ఇప్పుడు కాలం మారిపోయింది. ధరలు పెరుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీలు హర్తాళ్ కు పిలుపు ఇస్తే దాని వల్ల దేశంలో వాణిజ్య రంగానికి 10,000 కోట్ల నష్టం జరిగిందని లెఖ్ఖలు వేసే రోజులివి…
ఆన్లైన్ పిటీషన్లో ఓ సంతకం పారేస్తే చాలు సమస్యలు తీరిపోతాయని నమ్మే తరమిది. ఎర్రని ఎండలో చేసే ధర్నాలు ఎందుకోసమో చెప్పేదెవరు?
జీన్స్, టీషర్టులు వేసుకుని రోడ్డుపై కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహిస్తే మీడియా హడావిడి చేసే కాలమిది. అడవి బిడ్డల కాగడాల పోరును అర్థం చేసుకునేదెవరు?
గెలుపుకు మెట్లు అయిదున్నాయో అయిదొందలున్నాయో పుస్తకాలు రాసి మరీ చెప్పేవారున్నారు, కానీ ఓడిపోతామని తెలిసీ ప్రాణాలకు తెగించి పోరాడే వారి గురించి ఎవరు చెప్తారిప్పుడు?
నూతన ఆర్ధిక విధానాల ఫలాలను అందుకుంటున్న మధ్య తరగతి, ఇప్పుడు ఏ సమస్య మీదా స్వయంగా పోరాటం చెయ్యకపోవడమే కాదు పోరాటాలు, ఉద్యమాలను నిరసించడం, చిన్న చూపు చూడడం అలవాటు చేసుకుంది. ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోతున్న ప్రజలు మాత్రం రోజు రోజుకీ శాంతియుత పోరాట మార్గాలు మూసుకుపోతుండటంతో హింసత్మక ఉద్యమాలవైపు ఆకర్శితులవుతున్నారు.
ఆనాడు బ్రిటీష్ వారు మన దేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో వారిపై వీరోచితంగా పోరాడింది అడవి బిడ్డలే. ఇప్పుడు నల్ల దొరల అండతో అడవిని కాజేయడానికి వస్తున్న కొత్త బేహారులను ప్రాణాలొడ్డి అడ్దుకుంటున్నదీ ఆ గిరిపుత్రులే.
అయితే వారి పోరాటాలు విజేతలు రాసిన చరిత్ర పుటల్లోకి ఎక్కలేదు.
1930ల్లో అదిలాబాద్ జిల్లాలోని అసిఫాబాద్ దగ్గరలో ఉన్న జోడేఘాట్ ప్రాంతంలో నిజాం ప్రభుత్వ ఆగడాలకు వ్యతిరేకంగా పోరు రాజేసిన గోండు యోధుడు కొమరం భీం. “జల్, జంగల్, జమీన్” కొరకు తుపాకీ పట్టి పోరాడిన అతని జీవిత చరిత్రను రేఖామాత్రంగా తెలియజేస్తుంది గతవారం విడుదలైన “కొమరం భీం” సినిమా.
1990లో నిర్మాణమైన ఈ సినిమా 20 యేళ్ల తరువాత విడుదలకు నోచుకుంది. అల్లాణి శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గౌతం ఘోష్ సంగీతం అందించగా భూపాల్ రెడ్డి కొమరం భీం పాత్రను పోషించారు.
అప్పుడు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐ.టి.డి.ఎ.) లో ఉన్న ఐ.ఎ.ఎస్. అధికారి సుబ్రహ్మణ్యం గారు ఎంతో ప్రోత్సాహం ఇవ్వడం వల్లనే ఈ చిత్ర నిర్మాణం సాధ్యం అయ్యిందని దర్శకుడు అల్లాణి శ్రీధర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మొన్న సెప్టెంబర్ 2 నాడు హెలికాప్టర్ ప్రమాదంలో ముఖ్యమంత్రి వై.యెస్. తో పాటు సుబ్రహ్మణ్యం గారు కూడా మరణించడం విషాదకరం.
ఎస్.ఎం. ప్రాణ్ రావు గారు కొమరం భీం భార్య సోం బాయి, భీం తో పాటు పోరాటంలో పాల్గొన్న అతని సహచరులతో మాట్లాడి, ఎంతో పరిశోధించి ఈ సినిమాకు స్క్రిప్ట్ రాశారు.
నిన్న సాయంత్రం నారాయణ్ గుడాలోని దీపక్ టాకీసులో కొంతమంది మిత్రులతో కలిసి ఈ సినిమా చూశాను.
నిజంగా చెప్పాలంటే ఇది ఒక docu-drama లాగా అనిపించింది నాకు.
కథలోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ ప్రాంతంలో అడవిలో నివసించే గోండులను నిజాం ప్రభుత్వ అధికారులు బాగా దోచుకుంటుంటారు. వారి నుండి అనేక పన్నులు వసూలు చేస్తూ, వారి గూడేలపైబడి అనేక విధాలుగా హింసిస్తూ ఉంటారు. ఒక సారి కొమరం భీం ఉండే గ్రామ పట్వారీ (Village Secretary) వచ్చి “మీరు అడవిని కొట్టి భూముని చదును చేస్కుంటే మీకు నిజాం ప్రభుత్వం పట్టాలు ఇస్తుందని చెబుతాడు. అది నమ్మి ఆ గోండులు కొంత భూమిని చదును చేసి సాగుచేసుకోవడం మొదలుపెడతారు. తీరా భూమిని దున్నే సమయానికి పట్వారీ దాన్ని కాజేసే ఉపాయం చేస్తాడు. ఆ భూములన్నీ ప్రభుత్వం ఒక ఆసామికి పట్టా చేయమని ఉత్తర్వులు ఇచ్చిందని గోండులు ఆ భూమిని ఖాళీ చేయాలని చెబుతాడు.
ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన గోండు నాయకుడిని చర్చలకు అని పిలిపించి ఆహారంలో విషం ఇచ్చి చంపుతాడు పట్వారి. జరిగిన మోసం అర్థం చేసుకున్న కొమరం భీం ప్రభుత్వాధికారులపైకి తిరగబడతాడు. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు దగ్గరి నుండి తుపాకీ గుంజుకుని సాయుధుడవుతాడు. తోటి గోండులకు జరుగుతున్న మోసాలపై తిరగబడమని చెబుతాడు.
భీం చేస్తున్న పొరాటం గురించి తెలుసుకున్న పై అధికారులు కలవరపడతారు. భీం ను బంధించడానికి ఇంకొంతమంది పోలీసులను పంపుతారు. భీంపై కేసులు పెడతారు. సమీపంలోని టౌన్లో ఉన్న న్యాయవాదిని కలుస్తాడు భీం. “నువ్వు గూడెంలో ఉంటే పోలీసులు గూడెంపై బడతారు. నువ్వు అడవిలోకి పారిపోతే, పోలీసులు నీ వెంట బడతారు, గూడెం ప్రశాంతంగా ఉంటుంది” అన్న ఆ న్యాయవాది సలహా మేరకు భీం అజ్ఞాతంలోకి వెళతాడు. అక్కడే సోం బాయిని వివాహం చేసుకుంటాడు.
కొంత కాలానికి గూడేనికి తిరిగివచ్చిన భీం గోండులను సమావేశపరచి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిస్తాడు.
ప్రాణాలకు తెగించి ఈ పోరాటం ఎందుకు చేయాలన్న భార్య ప్రశ్నకు బదులిస్తూ…
గెలిస్తే మనం తలెత్తుకుని తిరుగుతామని, ఓడిపోయి మరణిస్తే మన పిల్లలు తలెత్తుకుని తిరుగుతారని చెబుతాడు భీం.
భీం తిరుగుబాటును అణచివేయడానికి అసిఫాబాదుకు ఒక కొత్త అవ్వల్ తాలుఖ్దార్ (District Collector) ను పంపిస్తుంది నిజాం ప్రభుత్వం. భీం న్యాయవాది ద్వారా “పోరాటం విరమిస్తే 30 ఎకరాల భూమిని నజరానాగా ఇస్తానని” కబురు పంపుతాడు అవ్వల్ తాలుఖ్దార్.
కానీ భీం ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. అడవిలోని గోండులందరికి 30 ఎకరాల భూమి ఇస్తుందా ప్రభుత్వం అని ప్రశ్నిస్తాడు.
చివరికి జోడేఘాట్ కొండపైకి పెద్ద ఎత్తున బలగాలను తీసుకుని దండయాత్రకు బయలుదేరుతాడు అవ్వల్ తాలుఖ్దార్. ఉన్న కొద్దిపాటి ఆయుధ సంపత్తితో పోలీసులను మొదటి రోజు నిలువరించగలుగుతాడు భీం. అయితే ఆ రోజు రాత్రి ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో జోడేఘాట్ ను వెనుకవైపునుండి చుట్టుముట్టిన నిజాం పోలీసులు భీం గోండు సైన్యంపై దొంగదెబ్బ తీస్తారు.
సూర్యోదయం అవుతుండగా పోలీసు బుల్లెట్లకు కొమరం భీం నేలకొరుగుతాడు.
ఉదయించే సూర్యుడి బ్యాక్ డ్రాప్ లో భీం నేలకొరిగే దృశ్యం ఈ చిత్రానికే తలమానికం
ఓడిపోయి కూడా నైతిక విజయం సొంతం చేసుకున్న ఈ గోండు వీరుని కథను చెప్పే సినిమా విడుదలైన రోజునే అదే ఆదిలాబాదు జిల్లాలో పోలీసుల చేతిలో అజాద్ హత్యకు గురికావడం బహుశా కాలం మారినా మారని ఆదివాసుల జీవితాన్ని, వారి పోరాటాలకు ప్రభుత్వ ప్రతిస్పందనను తెలియజేస్తుంది.
చాలా తక్కువ ఖర్చుతో తీసినా చెప్పాల్సిన కథను సూటిగా, చక్కగా చెప్పాడు దర్శకుడు. భూపాల్ రాసిన పాటలు ఆకట్టుకుంటాయి. పచ్చని ఆదిలాబాద్ అడవుల అందాలను భవానీ శంకర్ కెమెరా అద్భుతంగా చిత్రీకరించింది.
ఈ సినిమాకు 1990 లోనే రెండు నంది బహుమతులు వచ్చాయి (ఉత్తమ దర్శకుడు, ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం)
మేము చూసిన దీపక్ టాకీస్ లో ప్రొజెక్షన్, సౌండ్ రెండూ బాగోలేవు. ఈ వారమైతే ప్రసాద్స్ లో కూడా ఒక షో వేస్తున్నారు. అక్కడ వీలు కాకపోతే కనీసం డీవీడీ రిలీజయ్యాకనైనా చూడాల్సిన సినిమా ఇది. పెద్దగా హంగులు లేకుండా నిర్మించిన సినిమా కాబట్టి ఒక డాక్యుమెంటరీ చూస్తున్నామని అనుకోండి, కానీ చూడ్డం మాత్రం మానకండి.
Rakesh says:
Excellent review!
Thanks Dileep!!
Saaradhi says:
మీ ఈ వ్యాసం లోని కొన్ని లైన్లు కత్తి మహేష్ కుమార్ పట్టుకుపోయి తన బ్లాగు లో పెట్టేసుకున్నాడు. మీకు అభ్యంతరం లేదా?
K మహేశ్ కుమార్ says:
http://parnashaala.blogspot.com/2010/07/blog-post_07.html
viplove says:
hmm 20yrs!!
it seems makers also made the movie with the determination of fighting a losing battle.
ఓడిపోతాం అని తెలిసీ పోరాడే గిరిజనుల సంగతి కథాంశం అనేది పక్కనబెడితే ,
ఓడిపోతాం అని తెలిసీ సినిమాను నిర్మించిన వారి తెగువను మెచ్చుకుని పక్కనబెడుతే ,
అసలు ఓడిపోకుండా ఏం చెయ్యాలి అనేది ఆలోచించడం , అందుకు ప్రయత్నించడం చాలా ముఖ్యం కదా.
ఇలాంటి సినిమాలు ఎవరూ కొనరనీ , జనాలు చూడకపోవచ్చని తెల్సీ తీయడం ఎంత అభినందనీయమో …అలా కొనేట్లు , చూసేట్లు “ఏమైనా” చేయగల్గి ఉంటే… ఇంకెంత బావుండేది!
టీవీలో ట్రైలర్లు చూస్తుంటే చాలా బాధ అనిపించింది…ఇదే ఇరవై యేళ్ళా క్రితమే వచ్చి ఉంటే ఎంత బావుండేదో కదా అని.
K మహేశ్ కుమార్ says:
@విప్లవ్: సినిమా విజయానికి ఏవరైనా ఐదో ఆరోమెట్లు రాసేరేమో కాస్త చెప్పరూ…:)
ఏ సినిమా విజయం సాధిస్తుందని ఎవరు నిజంగా చెప్పగలుగుతున్నారు చెప్పండి?
పరమ చెత్త సినిమా తీసేవాడుకూడా ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి జాక్పాట్ పట్టెయ్యాలనుకునేవాళ్ళే.అలాంటప్పుడు కథను నమ్ముకుని, తియ్యాలనే తపన-కోరికతో పాషనేట్ గా ప్రయత్నించేవాళ్ళు రిస్క్ తీసుకుని చెయ్యకూడదు అనుకుంటే మన సినిమాలు ఎప్పటికి మారేను?
సినిమాను నమ్ముకోవడం మానేసి ఎలా అమ్ముకోవాలో ఆలోచించి సినిమాను తియ్యాల్సొస్తున్న ఈ రోజుల్లో హాయిగా బ్లూఫిల్మ్ తీసుకోవడంకన్నా మించిన గ్యారంటీ ఇంకొకటి ఉండదు అనుకున్నా,మన ఖర్మకొద్దీ వాటిని సెన్సార్ విడుదల కానివ్వదు, ఇంటర్నెట్లో పోటీకి అవీ తట్టుకోవని ఆలోచించాల్సొస్తుందేమో !
ఏ సినిమాకుంది గ్యారంటీ విజయం? ఎక్కడుందా ఫార్ములా?
సినిమాకు కావలసింది, ఆ కథను మనం నమ్మడం, చేతనైనంత సిన్సియర్గా తియ్యడం. ఇక అమ్మడం అంటారా…డిస్ట్రిబ్యూటర్ల దయ ప్రేక్షకుల ఖర్మ.
viplove says:
@mahesh
నేను ఎక్కడైనా “విజయం” గురించి చెప్పానా ??
కొంచెం వ్యాఖ్య పూర్తిగా , సరిగా , ఆవేశం లేకుండా ఆలోచించి చదివితే ఇలా బదులిచ్చి ఉండరు.
డిస్ట్రిబ్యూటర్లు కొనేట్లు , జనం “చూసేట్లు” ..అంటే సినిమాను జనానికి చేరవెయ్యడం.. మార్కెటింగ్.
ఆ రోజైనా , ఈ రోజైనా…. నటీనటులు “ఫ్రీ”గా చేసినా , ఫిలిం స్టాకు , సౌండు ఎక్విప్‍మెంటు వగైరా కనీస ముడిసరుకులు కూడా డబ్బుతోనే వస్తాయి , సినిమాను ప్రేక్షకులూ టికెట్లు “కొనే” చూస్తారు.
అలా డబ్బు ప్రస్తావన రాబట్టే.. ఈ సినిమా ఇరవై సంవత్సరాలు మగ్గిపోవడం అనేది నిజం కాదా ??
నేనన్నది… ఈ “డబ్బు” factorను అధిగమించి ఎలా ఈ సినిమాను చేరవేసి ఉండాలో అప్పుడే ఆలోచించుకుని ఉంటే… తీసినప్పుడే ఈ సినిమా జనానికి అందేది కదా?
కా దా ??
డబ్బు సంపాదించే సినిమా తియ్యాలని నేనెక్కడ అన్నానని బ్లూ ఫిలిం ప్రస్తావన తెచ్చారు ?
సినిమా సంపాదన గ్యారంటీ కాదు…జనానికి అందే గ్యారెంటీ గురించి చూసుకోవడం “మేకర్స్” ధర్మం కాదా ??
అలా పట్టించకోనప్పుడు ఇక ఎవరూ కొనలేదని , ఎవరూ చూడలేదని కంప్లయింట్స్ ఏమిటి ?
ఎవరో వస్తారని
ఏదో చేస్తారని
ఎదురుచూసి మోసపోకమా
నిజం మరచి నిదురపోకుమా….
నిజం మరచిపోదామా ??
డిస్ట్రిబ్యూటర్లు ఇంతే , జనం ఇంతే అని తిట్టుకుంటే సినిమాలు తియ్యడం మానుకోవాలి. అంత తోలుమందంగాళ్ళకూ వాతలు పెట్టేలా ఆలోచించాలి కదా అని నేనంటున్నా.
K మహేశ్ కుమార్ says:
@విప్లవ్:పెద్ద డిస్ట్రిబ్యూటర్లు/ఎగ్జిబిటర్లు ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలో లేక వాళ్ళు సొంతంగా నిర్మించిన సినిమాలు మాత్రమే కొంటారు లేక ప్రదర్శించుకుంటారు.చిన్న డిస్ట్రిబ్యూటర్లు యాక్షన్ సినిమాలూ, సెక్స్ సినిమాలూ మాత్రమే B-C సెంటర్లలో ఆడతాయికాబట్టి వాటినే కొంటారు.
తెలుగు ప్రేక్షకుడికి స్టార్లు కావాలి. భీకరమైన ఒళ్ళుగగుర్పొడిచే పోరాటదృశ్యాలు కావాలి. ఒళ్ళారబోసే మోహనాంగులు కావాలి.ఉర్రూతలూగించే పాటలు కావాలి.పగలబడినవ్వే (అప)హాస్యం కావాలి.
అంటే… సినిమా కొనేట్లు, చూసేట్లూ చెయ్యాలంటే ఇవన్నీ ఉన్న సినిమా మనం చెయ్యాలి. ఇవన్నీ చెయ్యడానికి ఆల్రెడీ ఘనాపాఠీలూ,దర్శక ఋషులు, క్రియేటివ్ డైరెక్టర్లూ ఉన్నారు. So, let’s just leave it to them and simply sit and watch those films. అదే మన నిర్ణయమైతే ఇక చర్చలెందుకు ఈ బాధలెందుకు చెప్పండి?
డబ్బు అవసరమే. అందుకే సినిమాను కళాత్మకవ్యాపారం అన్నారు.అది నేనూ కాదనట్లేదు. అయితే, అన్ని పరిశ్రమల్లో రిసెర్చ్ అన్డ్ డెవలప్మెంట్ (R&D) ఉన్నట్లు దానికి ప్రత్యేకమైన ప్రోత్సాహకం ఉన్నట్లు, ఇలాంటి ప్రయోగాలకు ఊతం కావాలంటున్నాను.
సత్యజిత్ రే సినిమాలూ, ఋత్విక్ ఘటక్ సినిమాలూ ఎంత మంది బెంగాలీలు చూశారంటారూ? జాన్ అబ్రహం సినిమాలు ఎంత మంది డిస్ట్రిబ్యూటలు కొన్నారు? ఎంత మంది మళయాళీలు చూశారు? కానీ వాళ్ళ సినిమాలు భారతీయ సినిమాను ప్రభావితం చేసిన తీరుని మనం ఇప్పుడు కాదనగలమా?
అన్ని సినిమాలూ డబ్బుతో తీసినినా అన్నీ డబ్బుకోసమే కానఖ్ఖరలేదు. కేవలం సినిమా కోసం సినిమా తియ్యడంకూడా అవసరం. ఆ అవసరం కోసమే NFDC, APFDC లాంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. పైరవీల ఖర్మలు, సినిమా మీద బ్యూరోక్రాట్స్ కున్న అవగాహనా రాహిత్యాలు ఆ సంస్థల్ని బ్రష్టుపట్టించాయి. దానికి alternative కావాలి. అది ఎలాగో నాకూ స్థూలంగా తెలీదు…కానీ కావాలనిమాత్రం తెలుసు. సినిమా కోసం సినిమా లేకపోతే ప్రేక్షకుడికి మిగిలేది చెత్తమాత్రమే అనీ తెలుసు. ఎందుకంటే…అనుభవిస్తున్నాంగా !
viplove says:
@mahesh
అసలిక్కడ ఆర్గ్యుమెంటే లేదు.
“1990లో నిర్మాణమైన ఈ సినిమా 20 యేళ్ల తరువాత విడుదలకు నోచుకుంది. ” వ్యాసంలో
“నోచుకోవడం ” అనే మాట గురించే నేను అంటున్నాను.
డిస్ట్రిబ్యూటర్లు కొనకపోతే ..రాయ్ చేసినట్లు గవర్నమెంటు r n b dept చేత పథేర్ పాంచాలీ కొనించినట్లో , లేక చివరాఖరికి “ఆనంద్” లాంటి కమర్షియల్ సినిమా తీస్తూ కూడా nfdc funds తీసుకొచ్చుకున్న కమ్ములలాగో…
ఏదైనా..
ఏమైనా.. చేసి సినిమా బాక్సుల్లో మగ్గిపోకుండా ప్లాన్ చేసుకోవాలి.
అదేదీ కుదరకపోతే… ఇవ్వాళ ఈ వ్యాసకర్త అన్నట్లు…డిజీ బీటాలో తీసేసి డైరెక్టుగా వీడియో క్యాసెట్ చేసి మార్కెట్ చేసి ఉండొచ్చు.
కొమరం భీం లాంటి కథ జనానికి అందడం ముఖ్యం..చూసేవాళ్ళు ఒక్కరయినా కానీ . అంతే కానీ ఇరవయ్యేళ్ళు మగ్గిపోవడం వలన అందవలసిన ప్రేక్షకులకు అందజేయలేకపోవడం మేకర్స్ వైఫల్యమే !
జాన్ అబ్రహామ్ లాంటి వారు సినిమాలు తీసినప్పుడు…అవి ఎవ్వరూ కొనరని ..”ODESSA COLLECTIVE” స్థాపించి ఏం చేసారో తెలియదా?
శ్యాం బెనెగెల్ పాల వ్యాపారస్థుల భాగస్వామ్యంతో సినిమా తీసి వారికి అందేట్లు చెయ్యలేదా ??
ఏదో ఒక మార్గం చూసుకుని సినిమా తీసిన వెంటనే జనానికి అందేట్లు ప్లాన్ చేసుకోవడం ఫిలిం మేకర్ మరచిపోకూడని ధర్మం.
మీరు ఊరికే వ్యవస్థనో , ప్రేక్షకులనో , హీరోలనో , నిర్మాతలనో , డిస్ట్రిబ్యూటర్లనో, nfdc సంస్థల్లోని పైరవీలనో…. విమర్శిస్తూ తిట్టుకుంటుంటే ఎంత వగచి ఏం లభం. నేను ఏం చెయ్యొచ్చో ఆలోచిద్దాం అంటున్నాను , ఏమీ చెయ్యలేం అన్న ఆవేశం మాత్రమే చూపుతున్నరు.
సమస్య ఉందీ అని మీకే కాదు , అందరికీ తెలుసు.. పరిష్కార మార్గాలగురించయితే చర్చిద్దాం లేకుంటా ఇక్కడితో ఆపెయ్యడం మంచిది.
K మహేశ్ కుమార్ says:
@విప్లవ్: నిజమే.అసలిక్కడ ఆర్గ్యుమెంటే లేదు.
సినిమాలు అమ్ముకోలేము అనే భయంతోనే చాలా సినిమాలు ఆలోచనా స్థాయిల్లోనే అగిపోతున్నాయి.
మార్కెటింగ్ కోసం కొత్త ఆలోచన చెయ్యడానికి, నిబద్ధతతో సినిమా తియ్యడానికీ మధ్య అగాధమంత గ్యాప్ ఉంది. ఆ రెండూ కలిసివస్తేనే ప్రస్తుతం ఉన్న మరాఠీ సినిమా అవుతుంది.కానీ అక్కడా క్రియేటివ్ మేకర్స్ తీసుకున్న కొన్ని తరాల “రిస్క్” కనిపిస్తుంది. వ్యవస్థల/ప్రభుత్వాల మద్దతు తెలిసొస్తుంది. ఆ తరువాతే కార్పొరేట్లు వచ్చాయి. అందుకే, ప్రయాణమెప్పుడూ మేకర్స్ నుంచే రావాలి. They should believe they have a product to reckon with. ఆ నమ్మకం లేకుండా కేవలం financial payback plan ముందే కావాలంటే కష్టం.
chakri says:
ఎంతో గొప్పగా.. “ప్రపంచ సినిమా ” ఉండగా తెలుగులో సినిమాలు తీయటం ..తిట్టటం అవసరమా..
అలా తీయటం మన చేత ఎలానూ కాదు..
ఎవడి standard of thinking ని బట్టి వాడు సినిమాలు తీస్తున్నాడు ,, ఎటొచ్చి ..కొంత మంది అ thinking ని పెంచుకోక.. దశాబ్దాలుగా అవే తీస్తున్నారు
viplove says:
“మన” చేత కాదు అని ఫిక్స్ అయిపోనట్లేనా చక్రీ ?
అలా అయితే ఇక తెలుగెందుకు …తెలుగుదనమెందుకు మనకు ..భాష మార్చుకుని ప్రపంచంలో కలిసిపోవచ్చుగా ?? మన ఐడెంటిటీ మనమే ప్రూవ్ చేసుకోకపోతే ఎవరో ఎందుకు మనకోసం ఆలోచిస్తారు ?
నిరాశ వద్దని ఇప్పుడె మహేశ్‍తో చెప్పిన మాటే మీకూ చెబుతున్నాను.
SuryaKiran says:
Viplove & Mahesh,
Thanks for your discussion, I’m thinking and thinking to get ideas regard Film distribution.
కొమరం భీం చిత్ర పరిచయం « గుండె చప్పుడు… says:
[...] పూర్తి పాఠం కింద ఇస్తున్నాను. దాదా ‘కొమరం భీమన్’ జయిన్ కటో కొత్త ఔట్ లుక్ పత్రిక కవర్ స్టోరీలో [...]
viplove says:
ekkaDa ?:(
అబ్రకదబ్ర says:
కొమరం భీమ్ గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాను. అతని కథతో రూపొంది దశాబ్దాలుగా డబ్బాల్లోనే మూలుగుతున్న సినిమా ఎట్టకేలకి విడుదలైతే, ఎలా ఉందో చదువుదామని ఇక్కడికొస్తే తీరా కనిపించింది ఆవగింజంత సినిమా ఊసు, గుమ్మడికాయంత భావజాలపు డోసు. మావోయిజాన్ని ప్రచారం చెయ్యటానికి వేరే వేదికలున్నాయి. ఓ సినిమా వెబ్‌సైట్ ఎందుకు? జీన్స్ ప్యాంట్లేసుకుని కొవ్వొత్తులతో నిరసన తెలిపితే తప్పో, పొట్టకూటికి పోలీసైనోడిని పిట్టలా కాల్చి చంపితే ఒప్పో …. అవన్నీ ఇక్కడ అవసరమా?
K మహేశ్ కుమార్ says:
@అబ్రకదబ్ర: భావజాలం లేకుండా సినిమా ఉంటుందా?
భావజాలం ప్రభావం లేకుండా ప్రేక్షకుడి interpretation ఉంటుందా?
మీ నిరసనలో మాత్రం భావజాలం లేదా?
chakri says:
కొన్ని సినిమాలని awards కోసం నిర్మిస్తారు.. ప్రజలకోసం అనేది రెండవ ప్రాముఖ్యత సంతరించుకొంటుంది. ప్రజలకి చేయరవేయాలని అనుకుంటే ఎలాగోలా చేస్తారు. అనుకోలేదు.. చేయలేదు.. ఇప్పుడు అనుకున్నారు.. చేసారు అంతే..
Vedantam Sripatisarma says:
This is a nice review. We need a Komaram Bhim once again to fight against the distributors of Tollywood these days. There are our own Nizams running havoc out here.
Your introduction about the average Indian’s attitude towards raising their voice is quite apt.
Sripati
chakri says:
@viplov
లేదు..వోదులుకోలేదు..ఆశ ఇంకా చావలేదు.
కొణతం దిలీప్ says:
ధరల పెరుగుదల వంటి అంశాలపై మధ్య తరగతి ఎందుకు ఉద్యమించడంలేదో చర్చిస్తూ CNN-IBN ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ రాసిన తాజా బ్లాగుపోస్టులో ఇలా అన్నారు:
But it’s not just the netas who have changed: the middle class, especially the more affluent sections, have dramatically shifted their priorities and become more self-centred than ever before. A credit card induced, acquisitive culture has meant that tomorrow is dispensable, what matters is the here and now. As long as an endless cycle of consumption is not significantly altered, there seems little empathy for the daily wage labourer who is struggling to survive. Double digit inflation is just a statistic, not a overwhelming concern.
మొత్తం పోస్టును ఇక్కడ చదవండి:
http://ibnlive.in.com/blogs/rajdeepsardesai/1/61928/indian-middle-class-invisible-and-indifferent.html
Ram says:
చాలాహోప్‍తో ఇద్దరు తెలన్గాణేతరులతో కలిసివెళ్ళి ఆసినిమా చూశాను.అనుకున్నంత బాగలేనందుకు వారితోపాటు నేనుకూడా నిరాశకు గురైనాను.సినిమాలో కథ నడపాల్సిన విధంగా నడపలేదు.లేనికథను చెప్పమనటం లేదు,కాని ఉన్నకథనైనా రసవత్తరన్గా నడిపించలేదు. ప్రజలపైన దమనకాండను “అల్లూరి సీతారామరాజు”లో చూపిన విధంగా చూపితే బాగుండేది. నైజాం ప్రభుత్వమ్ కొనసాగించిన దమనకాండను విశిస్టంగా చూపించలేదు.అంటే పాలకుల దమనకాండ వేరు,వేరుగా కొద్దిగానైనా విభిన్నంగా,విశిస్టంగా ఉంటాయి.అవి గుర్తించాల్సి ఉంటే ఇంకా మంచి సినిమా రూపొంది ఉండేది.