Menu

తెలుగు సినిమా నిర్మాతలకో లేఖ

అయ్యా

నిన్న తెలుగు సినిమా నిర్మాతలంతా కలిసి తెలుగు సినిమాని వుద్ధరించే ప్రయత్నంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని తెలిసి మేమెంతో సంతోషించాము. నిజానికి తెలుగు సినిమాను రక్షించుకోవడమంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే కదా.. అలాగే తెలుగు ప్రేక్షకుల్ని కూడా రక్షించినట్లే కదా.. అందుకే మాకు ఆనందం.

మీరు చేసుకున్న తీర్మానాలు (ప్రతిపాదనలు) విన్నాక మా ఆనందానికి అవధుల్లేకుండా పోయినయ్. ఇక నించి తెలుగేతర భాషల్లో నిర్మాణమైన చిత్రాలు తెలుగు డబ్బింగ్ అయ్యి విడుదలయ్యే సందర్భంలో వాటిని 50 ప్రింట్లకే పరిమితం చెయ్యాలన్న మీ ఆలోచన మహా గొప్పగా వుంది. ఇంగ్లీషు డబ్బింగ్ సినిమాలైతే ఏకంగా నిషేదించాలని కూడా నిర్ణయించడం మరీ బాగుంది.

తెలుగు ప్రేక్షకుడు మెచ్చుకోని హిట్ చేసేలా సినిమా తీయడం తెలుగు సినిమా ఇండస్ట్రీ వల్ల కావడం లేదు.. జనాలు రాని సినిమాకి విజయ యాత్రలు, సక్సెస్ మీట్లు ఎన్ని చేసినా డబ్బులు వెనక్కి రావటంలేదు. మరో పక్క చంద్రముఖి, యుగానికొక్కడు, అవారా అంటూ ప్రతి అరవ సినిమా తెలుగులో తెగ ఆడేసి డబ్బులు దండుకుంటోంది. ఎవరికైనా కడుపుమండదా మరి. ఆ అరవ సినిమాలు మన చేతగానితనాన్ని వేలెత్తి చూపిస్తే వొళ్ళు మండదా మరి..! ఇదుగో ఇప్పుడు మళ్ళీ రోబో వస్తోంది.. 27 కోట్లకి కొన్నారట తెలుగులో..!! ఇప్పుడు అర్జెంటుగా దీన్ని ఆపకపోతే ఏమౌతుందో తెలుసా.  వేరే పోటీ సినిమాలు లేక హిట్ టాక్ తెచ్చుకున్న కొన్న చెత్త సినిమాలు ఆడకుండా పోతాయి… మన హీరోలకంటే రజనీకాంత్ పెద్ద హీరో అయిపోతాడు. ఇది అన్యాయం కదూ… ఘోరం కదూ.. అందుకే ఈ ప్రతిపాదన వెంటనే అమలు జరపాలని వేడుకుంటున్నాం.

ప్రేక్షకుల గురించి ఆలోచిస్తున్నారేమో.. వద్దు సార్.. వాళ్ళంతా గొర్రెలు. సినిమా మొదలైన రోజే ఇదో “డిఫరెంట్” సినిమా అంటే నమ్మేస్తారు. మ్యూజిక్ రిలీజ్ చేసేందుకు పెద్ద ఫంక్షన్ చేసి మ్యూజిక్ డైరెక్టర్‌ని ఆకాశానికి ఎత్తేస్తే సీడీలు కొనుక్కుంటారు.. పట్టు మని పాతిక క్యాసెట్‌లు అమ్ముడు పోని పాటలకి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేస్తే నిజమే కాబోలు అనుకుంటారు. సినిమా విడుదల అవ్వగానే ప్రతి అడ్డమైన చానల్లో ప్రతి చెత్త ప్రోగ్రాంలో గెస్ట్‌గా కనపడి సినిమా సూపర్ అని వూదరకొట్టేస్తే పోలోమంటూ సినిమాకి వస్తారు. సినిమా చూసి నలుగురైదుగురు మూర్చపోయినా మనం మాత్రం టీవీలో మంచి టాక్ వచ్చింది సూపర్ హిట్ అని చెప్పుకోని జైత్రయాత్రలు చేసుకోవచ్చు. ఇన్ని చేసి, ఇంత కష్టపడి సినిమాని హిట్ చేసుకుంటుంటే మధ్యలో ఈ తమిళ సినిమాలు, ఇంగ్లీసు సినిమాలు వచ్చి డబ్బులు దండుకుంటుంటే ఎందుకు వూరుకోవాలి.

కరెక్ట్ సార్… మీరు చేసిందే కరెక్ట్. తమిళ సినిమా ఇండస్ట్రీతో మనకి అవసరాలు వున్నాయి కాబట్టి దాన్ని బ్యాన్ చెయ్యకుండా కేవలం ఇంగ్లీషు సినిమాలని మాత్రమే బ్యాన్ చెయ్యడం మంచి తెలివైన ఆలోచన. వాళ్ళు మంచి సినిమాలే తీయచ్చు గాక, వాళ్ళ సినిమాలు చాలా బాగుండచ్చుగాక కాని మన తెలుగు సినిమా.. మన సినిమా..!! దీన్ని బతికించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే పెద్ద హీరోలంతా రెండేళ్ళకో మూడేళ్ళకో ఒక సినిమా చేస్తున్నారు. చిన్న సినిమా పేరుతో చేసే అతుకుల బొంతలు, కాపీలకి స్ఫూర్తి రీమేకులు ఇవి ఎలాగూ జనానికి అంతగా నచ్చట్లేదు. ఇక చూసేదానికి సినిమా లేకపోతే ప్రేక్షకుడు మాత్రం ఏం చేస్తాడు? అరవ డబ్బింగులు, ఇంగ్లీషు డబ్బింగులు చూసేస్తాడు. మరక్కడే మనకి దెబ్బ పడి పోతుంది. తెలుగు సినిమా తక్కువైపోతుంది..!!

అసలు తెలుగు భూమి పైన తెలుగు సినిమా తప్ప వేరే సినిమా చూడకూడదు అని రూల్ పెట్టాలి సార్. ఈ ఇంగ్లీషు, తమిళమే కాదు ప్రపంచ సినిమాలు చూసే వాళ్ళు చాలా మంది వున్నారట. అందుకే తెలుగు తప్ప వేరే ఏ బాష సినిమా చూసినా కనీసం మూడేళ్ళు జైలు, లక్ష రూపాయల జరిమానా పెట్టాలి. అయితే ఈ రూల్ సినిమా పరిశ్రమకి వర్తించదు అని కూడా ఒక వెసులుబాటు వుండాలి. మనం కాపీ కొట్టుకోడానికి – రిఫరెన్స్‌లు – వుండాలి కదా. అప్పుడే జనానికి మనం ఏ సినిమా నుంచి ఏ సీన్ ఎత్తేశామో తెలిసే అవకాశం వుండదు. వేరే సినిమాలేవీ వుండవు కాబట్టి – ఆముద వృక్షం సామెత లాగా – తెలుగు సినిమా గొప్పదనం రాష్ట్రమంతా వ్యాపిస్తుంది. రాష్ట్రం దాటక పోతేనేం?

కాకపోతే వచ్చిన చిక్కల్లా ఒక్కటే – మనల్ని చూసి కర్నాటక నిర్మాతలు కూడా తెలుగు సినిమాని బ్యాన్ చేస్తే మన గతేం కానూ అని?

ఇట్లు
ఒక ప్రేక్షకుడు

34 Comments
 1. కే. శివ కిషోర్ September 21, 2010 /
 2. pidugu September 21, 2010 /
 3. Sudha September 21, 2010 /
 4. ఆ.సౌమ్య September 21, 2010 /
 5. sreenivas pappu September 21, 2010 /
 6. rambabu adla September 21, 2010 /
 7. Suuren September 21, 2010 /
 8. shankar Gongati September 21, 2010 /
  • venkat May 20, 2011 /
 9. నాగప్రసాద్ September 21, 2010 /
 10. swats September 21, 2010 /
 11. కొత్తపాళీ September 21, 2010 /
 12. ravi September 21, 2010 /
 13. bonagiri September 21, 2010 /
 14. సతీష్ September 21, 2010 /
   • సతీష్ September 22, 2010 /
 15. surya prakash.j September 21, 2010 /
 16. చదువరి September 21, 2010 /
 17. nsnaidu September 21, 2010 /
 18. satmali September 22, 2010 /
 19. satish September 22, 2010 /
 20. chakri September 22, 2010 /
 21. Chanukya September 22, 2010 /
  • raaja September 24, 2010 /
 22. naresh Nunna September 23, 2010 /
 23. aser September 23, 2010 /
 24. raaja September 26, 2010 /
 25. rayraj September 28, 2010 /
 26. జీడిపప్పు September 29, 2010 /
 27. venkat May 20, 2011 /