Menu

Well Done Abba (2010)

నవతరంగం లో ’వెల్ డన్ అబ్బా’ గురించి ఇప్పటివరకూ ఎవరూ రాయకపోవడాన్ని ఖండిస్తూ – ఈటపా 🙂

కథ: అర్మాన్ అలీ (బొమన్ ఇరానీ) ముంబైలో ఒకరి కారు డ్రైవర్ గా పని చేస్తూంటాడు. సెలవు పై వెళ్ళినవాడు…దొరికిన సెలవుకంటే చాలా ఎక్కువరోజులు ఉండిపోయి తిరిగొస్తే, యజమాని తిట్టి, పని మానెయ్యి పొమ్మంటాడు. దానితో అర్మాన్ అలీ అతన్ని బ్రతిమాలుకుని, అసలేం జరిగిందో చెబుతాను, తర్వాత మీ ఇష్టం – అని అంటాడు. యజమాని ముంబై నుండి పూణే వెళ్ళేదారి పొడువునా, బండి నడుపుతూ, అతను తన ఆలస్యానికి కారణం చెబుతాడు. ఎందుకు? అన్నదే సినిమా కథ.

నచ్చినవి:
-బొమన్ ఇరానీ నటన. ముఖ్యంగా – ఆ ఫొటోగ్రాఫర్ వద్ద ఫొటో తీయించుకునే దృశ్యం చూసి ఎంతగా నవ్వుకున్నానో! అలాగే, అతని రెండో రోల్ కూడా అక్కడక్కడా నవ్వించింది.
-కథా గమనం : ఎక్కడా బోరు కొట్టలేదు.
-డ్రీం సీక్వెన్సులు, సంబంధంలేని పాటల్లేకపోవడం : సుఖంగా, ఫ్లో దెబ్బతినకుండా హాయిగా అనిపించింది.
-గ్రామాల్లో ఆడ సర్పంచులను కంట్రోల్ చేసే వారి భర్తలపై సెటైర్ బాగుంది.
-అలాగే, బావి కోసం ఇచ్చే గ్రాంట్లు ఎలా గుటకాయ స్వాహా ఔతాయో బాగా చూపారు.
-’వెల్కం టు సజ్జన్పూర్’ మార్కు హాస్యం.
-సంభాషణలు చాలా బాగున్నాయి.
-నటీనటులందరూ బాగా చేశారు.

నచ్చనివి:
-ఒకే సినిమాలో చాలా విషయాలు చర్చిద్దామనుకోవడం. ఉదాహరణకు – ప్రీతీనిగమ్ వాళ్ళమ్మాయి అరబ్ షేక్ పెళ్ళి వ్యవహారం – అంత సీరియస్గా చర్చించాలి అనుకుంటే, కాస్త స్క్రీన్ స్పేస్ ఇవ్వాలి. లేదంటే, చర్చించకూడదు. ఆ ఒక్క సీన్లో బొమన్ ఇరానీ మనసు మారిపోవడం – అతి వేగమైన మార్పుగా అనిపించింది.

ముగింపు : అర్మాన్ అలీ (బొమన్ ఇరానీ) కథ పూర్తి చేయగానే, అతను కారు నడుపుతూ, యజమాని నవ్వుతూ ఉండగా కథ ముగుస్తుంది. అంటే ఏమిటన్నట్లు – ఈ కథ ఇలా ఎంటర్టైనింగ్ గా ఉంది కనుక, యజమాని అతన్ని క్షమించేసి పన్లోకి తీసుకున్నాడు అనుకోవాలా? ముగింపు విషయంలో కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండు అనిపించింది.

-ఆ రవికిషన్, అతని భార్యగా సోనాలీ కులకర్ణి -వీళ్ళని అన్నిసార్లు చూపడం అనవసరం ఏమో అని అనుమానం వచ్చింది.

-మీగ్గానీ ’వెల్కం టు సజ్జన్‍పూర్’ నచ్చి ఉంటే ఈ సినిమా తప్పక చూడండి. అలాగే, కొన్ని చోట్ల బొమన్ ఇరానీ కోసమైనా ఈ సినిమా తప్పక చూడాలి. డీవీడీలు దొరుకుతున్నాయి. అయితే, కాస్త పట్టుబట్టి వెదకాలి. వెదికీ వెదికీ దొరక్క – డీవీడీ షాపులో వాడి దగ్గర అప్పు తీస్కున్నాం మేము! బెనెగల్ ఇలాంటి కథాంశాలతో సినిమా తీయడం నాకు మహా ఆనందంగా ఉంది.

5 Comments
  1. sujata August 24, 2010 /
  2. జంపాల చౌదరి August 24, 2010 /
  3. kish September 6, 2010 /
  4. Nagarjuna September 7, 2010 /