Menu

ధమాకా “దబంగ్”

కొత్త సీసాలో పాత సారా అనే మాట అర్థం కావాలంటే ఈ సినిమా చూడాలి. ఇదే సినిమా కథని ఏ 1980లోనో తీస్తానంటే మిథున్ చక్రవర్తి ఎగిరి గంతేసి చేసేవాడు. సినిమా సూపర్ హిట్ కొట్టేది. 2010లో కూడా ఇదే కథతో హిట్ కొట్టడం ఎలానో నూతన దర్శకుడు అభినవ్ కశ్యప్ (అనురాగ్ కశ్యప్ సోదరుడు) నిరూపించాడు. అందులో సల్మాన్ ఖాన్‌ని హీరోగా ఎంచుకోవడమే మొదటి విజయం.

ఈ సినిమా కథ చాలా సాధారణమైనది.. మనకందరికి తెలిసినది. హీరో పోలీసాఫీసర్ (చుల్బుల్ పాండే్‌గా సల్మాన్). లంచాలు తీసుకోవడం, పైరవీలు చెయ్యడం, ఎదురు పడిన విలన్ల ఎముకలు విరగ్గొట్టడం ఇవన్నీ ఇతని వృత్తి, హాబీ, సరదా. ఒక విలన్ (చేదీ సింగ్‌గా సోనూ సూద్). హీరో గారిని ముందు నేరుగా ఎదిరించడం, తర్వాత సెంటిమెంట్‌తో ఎదిరించడం ఇతని ఫార్ములా. అప్పుడప్పుడు మెరిసి మాయమయ్యే అమ్మాయి (రజ్జోగా సొనాక్షి సిన్హా – శత్రుగన్ సిన్హా కూతురు) – ఆ అమ్మాయితో హీరో ప్రేమాయణం. కథకి రెండో వైపు చుల్బుల్ పాండే తల్లి (డింపిల్ కపాడియా) సవతి తండ్రి (వినోద్ ఖన్నా), సవతి తమ్ముడు (అర్బాజ్ ఖాన్). వీరందరి మధ్య నడిచే ఫ్యామిలీ డ్రామా, విలన్ ఈ డ్రామాని ఆధారం చేసుకోని హీరోని ఇరుకున పెట్టడం – ఇంకేముంది భారీ క్లైమాక్స్. కథ సుఖాంతం.

సాధారణ కథతో వచ్చినా, దర్శకత్వ ప్రతిభ, నటీనటుల అద్భుతమైన నటన (ఈ పొగడ్తలో 90% సల్మాన్‌కే) ఈ సినిమాని వైవిధ్యమైన సినిమాగా నిలబెడ్తుంది. ఎన్ని సార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన మాట – సల్మాన్ ఖాన్ నటన. ఇంతవరకు మనకి తెలియని సల్మాన్ ఇందులో మనకి కనపడతాడు. అతని నటన ఆ పాత్ర (చుల్బుల్ పాండే వురఫ్ రాబిన్‌హుడ్ పాండే) చాలాకాలం మనకి గుర్తుండిపోతుంది. అతని స్టార్‌డం, స్టైల్ (పొగరు అని కూడా అనవచ్చు), డైలాగులు పలికే విధానం, నడక, రూపురేఖలు (ముఖ్యంగా మీసకట్టు) అన్నీ అద్భుతంగా అమరాయి. మిగిలిన నటీ నటుల్లో సోనూ సూద్ బాగా ఆకట్టుకుంటాడు. ఆ మధ్య వచ్చిన ఓ తెలుగు సినిమా సన్నివేశాన్ని వాడుకున్నా మిగిలిన భాగమంతా బాగుంది. అర్బాజ్ ఖాన్ నటన అతంతమాత్రంగానే వుంది. డిపిల్ కపాడియాకి నాలుగు ఎక్స్‌ప్రషన్లు, కొత్త నటి సొనక్షీ సిణా కి ముడు ఎక్స్‌ప్రషన్లు, వినోద్ ఖన్నాకి రెండు ఎక్స్‌ప్రషన్లు, మిగిలిన పాత్రలకి ఒకటే ఎక్స్‌ప్రషన్‌కి అవకాశం ఇచ్చారు కాబట్టి వారిగుంచి చెప్పేదేమి లేదు.

ఈ సినిమా బాగుందని చెప్పడానికి మరో ముఖ్య కారణం కథ నడిపిన నేపధ్యం. ఉత్తర్ ప్రదేశ్‌లోని లాల్‌గంజ్ అనే ప్రాంతంలో కథని నడపడం వల్ల ఒక కొత్త నేపధ్యం – అందులోని పచ్చిదనం (రస్టిక్ సరైన పదం) మూస సినిమాలనుంచి ఈ సినిమాని కొంచెం దూరంగా మరి కొంచెం ఎత్తుగా నిలబెడుతుంది. న్యూటన్ సిద్ధాంతాన్ని విభేదించే ఏక్షన్ సన్నివేశాలు, కేవలం డాన్స్ వెయ్యడానికి ప్రేక్షకులచేత డాన్స్ వేయించడానికే అన్నట్లు తయారుచేసుకున్న పాటలు, అక్కడక్కడ కౌబాయి చిత్రంలా అనిపించినా మంచి అనుభవాన్ని మిగిల్చే నేపధ్య సంగీతం “దబంగ్” విజయానికి దోహద పడే అంశాలు.

హోల్ మొత్తంగా చూస్తే పక్కా మాస్ మసాల చిత్రం, పాత కథ – కాకపోతే కొత్తగా చూసిన అనుభవం – వెరసి సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో హిట్. సల్మాన్ అభిమానులకి కన్నులపంట – అభిమానులు కానివారికి అభిమానులు అయ్యేందుకు కారణం.

చిత్రం: దబంగ్
జాన్రా: ఏక్షన్, ఫ్యామిలీ డ్రామా
నటీ నటులు: సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, సొనాక్షి సిన్హా, వినోద్ ఖన్నా, డింపిల్ కపాడియా, సోనూ సూద్, అనుప ఖేర్, ఓంపూరి, మహేష్ మంజ్రేకర్, టీనూ ఆనంద్, మహీ గిల్ తదితరులు
సంగీతం: సాజిద్-వాజిద్
బ్యానర్: శ్రీ అష్టవినాయక్ సినీ విజన్స్
నిర్మాత: అర్బాజ్ ఖాన్
దర్శకుడు: అభినవ్ కాశ్యప్
విడుదల: 10 సెప్టెంబర్ 2010

6 Comments
    • అబ్రకదబ్ర September 13, 2010 /
  1. Zulu September 13, 2010 /
  2. GopiCM September 18, 2010 /