Menu

గాయపడిన పక్షి ప్రయాణం – ఉడాన్

గత పదిహేనేళ్ళుగా  ప్రి-టీన్స్, టీన్స్ ని విస్తృతమైన మార్కెట్ సెగ్మెంటుగా హాలీవుడ్ గుర్తించి వారికోసం సినిమాలు తియ్యడం మనకు తెలిసిందే. చాలా వరకూ వాటిల్లో చాలా వరకూ టీన్ సెక్స్ కామెడీలు ఉన్నా, టీనేజి సమస్యలు వారి మానసిక స్థితులు మొదలైన ప్రశ్నల గురించి చర్చించిన చిత్రాలు కూడా చాలా ఉన్నాయనేది కాదనలేం.  అత్యధిక కలెక్షన్లు చేసిన సినిమాలలో నిలబడున్న ‘హ్యారీపోట్టర్’ ఈ కోవలోకే రావడం గమనార్హం. కానీ, భారతీయ సినిమాల్లో ఈ సెగ్మెంట్ ప్రేక్షకులకు ఇప్పటివరకూ సరైన ప్రాముఖ్యత దక్కలేదు. అడపాదడపా ‘చిత్రం’, ‘కొత్తబంగారు లోకం’ వంటి చిత్రాలు వచ్చినా అవి ప్రేమ ప్రధానమైన చిత్రాలుగా మాత్రమే మిగిలిపోయాయిగానీ టీనేజి ఆశల్ని, ఆలోచనల్ని, సమస్యల్నీ, ఆశయాల్నీ, ఐడెంటిటీని చూపించడంలో పూర్తిగా విఫలమయ్యాయి.

నాగేష్ కుక్కునూర్ తీసిన ‘రాక్ ఫోర్డ్’  ఆ దిశగా ఒక మంచి ప్రయత్నమనుకుంటే, విక్రమాదిత్య మోత్వానీ చిత్రం ‘ఉడాన్’ ఒక అర్థవంతమైన హృద్యమైన గుర్తుండిపోయే  కొనసాగింపు అనుకోవాలి.

17 సంవత్సరాల రోహన్ స్నేహితులతో కలిసి చేసిన “సరదా సాహసం” కారణంగా షిమ్లా బోర్డింగ్ స్కూల్ నుంచీ గెంటివేయబడతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎనిమిదేళ్ళ తరువాత జెమ్షడ్ పూర్ లోని తండ్రి దగ్గరికి వస్తాడు. తన కొక ఆరేళ్ళ సవతి తమ్ముడు(అర్జున్) ఉన్నాడని తెలుసుకుంటాడు. కవిగా, కథకుడిగా, రచయితగా అవ్వాలనుకునే రోహన్ ఆశలు చెల్లవని  బలవంతంగా ఇంజనీరింగ్ కాలేజిలో చేర్పించి, తన ఫ్యాక్టరీలో పనిచెయ్యమని చెబుతాడు తండ్రి.

ఎనిమిది సంవత్సరాల బోర్డింగ్ స్కూల్ జీవితంలో ఒక్కసారికూడా చూడ్డానికి రాని తండ్రి. Abusive, patriarchal, male chauvinist  తండ్రి. తన ఆలోచనల్నీ, ఆశయాల్నీ ఏమాత్రం ఖాతరు చెయ్యని తండ్రి. మాట నెగ్గించుకోవడానికి, తన frustration తీర్చుకోవడానికీ పిల్లల్ని కొట్టి అదే కరెక్ట్ అనుకునే తండ్రి, రోహన్ కు పెద్ద సవాలు. ఆ సవాలుని ఎదుర్కొని, తన దారిని ఎన్నుకుని ఎలా రోహన్ ప్రయాణమవుతాడు అనేది ఈ సినిమా కథ.

ఇలాంటి కథనొకదాన్ని సినిమా కోసం ఎన్నుకోవడం సాహసమైతే , దాన్ని తెరకెక్కించడం అసంభవం. కానీ ఈ రెండూ అత్యంత అద్భుతంగా చేసి చూపించారు నిర్మాత అనురాగ్ కశ్యప్, కథకుడూ- దర్శకుడు విక్రమాదిత్య మోత్వానీ.

రోహన్ గా నూతన నటుడు రజత్ నటనలో పరిణితి కనిపిస్తుంది. నిజంగా రోహన్ ఇతడే అనిపించే conviction తెలిసొస్తుంది. తండ్రిగా రోనిత్ రాయ్ నటన అత్యంత హర్షనీయం. ఎక్కడా క్యారికేచర్ కాకుండా, పాత్ర వ్యక్తిత్వాన్ని జీవించాడు.  ఇంత మంచి నటుడ్ని బాలీవుడ్ ఇప్పటివరకూ విస్మరించడం మహానేరం. రోహన్ స్నేహపూరిత బాబాయి్ గా రామ్ కపూర్ పాత్రోచితంగా ఉన్నాడు. అర్జున్ గా నటించిన ఆరేళ్ళ బుడతడి పేరు తెలీదుగానీ, తండ్రిలాగే frustrated గా తయారవబోతున్న రోహన్ కు ప్రేమను, మాన్వత్వాన్నీ, జీవితంపై ఆశనీ కల్పించగల దయగల ముఖం ఈ పిల్లాడికి ఉంది. ఆ అమాయకమైన బుడతడి ఎంపిక, సినిమా క్లైమాక్స్ కు ఎంత బలాన్ని చేకూర్చిందనేది సినిమా చూసిన ఎవరైనా ఒప్పుకునే విషయం. ఆ పిల్లాడి నటన, presence అమోఘం.

విక్రమాదిత్య- అనురాగ కశ్యప్ రాసిన సంభాషణలు, కవితలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళడంలో సఫలమయ్యాయి.
బోర్డింగ్ స్కూల్లో ఎనిమిదేళ్ళ ఒంటరి జీవితం ముగుసిపోతుందని తెలిసిన తరువాత రోహన్ పాత్ర ఒక స్నేహితుడితో…
“ప్రయాణం మొదలైనప్పుడు
పాదాలు సుకుమారంగా ఉన్నాయి
ఇప్పటికీ ఆ సౌకుమార్యం కొంత మిగిలే ఉంది
మీ స్నేహం గిలిగింతలు లేకుంటే
అవి మొద్దుబారిపోయేవేమో!”
అంటూ చెప్పే కవిత చూచాయగా అర్థమైనా, గొంతులో గుండెకొట్టుకోక మానదు. అదే కవితలో “ఈ నగ్న పాదాలతో చాలా దూరం నడిచాను. జోళ్ళెక్కడ మరిచానో ఇక గుర్తులేదు” అంటూ ప్రధానపాత్ర conflict ని ముందుంచే తీరు గొప్ప దర్శకుల శైలిని గుర్తుకు తెస్తుంది.

తండ్రి ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడేమో అనే ఆశతో “ఆభిజాత్యాల కనురెప్పలు దాటి చూస్తే, నా గమ్యం నీకు కనిపిస్తుంది” అంటూ చెప్పే కవిత, బార్లో స్నేహితుల మధ్య చెప్పే అంత్యప్రాసల గందరగోళ కవిత అటు దృశ్యానికీ, ఇటు పాత్రకీ తెచ్చిన బలం మరువలేనిది. తండ్రీ కొడుకుల confronting దృశ్యంలోని మాటలు సినిమాకి ఆయువుపట్టు.

సినినిమాలోని పాటలు దృశ్యాల కొనసాగింపుగా వస్తాయి. అమిత్ త్రివేదీ సంగీతం, అమితాబ్ భటాచార్య గీతరచన సినిమాని ఎక్కడా ఆపకుండా కొనసాగేలా దోహదపడ్డాయి. దృశ్యాలకు బలాన్ని జోడించడంలో సఫలమయ్యాయి.

ఈ సినిమాలో బాగా నచ్చే విషయం దర్శకుడు అదృశ్యంగా ఉండి పాత్రల కథని పాత్రలచేత జీవింపజెయ్యడం. సాధారణంగా మూడ్ హైలైట్ చెయ్యడానికో లేకపోతే దృశ్యంలోని ప్రాధాన్యతని ఎడిటింగ్ ద్వారానో, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ద్వారానో అండర్లైన్ చేసి మరీ చెప్పడానికి వాడే ఏ device దర్శకుడు వాడలేదు.  దృశ్యాల్లో, పాత్రల చేత కథ చెప్పలేక అనవసరమైన “డైరెక్టోరియల్ డైలాగులు” జొప్పించే అవసరం ఈ దర్శకుడికి రాలేదు. ప్రేక్షకుల్ని emotional గా manipulate చేసి రసం పిండాలనే ప్రయత్నం అస్సలు చెయ్యలేదు. ఈ invisible direction కు విక్రమాదిత్యకు hats-off చెప్పాల్సిందే.

రెండుగంటలా ఇరవై నిమిషాలు సాగే ఈ సినిమా సాధారణ జీవితమంత వేగంగా సా…గు…తుం…ది.

షార్ప్ ఎడిటింగ్, స్పీడ్ నెరేటివ్ లకు అలవాటు పడిన ప్రేక్షకులకు ఈ సినిమా కొంచెం సహన పరీక్ష అయ్యే అవకాశం ఉంది. లేని ఒత్తిళ్ళు తల మీద పట్టుకోకుండా, ఒక అందమైన సాయంత్రపు వేళ రిలాక్స్డ్ గా, అర్థవంతమైన సినిమా చూడాలనుకునేవాళ్ళు మాత్రమే ఈ సినిమాను చూడండి. అలా చూడలేని వాళ్ళు ఈ సినిమాకు అర్హులు కాదు.

7 Comments
  1. sreenivas pappu July 17, 2010 /
  2. అరిపిరాల July 17, 2010 /
  3. GopiCM July 17, 2010 /
  4. కృష్ణశ్రీ July 17, 2010 /
  5. kRsNa July 17, 2010 /
  6. geethoo September 22, 2010 /