Menu

ఆత్మని రక్షితే సర్వం రక్షితం భవతి

శాస్త్రం కళ వర్తకం : ఈ త్రిక(మూడిటి సమూహం) ఒకటిగా కలిసి సినిమా మాధ్యమం ఏర్పడింది.
వీటిని అర్ధం చేసుకోటానికి ప్రయత్నం చేద్దాం:

శాస్త్రం : నిరూపణకు నిలిచే ఙ్ఞానమే శాస్త్రం (ప్రపంచాన్ని వాస్తవిక దృష్టితో చూడటమే దీని ప్రధాన ఉద్దేశ్యం)

కళ : భావోద్వేగాలను సంతృప్తి పరిచే రస సౌందర్య శాస్త్రమే కళ (వర్తమానం పై తార్కిక అవగాహన,భవిష్యత్ పై ఆశ కలుగజేయటమే దీని ప్రధాన ఉద్దేశ్యం)

వర్తకం : ఆర్ధిక లావాదేవీలు జరిగే వ్యాపారమే వర్తకం (ప్రజల అవసరాలు తీర్చటమే దీని ప్రధాన ఉద్దేశ్యం)
సినిమాకి అన్వయిద్దాం…..

శాస్త్రం : శాస్త్ర ప్రయోజనం తత్వ దర్శనం – యధార్ధ స్థితిని తెలుసుకోవటమే శాస్త్ర ప్రయోజనం ఐనప్పుడు ,మానవ జీవితాల్ని వాస్తవిక దృష్టితో చూసే కథల్ని మనం చూసాం.వివిధ శాస్త్రాలు మానవ జీవితాన్ని ప్రభావితం చేసినట్టే సినిమా కూడా మానవ జీవితం పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.చారిత్రక,సాంఘిక,పౌరాణిక నేపధ్యాల ద్వారా ఆయా కాలాల్లో పరిష్కారలున్నవి,పరిష్కరించలేనివి ఐన ఎన్నో సమస్యల్ని సినిమాల్లో చర్చించారు.నేడు సినిమాని శాస్త్రంగా అంగీకరించిన దేశాలు ఈ శాస్త్రానికి ప్రత్యేక విద్యని ఏర్పాటు చేసాయి.సినిమా శాస్త్ర ప్రయోజనాన్ని నెరవేరుస్తున్నది,ఇది విద్యగా కూడా అంగీకరించబడింది..ఇంద్రియాణాం ప్రశమం శాస్త్రం – ఇంద్రియాలకి శాంతినిచ్చేది శాస్త్రం కాబట్టి సినిమాని శాస్త్రంగా అంగీకరించటంలో ఎటువంటి సందేహం అవసరంలేదు.

కళ : ఇంద్రియాలపై మనసుకు ఆధిపత్యం ఉంది,సినిమా మనసుపై ప్రభావం చూపిస్తుంది.సినిమా చూడగానే మనసు చెదరటం గానీ,సంతృప్తి చెందటం గానీ జరుగుతుంది.సంగీతం,ఛాయాగ్రహణం,నటన,చిత్రకళ వంటి అనేక కళలని తనలో ఇముడ్చుకున్న శ్రేష్టమైన కళగా సినిమాని మనం చెప్పుకోవచ్చు.

వర్తకం : ప్రజలకు అవసరమైన వినోదపు అవసరాలను తీర్చటంలో సినిమా ప్రాధాన్యతని వివరంగా చెప్పక్కర్లేదు కద…నేడు అత్యంత పెద్ద వ్యాపారాల్లో సినిమా కూడా ఒకటి ,ప్రభుత్వాలు దీన్ని వ్యాపారంగా గుర్తించాయి.

కాలాన్ని ప్రాతిపదికగా చేసుకుని సినిమా నడుస్తుంది…సినిమా చూస్తూ ప్రేక్షకుడు కాలాన్ని మర్చిపోతే సినిమా ప్రయోజనం సగం నెరవేరినట్టే.
సినిమాలో కాలం ఎన్ని రకాలుగా ఉంటుందో చూద్దాం:
కాలం: 1)భూత, 2)భవిష్యత్ 3)వర్తమాన కాలాలే కాక 4)నియంత్రిత కాలం అనే ప్రత్యేకమైన కాలం ఉంది.
ఈ నియంత్రిత కాలం లో నాలుగు రకాలున్నాయి.
1)నెమ్మదిగా నడిచే కాలం (స్లో మోషన్)
2)వేగంగా కదిలే కాలం (స్పీడ్ మోషన్)
3)నిశ్చల కాలం: కదలిక లేకుండా నిలిచి పోవటం
4)వేగం నుంచి నెమ్మదికి,నెమ్మది నుంచి వేగానికి నడిచే కాలం.

ఇప్పుడు కథ మరియు సాంకేతికత గురించి తెలుసుకుందాం.
సినిమా చూస్తూ మనం అలోచించం,స్పందిస్తాం..అలోచనకి ఇక్కడ తక్కువ ప్రాధాన్యత ఉంటుంది.ఒకవేళ అలోచించినా కూడా అది రచయిత మనకిచ్చిన పరిమితమైన స్వేచ్ఛగా గుర్తించాలి.

కథ : చర్య,ప్రతిచర్య అనే తార్కికత పై ఆధారపడి అభివృద్ధి చెందే సంఘటనలు అలోచనని కాకుండా భావోద్వేగాల్ని ప్రేరేపిస్తాయి,ఇవి సాధించి తీరవలసిన లక్ష్యాన్నికూడా ఏర్పాటు చేస్తే,ఆ సమస్యే కథ అవుతుంది.

సాంకేతికత : యంత్రాలు,యంత్రపరికరాలు లేదా పారిశ్రామిక ఉపకరణాల యొక్క సేవల వినియోగమే సాంకేతికత.
సినిమాల్లో సాంకేతికత అంటే ప్రధానంగా ఛాయాగ్రహణం(కెమేరా + లైటింగ్),కూర్పు(ఎడిటింగ్),శబ్ధం…etc..ఇంకా కాస్త విశాలంగా అలోచిస్తే స్క్రీన్ ప్లే లో కూడా ఉపకరణాలు (Tools) ఉంటాయి కాబట్టి దాన్ని కూడా కలపుకోవచ్చు.(స్క్రిప్ట్ పూర్తయిన తరవాతే సాంకేతికత – రచయిత బుర్ర పని చేసి చూపించాకే,మిగతా సాంకేతిక నిపుణుల మెదళ్లు పనిచెయ్యటం మెదలుపెడతాయి మరి)

కథ తయారుచేయకుండా అసలు సినిమా నిర్మాణం ప్రారంభం అవదు…..శరీరానికి ప్రాణం ఎలాంటిదో సినిమాకి కథ అలాంటిది…ఆత్మ అనే పదం వినే ఉంటారు…
కథ ప్రాణం ఐతే ఇతివృత్తం ఆత్మ లాంటిది.
ఇప్పుడు మన చర్చ దీని గురించే……మకుటానికి అర్ధం ఆత్మని రక్షిస్తే సర్వాన్ని రక్షించినట్టే….పై చర్చ అంతా ఎందుకంటే……అవన్నీ ఈ ఆత్మ మీద అధారపడివున్నాయి కాబట్టి ,వాటి గురించి కాస్త తెలుసుకోవటం రచయితలు,దర్శకులమైన మన ధర్మం కాబట్టి.
ఇప్పుడు ఇతివృత్తం అంటే ఏంటో చూద్దాం…….
ఇతివృత్తం అంటే సందేశం అనే తప్పుడు అభిప్రాయంతో కొందరు వుంటారు…..వీళ్లు కథని తమకి నచ్చినట్టు రాసేసి(అదే ప్రేక్షకుల దృష్టి కోణం అంటారు )…చివర్లో అరే మనం చూపించేది ప్రేక్షకులు అనబడే జనానికి కదా అని గుర్తొచ్చి ఠక్కున అప్పటికప్పుడు ఙ్ఞాపకం వచ్చిన(నచ్చిన) సందేశం ఇచ్చి చేతులు దులుపుకుంటారు.
ఈ ప్రేక్షకుల దృష్టి కోణం వీళ్లకేలా తెలిసిపోతుందో మనకి అర్ధంకాదు,లక్షలమందిని ఒకేసారి చదివినట్టు చెప్పేస్తారు…..సినిమా పోయిందనుకోండి వీళ్లే – ప్రేక్షకులు ఎదగాలోయ్ అన్నట్టు మాట్లాడతారు.మాధ్యమాన్ని అర్ధం చేసుకోకపోవటం ఎన్నిఅనర్ధాలకు దారితీస్తుందో కదా!!?

అసలు కథలే లేవు అనే ఓ వర్గం వారు ఉంటారు….ఇక వీరు ఇతివృత్తం అనే పదాన్ని విని కూడా వుండరు.(ఉందో లేదో తెలియని వాళ్లు మాట్లాడే వాళ్ల మాటలు విచిత్రంగా ఉంటాయి కదా).

ఇతివృత్తం : మానవ జీవితాలకు సంబందించిన శాశ్వత సత్యం.ఇక్కడ సత్యం అంటే జీవితానికి సంబంధించిన ఓ కోణం.ఈ దారిన ప్రయాణిస్తే ఇక్కడికి చేరతావు అని చెప్పే ఓ మార్గదర్శి (గైడ్) లాంటిది.ఇలా జరిగితే ఇలాంటి ఫలితం వస్తుంది లాంటి ఓ సూత్రం అన్నమాట.
ఇవి 1.అనుకూల భావన (Up-End),2.ప్రతికూల భావన(Down-End),3.పరస్పర విరుద్ధ భావన(Ironic-End) అని మూడు రకాలు.
ఉదాహరణ చూద్దాం :

శివ :అధికారాన్ని ప్రశ్నించాలంటే అధికారితో తలపడాలి.
అందుకే కింద ఉన్న బచ్చాగాళ్లతో శివ గొడవపడడు…..భవాని అధికారాన్ని వీధుల నుండి (కాలేజ్, శివ వదిన సరుకులు తెచ్చే సీన్,బార్ షాపులు, కార్మిక సంఘాల సన్నివేశాల్లో వివరంగా చూపించాడు ) రాజకీయాల (మాచిరాజు) వరకూ ప్రశ్నిస్తాడు..హీరో కాబట్టి సమస్యని పరిష్కరిస్తాడు.
సమాజంలోని వాస్తవిక పరిస్థితులకి చలించి రచయిత చేసిన హెచ్చరిక ఈ శివ సినిమా.80’ల్లో పరిస్థితుల్ని ఈ సినిమా ప్రతిబింబిస్తుంది ..వర్మ ఈ కథ తను ఎన్నో సినిమాలు చూసి రాసినదిగా చెప్పినప్పటికీ…..(ఈ సినిమాలో ఆయన ప్రేరణ పొందిన సినిమాల్లోని సాంకేతికత మాత్రమే కనిపిస్తుంది..కాని అప్పటి సామాజిక పరిస్థితులు మాత్రం కళ్లకి కట్టినట్టు కనిపిస్తాయి)ఇది సత్యాన్ని సమాజానికి చెప్పాలనే రచయిత/దర్శకుడి తాపత్రయమే తప్ప మరోటికాదు.ఈ కథలు చెప్పే ప్రతిభని ఆయన క్రమంగా ఒదిలించుకొని సాంకేతికతని మాత్రమే నమ్ముకుని అర్ధంలేని సినిమాలు తీయడానికి అలవాటుపడ్డాడు.

సమరసింహా రెడ్డి : ప్రేమ విలువ తెలుసుకున్న మనిషి ప్రాణం విలువ తెలుసుకుంటాడు.
సమరసింహా రెడ్డి మొదట ఫాక్షన్ లీడర్ అతని నేపధ్యం ప్రకారం అతనికి కుటుంబం ఉన్నప్పటికీ అతనిలో పగ,ప్రతీకారలనే మనం చూస్తాం తప్ప అతనిలో మానవత్వాన్ని మనం చూడం ,తనని ప్రాణంగా ప్రేమించే సేవకుడ్ని తన చేతుల్తో చంపాననే పశ్చాతాపంతో అతని చివరి కోరికని తీర్చడానికి అతని చెల్లెళ్ల జీవితాలు బాగుచేయటానికి వెళ్తాడు…అక్కడ వారి ప్రేమని సాధించడానికి శ్రమించి ప్రేమ గొప్పది అనే సత్యాన్ని తెలుసుకుంటాడు….ఇది తెలుసుకున్న తర్వాత అతను తన ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధపడతాడు కానీ ఇతరుల ప్ర్రాణాలు తియ్యడు.
(ప్రేమ విలువ తెలుసుకోవటం అనే కోణాన్ని కథలో నిర్లక్ష్యం చేసారు)

గమ్యం : ప్రేమ విలువ తెలుసుకున్న మనిషి తనని తాను తెలుసుకుంటాడు.
దీన్లో హీరో ధనమదంతో తనని తాను మర్చిపోతాడు….కేవలం డబ్బుతో అన్నీ వస్తాయి లేదా డబ్బుతో వచ్చే సుఖాలే జీవితం అనుకుంటాడు..హీరోయిన్ దూరం అవగానే ఆమె విలువని గ్రహించి ఆమెని చేరే ప్రయత్నంలో తనని తాను తెలుసుకుంటాడు.

టైటానిక్ : విలువైనవి ఒదులుకున్నప్పుడే వెలకట్టలేనివి పొందగలం
కేట్/రోజ్ ని కాపాడుకోటానికి హీరో విలువైన తన ప్రాణాన్నే ఒదులుకుంటాడు……వెలకట్టలేని ఆమె ప్రేమని పొందుతాడు…ఇది తెలుసుకోటానికి అతను ప్రాణాలతో ఉండడు కాని దీన్ని అర్ధం చేసుకునే ప్రేక్షకులు వున్నారు…అర్ధం చేసుకున్నారు కాబట్టే ఎంతో అర్ధాన్ని సమర్పించారు.
(తను కావలనుకున్నది అతడు పొందాడు కాని అనుభవించడానికి అతను లేడు – ఇది ఐరనిక్ గా దర్శకుడు మలిచాడు….)

ఇదే ఇతివృత్తంతో తెలుగులో వచ్చిన సినిమా
క్షణ క్షణం : హీరో దొంగ.అతనికి డబ్బు చాలా విలువైనది…కానీ హీరోయిన్ కోసం దాన్ని ఒదులుకుంటాడు…ఆమె ప్రేమని పొందుతాడు.(ఇక్కడ ఇతివృత్తం అప్ ఎండ్)
*ఒకే ఇతివృత్తం తో వందల కథలు తయారు చేయవచ్చు…ఆ సత్యాన్ని అర్ధం చేసుకోవటంలోనే వుంది నేర్పు.

శుభలగ్నం : డబ్బు ద్వారా సుఖాన్ని కొనచ్చుగానీ,ఆనందాన్ని పొందలేం
దీన్లో ఈ సత్యాన్ని తెలుసుకొనే పాత్ర ఆమని,డబ్బుతో వచ్చే సుఖాన్ని గొప్పదిగా భావించి తన భర్తని అమ్ముకుంటుంది…కాని సుఖానికి విలువలేదని అసలైన ఆనందం భర్తని కలిగివుండటంలోనే ఉందని తెలుసుకోవటమే ఈ కథ.

దేవదాసు : బంధానికి బానిస ఐన వ్యక్తి బానిసగా మరణిస్తాడు.
దేవదాస్ డౌన్ ఎండ్ ఇతివృత్తానికి పరాకాష్ఠ….అటు తండ్రి పై బంధాన్ని వదులుకోలేడు,ఇటు ప్రియురాలిపై ప్రేమ బంధాన్ని త్యాగం చేయలేడు…చివరికి మద్యానికి బానిసగా మరణిస్తాడు….సత్యం కఠినంగా ఉంటుంది…ఆ పాత్రని ఎప్పటికి మర్చిపోలేము.

బొమ్మరిల్లు : ప్రేమ (బంధం) వ్యక్తిగత స్వేచ్ఛని హరించకూడదు.
సమాజాన్ని కొన్ని సమస్యల పట్ల ముందుగా అప్రమత్తం చేసే ఇతివృత్తానికి ఇది ఉదాహరణ..మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యక్తుల అలోచనల్లో మార్పు రావాలి…..పాత అలోచనలకి స్వస్తిచెప్పి కొత్త అలోచనలని స్వీకరించాలి..లేదంటే కొత్త తరం దగ్గర పాఠాలు నేర్చుకోటానికి సిద్ధంగా ఉండాలి.
వాస్తవానికి ఇది ప్రకాష్ రాజ్ కథ…..దీన్ని అర్ధం చేసుకుని వుంటే, కథనం ఇంకా అర్ధవంతంగా వుండి సినిమా క్లాసిక్ గా పదికాలాలపాటు నిలిచిపోయేది.
ఇతివృత్తం ప్రకారం కథలో మార్పు వుండాలి…..ప్రవహించకుండా నిశ్చలంగా వున్న నీరు మురికిగా మారుతుంది……మార్పు ఎవరిలో వుంటుందో వారే ప్రధాన పాత్ర అవుతారు…..
ఉదా : గుండమ్మ కథ.
బొమ్మరిల్లు లో ప్రకాశ్ రాజ్ చేతిలో అతని కొడుకు…..హీరో ప్రేమించిన హీరోయిన్ ఇద్దరు ప్రేమ అనే బంధంలో వ్యక్తిగత స్వేచ్ఛని కోల్పోతారు…..తల్లి,తండ్రుల నుంచే కద పిల్లలు నేర్చుకునేది…వారసత్వం ఎక్కడికి పోతుంది??కొడుకూ తండ్రిలాగానే ప్రవర్తిస్తాడు…….తప్పని సరి పరిస్థితుల్లో తండ్రి మారతాడు.

కథలు ద్వారా మనం చెప్పేది ఇలాంటి సత్యాలే….ఇవి ప్రేక్షకుల మనసు లోతుల్లో ప్రభావం చూపించి..వారి అలోచనా విధానాన్నిమారుస్తాయి(మార్చాలి.)….మార్పు చెందిన తరం కొత్త తరానికి మంచి లక్షణాల్ని వారసత్వంగా అందిస్తుంది..

కథ పూర్తి చేయడానికి ముందే లేదా తయారు చేస్తున్నప్పుడే దానిలో ఇతివృత్తం తెలుసుకోటానికి ప్రయాసపడండి…..ఆత్మ ఙ్ఞానం సంపాదించడం అంత సులువు కాదు….కాని, శ్రమిస్తే సాధ్యం కానిది లేదు.
ఇతివృత్తాన్ని ఆత్మగానూ…. కథని ప్రాణంగానూ.సాంకేతికతని( టెక్నిక్) ని శరీరం గానూ అర్ధం చేసుకోండి.
అలంకారాన్ని (టెక్నిక్) పిండి కొట్టండి కానీ అందాన్ని (కథ) ఒంట పట్టించుకోండి.
ఆత్మ వుంటే ప్రాణం వుంటుంది… శరీరానికి ప్రాణం ఆధారం…ప్రాణం లేనివి ఐతే శిల్పాలన్నా కావాలి లేదా నిర్జీవ పదార్ధాలైనా కావాలి.
అందుకే ఆత్మని రక్షించడానికి ప్రయత్నం చేయండి.

*సత్యాన్ని చెప్పటంలో సంకోచాలకు తావులేదు…..సత్యం చెప్పేటప్పుడు హింస,జుగుప్స లాంటివి ఒక్కోసారి కథల్లో అవసరం ఉండొచ్చు…కథకి అవసరంవున్నా కూడా నేను హింసను చూపించను అంటే నీకు సినిమా గురించి తెలీదు అని ఒప్పుకున్నట్టే…..సినిమా మనసు మీద ప్రభావం చూపిస్తుంది..మనసు/బుద్ధి: మంచి – చెడులు,న్యాయం – అన్యాయం,హింస -అహింస ఇలాంటి విలువల మధ్య బేధభావాన్ని అర్ధం చేసుకోగలిగే విధంగా రూపొందించబడింది(Design చేయబడింది).హాస్యం,శృంగారం,భయానకం(హారర్,థ్రిల్లర్),రౌద్రం,వీరం,అధ్భుతం,శాంతం,భక్తి.భీభత్సం ఏదైనా సరే నిర్భయంగా చెప్పండి.రచయితలు,దర్శకులు సత్యవాదులుగా ఉండాలి………..సత్యమేవ జయతే.

P.S: సినిమాలో శాస్త్రీయతని,కళని,వ్యాపారాన్ని అర్ధం చేసుకుని,ప్రేక్షకుడు వెచ్చించే సమయమూ,డబ్బు,నిర్మాత చేసే వ్యయమూ,ఇతర సాంకేతిక నిపుణుల ఆవశ్యకత,మన సొంత ఙ్ఞానం,సమాజానికి కథల అవసరం ఇవన్ని పరిగణనలోకి తీసుకుని ముందు కథలు రాయటం నేర్చుకుని ఆ తర్వాత రాయండి…..ఎర్రబస్సులు ఎక్కి వచ్చారు అని అనిపించుకోవటమో లేదా దేనికి పనికిరాకపోవటం సినిమాకి పట్టభధ్రత లాంటిది అనో భావించకండి…మీ ఆలోచనలే భావితరాలకు వారసత్వంగా ఇస్తారు…ఇప్పుడు మన
సినిమాలు ఇలా నికృష్టంగా ఉండటానికి కారణం ఎవరు?తెలుసుకుని…మీరు మార్పుని ఆహ్వానించండి…ఆత్మని నిరూపించండి.శుభం.

మూల్పూరి.ఆదిత్య చౌదరి.
(ఔత్సాహిక దర్శకుడు)

(greenlong2498@gmail.com)

23 Comments
 1. సురేష్ రావి August 22, 2010 /
 2. కమల్ August 22, 2010 /
 3. viplove August 22, 2010 /
   • j.surya prakash August 23, 2010 /
 4. విజయవర్ధన్ August 22, 2010 /
 5. Gandi venkatesh August 22, 2010 /
 6. శశిపాల్ రెడ్డి రాచమల్ల August 25, 2010 /
 7. శశిపాల్ రెడ్డి రాచమల్ల August 25, 2010 /
 8. కొత్తపాళీ September 1, 2010 /
 9. Uttara October 9, 2013 /