Menu

వర్మ ‘సత్య’ ఒక పరిచయం

‘సత్య’ మాఫియా నేపధ్యంగా ఉన్న చిత్రమే అయినా, రాంగోపాల్ వర్మ ‘శివ’ ద్వారా మొదలుపెట్టిన సమాజపు చీకటికోణాలపై తన పరిశీలనను తారాస్థాయికి తీసుకెళ్ళిన చిత్రం. వర్మ తన socio- philosophical premise ని ఒక నిరపేక్షిక (objective, detached) స్థాయికి ఈ చిత్రం ద్వారా తీసుకెళ్ళాడూ.  ‘సత్య’ (జె.డి.చక్రవర్తి) కు భూత, భవిష్యత్ కాలాలు లేవు, ఒక్క వర్తమానం తప్ప. ఇలాంటి ఒక సాధారణ వ్యక్తి. .. చాలా సా…ధా…ర…ణం…గా ముంబై మాఫియాలొ చేరి, అంతే సులువుగా జీవితం గడిపి, పెద్దగా వ్యక్తిగతంగా మార్పు కూడా లేకుండా (కాల్పుల్లో) మరణించడం ఈ చిత్ర కథ. ఇంత సాధారణ యువకుడి కథ అంతే value judgement లేకుండా చెప్పి వర్మ తన matured understanding of present day society ని తెరబద్ధం చేసాడనిపిస్తుంది.

సినిమా బోంబాయి నగరంలో పెరిగిపొయిన ఆర్థిక అసమానతలూ, అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థ, దాని కారణంగా ఏర్పడిన మాఫియా గురించి నేపథ్యంలో ఒక voice-over చెప్తుండగా, ఈ చిత్ర హీరో పరిచయమవుతాడు. ఇంతకు ముందే చెప్పినట్లు అతని నేపథ్యం తెలియదు, తను జైల్లో ‘భీఖూ మహత్రే’ (మనోజ్ బాజ్ పాయ్)తో చెప్పిన మాటల్లో , తల్లిదండ్రులెవరో తెలీదు, బ్రతికున్నారో లేదో కూడా తెలీదు. కాకపోతే తనను చందా (హఫ్తా) అడిగిన ఒక లోకల్ గూండా ముఖాన కత్తివేటు వెయ్యడంతో తనలోని కోపాన్ని పరిచయం చేస్తాడు. ఈ గొడవ పర్యవసానంగా లోకల్ మాఫియాతో కుమ్ముక్కైన ఒక పోలిస్ ఇన్ స్పెక్టర్ ద్వారా నేరం మోపబడి జైలుకి చేరతాడు. అక్కడ తన జీవితంలో పెద్ద మలుపు తిరుగుతుంది. భీఖూ మహత్రే అనే ఒక మాఫియా సైనికునితో పరిచయం కలుగుతుంది. మొదట వీరి పరిచయం గొడవతో మొదలైనా, “నాకు చావంటే భయం లేదు” అన్న తన ఒక్క మాటతో, సత్య విలువ గ్రహించిన మహత్రే, తనతో పనిచెయ్యమంటాడు. తన గ్యాంగ్లో స్థానం కల్పిస్తాడు. అప్పటిదాకా తాడూబొంగరం లేని సత్యకు ఆ మాఫియా గ్యాంగులో తనదంటూ ఒక కుటుంబం దొరుకుతుంది.

తనని జైలుకు పంపించిన లోకల్ గూండాను కాల్చిచంపడంతో తన మాఫియా జీవితం ఆరంభస్తాడు. ఆ గూండాని చంపుతున్నప్పుడుగానీ, ఆ తరువాతగానీ ఎక్కడా తను చేసింది ‘తప్పు’ అనే చర్చగానీ, ముఖంలో భావంగానీ కనపడని సత్య. తనుచేసింది ఒక ఆటవిక న్యాయం అంతే, అక్కడ అదే సరి. దాంట్లో చర్చలూ, ఫీలింగ్స్ కి స్థానం లేదు. ఈ నిజాలకి నిలువెత్తురూపంగా ‘సత్య’ మారతాడు. అక్కడి నుండీ భీఖూ కుడిభుజంగా, తన తరఫున ఆలోచనగా, ఒక నమ్మకంగా గ్యాంగ్ లో సుస్థిరస్థానాన్ని కల్పించుకుంటాడు. శివ, దుర్గల్లాగా సత్య గ్యాంగుకి నాయకుడు కాదు, ఒక భాగం మాత్రమే. కానీ అతడు ఈ బొంబాయి అస్థవ్యస్థమైన వ్యవస్థలో ‘ఒక సామాన్యుడు’, మాఫియాలో స్థానాన్ని కల్పించుకుని సిటీని తనదైన విధంగా శాసించిన ‘అసామాన్యుడు’. ఇతడి ఫోటో పోలీసుల దగ్గర ఉండదు, కానీ he is one of the most wanted persons. ఈ contradiction సత్యను ఒక విభిన్నమైన కథానాయకుణ్ణి చేస్తుంది.

‘సత్య’ పాత్రకున్న మరోపార్శ్వం, ‘విద్య’ (ఊర్మిళ మటోండ్కర్)తో తన పరిచయం, ప్రేమ. విద్యను మనలాంటి సామాన్యులకు ప్రతీకగా పోల్చుకోవచ్చు. పక్కనే మాఫియా ప్రపంచం అనేది ఒకటుందని తెలీదు. మన జీవితాలు ఏదోఒక విధంగా దానితో ముడిపడి ఉన్నాయనీ తెలీదు. అలాగే సాధారణంగా బతికేస్తాం. అజ్ఞాతంగా ఉండి సంగీత దర్శకుణ్ణి గన్ పాయింట్ మీద బెదిరించి పాటపాడే అవకాశం సత్య ఇప్పించాడని తనకి తెలీదు. ఆఖర్న పోలీసులు తనని సత్య గురించి చెప్పమని ఇంటరాగేట్ చేస్తే, తన నమ్మశక్యంకాని ముఖంలో, మాఫియా ఉనికి గురించే తెలియని ఒక సాధారణ పౌరుడి తెలియనితనం కనబడుతుంది. అప్పటి వరకూ భయం ఎరుగని సత్య కూడా, సినిమా ధియేటర్ ఉదంతం తరువాత భీఖూ తో “విద్య గురించి అలోచించినప్పుడలా భయం కలుగుతోంది” అంటాడు. విద్యతో దుబాయ్ వెళ్ళి తన మాఫియా జీవితాన్ని ముగిద్దామన్న సత్య కథ, అతని షూటౌట్ తో ముగుస్తుంది.

‘సత్య’ పాత్ర గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవడానికి ఏమీ ఉండదు. ఈ పాత్ర ద్వారా వర్మ చెప్పదలుచుకున్న social commentary అదే. సత్య ఎవరైనా కావచ్చు. మీరు, నేను, మన పక్కింటి అమాయకపు కుర్రాడు ఎవరైనా … ఏక్కడైనా ఈ సత్య ఉండొచ్చు. మన ఆధునిక సమాజంలో ఈ చీకటి ప్రపంచం (under world) ఎంతగా మమేకమైపోయిందనడానికి ప్రతీక సత్య. వర్మ ఈ హీరోని ఎటువంటి social, moral, emotional conflict లేకుండా ఒక non-committal statement లాగా సృష్టించాడు. ఈ కథానాయకుడి ద్వారా వర్మ ఈ సమాజానికి తను తెలుసుకున్న, తనదైన అర్థాన్ని పరిచయం చేసాడు.

2 Comments
  1. రవి September 3, 2010 /