Menu

గొప్పనటుడు,మానవతావాది ‘పాల్ న్యూమన్’

ఆ వార్త విని హాలీవుడ్ ఆశ్చర్యపోయింది,అమెరికా సినిమా పరిశ్రమతో సంబంధమున్న ప్రతివారూ నివ్వెరపోయారు,మరికొందరు మౌనంగా శాపనార్ధాలు పెట్టగా పలువురు సంతోషం పట్టలేక ధారాళంగా అభినందించారు. 2008 సంవత్శరం జనవరి 29న పాల్ న్యూమన్,జొయన్ని తమ యాభయవ వివాహవార్షికోత్శవాన్ని జరుపుకోనుండటమే ఆ సంచలనానికి కారణం.అమెరికాలో చలనచిత్ర పరిశ్రమ ప్రారంభమైన అన్ని యేళ్ళలో అటువంటి ‘విపరీతవార్త’కనీవిని ఎరుగని విడ్డూరమే మరి!నాలుగు,ఆరు,ఎనిమిది ఇలా అసంఖ్యాకంగా జరిగే పెళ్ళిళ్ళు,అక్రమసంబంధాలు,విపరీత లైంగిక ప్రవర్తనలు,మాదకద్రవ్యాలు,మాఫియాతో సంబంధాలు ఇలా ఒకటేమిటి ఎన్ని రకాల అవలక్షణాలు,అనారోగ్యకరధోరణులుండాలో అన్నీ సమృద్ధిగా ఉన్న చోట న్యూమన్ లాంటి ‘ఉలిపికట్టె’కూడా ఉండటం విచిత్రమే కదా!

పెళ్ళితో సంబంధం లేకుండా దశాబ్దాల తరబడి సహజీవనం చేసిన(స్పెన్సర్ ట్రేసీ-కాధరిన్ హెప్ బర్న్)వారున్నారు,ఇక నాకు వద్దని విడాకులు పుచ్చుకుని,కొన్నాళ్ళు పోయాక పెటాకులయిన పెళ్ళే ముద్దని,మళ్ళీ ఒక్కటయ్యి,కొన్నాళ్లకు విడాకులు పుచ్చుకున్న(ఎలిజబెత్ టేలర్,రిచర్డ్ బర్టన్)లాంటి ‘తళుకుబెళుకు రాళ్ళు తట్టెడున్న’ హాలీవుడ్ సినీమాయాజగత్తులో ‘నిక్కమైన నీలమంటి’వాడు పాల్ న్యూమన్.

జనవరి 26, 1925న అమెరికాలోని ఒహాయియొ రాష్ట్రంలోని షేకర్ హైట్స్ల్ లో జన్మించిన న్యూమన్ చదువులో పెద్దగా రాణించలేకపొయాడు,పైగా తన అన్న ఆర్థర్ జూనియర్ లా తనకు‘ విద్యపట్ల అంకితభావం,ఆసక్తి లేవ’ని ఆనాటి అతని ఉపాధ్యాయులు భావించారు.అయితే చదువులో అంతటి శ్రద్ధ చూయించిన ఆర్థర్ కూడానిర్మాతగా,ప్రొడక్షన్ మేనేజర్ గా మారాల్సి రావటం వేరే విషయం. పసితనం నుంచి నటనపట్ల న్యూమన్ చూయించిన ఆసక్తిని అతని తల్లి థెరెసా ప్రోత్సహించటంతో తన ఏడవయేటనే పాఠశాలలో జరిగిన ఒకనాటకంలో చిన్న విదూషకుడిపాత్రపోషించటంతో రంగప్రవేశం చేసాడు.రెండవప్రపంచయుద్ధంలో వాయుసేనలో పైలట్ గా పని చేయాలని ఆశపడ్డా వర్ణాంధత కారణంగా నావికాదళంలో శిక్షణ పొంది వివిధహోదాల్లో పనిచేసాడు.అనంతరం  డిగ్రీపూర్తిచేయటంతోపాటు యేల్ విశ్వవిద్యాలయంలో,యాక్టర్స్ స్టుడియో,న్యూయార్క్ లో రంగస్థలం గురించి అధ్యయనం చేసాడు.ప్ర్రారంభదశలో న్యూమన్ న్యూయార్స్ విడిచి హాలీవుడ్ వెళ్ళేందుకు ఇష్టపడలేదనీ,ఎందుకని అడిగితే ఇక్క్డడ ఇంటికి దగ్గరగా ఉంటాము,అక్కడ చదవటానికి యేముందని అనేవాడ’నీ న్యూమన్ జీవితచరిత్ర రాసిన అస్కార్ లెవంట్ పేర్కొన్నాడు.

బ్ర్రాడ్వే లో నాటకప్రదర్శనలలో నిమగ్నమై ఉన్న న్యూమన్ కు వార్నర్ బ్రదర్శ్ నుంచి పిలుపందటంతో వెంటనే వారి ఒప్పందం మీద సంతకం చేసాడు.అలా అతని మొదటి సినిమా అనుభవం మొదలయ్యింది,ఆ సినిమా పేరు-ది సిల్వర్ చాలిస్.సినిమా పూర్తయ్యాక న్యూమన్ బహుశా యేనటుడూ చెయ్యలేని,కనీసం ఊహకు కూడా రాని పని ఒకటిచేసాడు.టిక్కెట్లు కొని ది సిల్వర్ చాలిస్ సినిమా చూసిన వారందరికీ క్షమాపణలు చెపుతూ దినపత్రికల్లో  ఒక పూర్తిపేజీ ప్రకటన ఇచ్చాడు. అతని దృష్టిలో అత్యంతవ్యర్ధమైన,మరొకమాటలో చెప్పాలంటే పరమచెత్త సినిమా అది,అందుకనే,సదరు ది సిల్వర్ చాలిస్ చూసి సమయమూ,సొమ్మూ వృధాచేసుకున్న వారిని మన్నించమని కోరాడు.తిరిగి హాలీవుడ్ నుండి న్యూయార్క్ నగరం చేరి నాటకప్రదర్శనల్లో నిమగ్నమయ్యాడు. ఈమధ్య కాలంలో కొన్నాళ్లు టీవీప్రదర్శనల్లో కూడా పాల్గొన్నాడు.

తర్వాత కొన్నాళ్లకు ఫ్రాంక్ సినాట్రాతో ‘అవర్ టౌన్’,లీ మార్విన్ తో‘ది రేక్’ సినిమాల్లో నటించటంతో హాలీవుడ్ లో ‘సెకండ్ ఇన్నింగ్స్’మొదలుపెట్టాడు న్యూమన్.‘అవర్ టౌన్’ఒకమోస్తరుగా నడిచినా,‘ది రేక్’మాత్రం దారుణంగా పరాజయం పాలయ్యింది.ఆతర్వాత న్యూమన్ మొదటి భార్య జాకీ విట్టీ నుంచి విడాకులు తీసుకుని,ఎన్నో చిత్రాల్లో తన సహనటి జొయన్ని వుడ్ వర్డ్ ను వివాహమాడాడు.

యాభయ్ సంవత్శరాల సినిమా జీవితంలో యాభయ్ సినిమాల్లో నటించిన న్యూమన్ కు విపరీతంగా పేరుప్రఖ్యాతులు తెచ్చిన చలనచిత్రాలు:ఎగ్జోడస్ (1960), ది హజ్లర్(1961), హడ్ (1963),హార్పర్ (1966), హొంబ్రె (1967), కూల్ హ్యాండ్ లూక్(1967), ది టవరింగ్ ఇన్ ఫ్రెర్నో(1974), స్లాప్ షాట్ (1977), ది వర్డిక్ట్ (1982). అలాగే రాబర్ట్ రెడ్ ఫోర్డ్ కలిసి నటించిన బచ్ క్యాసిడీ అండ్ ది సన్ డాన్స్ కిడ్(1969) ,ది స్టింగ్ (1973)బ్రహ్మాండమైన విజయాలు సాదించాయి.

అదే విధంగా హ్యారీ అండ్ సన్ సినిమాలో నటించి దర్శకత్వం వహించిన న్యూమన్ మరొక నాలుగు చలనచిత్రాలకు మెగాఫోన్ పట్టాడు.అవిరేచల్,రేచల్ (1968),ది ఎఫెక్ట్ ఆఫ్ గామ రేస్ ఆన మాన్-ఇన్ ది మూన్ మారిగోల్డ్స్(1972),ది షాడో బాక్స్(1980),ది గ్లాస్ మెనెజిరీ(1987).  న్యూమన్ తెరపై నటుడిగా తెరపై కనిపించిన్ చివరి చిత్రం టాం హాన్క్స్ ‘ది రోడ్ టు పెర్డిషన్’(2002),అయితే 2007 వరకూ పలుపాత్రలకు ముఖ్యంగా యానిమేషన్ సినిమాలకు గాత్రదానం చేస్తూ వినిపించాడు.

చివరిగా మే 25, 2007 న నటన కు శాశ్వతంగా వీడ్కోలు పలికాడు.ఆ సందర్భంగా అతను చెప్పిన విషయాలు అన్ని దేశాల చలనచిత్రనటులకూ వర్తిస్తాయి.‘ఒక వయసు దాటాక జ్ఞాపకశక్తి తగ్గుతుంది.నీమీద నీకున్న విశ్వాసం సన్నగిల్లుతుంది,నటనలో కొత్తదనం ప్రదర్శించలేము,మరి అలాంటప్పుడు విశ్రాంతి తీసుకోవటం మంచిది కదా’అని.

‘ది కలర్ ఆఫ్ మనీ’కి గాను ఆస్కార్ పురస్కారం పొందిన న్యూమన్ ఆ వెనుక,ముందూ కూడా అస్కార్ ఆవార్డుకు పలుసార్లు నామినేషన్ పొందాడు.ఎలాంటి గ్లామర్ ప్రలోభాలకు లొంగని న్యూ బ్రాండొ(అతనికి సినీవిమర్శకులు ఇచ్చిన బిరుదు)తన కుటుంబాన్ని హాలీవుడ్ వాతావరణానికి దూరంగా కనెక్టికట్ ఉంచాడు,అక్కడే అతని తుదిశ్వాస కూడా విడిచాడు.కుటుంబజీవితానికి,కౌటుంబిక విలువలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చిన న్యూమన్ ను ఒకసారి ఎవరో సరదాగా ‘తిరుగుళ్ళు’గురించి అడగ్గా అతనూ సరదాగానే అయినా తన మనసులో మాటను కాస్త ఘాటుగానే”ఇంట్లొ కమ్మని విందుభోజనం దొరుకుతుంటే,వీధులవెంట చిల్లరతిళ్ళు ఎందుకు తినాలి” అంటూ జవాబిచ్చాడు.

యుక్తవయసుకొచ్చినప్పటి నుంచీ న్యూమన్ ఏనాడు తనమతవిశ్వాసాలను బహిరంగంగా వెల్లడించలేదు,కాకుంటే యూదుడిని అని మాత్రం చెప్పుకునేవాడు.అలా తాను ఒక ‘జ్యు’అని చెప్పుకోవటమే అసలైన సవాలని కూడా ఒకసారి చెప్పుకొచ్చాడు.కారు రేసులపట్ల అమితాసక్తి ఉన్న న్యూమన్ చాలాకాలం తను స్వయంగా ఒక రేస్ టీం ను నిర్వహించాడు,మిగతా జట్లతో కలిసి రేసుల్లో పాల్గొన్నాడు.

పాల్ న్యూమన్ స్థాపించిన న్యూమన్ ఓన్ ఫౌండేషన్ 2008 నాటికే సుమారు మూడువందల మిలియను అమెరికా డాలర్లను వివిధరకాల దాతృత్వకార్యక్రమాలకొరకు నిధులు,విరాళాలు గా అందజేసింది.రాజకీయాల్లో కూడా ఆసక్తి ఉన్న న్యూమన్ పలువురు అభ్యర్ధులకొరకు భూరి విరాళాలు ఇవ్వటమే కాక,కొన్ని సార్లు స్వయంగా ప్రచారకార్యక్రమాలు,టీవీ షో లల్లో కూడా పాల్గొన్నాడు.పర్యావరణం పట్ల ఇవ్వాళ డికాప్రియో లాంటివాళ్ళు చూపుతున్న ఆసక్తికి ముగ్దులవుతున్న ప్రజానీకానికి పూర్తిగా తెలీని విషయమేమంటే న్యూమన్ అప్పటికి హాలీవుడ్ హాట్ ప్రాపర్టీగా ఉండి కూడా మన్ హట్టన్ లో జరిగిన  ఫస్ట్ ఎర్త్ డే ఈవెంట్లో పాల్గొన్నాడని,అదే విధంగా పర్యావరణ సమస్యలకు అణుశక్తి వినియోగాన్ని అభివృద్ధి చెయ్యటమే అని సూచించాడని.అమెరికాలో గే హక్కులకు,స్వలింగవివాహాలకూ మద్దతు పలికినా వాటిని తీవ్రంగా వ్యతిరేకించే వ్యాటికన్ అతని మరణాంతరం,‘న్యూమన్ గొప్ప వితరణశీలి,హాలీవుడ్ లో అరుదుగా కనిపించే విలక్షణమైన వ్యక్తిత్వమున్న వాడని’ నివాళులర్పించింది.

సుమారు రెండు సంవత్శరాలకు పైగా ఊపిరితిత్తుల కాన్సరుతో బాధపడ్డ న్యూమన్ 83యేళ్ళ వయసులో కుటుంబసభ్యులు,కొందరు సన్నిహితమిత్రుల సాన్నిధ్యంలో సెప్టెంబరు 26,2008న  శాశ్వతంగా కన్నుమూసాడు.

సెప్టెంబరు 26 పాల్ న్యూమన్ తృతీయ వర్ధంతి

(నాకు గుర్తున్నంతవరకూ నేను చూసిన మొదటి పాల్ న్యూమన్ సినిమా టవరింగ్ ఇన్ ఫెర్నో.అయితే అందులో న్యూమన్ ది ఒకప్రాధాన్యత ఉన్న పాత్ర మాత్రమే,పైగా అందులో నా అభిమాన నటుడు స్టీవ్ మెక్విన్ ప్రధాన కధానాయకుడు,తర్వాత చాలా కాలానికి చూసింది కూల్ హ్యాండ్ లూక్.నేను ఆ సినిమా చూసిన కొద్దికాలానికి న్యూమన్ దివంగతుడయ్యాడు.అప్పుడే నవతరంగంలో న్యూమన్ గురించి రాయమని మనవాళ్లు నన్ను కోరినా కేవలం ఒక్క సినిమా చూసి అంతటి గొప్పనటుడు,మానవతావాది గురించి ఏమి రాసినా అసమగ్రంగా ఉంటుందన్న భావనతో సాహసించ లేకపోయాను. (నాకు గుర్తున్నంతవరకూ నేను చూసిన మొదటి పాల్ న్యూమన్ సినిమా టవరింగ్ ఇన్ ఫెర్నో.అయితే అందులో న్యూమన్ ది ఒకప్రాధాన్యత ఉన్న పాత్ర మాత్రమే,పైగా అందులో నా అభిమాన నటుడు స్టీవ్ మెక్విన్ ప్రధాన కధానాయకుడు,తర్వాత చాలా కాలానికి చూసింది కూల్ హ్యాండ్ లూక్.నేను ఆ సినిమా చూసిన కొద్దికాలానికి న్యూమన్ దివంగతుడయ్యాడు.అప్పుడే నవతరంగంలో న్యూమన్ గురించి రాయమని మనవాళ్లు నన్ను కోరినా కేవలం ఒక్క సినిమా చూసి అంతటి గొప్పనటుడు,మానవతావాది గురించి ఏమి రాసినా అసమగ్రంగా ఉంటుందన్న భావనతో సాహసించ లేకపోయాను. కూల్ హ్యాండ్ లూక్, హోంబుర్,  బచ్ క్యాసిడీ అండ్ సన్ డాన్స్ కిడ్,ది హడ్ సకర్ ప్రాక్సీ  పాల్ న్యూమన్ సినిమాల్లో ఈ నాలుగు సినిమాలకున్న విశిష్టతను వివరిస్తూ ఒకొక్క చిత్రం గురించి వీలు వెంబడి ఇక్కడ నావ్యాసాలు వెలువడుతాయి.)

2 Comments
  1. Srinu Pandranki September 25, 2010 /
  2. anwar September 27, 2010 /