, 2010 /
 12. chakri September 13, 2010 /
   • chakri September 19, 2010 /
  • Vinay Talluri October 6, 2010 /
 13. ramesh September 13, 2010 /
 14. harilorvenz September 17, 2010 /
 15. chakri September 19, 2010 /