Menu

మారాల్సింది ఎవరు ? : ప్రేక్షకులా? సినిమానా? సెన్సారా?

సినిమా…మూడక్షరాల ఈ చిన్న పదం సినీ మాయజాలంగా మారి చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ తనవైపు తిప్పుకోగల మహాశక్తిగా మారిపోయింది. సినిమాను ఎందుకు చూస్తారు? వినోదానికి! అధికశాతం ఇచ్చే జవాబిది. కేవలం వినోదమే కాదు సామాజిక సమస్యలపట్ల అవగాహన పెంచి ప్రేక్షకుడిని పరిష్కారంపట్ల అప్రమత్తులను చేస్తాం. కన్యాశుల్కం నుండి వరకట్నం దాకా, ఆత్మీయత నుండి అనుబంధాల వంపుదాకా సినిమాలలో వినోదాత్మకంగా, విజ్ఞానయుతంగా చూపుతున్నాం కదా! అంటారు. మరి ఇటీవల సినిమాలెందుకు విమర్శలకు గురవుతున్నాయి.

ఈ రోజుల్లో సినిమాకు వెళ్లేముందే సకుటుంబంగా చూడదగ్గదేనా అని తెలుసుకున్నాకే బయలుదేరుతారు. ముఖ్యంగా ‘టీనేజి’ పిల్లలున్న తల్లిదండ్రులకు నేడు వచ్చే కొన్ని సినిమాలు, సిగ్గుపడేలా వున్నాయి. పిల్లలున్న స్నేహితులతో కలిపి సినిమాలకు పంపినా తల్లిదండ్రులకు బెంగగానే వుంటుంది. సినిమా చూసి వచ్చిన ప్రభావం మరో కొత్త సినిమాకు వెళ్ళేదాకా వీడిపోదు. చూసిన సినిమాల్లోని డైలాగులు, ద్వందార్థ పాటలు, అసభ్య జోకులు రింగుటోన్లయి ఫోను చేసినప్పుడు ఇబ్బందికూడా కలిగిస్తాయి. సినిమా పేర్లే చెప్పడానికి ఇబ్బందిగా వుంటుంది. ఇక కథలో నీతి కాగడా పెట్టి వెదికినా కనబడదు. పాటలలో వాయిద్యాల హోరు, కథనంలో సెట్టింగుల జోరు, థియేటర్లను నింపినా, సినిమాను ‘పాజిటివ్’ దృక్పథంతో చూసి విశే్లషించాలంటే మాటలు తడుముకోవాల్సిందే.

సినిమాలు తీసే పని మాది. ఇది మా వృత్తి అంటారు. అంటే ఇందులో ధనార్జనే ప్రథమసూత్రం సరే. మంచిదే అందాం. కూరగాయలు అమ్మేవాడు మీకు పుచ్చు కూరగాయలిస్తాడు కొంటారా? కొనరు. కానీ సినిమా అలా కాదు. కూరగాయలు చూసాకే బాగుంటే డబ్బిస్తారు. సినిమా చూస్తారు. టిక్కెట్ కౌంటర్‌లో డబ్బు చెల్లించాక సినిమా బాగున్నా, బాగలేకపోయినా తేలుకట్టిన దొంగల్లా కిమ్మనకుండా చూస్తారు. బయట పడ్డాక పెదవి విరవడం వేరు!

సినిమా ప్రభావం పడేది ముఖ్యంగా యువతమీదే. ఇటీవల వచ్చిన సినిమాలు కొన్ని వివాదాలకు గురవుతున్నాయి. ఎవరి సమర్థింపులు వారికుంటాయి. ప్రేక్షకులు చూస్తున్నారు. మెచ్చుకుంటున్నారు తప్పు చేయవద్దు అని సందేశం ఇచ్చాం. మా తప్పులేదు అంటారు. అయితే ప్రేక్షకులూ మీరెందుకు ఇలాంటివి చూస్తారు. అని అడిగితే వాళ్ళు తీస్తే మేం చూసాం. ఏదో ఒకటి చూడాలి గదా! అని జవాబువస్తుంది.

అయితే ఎవరు మారాలి? ఎక్కడో ఒక చోట మార్పునకు శ్రీకారం కావాలి. లేకపోతే యువతలో వెర్రిపోకడలు పెరిగి సమాజంలో విలువలు పతనావస్థకు చేరుకుంటాయి. అప్పుడప్పుడే టీనేజ్‌లోకి అడుగిడుతున్న యువత మనసు అపరిపక్వత దశలో చిత్రమైన ఆకర్షణకు లోనుకావడం వారి మానసిక, శారీరక మార్పు వలననేనన్నది అందరూ చెప్తారు. కానీ ఆ దశలో వారి మనసులపై మాలిన్యంలేని సద్గుణ బీజాలు మొలకెత్తాలి కాని చెడును ప్రేరేపించే చెడ్డ విత్తనాలు చల్లరాదు. మంచిని గ్రహించడంకన్నా ఏడు భావాలను త్వరితగతిని అందుకుని సమాజంలో తలెత్తుకోలేని పనులకు పాల్పడుతారు. మరి వారి స్థితికి సమాజం బాధ్యత లేదా?

ఎవరి బతుకు వారిది అని తమ బతుకు తాము బతకాలి అనుకునే వర్గం నేడు సమాజం నిండుగా వుంది. సామాజిక స్పృహ బదులు పూర్తి ఉదాసీనత, స్థబ్దత రాజ్యమేలుతున్నాయి. సినిమాలను మనం బాగు చేయగలమా, సెన్సారు బోర్డు ఉండేది అందుకే కదా అని చేతులు దులుపుకుంటారు. సెన్సారు బోర్డులోని లొసుగులను తమకు అనుకూలంగా మలచుకుని ఒకసారి సెన్సారు అయిన చిత్రాలను రిటేక్, రిమేక్‌లని మరోమారు తీసి కత్తెరలు తప్పించుకుంటున్నారు. చూసీ చూడనట్లు వదిలేయకుండా యువతను పెడదారి పట్టించే సినిమాలకు కాస్త ఘాటు కషాయంలా సెన్సారు మారాలి కదా. ఎవరికి వారు తమకెందుకు అనుకుంటే ఇక ఎల్‌కెజి అన్న కాన్సెప్ట్‌తో సినిమా వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.

– C.ఉమాదేవి

http://umadevic.blogspot.com/

5 Comments
  1. అభిమాని July 20, 2010 /
  2. Nagarjuna July 20, 2010 /
  3. rahul July 20, 2010 /
      • rahul July 21, 2010 /