Menu

రచయిత పరిచయం

ప్రేక్షకులకు కథపై ఆసక్తి కలిగించి, వారిని కథలో లీనం చేసి, ముగింపు వరకు ఆ ఆసక్తిని నిలిపి ఉంచి, పాత్రల అనుభవాలను ప్రేక్షకులు అనుభూతి చెందేలా చేయడమే రచయిత సంకల్పం. సంక్షిప్తంగా దీనినే వినోదం అంటాం. వినోదం అంటే నవరసాలు మిళితమైన రూపకం ద్వారా పరిపూర్ణ రసాస్వాదన పొందటం. వినోదం అంటే కేవలం హాస్య రసం కాదు.

ప్రేక్షకులను కేవలం నవ్వించడమే వినోదం అనుకుంటే అది పొరపాటు. ప్రేక్షకులు కథలో లీనమై, పాత్రలతో మమేకమై వాటి ఆశలు, ఊహలు, ఆనందాలు, బాధలు, కష్టాలు, భావోద్వేగాలు పంచుకునేటట్లు చేయడమే వినోదం. వినోదానికి తత్సమానమైన ఆంగ్లపదం Entertainment. ఈ పదం Tenare అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. Tenare అంటే ఒక్కసారిగా పొందు, పట్టిఉంచు. ప్రేక్షకుల హృదయాల్ని గట్టిగా పట్టి, వారిని అదే స్థితిలో ఉంచగలిగితే నువ్వు వారిని వినోదింప చేస్తున్నావు అని అర్ధం.ప్రేక్షకులు వినోదం పొందటం కోసం సినిమాలు చూస్తారు. అందువల్ల ఆలోచన కలిగి ఉండటం అనేది వినోదం కలిగించడానికి ప్రధానమైన అర్హత.

ధియేటర్ లోనో, టి.వి. తెరపైనో సినిమాలు చూడ్డానికి కొన్ని గంటల సమయాన్ని వెచ్చించే ప్రేక్షకులు ఆ చిత్రాల్లోని పాత్రల జీవితాల్ని తమవయిన జీవితాలతో పోల్చి చూసుకుంటారు. దీని వలన వారు ఏ లాభం పొందనప్పటికి ఈ అనుభవాన్ని వారు విలువయినదిగా భావిస్తారు. ప్రేక్షకులకు వినోదం కలిగించాలంటే రచయిత వారి భోవోద్వేగాలను తట్టి లేపాలి. పామరుల (Mass) స్పందన, పండితుల (Class) నుంచి వచ్చె స్పందన కన్నా హెచ్చుగా ఉంటుంది. చిత్రం చూసిన అనుభూతి విలువైనదిగా ప్రేక్షకులు బావించేలా చేయడం రచయిత కర్తవ్యం. కథా రచయిత మొదట కథకుడిగా ఉండాలనేది సినిమా రచనలో ప్రధాన నియమం. చలనచిత్ర మాధ్యమం ద్వారా కథను మరింత ప్రతిభావంతంగా చెప్పడానికి రచయిత కథాంగాలను, కథన రీతుల్ని లోతుగా అధ్యయనం చేయాలి. ఇది వ్యాపారస్తుడు వ్యాపార సూత్రాలు, రహస్యాలు అధ్యయనం చేయడం లాంటిదే.

కథా రచనని అధ్యయనం చేయడం అంటే మూస పద్ధతుల్ని అధ్యయనం చేయడం కాదు అనే విషయాన్ని గమనించాలి. కథను ఇంకాస్త ప్రభావవంతంగా, ప్రతిభావంతంగా చెప్పడమే దీనిలో ప్రధాన ఉద్దేశ్యం. ప్రతి కథా భిన్నమైనది కావటం చేత మూస పద్దతితో సమస్య వస్తుంది. ఈ కథాంగాలు, కథన రీతులు ఒక గొప్ప కథనం తయారు కావడానికి ఏ విధంగా ఉపయోగ పడతాయి అనేది కథలోని సారాంశం మీద ఆధారపడి ఉంటుంది. సినిమా రచన యొక్క సాంకేతికతను, దాని అధ్యయనాన్ని మూస పద్ధతి అని భావించే రచయితల కథలు అవాస్తవికంగాను, నూతనత్వం లేకుండా ఉంటాయి. చూసిన విషయాలు మళ్ళీ మళ్ళీ చూడ్డానికి ప్రేక్షకులు ప్రయాస పడవలసి వస్తుంది.

పుట్టుకతో ఎవరూ రచయితలు కారు. మనల్ని మనం రచయితలుగా మలచుకోవాలి. నేర్చుకోవడానికి చదవడం, రాయడం అనేది సరి అయిన పద్ధతి. నవలా రచనకి, నాటక రచనకి, సినిమా రచనకి చాలా వ్యత్యాసం ఉంది. నవలని చదువుతాం, నాటకాన్ని, సినిమాని చూస్తాం. నాటకం, సినిమా రెండూ దృశ్య మాధ్యమాలైనప్పటికి – రెండిటికి వ్యత్యాసముంది. నాటకంలో దృశ్యాన్ని దగ్గరగాను, వివరంగాను చూసే అవకాశం లేదు. సినిమా అనేది అభివృద్ధి చెందిన ప్రక్రియ.

ఏ ఔత్సాహిక చిత్రకారుడు మొదటిసారిగా కుంచె పట్టీ పట్టగానే అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తాడని ఎవరూ ఊహించరు. అలాగే కొన్ని వందల పాటలు విన్నంత మాత్రానే ఎవరూ సంగీత దర్శకుడు కాలేడు. సాధన అనేది అధ్యయనంలో ప్రధానమైనది.

రచయిత మొదట సృజనాత్మకత కలిగి ఉండాలి,తరువాత నిపుణుడు అవ్వాలి. కథ చెప్పే వాంఛ లేనట్లైతే రచయిత ఎప్పటికి కథకుడు కాలేడు.

వివిధ రకాల ఉపకరణాల వలె – కథాంగాలను, కథన రీతుల్నీ గొప్పగానో లేదా హీనంగానో ఉపయోగించుకోవచ్చు. వృత్తి నైపుణ్యం (Craftsmanship) అంటే ప్రతి అంగాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవడమే.

ఇప్పుడు సినిమా రచనలో ప్రధానమైన అంగాలేమిటో చూద్దాం……….

1. కథ.
నిర్వచనం : A Story is a representation of series of events linked together by cause and
effect, and a struggle between individual human wills motivated by emotion
rather than intellect – And expressed in terms of objective action.

2. స్క్రీన్-ప్లే (కథనం)
నిర్వచనం : A Screen-Play is a story told in pictures, in dialogue (Dialog) and
description and placed within the context of dramatic structure.- Syd field

3. ప్లాట్ (కథా వస్తువు)
నిర్వచనం: 1. Arrangement of incidents – Aristotle.
2. Plot is the Scheme, plan or action of the story.
3. A Plot shows by means of visible action a sole in his hour of crises, what
brought about the crises, what constitutes the problem and how it is
resolved.

 స్క్రీన్ -ప్లే ముఖ్యాంశాలు :
1. డ్రామా (నాటకీయత) : పరస్పర విరుద్ధమైన ప్రేరణల వల్ల ఏర్పడిన భావోద్వేగాలు వల్ల కలిగిన
సంఘర్షణ.

* సినిమా కథను మనం నాటకీయత ఉపయోగించి చెబుతాం.

2. స్క్రీన్ డ్రామా : కథను మనం దృశ్యరూపంలో చెబుతున్నాం కనుక అది స్క్రీన్ డ్రామా.

3. పాత్ర పోషణ : మనుషుల జీవితాలకు సంభందించిన కథ కాబట్టి వారే అందులో
పాత్రదారులు. పాత్రల గురించి వివరణాత్మకమైన వర్ణనే పాత్ర పోషణ.

4. ప్రేరణ: మనుష్యులకు కోరికలు ఉంటాయి. ఆ కోర్కెలు వారిని నిశ్చితమైన
ప్రయత్నాలు చేయడానికి కారణం అవుతాయి. అదే ప్రేరణ.

5. చర్య: ప్రేరణ వల్ల లక్ష్య సాధనకు చేసే ప్రయత్నాలే చర్యలు.

6. సమస్య & సంఘర్షణ : వివిధ సిద్ధాంతాల మధ్య భేదం వల్ల, ప్రయత్నానికి
ఏర్పడె ఆటంకం వల్ల సమస్య మరియు సంఘర్షణ ఏర్పడతాయి.

7. ఉత్కంఠ: ఫలితం కోసం ఏర్పడే నిరీక్షణే ఉత్కంఠ.

8. వ్యత్యాసం: పాత్రల మధ్య సిద్ధాంత భేదం, వాటి విరుద్ధ స్వభావాలు వాటి
మధ్య వ్యత్యాసాన్ని తెలియచేస్తాయి, ఆసక్తిని కలిగిస్తాయి.

9. సంఘటన : వివిధ చిరు సంభవాలే సంఘటనలు.

10. సంధర్భం: వివిధ సంఘటనల్లో జరిగే సంఘర్షణ సంధర్భంగా వృద్ధి చెందుతుంది.

11. విపత్కర పరిస్థితి : ప్రతి సందర్భం దాని ముగింపులో విపత్కర పరిస్థితికి దారి తీసి కొత్త
సంఘటనకు కారణం అవుతుంది.

12. సన్నివేశ క్రమం : అనేక సన్నివేశాలు, సంధర్భం , విపత్కర పరిస్థితి కలిసి ఒక సన్నివేశ
క్రమం అవుతుంది.

13. పతాక సన్నివేశం : అనేక సన్నివేశాల క్రమం కథలో చిట్ట చివరి దశను చేరడమే
ఉచ్చస్థితి.

14. ముగింపు : ప్రారంభంలో ఏర్పడిన సమస్యకి పరిష్కారమే ముగింపు.

15. సంభాషణ : పాత్రల యొక్క చర్యలో భాగమే సంభాషణ. కేవలం వాగుడు కాదు. కథలోని సూక్ష్మరూప సారాంశాన్ని వ్యక్తం చేయడానికి దృశ్య రూపంలో తెలియచేసే సమాచారానికి పుష్టిని కలిగించడానికి సంభాషణ ఉపయోగించాలి.

ఈ ముఖ్యాంశాలకి తోడు ఇరవై ఆరు ప్రాధమిక అంశాలు, ఆరు ముఖ్యమైన కథన రీతుల్నీ తరువాత వ్యాసంలో చర్చిద్దాం.

** మూల్పూరి. ఆదిత్య చౌదరి. **

13 Comments
  1. Uma August 9, 2010 /
  2. NT Fan August 9, 2010 /
  3. అరిపిరాల August 10, 2010 /
  4. geethoo August 10, 2010 /
  5. Shankar Gangadhari August 11, 2010 /
  6. johh August 20, 2010 /
  7. Gandi venkatesh August 22, 2010 /
  8. gandhi September 10, 2010 /
  9. Ramana October 24, 2010 /